అటక మీది మర్మం -10 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం -10

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-పదవ భాగం 
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 
(జరిగిన కధ: తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. . మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. ఆ కేసులో ముందుకు వెళ్ళాలంటే ముందుగా బుషీట్రాట్ అన్న వ్యక్తి డైట్ కంపెనీలో పని చేస్తున్నట్లు నిర్ధారించాలి. తండ్రి చెప్పినది విన్న నాన్సీ రైల్వే స్టేషన్లో డయానెను కలిసి తన మాటల్తో బోల్తా కొట్టించి, ఆమెతో డైట్ కంపెనీకి వెడుతుంది. డయానె తండ్రి దగ్గరకు వెళ్ళిన సమయంలో, ఆ కంపెనీ కార్యదర్శితో ఫాక్టరీలోపల చూడటానికి వెళ్ళిన నాన్సీ చిన్ననాటాకంతో అక్కడ పనిచేసే బుషీట్రాట్ ను చూస్తుంది. ఆ విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా పై అంతస్తునుంచి రక్తం గడ్డకట్టించే స్థాయిలో అరుపు వినిపిస్తుంది. పక్కబట్టలకోసం పాత బీరువాలో వెతుకుతున్న ఎఫీని బ్లాక్ విడో సాలీడు మరిచిందని గమనించి డాక్టరు వద్దకెళ్ళి చికిత్స చేయిస్తుంది. హన్నా ప్లెజెంట్ హెడ్జెస్ కి వచ్చి బ్లాక్ విడోని కనుక్కొని చంపేస్తుంది. జబ్బుపడ్డ ఎఫీ కోలుకొనేవరకు నాన్సీ మార్చ్ భవంతిలోనే ఉండిపోతుంది. ఆ రోజే గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా కోరుతూ ఉత్తరం వ్రాస్తుంది. భోజనాల సమయంలోమార్చ్ తన కుటుంబవిషయాలను నాన్సీకి చెబుతాడు. ఆ రాత్రి అటకమీద వెతుకుతుంటే అనుకోకుండా ఆమె టార్చీలైట్ ఆరిపోవటం, అదే సమయంలో ఎక్కడినుంచో కొన్ని విపరీత శదాలు వినిపించటం జరుగుతుంది. ఎఫీ కోలుకొన్నాక యువ గూఢచారి యింటికొస్తుంది. తరువాత ఏం జరిగిందంటే. . . . . )
@@@@@@@@@@@@@@@@@
"నా కూతుర్ని చూడగలిగినందుకు ఆనందిస్తున్నాను" అంటూ ఆప్యాయంగా అన్నాడు. " ఈ శుభసందర్భంలో ఈ రోజు పూర్తిగా సెలవు తీసుకొని పండుగ చేసుకోవాలనుకొంటున్నాను."

తనను తండ్రి ఉడికిస్తున్నట్లు పసికట్టి, " నిజంగానే సెలవు తీసుకొంటున్నారా?" అని నాన్సీ అడిగింది.

"నేను బుకర్ ని కలవటానికి వెళ్తున్నాను" తండ్రి బదులిచ్చాడు.

పట్టు తయారీ ఫార్ములా దొంగతనం కేసు ఎంతవరకూ వచ్చిందని అడిగిందామె.

"బొత్తిగా ఏమీలేదు. నువ్వు డైట్ ప్లాంట్ కి వెళ్ళివచ్చినప్పటినుంచి ఎంతోమంది నీడలా అక్కడే ఉండి వెన్నంటి పరిశోధిస్తున్నారు. కానీ బుషీట్రాట్ ఆ భవనంలోకి వెళ్ళటం గాని, లోపలినుంచి బయటకు రావటం గానీ ఎవరు చూడలేదు."

"అతను లోపలే నివసిస్తూ ఉండి ఉండొచ్చు. ఒకసారి నన్ను ఫాక్టరీలోకి వెళ్ళి కనిపెట్టమంటావా?" నాన్సీ అడిగింది.

