ధీమా-భీమా - అచ్చంగా తెలుగు
"ధీమా-బీమా"
వేదుల సుభద్ర 

" ఇది ఏ ఒకరిద్దరికో తప్ప అందరికీ ప్రాప్తించే అవస్థే కదా, శేఖర్? మనం కావాలనుకుంటే వచ్చేది, వద్దనుకుంటే పోయేదీ కాదు.. వంటిమీద కుదురుగా నిలబడనిది వయసే కదా.. అయినా ఇప్పుడేమయింది? నాలుగురోజులు పోతే మళ్ళీ నా కాళ్ళమీద నేను అదే ధీమాతో, బీమాతో నిలబడతాను.
కంపెనీ వారు పెట్టిన రిటైర్ మెంట్ అయిందిలే, చురుగ్గాఉండేవాళ్ళకి రిటైర్మెంటేవిటి? మన విజయ్, అదే పెళ్ళికొడుకు తండ్రి కంపెనీకి సలహాదారుగా పనిచేస్తాను. ఆపైన సమయం ఉన్నప్పుడు ఆర్టికిల్స్ రాస్తాను. వయసునూ, అది తెచ్చే చిన్న, పెద్ద సమస్యలను ఆపడం ఎవరి తరమూ కాదు కదా!
“అది, ఆరోజు నేను చేసిన పని మాత్రం  మాత్రం నేను వద్దనుకుంటే ఆగిపోయేది, కావాలంటే జరిగేది" ఇంత  చిన్న లాజిక్ మిస్సవకపోతే నన్నీ ప్రశ్న అడిగేవాడివే కాదు కదా!" అంటూ నా ముఖంవంకైనా చూడకుండానే, వెళ్ళిపోయిన అతన్ని చూస్తూ..
" మళ్ళీ కొట్టాడు దెబ్బ ముసలాడు" అనుకోలేకపోయాను.. " పెద్దాయన చేతిలో మళ్ళీ ఓడిపోయాను’ అనే అనుకున్నాను..
దానికి కారణం ఆయనతో పాటు పెరిగిన నా వయసా? అదే అయితే ఇన్నేళ్ళ తర్వాత కలిసిన  ఆయన్ని అలా పలకరించేవాడినా??
ఏ మూలో నాకు తెలియకుండానే పెరిగిన కాస్త వివేకమా?? అసలది నాలో ఉందా? ఆయన మాటలు విన్నాకా కలిగిన భావాలే ఇవన్నీ..
దాదాపు ఇరవై సంవత్సరాలై ఉంటుందేమో....
---------------
మధ్యతరగతి కాలనీలో కొత్తగా ఇళ్ళు వెలుస్తున్న కాలనీ మాది. నేనో చిన్న వ్యాపారస్థుడిని అప్పుడు. కార్లు కొని టాక్సీలు గా అద్దెకు తిప్పేవాడిని, అలాగే నాకో గారేజ్ కూడా ఉండేది. నా టాక్సీలే కాక,  ఇతర కార్లని కూడా రిపేర్ చేయించడానికి.
ఆ కాలనీలో చవకలో మా నాన్న కొన్న స్థలంలో ఒక పక్క ఇల్లు, మరో పక్కన గేరేజ్, కార్లు నిలుపుకోవడానికి వీలుగా స్థలం ఉండేలా ప్లాన్ చేసి కట్టించాను. ఇంటినీ , గేరేజ్ స్థలాన్నీ కలుపుతూ లేదా విడదీస్తూ ఒక గోడ, దానికి నా రాకపోకలకి వీలుగా గేటూ పెట్టించాను. పదిహేను కార్లవరకూ పెట్టుకొవచ్చు నా గేరేజ్ కున్న స్థలం కాక మిగిలిన దాంట్లో..
ఇలా అన్నీ హాయిగా సెట్ చేసుకున్నాను పనిలో.. అలాగే జీవితంలోనూ.. నా మాట కనుగుణంగా నడుచుకునే ఇల్లాలు, ఇద్దరు పిల్లలు, మా అమ్మా. ఇది సంసారం.
