తేడా (కధ)
సోమసుధ
"నాన్నా!" అంటూ ఆటో దిగుతున్న తండ్రి దగ్గరకు మేడమీదనుంచి ఉరుక్కొంటూ వచ్చింది ప్రీతి. తనకు ప్రీతిపాత్రమైన కూతుర్ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు వెంకటాచలం.
"ఏమ్మా బాగున్నావా?" ఆప్యాయంగా అడిగాడతను.
"నా సంగతెందుకులెండి! మీరెలా ఉన్నారో చెప్పండి. ఢిల్లీలో అన్నయ్య, వదిన, తేజాగాడు అందరూ బాగున్నారు కదా!" అంటున్న కూతురి తలపై ప్రేమగా తట్టి "పిచ్చిపిల్ల! నీకు బంధుప్రీతి ఎక్కువేరా!" అన్నాడు.
"ఇలా యివ్వండి నాన్నా! నేను పట్టుకొంటాను" అని తండ్రిచేతిలో సూటుకేసును బలవంతంగా లాక్కుంది.
"ఫరవాలేదు లేరా!" మొహమాటపడ్డాడతను.
"చూడండి. వయసులో ఉన్నప్పుడు మా బరువు ఎలాగూ మోశారు. కనీసం యిప్పుడన్నా మీ లగేజీ బరువు మోయనివ్వరా? " అంటూ తన యింట్లోకి తీసుకెళ్ళింది.
తండ్రిని హాల్లో కూర్చోపెట్టి బల్లమీద ఉన్న ఆరోజు న్యూస్ పేపరు చేతికిచ్చి "చదువుతూ ఉండండి. ఇప్పుడే వస్తాను" అంటూ వంటింట్లోకి పరిగెత్తింది.
కొద్ది క్షణాల్లో ప్లేటులో కాజా తీసుకొచ్చింది.
"ఏమిటమ్మా యిదంతా?"
"మరిచిపోయారా? ఈరోజు మీ అమ్మాయి పుట్టినరోజు. అందుకే యివన్నీ చేశాను. చెప్పండి నాన్నా! నా మేనల్లుడు బాగా అల్లరి చేస్తున్నాడా? వెధవ! 'ఒకసారి మా ఊరు రారా' అంటే అలాగేనని ఒప్పుకొని, నా చేత అన్నీ కొనిపించుకొని, తీరా బయల్దేరే టైముకి ఏడుపు లంకించుకొన్నాడు" గడగడా మాట్లాడుతున్న కూతుర్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు.
"ఏంటి నాన్నా అలా చూస్తున్నారు?"
"నీ మాటలతో ఎదుటివాళ్ళని ఊపిరి ఆడకుండా చేస్తావు. నేను వచ్చినప్పటినుంచి నువ్వు మాట్లాడటమే తప్ప నాకు అవకాశం యిచ్చావురా! అసలిన్ని మాటలు నిమిషాలమీద ఎలా పుట్టుకొస్తాయిరా?"
"చిన్నప్పుడు చాలా రోజులు నాకు మాటలు రాలేదని నువ్వు వస పోయించావటకదా! దాని ప్రభావమే! " నవ్వుతూ అంది.
"ఒక్కసారి యింట్లో పెట్టిన నా సూటుకేసు తీసుకురా!" అన్నాడు వెంకటాచలం. ఆయన ఎందుకు తెమ్మన్నాడో ఆమెకు తెలుసు. అందుకే పరుగులాంటి నడకతో లోనికెళ్ళి దాన్ని తెచ్చి యిచ్చింది.
అతను పెట్టెలోనుంచి కాశ్మీరీ పట్టుచీర తీసి చేతికిస్తూంటే వద్దంటూనే ప్రీతి తీసుకొంది.
"ఏమిటో నాన్నా! నన్ను మరీ మొహమాటపెట్టేస్తున్నారు. నేను కాపరానికి వచ్చిన ఈ అయిదేళ్ళలో ప్రతి ఏడాది నా పుట్టినరోజుకి రావటమే కాకుండా, యిలా ఖరీదైన బట్టలు, వస్తువులు కానుకగా తెచ్చి నన్ను యిబ్బంది పెట్టేస్తున్నారు" అంటూ అతను అందించిన సూటుకేసును, చీరను పట్టుకొని పడకగదిలోకి వెళ్ళిపోయింది. ముద్దులకూతురి కళ్ళలో వెలుగును చూసిన అతను ఆనందంగా కళ్ళు తుడుచుకొన్నాడు.
"ఏమ్మా! అబ్బాయి గురించి యిదివరకు ఏదో చెప్పావు. ఇప్పుడు బాగానే చూసుకొంటున్నాడా?" లోనుంచి వచ్చిన ప్రీతిని అడిగాడు.
"ఏం బాగు నాన్నా! నా సరదాలు, బాధలు అసలు పట్టించుకోరు. నేను అడిగిన ప్రతీదానికి తలూపుతారు. తీరా చివరికి తను అనుకొన్నట్లే చేస్తారు. ఏదో మీ స్నేహితుడి కుమారుడికి యిచ్చి చేశారు కదా! మిమ్మల్ని రోడ్డున పెట్టడం యిష్టంలేక సర్దుకుపోతున్నాను."
"ఏమ్మా! అతనేమన్నా దుర్వ్యసనాలు నేర్చుకొన్నాడా?"