"ఇప్పుడే వద్దు. ఆ ట్రాట్ అక్కడ ఉన్నా, లేకపోయినా బుకర్ తన విధానాన్నే వాళ్ళు అనుకరిస్తున్నారని, లారెన్స్ డైట్ మీద న్యాయపరమైన చర్యలకు పూనుకొమ్మని తొందర చేస్తున్నాడు."

"మీరు అలా చేస్తారా?"

"మరింత ఋజువు దొరికేదాకా లేదమ్మా!" అని బదులిచ్చాడతను. "డైట్ లాంటి హోదా ఉన్న వ్యక్తిపై నేరం మోపేముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ ప్రత్యేక పట్టు వస్తువులను తయారుచేసే విధానాన్ని బుకర్ సరిగా వివరించలేకపోతున్నాడు. నేను దాన్ని కనుక్కొనే పనిలో ఉన్నాను. నువ్వూ నాతో వస్తావా?"

"రెండవసారి నన్ను అడగవలసిన పని లేదు."

"ప్రస్తుతం మనం బుకర్ ప్లాంట్ లోకి వెళ్తున్నాం. తరువాత మనిద్దరిలో ఒకరు డైట్ ఫాక్టరీలోని రహస్యవిభాగంలోకి వెళ్ళగలిగితే, ఈ రెండు ప్లాంట్లలో పట్టు కండువాల తయారీలో అనుసరిస్తున్న విధానాలను పోల్చి చూడగలం."

తన ఫాక్టరీకి వచ్చిన ఆ తండ్రీకూతుళ్ళను బుకర్ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు.

"ముందుగా గొస్సామెర్ గార్మెంట్ గదిని చూపిస్తాను" వెళ్ళే దారిలో చెప్పాడతను.

ఆ గదిలో ఉన్న మేకులకు కండువాల తయారీలో ఉపయోగించే తెల్లనిరంగులో మెరిసే సన్నని పట్టు పదార్ధాలు వేలాడుతున్నాయి. మిగిలినవన్నీ అనేక రంగుల్లో ఉంటే, వాటిలో కొన్ని కళాత్మకమైన, అసాధారణ డిజైను నమూనాల్లో ఉన్నాయి.

"చాలా అందంగా ఉన్నాయి!" నాన్సీ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ అంది.

తెలివైన డిజైనర్లు వీటిలో కొంతభాగాన్ని ఆకర్షణీయమైన దుస్తులుగా మలచి, దుమ్ము చేరని గాజు కేసుల్లో ఒక వరుసలో వేలాడదీస్తారు.

"ఇంత అందమైన దాన్ని నేనెప్పుడూ చూడలేదు" నాన్సీ అంది. సాయంత్రాల్లో వాడే లేత పసుపురంగు గౌను ఆమె దృష్టిని ఆకర్షించింది. "నృత్యప్రదర్శనకు అనువైన అద్భుతమైన వస్త్రం!"

దాన్ని నేసిన విధానాన్ని చూస్తూంటే యింతకు ముందు తాను చూసిన ఏ వస్త్రంతోను సరిపోలని స్థాయిలో ఉంది. "బట్ట చూస్తే చాలా బలంగా ఉంది. కానీ చేతితో తాకితేనే కరిగిపోయేంత సున్నితంగా కనిపిస్తోంది."

నాన్సీ మాటలకు బుకర్ గర్వంగా చూశాడు. " అందుకే దీన్ని గొస్సామెర్ అంటాం. దీన్ని ఎలా తయారుచేస్తారో మీకు చూపిస్తాను. కానీ ఈ రహస్యాలను, అఫ్ కోర్స్ , ఎప్పుడూ బయటపెట్టమని నాకు మాటివ్వాలి."

"మమ్మల్ని నమ్మొచ్చు" డ్రూ అన్నాడు.

ఆ ఫాక్టరీ యజమాని ఒక పెద్ద యినుపతలుపు తాళం తీసి, వాళ్ళను ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గదిలో యిద్దరు వ్యక్తులు ఒక బల్ల ముందు కూర్చుని అసాధారణమైన పని చేస్తున్నారు.

"ఇదే నా సాలెగూడు. ఈ గాజుగోళంలో నేను నేతగాళ్ళను పోషిస్తున్నాను. అవి నాకు కావలసిన పట్టుదారాన్ని సమకూరుస్తాయి" బుకర్ వివరించాడు.