పొద్దున్నే వెళ్ళి ఏ కార్ ఎక్కడికెళుతోందో? డ్రైవర్ ఎవరో? లాంటీటి వివరాలు రాసుకోడం, గేరేజ్ పరీక్షించడం ఆపైన మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం, చిన్న కునుకును తీసి టీ తాగి మళ్ళీ సాయంత్రం వెళ్ళి పని చూసుకోవడం..
ఇదీ నా దినచర్య..
"ఎదురుకుండా ఇల్లు కడుతున్నారల్లే ఉంది" అంది మా అమ్మ ఓ రోజు వీధిలో పూలు కోసుకోవడానికి వెళ్ళి వస్తూ..
" కొత్త కాలనీ కదా, ఇంక వస్తూనే
" పోన్లే మనుషులు కనబడితే ఆ సందడే వేరు, ఇక్కడోటీ, అక్కడోటీ విసిరేసినట్టున్న ఇళ్ళల్లో ఎవరున్నారో, లేదో ? కూడా తెలీడం లేదు బొత్తిగా" అందావిడ సంతోషంగా.
" ఆ!  వచ్చిన వాళ్ళు మనతో కలవాలి గా?" అంది నా భార్య అధాట్టుగా.
" ఎందుకు కలవరే? నీది మరీ వింత! నొరు మంచిదైతే ఊరు మంచిదని ఊరికే అన్నారా?" అంది మా అమ్మ.
అలా మాట్లాడుకుంతున్న ఆడవాళ్ళిద్దరినీ వదిలి నేను గారేజ్ వైపు అడుగులు వేస్తూ, ఎదురుగా ఉన్న స్థలం వైపు చూసాను..
గోతులు తవ్వుతున్నారు, వాటి వరస చూస్తే పిల్లర్లకోసం అనిపించడం లేదు.
‘ కొంపదీసి పునాది వేస్తారా ఏమిటి?’ అనుకున్నాను. నా ఊహే నిజమైంది కొన్నాళ్ళకి..
ఆ తర్వాత నాకాశ్చర్యం కలిగించే సంఘటనలు చాలానే జరిగడంతో రోజూ ఆ పక్క కి చూడడం , అదే పరీక్షించడం ఎక్కువయింది.
ముట్టుకుంటే మాసిపొయేలా ఉందే ఒక నడివయసాయన రోజూ పొద్దున్నా, సాయంత్రం తన స్కూటర్ మీద వచ్చేవారు, వెనక ఆయనకన్నా సుకుమారంగా ఉండే ఆవిడ, ఆయన శ్రీమతి అనుకుంటా.  ఇద్దరూ ఠంచనుగా 8.30 కల్లా వచ్చేవారు. ఆయన పావుగంట సేపు ఉండి మేస్త్రీతోనూ, ఇతరులతోనూ మాట్లాడి సరిగ్గా 8.45 కల్లా ఆవిడకి చెప్పేసి,  వెళ్ళిపోయేవారు. ఆవిడ ఆపైన ఓ గంటో, రెండు గంటలో అన్నీ పర్యవేక్షించి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు. తనతో ఒక మంచినీళ్ళ సీసా, చిన్న చాలా, గొడుగూ తప్పక తెచ్చుకునేవారుట. రేఖ చెప్పింది
ఒక రోజు లారీలో కొన్ని పాత ద్వార బంధాలు, కిటికీలు దిగాయి. అలాగే మంగుళూరు పెంకులు.. ఆరోజు ఉత్సుకత ఆపుకోలేక, వెళ్ళి పరిచయం చేసుకుని మాట్లాడాను.ఆయన పేరు మాధవరావు, ఆవిడ పేరు రాజ్యలక్ష్మి..
“ఇంకా ఈరోజుల్లో పెంకుల ఇల్లేమిటి సార్”? అన్నాను నవ్వుతూ..
"డాబా వేసుకోవచ్చనుకోండి కానీ పెంకుటింటిలో ఉన్న చల్లదనం ఉండదు కదా! అసలు మనవైపు పెంకులు దొరకలేదు అందుకే మంగుళూరు పెంకులు వేయించాల్సి వస్తోంది" అన్నారు  చిరు నవ్వుతో.
" మరి ఈ పాత తలుపులూ, ద్వార బంధాలూ?"