"అవి ఉన్నా అంత బాధ ఉండదు నాన్నా! కానీ నన్ను ఆశల అంచుకి తీసుకెళ్ళి అమాంతం క్రిందకు తోసేస్తారు. మీకు గుర్తుందా? చిన్నప్పుడు మిమ్మల్ని ఏదడిగినా కాదనక నా కోరికలన్నీ తీర్చేవారు. కానీ ఈయన. . .? ఎందుకులే నాన్నా! 'తెలిసిన మనిషికే యిచ్చాను కదా! మీ కూతురు బాగా సుఖపడిపోతోందనే ' భ్రమలో మీరున్నారు. మీ అందమైన కలను పాడుచేయటం నాకు యిష్టం లేదు. నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు. లేవండి. రాత్రి ప్రయాణంలో బాగా అలిసిపోయినట్లున్నారు. బాత్రూంలో నీళ్ళు పెడతాను. స్నానం చేసి కాసేపు నడుము వాల్చండి" అని కళ్ళు తుడుచుకొంటూ స్నానాలగదివైపు వెళ్ళిపోయింది.
కూతురి మాటలు విన్న వెంకటాచలం గుండె మండిపోయింది. మిత్రుడు గుర్నాధం కొడుకే కదా అని తన ప్రాణాన్ని వాడి చేతుల్లో పెడితే యిలా ఆడుకొంటాడా? ఎదురుగా కనిపిస్తే ఎంత ఆప్యాయంగా మాట్లాడుతాడు? వీడితో కాదు. ఈ విషయాన్ని ఆ గుర్నాధంతో తేల్చుకోవలసిందే!
స్నానం చేసి మంచంపై పడుకొన్నా కూతురి గొంతులో బాధ సరిగా నిద్ర పోనీయలేదు. మధ్యాహ్నం భోజనం చేశాక మనశ్శాంతికోసం ఊరు చూసి రావటానికి బయటకెళ్ళిపోయాడు.
సాయంత్రం ఆప్యాయంగా పలకరించిన అల్లుణ్ణి చూసి అతని గుండె రగిలిపోయింది. వెంకటాచలానికి తన పెద్ద కూతురు ప్రీతి అంటే వల్లమాలిన అభిమానం. కష్టాల్లో ఉన్న సమయంలో తన యింట మహలక్ష్మిలా జన్మించింది ప్రీతి. ఆమె పుట్టాక తన కష్టాలన్నీ అంచెలంచెలుగా దూరమయ్యాయి. అంతేగాక శ్రీమహాలక్ష్మిలా అందమైన రూపం. అందుకే తాను పూర్తిగా పెద్దకూతురికి లొంగిపోయాడు. తండ్రి గారంలో పెరిగిన ఆమె అడిగిందే తడవుగా కొండమీద కోతినైనా తెచ్చి యిచ్చేవాడు. ఇరవై సంవత్సరాలుగా పుట్టింట్లో తన ముచ్చట్లన్నీ తీర్చుకొన్న ప్రీతికి, భర్త తాను కోరిన కొన్ని కోరికలను వాయిదా వేయటం, కొన్ని సరదాలను పట్టించుకోకపోవటం నచ్చలేదు. ఆమెకు తండ్రి ఏనాడు ఎదురు చెప్పలేదు. కానీ భర్త సర్ది చెప్పాలని చూస్తాడు. అలాగని ఆమెపై చేయి చేసుకోవటం గాని, మనసు గాయపడేలా మాట్లాడటం కానీ చేయలేదు. ప్రీతి మాత్రం చాలాసార్లు అతనితో గొడవపడి, భర్త మనసు గాయపడేలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇవేవీ వెంకటాచలానికి తెలియవు. అతనికి తెలిసిందల్లా విశ్వానికి యిచ్చి చేసిన ప్రీతి నరకయాతన అనుభవిస్తోంది. అంతే! తను కూతురింటికి వచ్చినప్పుడల్లా ఆమె తన కష్టాలను ఏకరువు పెడుతూంటే, విశ్వానికి విడాకులు యిప్పించి, కూతుర్ని తనతో తీసుకుపోవాలన్నంత ఆవేశం వెంకటాచలానికి వస్తూంటుంది. కానీ ఆ మాట ఏనాడూ తన కూతురి నోట రానందున అతను సంబాళించుకొంటున్నాడు.
ఆ రాత్రి హాలులో పడుకొన్నాడతను. తన కూతురి కన్నీళ్ళు గుర్తుకొచ్చి అతనికి సరిగా నిద్రపట్టలేదు. అర్ధరాత్రివేళ ప్రీతి గొంతు పెంచి విశ్వంతో మాట్లాడటం వినిపించింది.
" నాకేమీ చెప్పొద్దు. ఏం? మీ అమ్మగారికి మీరొక్కరే కొడుకా? ఆవిడ మనింట్లో ఉంటే తనకోసం ఖర్చుపెట్టడం మన బాధ్యత. మీ అన్నయ్య యింట్లో ఉన్నప్పుడు ఆవిణ్ణి ఆయనే చూసుకోవాలి. అంతేగాని ఆవిడకోసం నా సరదాలను వాయిదా వేసుకోమంటే ఊరుకొనేది లేదు."
"మెల్లిగా! అవతల మీ నాన్నగారు ఉన్నారు."