" మీరు నిజంగా సాలెపురుగుల్నే వాడుతున్నారే!" నాన్సీ తెల్లబోయింది.

"అవును"అంటూ నవ్వాడతను. "వాటి చేత ఎలా పని చేయించాలో తెలుసుకోగలిగితే, అవి మనకు బాగా ఉపయోగపడుతాయి."

నాన్సీ ఆసక్తిగా గమనిస్తోంది. అక్కడున్న యిద్దరు పనివాళ్ళలో ఒకడు తన దగ్గర ఉన్న పట్టకారుతో ఒక సాలీడుని పట్టుకొన్నాడు. అది తన పొట్ట దగ్గర ఉన్న చిన్న కన్నం నుంచి సన్నటిపొరలా ఉండే దారాన్ని స్రవించింది.అతను తన రెండవచేతితో ఆ దారాన్ని పుడకలా ఉన్న స్పూల్ కి చుట్టాడు.

"సాలీళ్ళు వేగంగా పనిచేస్తాయి" న్యాయవాది వ్యాఖ్యానించాడు.

"వీటిలో ఒక సాలీడు గంట లోపునే అరగజం దూరం వరకూ సాలెగూడు అల్లేస్తుంది. ఇప్పుడు ఆ సన్నటి దారాన్ని ఒక బట్టలా అల్లేంత దిట్టంగా ఎలా మారుస్తామో చూపిస్తాను ."

బుకర్ వాళ్ళిద్దరిని సన్నటి దారానికి రసాయనాలను జోడించి, పట్టుగా తయారుచేసే గదిలోకి తీసుకెళ్ళాడు. అది ఒక రహస్య ఫార్ములా గనుక ఆ గదిలోకి ఎవరినీ అనుమతించరు. ఆ గదిలో నాన్సీ అనేక గొట్టాలలో నిండి ఉన్న ద్రావణాన్ని చూడటమే గాక, వాటినుంచి వచ్చే అసాధారణమైన వాసనను కూడా గమనించింది.

"మిగిలిన విషయాల కన్నా యీ వాసనను తాను తేలికగా గుర్తించగలదు. ఇదే రసాయనాన్ని డైట్ ఫాక్టరీలో వాడుతున్నట్లయితే, ఆ దారిలో తాను విషయాన్ని రాబట్టగలదు" నాన్సీ తనలో అనుకొంది.

"బుషీట్రాట్ పనిచేసిన విభాగమిదేనా?" అని డ్రూ అడిగాడు.

"అవును. ఈ విభాగంలోనే ఉండేవాడు. పెద్ద సిఫార్సుతో ఒక రసాయనిక శాస్త్రవేత్తగా నా దగ్గరకు వచ్చాడు. అకస్మాత్తుగా అతను పని మానివేయటంతో ఒక గూఢచారిగా యిక్కడకు పంపబడ్డాడేమోనని నేను అనుమానించాను."

ప్రస్తుతం ప్రతికక్షికి వ్యతిరేకంగా కావలసినంత సాక్ష్యం ఉన్నదని బుకర్ తో డ్రూ చెప్పాడు.

"బుషీట్రాట్ విషయంలో యింకా తనిఖీ చేయటానికి ప్రయత్నిస్తున్నాం. లారెన్స్ డైట్ తన పట్టుబట్టలను ఎలా తయారుచేస్తున్నాడో కనుక్కోవటమే తదుపరి అడుగు."

తండ్రీకూతుళ్ళిద్దరూ బుకర్ ఫాక్టరీనుంచి తిరుగుప్రయాణమయ్యారు.

"డైట్ ఫాక్టరీలోకి మరొకసారి వెళ్ళగలిగితే, విషయాన్ని రాబట్టగలను" నాన్సీ వ్యాఖ్యానించింది.

"మరొకసారి డయానెతో కలిసి డైట్ ఫాక్టరీలోకి వెళ్ళాలనుకొంటున్నావా?" తండ్రి అడిగాడు.

"ఆమెతో నాకు అంత గాఢస్నేహం లేదు. ముఖపరిచయం ఉన్న స్నేహితురాలు మాత్రమే నాన్నా! నేను మరొక మార్గం ఆలోచించాను" చెప్పిందామె.