"ప్రతీ ఇంటికీ చెట్లు కొట్టేస్తే ఎలాగండి? బావున్నాయని మా వడ్రంగి మేస్త్రీ చెప్పాకే ఇవన్నీ తెచ్చాను, లేడీస్ కి సెంటిమెంట్ కనక ముఖద్వారానికి మాత్రం కొత్తది కొన్నాను, నాకైతే అదీ పట్టింపు లేదు”  అన్నారు.
“ఈయనది చాదస్తమా? పిసినారితనమా? “అని నవ్వొచ్చింది నాకు. కానీ ఆయన్ని పరిశీలించాలన్న కోరిక మాత్రం హెచ్చింది. దానివల్లనే, ఆయనతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడిని..
ఆయన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలలో ఒకదానిలో పనిచేస్తారని, రోజూ తొమ్మిదికల్లా ఆఫీసులో ఉండాలి అనేది ఆయన నియమం, ఆఫీసుకు ఆలస్యంగావెళ్ళడం ఆయనకలవాటు లేదు , అదేఆయన 8.45 కల్లా వెళ్ళిపోవడానికి కారణం అదేనని తెలుసుకున్నాను. ఒక్కర్తే కూతురుట, మనిపాల్ యూనివర్సిటీలో చదువుకుంటోందిట. ఆవిడ,ఆయన ఇద్దరే ఉంటారు.
స్థలం పెద్దదైనా ఇల్లు చిన్నదిగా కట్టి నలువైపులా తోటకని స్థలం వదిలేశారు. ఆవిడ సిమెంట్ పని పూర్తయ్యే సమయానికి పూల, పళ్ళ చెట్లు పెట్టడం మొదలు పెట్టారు. వెనక కిచెన్ గార్డెన్ కి అనువుగా మళ్ళూ, నీళ్ళకి బావి తవ్వారు, ఆయనకి బోర్ వెల్ అంటే ఇష్టం లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేకుండానే నాకు తెలిసి పోయింది.
‘ఈ లెక్కన ఆయన ఇంట్లో ఫేన్లైనా పెట్టుకుంటారా? లేక ఏ వేపచెట్టో వేసుకుంటారా?’ లాంటి అనుమానాలునాకెన్నో వచ్చేవి కానీ ఆయనని అడిగితే బావుండదని ఊరుకునేవాడిని.
పైకి మర్యాదగానే మాట్లాడుతున్నా,  ఆయనంటే నాకు తెలీకుండానే కాస్త తేలిక భావం వచ్చిందనే చెప్పాలి.
నా బిజినెస్ లో మేనేజర్ గా చేరాడు నా బావమరిది సురేష్ . కార్ల రిపేర్లు, గేరేజ్ వ్యవహారాలు చూసుకునేవాడు.  నేను నా స్నేహితులతో కలిసి ప్రారంభించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీ అయిపోవడంతో ఆయనని దగ్గరగా చూడడం తగ్గిపోయింది.
గృహప్రవేశానికి పిలవడానికొచ్చారు ఆ దంపతులిద్దరూ వాళ్ళ అమ్మాయిని తీసుకుని. ఎంతో ముచ్చటగా ఉంది వాళ్ళ అమ్మాయి లంగా వోణీ వేసుకుని. ఎంతో సింపుల్ గా అరటి ఆకుల భోజనాలు, మావిడి తోరణాలతో సాంప్రదాయ బధ్ధంగా జరిగింది వాళ్ళ గృహప్రవేశం.
అదయ్యాకా వాళ్ళిద్దరూ చిన్న లారీడు సామాన్లతో వచ్చేశారు. వాళ్ళ దినచర్య ఎంతో సరళంగా, హాయిగా ఉండేది.. వాళ్ళ విషయాలన్నీ నాకప్పుడప్పుడు అమ్మ ద్వారా, రేఖ ద్వారానే తెలుస్తున్నాయి.. కలవడం అరుదుగా జరిగేది నా పనుల కారణంగా.. పెరిగిన బిజినెస్ వల్ల నాకు ప్రయాణాలూ ఎక్కువే అయ్యాయి..
ఒకరోజు నా బావ మరిది సురేష్ బెరుగ్గా చెప్పాడు.. మా కార్లలో  ఈ మధ్యన  నాలుగు కార్లకి  యాక్సిండెంట్లు జరిగాయనీ, పాలసీ తీసుకున్నప్పుడు తక్కువలో వస్తాయని కొన్ని క్లాజ్ లు వదిలేసామని ఇప్పుడు వాటిల్లోకి వచ్చే కారణాలవల్లే మా కార్లకి ప్రమాదాలు జరిగినందువల్ల మాకెలాంటి పరిహారమూ ఇవ్వడానికి కుదరదని బీమా కంపెనీ వాళ్ళు చెప్పారని భయపడుతూనే చెప్పాడు. అంతేకాక వచ్చే ఏడాది నుంచి మేము ఆ రెండు కార్లకి కట్టవలసిన ప్రిమియం కూడా పెరుగుతుందని. చెప్పాడు. నాకోపం గురించి వాడికి అందరికంటే కొంచం ఎక్కువే తెలుసు.. కోపం వస్తే ఏం మాట్లాడతానో, ఏం చేస్తానో నాకే తెలీదు.,
సహజంగానే నాకది నచ్చలేదు. ప్రధమ స్పందనగా అతన్ని బాగా కోప్పడ్డాను. ఇలా ఎందుకు జరిగింది? పూర్తిగా పరిశీలించి తీసుకోవాలి కదా అని గట్టిగా అరిచాను, నిజం చెప్పాలంటే విరుచుకు పడ్డాను.. చిన్నబుచ్చుకున్నాడు..
“ఏ కంపెనీ తో బీమా చేసాము?” అని అడిగాను..
అతను చెప్పిన కంపెనీ పేరు వినగానే నాలో కొద్దిగా సంతోషం..
మాధవరావు గారిది అదే కంపెనీ. ఆయనతో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని నా పని సాధించుకోవచ్చునన్న ఆశ కలిగింది..
మర్నాడు పొద్దున్నే ఆయన ఇంటికి వెళ్ళాను..
గడియారం ఏడు కొట్టకుండానే వచ్చిన నన్ను సంతోషంగా ఆహ్వానించారు ఆయన..
“ రాజ్యం ఎవరొచ్చారో చూడు! శేఖర్ గారు. మరొ కప్పు కాఫీ!” అంటూ ఆవిడతోచెప్పి “రండి, రండి” అంటూ కుర్చీ చూపించారు..
రెండు నిమిషా లు మాములు మాటలయ్యాకా, నేను విషయం కదపబోయాను..
" ఆఫీసు విషయాలు ఆఫీసులోనే మాట్లాడతానండి. మొదటి నించీ అదే అలవాటు. మీకు వీలున్నప్పుడు ఆఫీసుకొస్తే లేదా మీవాళ్ళెవరినైనా పంపిస్తే మా వాళ్ళు సహాయం చేస్తారు" అన్నారు అదే చిరునవ్వుతో..
నాకు కోపం వచ్చింది. " ఏమిటీయన అతిశయం?" అనుకున్నాను కానీ అవసరం నాది కనక పైకి “సరేనండి అలాగే !” అని చెప్పి వచ్చేశాను..
మర్నాడు తప్పదు కనక ఆఫీసుకు వెళ్ళాను. అక్కడా అంతే మర్యాదగా ఆహ్వానించారు, అక్కడకెళ్ళాకే తెలిసింది, అది ఒక పెద్ద డివిజనల్ ఆఫీస్ అని, దానికాయన మేనేజర్ అని.. “ఇంకేం? పని అయిపోయిందనుకున్నాను.”  ఎక్కడో ఓ మూల అనుమానంగానే ఉంది..
"చూడండి శేఖర్! మీరు చేసినది సరి కాదు, అందువల్లే ఈ క్లెయింస్ సెటిల్ చెయ్యడం కుదరదని మా వాళ్ళు చెప్పారు, ఇంక ఇందులో మనం చెయ్యగలిగిందేమీ లేదు, ఈ సారి నించి మిస్సయిన క్లాజ్ కూడా కవర్ అయ్యేలా చూసుకోవడమే. మీ దురదృష్టం  కొద్దీ నాలుగు కార్లూ అదే విధంగా యాక్సిడెంట్ కు గురీయ్యాయి. మీరు కానీ , మీ బావమరిది సురేష్ కానీ వస్తే మా వాళ్ళు ఎలాంటి పాలసీ తీసుకుంటే మంచిదో చెప్తారు, అప్పుడిలాంటి సమస్యలు రావు" అంటూ బుద్ధుడిలా జ్ఞానభోధ చేస్తున్న ఆయన్ని చూస్తే నాకరికాలి మంట నెత్తికెక్కింది.
అయినా పళ్ళ బిగువున కోపాన్ని అదిమి పెట్టి..
"నిజమే సర్! కానీ ఈ ఒక్కసారికి మీరేదోలా చూస్తే వచ్చే సారి నుంచి జాగ్రత్తగా ఉంటాం" అన్నాను నవ్వుతూ.
ఆయన నవ్వలేదు.. " ఎదోలా అయ్యేదైతే ఈ పాటికే మావాళ్ళు చేసేవారు, అవ్వలేదంటే కుదరదనే కదా! ఇంక ఇందులో నేను చెయ్యడానికేమీ లేదు" అంటూ తన ఎదురుగా ఉన్న ఫైల్ వైపుకి దృష్టి సారించారు..దాంతో నాకు ఒళ్ళు మండిపోయింది.
"ఇంక నువ్వెళ్ళచ్చు" అన్నట్టుగా అనిపించి నాకు మరింత కోపం వచ్చింది ఆ అవమానానికి..
" మీరే అలా అంటే ఎలా సార్? బాగా తెలిసిన వాళ్ళం, మీరే ఏదో ఒక మార్గం చూడాలి" అంటూ ఉండగానే
" శేఖర్, మీకు ఇప్పటికే చెప్పాను, మన పరిచయానికి,  ఈ సాయానికి ఎలాంటి సంబంధం లేదు, రెండింటినీ దయచేసి కలపద్దు, నేనున్న ఏ బ్రాంచి లోనూ నాకు అన్నం పెట్టే సంస్థకి అన్యాయం జరగదు, నేను జరగనివ్వను. దేవుని దయవల్ల మీకు కావలసినంత డబ్బుంది, రిపేర్లు చేయించుకోగలరు. అందుకని మీరు ఆ పనిలో ఉంటే మంచిది" అన్నాడాయన  స్థిరంగా..
" అది నువ్వేం చెప్పక్కర్లేదు లే సారూ, నీ చేతిలో ఉన్నది చేస్తావా, లేదా చెప్పు చాలు" అన్నాను చిరాగ్గా, ఎప్పుడు ఏకవచనంలోకి దిగానో నాకే తెలీలేదు..
" ప్లీజ్, ఈ చిన్న విషయాలకి మర్యాద మీరకండి. మన వస్తువులకైనా, మన ప్రాణాలకైనా సరే!  బీమా ఎప్పుడూ అన్నీ తెలుసుకొని సరిగ్గా చేసుకోవాలని గుర్తుంచుకోండి చాలు, వెళ్ళండి" అన్నాడాయన..
" అధికారం చేతిలో ఉందనే కదా, ఈ అహంకారం..చిన్న సహాయం చెయ్యమంటే దేశాన్ని దోచిమ్మన్నట్టు ఫీల్ అవుతున్నావే? చూదాం ఇదెన్నాళ్ళుంటుందో? " మొదటినించీ నాకున్న కోపంతో ఏం మాట్లాడుతున్నానో తెలీకుండా అంటూనే ఆయన ఆఫీసులోంచి వచ్చేశాను..
ఆతర్వాత నా కార్లవి, ఇతర బిజినెస్ లవి ఇన్స్యూరెన్సలని ఆ కంపెనీ నించి మార్చేశాను. అదే నేను చేసిన మొదటి పని..
పెరిగిన బిజినెస్ కి నా స్థాయి కి తగ్గట్టుగా బంజారాహిల్స్ లో పెద్ద బంగ్లా కొనుక్కుని మారిపోయాను.. పాత ఇంటిని అద్దెకిచ్చి గేరేజ్, అద్దెకార్ల బిజినెస్ సురేష్ కిచ్చేశాను..
అలా మాధవరావు గారితో నా సంబంధం పూర్తిగా తెగిపోయింది లేదా నేనే తెంచుకున్నానేమో.. మళ్ళీ ఇన్నాళ్ళకి.. ఇలా అనుకోకుండా ఆయన కలవడం..
--------
నా పార్ట నర్, ఎంతో ముఖ్యమైన స్నేహితుడూ అయిన సురేంద్ర కూతురి పెళ్ళి. అమ్మాయిని ఒక ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లో పెద్ద అధికారి కొడుక్కు ఇస్తున్నారు..
ఆపెళ్ళిలోనే కనిపించారాయన ఎన్నో ఏళ్ళతర్వాత.. డెబ్భై ఐదేళ్ళుండచ్చేమో,  వీల్ చెయిర్ లో తీసుకొచ్చారాయన్ని. ఈ మధ్యనే హార్ట్ ఆపరేషన్ జరిగిందిట, అందువల్ల ఎక్కువ శ్రమ పడకూడదని.. రానన్నా, కాదూ,  కూడదు, అన్నిసదుపాయాలు నేను చూసుకుంటానని ప్రత్యేకంగా ఒక డాక్టర్ ని ఏర్పాటు చేసి మరీ తీసుకొచ్చారుట అబ్బాయి తండ్రి.,.   అతను ఒకప్పుడు మాధవరావు గారికి జూనియర్, ఆ కంపెనీని వదిలి ఈ ప్రైవేట్ కంపెనీలో చేరి పెద్ద హోదాకి ఎదిగాడుట. మాధవరావుగారు ఆయనకి గురుతుల్యులుట. ఆయన్నెంతో ప్రత్యేకంగా చూస్తున్నారు.
ఆయన్ని చూడగానే పాత సంగతులన్నీ జ్ఞాపకానికొచ్చాయి.. పలకరించాలని అనిపించక, పలకరించడానికి నా అహం అడ్డొచ్చి తప్పుకు తిరిగాను కాసేపు. కానీ బాగా దగ్గర స్నేహితుడి కూతురిపెళ్ళి, దాదాపు రెండు రోజులక్కడే ఉన్నాము మాధవరావు గారి లాగే. కాసేపటికే ఎదురుపడక తప్పలేదు..
'బావున్నారా శేఖర్?" అంటూ ఆయనే పలకరించారు. .
అవున్లే! పలకరించకేం చేస్తాడు? ఇప్పుడు నేను సిటీలోనే పేరు మోసిన రియాల్టర్ ని. ఆయన రిటైర్ అయిన మాజీ అధికారి’ అనుకున్నాను..
" ఎవరు? మాధవరావు గారా? బావున్నాను! రిటైర్ అయిపోయారా? ఏం మాస్టారు వీల్ చెయిర్ కొచ్చేశారే? ఆపరేషన్ జరిగిందిట,  మీ సత్తెకాలపు ఆలోచనలతో, చాదస్తంతో నాలుగురాళ్ళు వెనక ఎలాగూ వేసుకుని ఉండరు.. కనీసం బీమా చేయించుకున్నారుగా సరిగ్గా” అన్నాను నా నవరత్నాల ఉంగరం తడుముకుంటూ.."
నిజానికలా ఎందుకన్నానో నాకే తెలీదు.. ఇన్నేళ్ళయినా ఆయన నన్ను అవమానించారనే భావనే నాలో ఉందేమోదానికి ఆయనిచ్చిన సమాధానమే మొదట నేను చెప్పినది, నన్ను మెత్తని చెప్పుతో కొట్టినట్టనిపించినది....
ఆటుపోటులూ, ఎత్తు పల్లాలూ మీలాంటి బిజినెస్ ల వాళ్ళకి కానీ చెతిలో విద్యని నమ్ముకున్న మా లాంటి వాళ్ళది కాదు అని నన్ను తిరిగి ఎద్దేవా చెయ్యకపోవడం ఆయన సంస్కారం.. అంతే..
ఆయన లో ఏ మార్పు లేదు.,అప్పుడూ ఇప్పుడూ అదే ధీమా,  బీమా ఇచ్చిన ధీమా.
***

1 comment:

  1. కథ మొత్తం చదివాక మళ్ళీ మొదటి పేరా చదివేలా కథనాన్ని నడిపించిన రచయిత్రి గారికి అభినందనలు.!
    కాని, కథ మొత్తం చదివాక మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాను, క్షమించాలి మీరు.!
    చదువుతున్నంతసేపు హాయిగా గడిచిపోయింది..!!

    ReplyDelete

Pages