"ఉంటే? తనేదో బ్రహ్మాండమైన సంబంధం తెచ్చేశానని మురిసిపోతున్నాడాయన. ఆ బ్రహ్మాండమేదో నాకు బద్దలైపోతోంది. ఈ తల్లిదండ్రులున్నారే! ఆడపిల్లను ఎవరికో ఒకరికి అంటగట్టేసి వదిలించేసుకొందామనుకొంటారు గానీ ఆ పిల్లకీ కొన్ని ఆశలుంటాయని, వాటిని తీర్చేవాడికి యిచ్చి చేద్దామని అసలు ఆలోచించరు కదా!"
ఆ మాటలు విన్న వెంకటాచలానికి జీవితంలో తొలిసారి ప్రీతి మీద అసహ్యం వేసింది. ఎంతో ప్రేమగా చూసిన తనను ఎలా తీసిపడేస్తోంది?
"ప్రీతీ! ప్లీజ్! మన పెళ్ళయిన అయిదేళ్ళలో నీకేమి తక్కువ చేశానని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడేమి అడిగినా కాదనకుండా తీరుస్తూనే ఉన్నా కదా! ఏదో ఒకటి రెండు సార్లు అనుకోని యిబ్బందులొచ్చి నీ కోరికలు వాయిదా వేస్తున్నానే తప్ప, ఏనాడైనా ఎగ్గొట్టానా?"
"ఎక్కడ తీర్చారు? క్రిందటి సంవత్సరం పుట్టినరోజు కోరిక నా మెడలో కొత్త మోడల్ నెక్లెస్ వేసుకోవాలని. మార్కెట్లో మోడల్స్ మారిపోతున్నాయి గాని నా మెళ్ళోకి నెక్లెస్ రావటం లేదు. అదే మా నాన్నయితే అడిగిన అరక్షణంలో ఆ వస్తువు తెచ్చి యిచ్చేవాడు. మీరూ ఉన్నారు. ఎందుకు? ఎరక్కపోయి కట్టుకొన్నాను."
వెంకటాచలం త్రుళ్ళిపడ్డాడు. ఇప్పుడు విశ్వం నోటినుంచి ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని ఆ తండ్రి గుండెలు గుబగుబలాడాయి.
" ప్రీతీ! నెక్లెస్ బదులుగా ఈ గొలుసు పట్టుకొచ్చానుగా!" సౌమ్యంగా వినిపించింది విశ్వం గొంతు.
"తెచ్చారులెండి చవకలో తేల్చేద్దామని."
"చూడు. నిన్ను నిరుత్సాహపరచాలని కాదు. అమ్మకి ఒంట్లో బాగులేదని తేలేదు. తనకి స్ట్రోక్ వచ్చిందట! హాస్పిటల్లో చేర్చారని అన్నయ్య ఫోను చేశాడు. వెంటనే కొంత డబ్బు అటు పంపాల్సివచ్చింది."
"వయసు మళ్ళాక అందరికీ రోగాలొస్తాయి. అంతమాత్రాన వయసులో ఉన్నవాళ్ళు కోరికల్ని చంపుకోవాలా? అయినా ఆవిడ మీ అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు డబ్బులు పంపాలి?"
" చూడు. అన్నయ్యది చిన్న ఉద్యోగం. అయినా వాడు అమ్మానాన్నలను వదల్లేక చూస్తున్నాడు. నాకు పెళ్ళయిన ఈ అయిదేళ్ళలో ఏనాడూ నేను వాళ్ళ పోషణకు నయాపైసా పంపలేదు. అయినా వాడు నన్ను అడగలేదు. మా వదిన కూడా అన్నయ్యను ' మీరొక్కడే కొడుకా!' అని ఏనాడూ నిలదీయలేదు గనుక ఏ గొడవా లేకుండా రోజులు గడిచిపోయాయి. ఈ రోజు అమ్మకి బాగులేదు. ఆ ఖర్చును భరించే స్థాయిలో వాడి సంపాదన లేదు. కనీసం ఈ సమయంలోనన్నా నేను చేయూతనివ్వకపోతే బాగుండదు. అందుకే డబ్బులు పంపాను. దీనిపై చర్చ అనవసరం."
"అవసరమే! ఏం? భార్య కోరికలను తీర్చలేని వాళ్ళు పెళ్ళెందుకు చేసుకొన్నారు? మీకంటే సంఘంలో గొప్పగా చెప్పుకొందుకు అందమైన భార్య కావాలి. కానీ ఆ భార్య అందమైన కోరికలను తీర్చటానికి మాత్రం మనసొప్పదు. అలాంటప్పుడు నన్నెందుకు చేసుకొన్నారు? మీరింత ముద్ద పడేస్తే అదే మహాప్రసాదమని మురిసిపోయే నా చెల్లిని కట్టుకోలేకపోయారా?"
"ఊరుకో! పెళ్ళయిన అమ్మాయి గురించి పెద్ద మాటలు మాట్లాడకు. ఎవరైనా వింటే బాగుండదు."
"ఏంటి? మహారాజుగారికి మరదలు మీద మనసు మళ్ళినట్లుంది"
ప్రీతి మాటలు వినలేక వెంకటాచలం శబ్దం కాకుండా వీధి తలుపు తెరచి బాల్కనీలోకి వచ్చాడు. తలుపు బయట గొళ్ళెం పెట్టి మెట్లెక్కి డాబా మీదకెళ్ళాడు. అకస్మాత్తుగా అతనికి తన రెండవ కూతురు శ్యామల గుర్తుకొచ్చింది. అతని కళ్ళముందు తన యిద్దరు కూతుళ్ళ బాల్యం, వారి పట్ల తన ప్రవర్తన మెదిలాయి. ప్రీతి ఆటల్లో పడిపోయి ఏడుస్తూంటే లేవదీసి ఎదురుగా ఉన్న కిరాణాషాపులో చాక్లెట్లు కొని యిచ్చేవాడు. కానీ శ్యామలకు దెబ్బ తగిలి ఏడుస్తూ వస్తే ' అంత ఒళ్ళు మరిచిపోయి పరిగెడితే పడిపోరా' అని తిట్టేవాడు. ప్రీతి గుండెలమీద తనను కరుచుకొని పడుకొంటే, శ్యామల మంచం ప్రక్కన నేల మీద తండ్రి వాత్సల్యాన్ని ఆశిస్తూ పడుకొనేది. కొన్నాళ్ళు తన ప్రేమకోసం ఆరాటపడి యిక తనపై ఆశలు పెట్టుకోవటం మానేసింది. ప్రీతికి పెళ్ళయి అయిదేళ్ళయితే శ్యామల వివాహమై మూడేళ్ళయింది. ఇన్నేళ్ళుగా ప్రీతి పుట్టినరోజుకి వచ్చి ఆమెకు ఏదో ఒకటి యిస్తూనే ఉన్నాడు. కానీ పెళ్ళయిన మూడేళ్ళలో ఏనాడూ శ్యామలను చూసి రావాలని అనిపించలేదు. ఇద్దరు కూతుళ్ళ మధ్య ఒక తండ్రిగా తాను న్యాయం చేయలేకపోయాడా? తాను గారం చేసిన కూతురు యిలా తయారైంది. తాను దూరం పెట్టిన కూతురు ఎలా ఉందో చూడాలని మనసుకు అనిపించింది. డాబామీద పిట్టగోడనానుకొని చాలాసేపు ఉన్న వెంకటాచలం మెల్లిగా క్రిందకు వెళ్ళి తలుపు తీసి లోనికెళ్ళాడు.
"ఎక్కడికెళ్ళావు నాన్నా? ఆయన అనుకోకుండా బయటికొచ్చి చూస్తే నువ్వు కనపడలేదు. వీధితలుపు గడియపెట్టి ఉంది. ఎంత కంగారుపడ్డామో తెలుసా?" అంటున్న ప్రీతిని సూటిగా చూడలేకపోయాడు.
"ఏమైంది మామయ్యా?" అడుగుతున్న అల్లుడి భుజంపై సున్నితంగా తట్టాడు.
"ఏం లేదయ్యా? నా భార్య గుర్తుకొచ్చింది. ఆ కాలం మనిషి కదా! నాకిది కావాలని ఎప్పుడూ అడిగేదికాదు. నేనేది యిస్తే అది తీసుకొనేది. ఆర్ధికసమస్యలున్న రోజుల్లో దాని చేయూతే లేకపోతే ఏమైపోయేవాణ్ణో! వెళ్ళండి. వెళ్ళి పడుకోండి" అంటూ మంచంపై నడుం వాల్చాడతను. తమ మధ్య గొడవ వినే ఆయన అలా అంటున్నాడని వాళ్ళకి అర్ధమైంది.
"అదేంటి నాన్నా అప్పుడే వెళ్ళిపోతానంటావు? ఇంతకు ముందు వచ్చినప్పుడు వారంరోజులు ఉండి వెళ్ళేవాడివిగా!" మరునాడే వెళ్ళిపోతానంటున్న తండ్రిని ప్రీతి అడిగింది.
"లేదమ్మా! ఢిల్లీలో అన్నయ్యవాళ్ళు ఊరెళ్ళాలట" అతని మాటలు పూర్తికాకుండానే ప్రీతి అందుకొంది.
"అంటే నిన్ను యింటికాపలా పెట్టి పోతారా వాళ్ళు?" వెంకటాచలానికి చెంప చెళ్ళుమన్నట్లనిపించింది. పసితనంలో తను పెడసరంగా మాట్లాడుతున్నా, గారం వల్ల ఎన్నడూ ఆమెను వారించేవాడు కాదు. అందుకే పెద్దయినా, యిలా పెళుసుగా మాట్లాడటం అలవాటైపోయింది.
" వాడు నన్నూ రమ్మనే అన్నాడు. వయసు మళ్ళినవాణ్ణి కదా! ఎవరో చెప్పినట్లు వయసు మళ్ళాక అందరికీ రోగాలొస్తాయి. అంతమాత్రాన వయసులో ఉన్నవాళ్ళు కోరికల్ని చంపుకోవాలా? అందుకే నేనే యిల్లు చూసుకొంటాను వాళ్ళని వెళ్ళి రమ్మన్నాను. ఈ మధ్యలో ఒక రెండురోజులు రాజమండ్రి కూడా వెడదామనుకొంటున్నాను. దాని పెళ్ళయ్యాక ఎప్పుడూ శ్యామల యింటికి వెళ్ళలేదు. పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పట్లో మళ్ళీ యిటువైపు రాలేనేమో! " రాత్రి ప్రీతి మాటలు విన్న అతను తన కూతుర్ని కొన్నేళ్ళపాటు చూడకూడదని నిర్ణయించుకొన్నాడు.
" ఏమిటి? ఉన్నట్లుండి మీ రెండవ కూతురి మీద ఆప్యాయత పుట్టుకొచ్చింది. అది నాలాగ ఏమీ యిబ్బందులు పడటం లేదు. వాళ్ళాయన ఈ అల్లుడు కన్నా నయమే!"
ఆ రాత్రి శ్యామల యింటికి తొలిసారిగా వెళ్తున్న వెంకటాచలాన్ని ప్రీతి దంపతులు బస్సెక్కించారు.
" బాబూ! తండ్రిగా కూతుర్ని సాకటం వేరు. భార్యగా ఆడదాన్ని చూసుకోవటం వేరు. ఎప్పుడన్నా అది దురుసుగా మాట్లాడితే కారణం మాత్రం అది కాదు. విజ్ఞుడివి. అర్ధం చే్సుకో!" అని అల్లుడితో చెప్పాడతను. పసితనం నుంచి తను చేసిన గారమే ప్రీతిని చెడగొట్టిందన్న ఆయన తాత్పర్యం విశ్వానికి అర్ధం అయింది.
@ @ @ @ @ @
"శ్యామలా!"
వీధిగదిలో టేబులు ముందు కూర్చుని చదువుకొంటున్న ఆమె త్రుళ్ళిపడింది.
'అది నాన్న గొంతులా ఉందే! తన యింటికి తండ్రి వచ్చాడా?' సంశయంతో వెనక్కి తిరిగిన ఆమె తన ముందు వెంకటాచలం నిలిచి ఉండటం గమనించి కన్నీళ్ళ పర్యంతమైంది. అంతలోనే ఆమె ముఖం పాలిపోయింది.
"ఏంట్రా అలా చూస్తావ్? నేనురా! మీ నాన్నని."
"నాన్నా!" అంటూ శ్యామల తండ్రి పాదాలకు నమస్కరించింది. తండ్రి తన భుజాలను పట్టుకొని లేవదీస్తాడని ఆశించింది. కానీ . . .
"సరిసరి! లే!" అంటూ ఆమె లేచిన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. తండ్రి నేలపై ఉంచిన సూటుకేసును పడకగదిలో పెట్టి, మంచినీళ్ళతో వచ్చిందామె.
"బల్లపై ఆ పుస్తకాలేమిట్రా? " తాగిన నీళ్ళగ్లాసుని కూతురు చేతికి అందిస్తూ అడిగాడు.
"మీరు నాకు డిగ్రీవరకూ చెప్పించారు. చదివిన చదువుని సార్ధకం చేసుకోవాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను నాన్నా! నేనూ సంపాదిస్తే ఆర్ధికంగా ఆయనకు ఆసరా యిచ్చినదాన్నవుతానని అనిపించింది."
కూతురి మాటలకు ఆయన మనసు ఉప్పొంగింది. శ్యామల ఎంతలా ఎదిగింది? ఇలాంటి కూతురినా తను దూరం పెట్టాడు? అయినా ఆడది భర్త సహకారం లేకుండా పైకి రాలేదు కదా!
'అబ్బాయి మునుపు, ముందు మనకు తెలియనివాడు. బయట వాళ్ళకి పిల్లనిచ్చేముందు అబ్బాయి గుణగణాలు కాస్త విచారించండి ' అని తన భార్య పోరుపెట్టింది. కానీ తాను వితండవాదం చేశాడు.
"దాని వాలకం చూడు. నీ కూతురు ఓ పేద్ద రంభ మరి! అలాంటి దానికి మన్మధుడెవడూ కాచుక్కూర్చోలేదు. దానికి ఎన్ని సంబంధాలు చూశాం. ఆఖరికి ఈ కుర్రాడు చేసుకుంటానన్నాడు. అబ్బాయి గుణగణాలంటూ ఈ సంబంధం కూడా చెడగొట్టుకుంటే దీనికి జన్మలో పెళ్ళి అయినట్లే మరి!" అని కూతురి ఎదురుగానే పెళ్ళాన్ని వాయించి పడేశాడు. శ్యామల తన మాటకి ఎదురుచెప్పకుండా యితన్ని కట్టుకొంది. తాను ఎంచుకొన్న అల్లుడు గుణవంతుడని యిప్పుడు ఋజువైంది కదా!
"ఏమిటి నాన్నా ఆలోచిస్తున్నారు?"
"అదే! నీ కాపురం బాగానే ఉంది. కానీ ప్రీతి గురించేరా! అది కన్నీళ్ళు పెట్టని రోజు లేదు. భర్తనుంచి తను ఆశించినదేది దక్కటం లేదని ఉద్రేకపడిపోతుంటుంది."
"బావ మంచివాడే నాన్నా! కాకపోతే తండ్రి దగ్గర నడిచినట్లు భర్త దగ్గర నడవాలంటే కొన్ని సమయాల్లో కుదరకపోవచ్చు. అతనికీ కొన్ని సామాజిక బాధ్యతలు ఉంటాయి కదా! కొన్ని సమయాల్లో కొన్ని కోరికలను అతను తీర్చలేకపోవచ్చు. అలాంటి సమయాల్లో మనమే సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు."
ఆమె మాటలకు వెంకటాచలానికి కోపం వచ్చింది.
"నీ కాపురం సవ్యంగా ఉంది గనుక నువ్విలా మాట్లాడుతున్నావు. కానీ అది చెప్పేది వింటూంటే విశ్వానికి విడాకులిప్పించేసి నాతో తీసుకొని పోవాలనిపిస్తుంది."
"విడాకులిప్పించమని తను మీతో అందా?"
"లేదనుకో!"
"మరి! భర్త మీద తను ఎన్ని చెప్పినా అది అతన్ని వదిలి ఉండలేదు నాన్నా! అసలు ఈ సంఘంలో అది ఒంటరిగా బ్రతకలేదు, దాని మాటలు పట్టుకొని. . ." శ్యామల మాటలను పూర్తికానీయలేదతను.
"అవున్లే! పడవలో ప్రయాణించేవాడికి నదిలో కొట్టుకుపోయేవాణ్ణి చూస్తే లోకువే! ఈత కొట్టి గట్టున పడొచ్చు కదా అంటాడు. ఉచిత సలహాలు ఎన్నయినా యివ్వవచ్చు. ఆ పరిస్థితిలో తానుంటే ఏమి చేసేవాడో ఆలోచించడు కదా!" తండ్రి మాటలకు ఆమె బదులివ్వలేదు. ఆ రోజంతా వారి మధ్య మాటలు చాలా తక్కువే! ప్రీతి అయితే తనకు ఊపిరి ఆడనివ్వకుండా మాట్లాడేది. కానీ యిది యింటిపనుల్లో పడి తనను చాలా తక్కువగానే పట్టించుకుంటోంది. అనవసరంగా దీని యింటికొచ్చానా? అని ఆ రోజులో పదిసార్లయినా అనుకొని ఉంటాడు.
"ఆయన కేంపెళ్ళారు నాన్నా! నాలుగురోజుల దాక రారు. మీరు భోజనం చేసెయ్యండి" అనటంతో పెందరాళే భోజనం చేసి ఆమె చూపించిన గదిలో నడుం వాల్చాడు. వంటిల్లు సర్దుకొని వచ్చి తండ్రి మంచం ప్రక్కనే నేలమీద పడుకొందామె. అర్ధరాత్రి ఎవరో తలుపులు బద్దలుకొడుతున్న చప్పుడై వెంకటాచలం లేవబోయాడు. కానీ శ్యామల లేవటంతో తిరిగి కళ్ళు మూసుకు పడుకున్నాడతను. కొద్దిక్షణాలకే ఎవరో దబ్బున పడ్డ శబ్దం, ఆ వెనుక శ్యామల పెట్టిన కేక వినిపించాయి. త్రుళ్ళిపడ్డ అతను అమ్మాయి కంగారులో వెడుతూ జారిపడిందేమోనన్న ఆదుర్దాతో లేవబోయాడు. వెంటనే అల్లుడి మాటలు వినిపించి ఆ ప్రయత్నం మానుకొన్నాడు.
"నిన్ను కాలెత్తి తన్నినా బుద్ధి రాదే! పిలిచిన వెంటనే తలుపు తీయక ఎక్కడ . . . వు?" అల్లుడి నోట్లోంచి అలాంటి అసభ్యపదజాలం విన్న వెంకటాచలం ఉలికిపడ్డాడు.
"నాలుగు రోజుల దాక మీరు ఆ యింటికి వెళ్తానన్నారని నిద్రపోయాను. వెంటనే మెలకువ రాలేదు" శ్యామల గొంతు భయంతో వణుకుతోంది.
"నిద్రపోయావా? నా భర్త చేయగా లేనిది నేను చేస్తే తప్పేమిటని ఎవరినన్నా?. . .చూడు. మా అమ్మ డబ్బుకోసం నిన్ను కోడల్ని చేసుకొంది. అలాగని నీ కన్నా ముందే పరిచయమైనదాన్ని ఎలా వదిలేస్తాను? నేను మగాణ్ణి. ఏదన్నా చేస్తాను. అలాగని నువ్వు గీత దాటుతానంటే నీ తాట తీసేస్తాను."
"మీకు దండం పెడతాను. గట్టిగా అరవకండి."
"ఏం? నేను రాననుకొని నువ్వు పిలిపించుకొన్నవాడు వింటాడనా? నాకెందుకో యిలాంటిదేదో చేస్తావనే అకస్మాత్తుగా యింటికొచ్చాను. ఎవడే వాడు? . . . ఒరే! నేను లేనప్పుడొచ్చి నా కొంపకే చిచ్చుపెట్టాలని చూస్తావురా? నిన్ను. . ."అంటూ ఆవేశంగా వెంకటాచలం పడుకొన్న గదిలోకి వెళ్ళబోయాడు.
గది గుమ్మం దగ్గరే శ్యామల అతని కాళ్ళపై పడి "లోపల పడుకున్నది మా నాన్న. ఒక్కసారి యీ కూతురి కాపురం చూడాలని వచ్చారు. మీరు అల్లరి చేసి ఆయన మనసు కష్టపెట్టొద్దు" అని బ్రతిమలాడుతోంది.
"మీ నాన్నా? అయితే ఇంత అందాలరాశిని బహూకరించినందుకు సన్మానం చేయాల్సిందే! సిగ్గులేకపోతే సరి. నిన్ను నాకు అంటగట్టి చేతులు దులిపేసుకొన్నాడు గాని ఈ మూడేళ్ళలో ఒక్కనాడైనా వచ్చి నీకు తులసాకైనా యిచ్చాడా? మూడేళ్ళ తరువాత ఈ ముసిలోడికి కూతురి కాపురం చూడాలనిపించిందట. మరి వచ్చినోడు నీకు ఏం పట్టుకొచ్చాడో చెప్పు? ఏమీ తేలేదు కదూ! పుట్టింటినుంచి ఏమీ తెచ్చుకోలేని అర్భకురాలిని కట్టుకొన్నాను కదే!" అంటూ ఆవేశంగా శ్యామల జుట్టును పట్టుకొని నేలమీద ఈడ్చేశాడు.
సుమారు అరగంటసేపు అవతల అల్లుడు చేసే దాడికి కూతురికి ప్రాణం కడంటి గగ్గోలు పెడుతుంటే వెంకటాచలం లేవలేకపోయాడు. ప్రీతి విషయంలో యిలా ప్రవర్తించగలడా? ఈ పాిిటికి అల్లుడితో గొడవపడేవాడు కదా! మూడేళ్ళుగా యింత నరకయాతన పడుతున్నా తనకు మాటమాత్రంగానైనా తెలియపరచలేదు శ్యామల. ఏమని తెలియపరుస్తుంది? ముఖవర్ఛసు లేని కూతుర్ని ముష్టివాడికైనా యిచ్చి చేద్దామని నిర్ణయించుకొన్నాడు తను. చీమకి కూడా అపకారం తలపెట్టని ఆ పిచ్చిది, చీకట్లో యిలా అల్లాడిపోవటానికి కారణం ముమ్మాటికి తనే! మంచంపై మధనపడుతూ పడుకొన్న వెంకటాచలానికి, శ్యామల తన మంచం దగ్గరకు వచ్చిన అలికిడి వినిపించింది. ఆమెకి ఈ సౌభాగ్యాన్ని అంటగట్టిన నిర్లక్ష్యం అతన్ని లేవనీయలేదు. గుడ్డి వెలుతురు నిండిన ఆ గదిలో గుండెలోని బాధను తగ్గించుకోవటానికి కరువుతీరా ఏడ్చింది శ్యామల. తన మంచం ప్రక్క నేలమీద కూర్చుని తండ్రి వాత్సల్యం కోసం చూసిన అప్పటి పసిరూపం అతనికి గుర్తుకొచ్చింది. ఇక ఉండబట్టలేక కూతుర్ని ఓదార్చాలని యిటువైపు తిరిగిన వెంకటాచలానికి మౌనంగా బయటకెళ్ళిపోతున్న శ్యామల కనిపించింది. తొలిసారిగా ఆ పిచ్చిదానిపై ఆ తండ్రి గుండెలో మమకారం మొగ్గ తొడిగింది. రాత్రంతా కలతనిద్ర పోయిన అతను లేచేసరికి బాగా ప్రొద్దెక్కింది.
" అల్లుడితో ఒకసారి మాట్లాడాలనుకొంటున్నానమ్మా!" కాఫీ యిచ్చిన శ్యామల తండ్రి మాటలకు త్రుళ్ళిపడింది.
"అల్లుడేమిటి నాన్నా? ఆయన కేంపుకి వెళ్ళారని చెప్పానుగా!"
"ఏమ్మా! చిన్నతనం నుంచి నీకే కష్టం వచ్చినా పట్టించుకోలేదని, యిప్పుడు కూడా నాకు చెప్పదలచుకోలేదా?" వెంకటాచలం కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"నాన్నా! మీరు. ."
"రాత్రి జరిగిన భాగోతమంతా విన్నానురా! నా పిచ్చితల్లి నా ముందే భర్త చేత చావుదెబ్బలు తింటూంటే చేవ చచ్చినవాళ్ళా కలుగజేసుకోలేకపోయాను. నువ్వంటే నాకెప్పుడూ చిన్నచూపేరా! అమ్మ చెబుతున్నా వినకుండా నీకు పెళ్ళయితే చాలని ఈ దుర్మార్గుడికి మూర్ఖుడిలా అంటగట్టాను. ఈ నాన్న మనసు కష్టపెట్టకూడదని యింకా ఎందుకురా నటిస్తున్నావు?" అని కూతుర్ని దగ్గరకు తీసుకొన్నాడు.
మూడేళ్ళుగా నరకయాతన అనుభవిస్తున్న ఆమెలోని బాధ ఒక్కసారిగా తన్నుకొచ్చింది. జీవితంలో తొలిసారి తండ్రిని అల్లుకుపోయి కరువు తీరా ఏడ్చిందామె. కొన్ని నిమిషాల తరువాత వెంకటాచలం తేరుకొని శ్యామల కళ్ళు తుడిచాడు.
"పదమ్మా! ఇక్కడ నరకయాతన అనుభవిస్తూ బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. నాతో అన్నయ్య దగ్గరకు తీసుకుపోతాను. నా జీవితాంతం నిన్ను ప్రాణంలా చూసుకొంటానురా!"
"ఆ తరువాత?" శ్యామల ప్రశ్నకు అవాక్కయిపోయాడు.
"అలాగని ఈ రాక్షసుడికి ఊడిగం చేస్తూ వాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకొంటావా?"
"లేదు నాన్నా! ఆత్మాభిమానం మీ రక్తంలో ఉంది. ఆ రక్తమే నాలోను ఉంది. మీరు నాకేదీ యివ్వలేదని బాధపడుతున్నారు. కానీ మీరు నాకు చదువు చెప్పించిన విషయం మరిచిపోయారు. అది చాలు నాన్నా ఈ కూతురికి మీరిచ్చిన ఆస్తి. నేను ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నానని మీకు చెప్పాను కదా! నేను పోటీ పరీక్షల్లో పాసై, విశాఖపట్నం ఆదాయపుపన్ను శాఖలో గుమాస్తాగా చేరబోతున్నాను. నా సర్టిఫికెట్లను తనిఖీకి పంపించాను. అది పూర్తికాగానే వాళ్ళు ఆర్డరు పంపిస్తారు."
" ఈ విషయం మీ ఆయనకు తెలుసా?"
" లేదు నాన్నా! అక్కడ ఉద్యోగంలో చేరాక ఈ నరక జీవితం నుంచి బయటపడాలనుకొంటున్నాను. అప్పుడే ఆయనకు చెప్పదలచుకొన్నాను."
"శ్యామలా!" తెల్లబోయాడతను.
"ఇష్టంలేని పెళ్ళి చేసుకొన్నానంటున్న నా భర్తకు గుదిబండగా ఉండాలనుకోవటం లేదు. ఆయన తన ప్రేయసితో సుఖపడకుండా అడ్డుపడాలనుకోవటం లేదు. అందుకే ఆయన ఏం చేసినా పడి ఉన్నాను. మీకు రాత్రి చూసింది మాత్రమే తెలుసు. కానీ నిప్పులా ఉన్న నన్ను అనుమానించి యిలా ఎన్నో అర్ధరాత్రులు చిత్రహింసలు పెట్టారు. ఏం నాన్నా! నా వ్యక్తిత్వాన్నే కించపరిచే యిలాంటి భర్తను వదిలేసి నేను తప్పుచేస్తున్నానా?"
"లేదమ్మా! తండ్రిగా నేను నీకు అన్యాయం చేశాను. అయినా నా మీద నీకు కోపం లేదు. నీ జీవితాన్ని చక్కదిద్దుకొనే మార్గం నువ్వే చూసుకొన్నావు. ఇలాంటి అమ్మాయి నా కూతురైనందుకు గర్వంగా ఉందిరా!"
"నాన్నా! నువ్వు నన్ను గారం చేసి ఉంటే ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడే మనస్తత్వంతో ఎదిగేదాన్ని. కానీ నడుస్తూ పడిపోతే 'చూసి అడుగేయమని ' సలహా యిచ్చారు. అదే నాకు యిప్పుడు ఆలోచించుకొనే విజ్ఞతనిచ్చింది. పసితనంలో మీనుంచి ఎన్నో తీసుకోవాలని ఆశపడ్డాను. ఈ రోజు నాకు అలాంటి ఆశలేమీ లేవు. కానీ ఒక్కటే కోరిక. మీ తండ్రిప్రేమను, వాత్సల్యాన్ని కరువుతీరా పొందటానికి నా కళ్ళముందే ఉంటారా నాన్నా?" శ్యామల కోరికకు చలించిపోయాడతను.
తన గారంతో పెరిగిన ప్రీతి చిన్నచిన్న కోరికల కోసం భర్తనే రోడ్డున పెట్టే రీతిలో ప్రవర్తిస్తోంది. కానీ శ్యామల? గుండెలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, గుట్టుగా తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని తాపత్రయపడుతోంది. ఆమెకు చేయూతనిచ్చి సంసారానికి దూరం చేస్తాడా? జీవితాంతం భార్య అనే హోదాకోసం కంట్లో నీటిచుక్కలతో కలకాలం గుమ్మం దగ్గర కాపలా కాస్తూ బ్రతకమంటాడా? తల్లిగా తన భార్య ప్రేమను కూతుళ్ళిద్దరికీ సమంగానే పంచింది. కానీ తన పెంపకంలో తేడానే వాళ్ళిద్దరి మనస్తత్వాల్లో యీ తేడాను తీసుకొచ్చింది.
"నా నిర్ణయం మీకు బాధ కలిగిస్తే యిలాగే ఉండిపోతాలెండి."
"వద్దురా! ఒక తండ్రిగా నిన్ను ఒంటరిగా బ్రతకమని చెప్పలేను. కానీ ఒక మానవతావాదిగా నిన్ను జీవితాంతం బానిసలా నరకయాతన పడమని చెప్పలేను. నీ ఆలోచన ప్రకారమే చెయ్యి. అన్నయ్యతో చెప్పి నీకు తోడుగా ఉండటానికి వచ్చేస్తాను. నీకు ఆర్డరు వస్తే నాకు తెలియపరచు" అంటున్న తండ్రి కాళ్ళకు నమస్కరించబోయిందామె.
"ఈ రోజు నుంచి నీ చోటు అక్కడ కాదు నాన్నా!" అంటూ శ్యామలను వాత్సల్యంతో గుండెకు హత్తుకున్నాడు వెంకటాచలం.
(కుటుంబమైనా, దేశమైనా తన బిడ్డలను సమానంగా చూసుకొన్నప్పుడే అది కీర్తిప్రతిష్టలను గడిస్తుంది. తమ స్వార్ధప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కుటుంబ యజమానులు/దేశ పాలకులు ప్రవర్తిస్తున్నప్పుడు, గారం చేసిన బిడ్డలు అరాచకం సృష్టించాలని చూస్తూంటే, దూరమైన బిడ్డలు తమ మనుగడ కోసం దేశాలు పట్టిపోతారు. ఈ తేడాలు ఎప్పుడు సమసిపోతాయో?)
No comments:
Post a Comment