తండ్రిని అతని ఆఫీసు దగ్గర వదిలాక, ఆమెలో ఏదో ప్రేరణ కలిగినట్లయింది. తన ప్రణాళిక పనిచేస్తే, ఆమె సులువుగా డైట్ ఫాక్టరీలోకి వెళ్ళగలదు. తన ప్రణాళికను అమలులో పెట్టాలన్న ఉత్తేజంతో ఆమె కారును డైట్ యింటివైపు పోనిచ్చింది. రోడ్డు మీద వెళ్తున్న ఆమెకు తీగలతో అల్లిన కంచెల మధ్య నుంచి నగర శివార్లలోని విశాలమైన భూములు కనిపిస్తున్నాయి. ఆమె తన కారును మెలికలు తిరిగిన బాటలోకి మళ్ళించి, సముద్ర తీరాన ఉన్న ఒక పెద్ద తెల్లని యింటి వైపు పోనిచ్చింది.

నాన్సీ ఆశగా డైట్ యింటి కాలింగ్ బెల్ నొక్కింది. ఆమె తన ప్రణాళికను అమలుపరిచే ఆత్రుతలో ఉంది. డయానె తలుపు తీసింది.

"నన్ను చూడాలని వచ్చావా?" డయానె మొరటుగా అడిగింది.

నాన్సీ మర్యాదపూర్వకంగా నవ్వింది. "నీకు ఒక చెల్లెలు ఉంది కదూ!" నాన్సీ ఆమెనడిగింది.

"అవును. పేరు జీన్. ఏడేళ్ళ వయసు."

"అయితే నాకు తెలిసిన అమ్మాయి కన్నా మీ చెల్లి వయసులో కొంచెమే పెద్దది. నేను చెప్పిన అమ్మాయికి బట్టలు చాలా తక్కువ ఉన్నాయి. మీ చెల్లికి బిగువైపోయిన బట్టలు ఉంటే ఆ అమ్మాయికి యిస్తారేమో మీ అమ్మగారిని అడుగుతావా?"

నాన్సీ ప్రశ్నకు డయానె భుజాలెగరేసింది. " అమ్మని అడుగుతాను. లోపలకు రా!"

ఆమె ఆహ్వానానికి నాన్సీ పొంగిపోయింది. మిస్టర్ డైట్ ఎలాంటి కళాఖండాలను యిష్టపడతాడో చూడటానికి యిదే మంచి అవకాశం. మార్చ్ యింటిలో ఉన్న పురాతన వస్తువులను కొనటానికి వీళ్ళు యిష్టపడొచ్చు. తను వాళ్ళకు కొన్ని వస్తువులను అమ్మగలిగితే, ఆ వంకతో మిస్టర్ డైట్ ను అతని ఫాక్టరీలో కలిసే అవకాశం రావచ్చు.

ఒంటరిగా ఉన్న నాన్సీ ఖరీదైన ఫర్నిచరుతో నిండిన ఆ హాలుని పరికించి చూసింది. ఒక ప్రక్క గోడలో బిగించిన దేవదారు అలమారు ఆమె దృష్టిని ఆకర్షించింది. దానిలో అరలన్నీ గాజుతో చేసినవి. వాటిపై ఒక వరుసలో అందమైన, అపూర్వమైన పాత సీసాలు ఉన్నాయి.

"మంచి విషయం తెలిసింది" అనుకొంటూ నాన్సీ పొంగిపోయింది. వాటిని పరీక్షగా చూడటానికి దగ్గరకు వెళ్ళింది. వాటిలో ఒక సీసాపై జార్జ్ వాషింగ్టన్ ముఖం ఉంటే, మరొకదానిపై డాలీ మాడిసన్ ముఖం ఉంది. ఆమె ముచ్చట గొలిపే నీలం రంగు పాత పన్నీరు సీసాను చూస్తూండగా, డయానె మెట్లు దిగి వచ్చింది.

"అక్కడున్నావా?" అంటూ తన చేతిలోని బట్టల కుప్పను సోఫాలోకి విసిరింది.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages