ఘుమ్మనియెడి శ్రుతి గూడగను
తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన/రేకు: 55-3/సంపుటము: 6-81
డా.తాడేపల్లి పతంజలి
గోపికలకు అన్నమయ్య ఈ పాటలొ ప్రబోధం చేస్తున్నాడు.
ఘుమ్మనియెడి శ్రుతి గూడగను
కమ్మని నేతులు కాగగ జెలగె ॥పల్లవి॥
నీలవర్ణుడని నీరజాక్షుడని
బాలుని నతివలు పాడేరో
పాలు విదుకుచును బానల కాగుల
సోలి పెరుగు త్రచ్చుచుజెలరేగి ॥ఘుమ్మని॥
మందరధరుడని మాధవుడని గో
విందుని బాడేరు వెలఁదు లిదె
నందవ్రజమున నలుగడ నావుల
మందల బేయల మంచిరవముల ॥ఘుమ్మని॥
వేంకటపతి యని వేదనిలయుడని
పంకజనాభునిబాడేరో
అంకులచేతను నలరురవంబుల
బింకపుమాటల బృందావనమున ॥ఘుమ్మని॥
తాత్పర్యము
ఘుమ్మనియెడి శ్రుతి గూడగను
కమ్మని నేతులు కాఁగగ జెలగె ॥పల్లవి॥
మనోహరంగా వేణునాద శ్రుతి వినిపిస్తుండగా
కాగిన నేతుల వాసనలు కమ్మగా అనిపిస్తుండగా - ఈ చక్కటి నేపథ్యంలో బాలకృష్ణుని గురించి పాటలు పాడండి.
విశేషార్థం
(ఘుమ్మని- కమ్మగా వేద(శ్రుతి) నాదములు కలుస్తుండగా కమ్మని నేతినేతివాదాలు తపిస్తూ వినబడుతున్నాయి. బ్రహ్మం అంటే ‘ఇది కాదు’, ‘ఇది కాదు’ అంటూ ఇవేవీకానిది బ్రహ్మం అని సిద్ధాంతికరించే వాదం నేతినేతి వాదం.. సాక్షాత్తు వ్యాస మహర్షి వ్రాసినదిగా పేరున్న ‘సిద్ధాంత తత్త్వదర్శనం’లో ‘నేతి నేత్యన్తః’ అనే సూత్రం ఈ వాదానికి ఒక ఆధారం. నిషేధ పూర్వకంగా ఇది కాదు, ఇది కాదు అంటూ అనిర్వచనీయమైనది ఏదో అదే బ్రహ్మం అని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. ఆ నిర్వచనీయమైన బ్రహ్మమే కృష్ణుడని అతని గురించి పాడండని అన్నమయ్య కవి హృదయం)
1.నీలవర్ణుఁడని నీరజాక్షుఁడని
బాలుని నతివలు పాడేరో
పాలు విదుకుచును బానల కాగుల
సోలి పెరుగు త్రచ్చుచు జెలరేఁగి ॥ఘుమ్మని॥
నల్లనివాడని, పద్మాలవంటి కన్నులు కలవాడని
ప్రేమగా ఈ బాలుని గురించి ఓ గోపికలారా ! పాడండి.
మీరు పాలు పితుకుతూ , బానలలో, కాగులలో పెరుగును చిలుకుతున్న సందర్భాలలో - మైమఱపుతో, తన్మయత్వముతో(=సోలి) ఆ బాలుని గురించి రెచ్చిపోయి (=చెలరేగి) పాడండి.
విశేషార్థం
నింగి వర్ణము వలన స్వామికి "నీల వర్ణుడు"అనే పేరు వచ్చిందని ఒక భావన.
భృగుమహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నినప్పుడు, లక్ష్మీదేవి విడిచి వెళ్లింది.అప్పుడు అమ్మవారి విరహతాపాన్ని భరించలేక విష్ణువు నల్లగా మారిపోయాడని, (వెలది నిను బెడ బాసి విరహంపు మెయికాక/వలన నీతడు నీల వర్ణుడై నాడు) అన్నమయ్య ఒక కీర్తనలో నీలవర్ణుడు అను పేరు రావటానికి కారణాన్ని చమత్కరించాడు.
'ఆకాశం ఇంత దూరం లో ఉన్నది' అనిఎవ్వరూ చెప్పలేరు. కనుకనే, sky is blue (ఆకాశం నీలంగా ఉన్నది) అన్నారు. సముద్రం ఎంత లోతుగా ఉంది? దానినికూడ ఎవరూ చెప్పలేరు. కనుకనే, ocean is blue(సముద్రం నీలంగా ఉన్నది) అన్నారు. అదేరీతిగా, భగవత్తత్త్వాన్నికూడ ఎవ్వరూవర్ణించలేరు. కనుకనే, భగవంతునికి 'బ్లూ కలర్' (నీలవర్ణము)ను ఆపాదించారని సత్యసాయిబాబా గారు చెప్పారు.
2.మందరధరుఁ డని మాధవుడని గో
విందునిఁ బాడేరు వెలఁదు లిదె
నందవ్రజమున నలుగడ నావుల
మందలఁ బేయల మంచిరవముల ॥ఘుమ్మని॥
మందరపర్వతాన్ని కూర్మావతారంలో ధరించినవాడని, లక్ష్మీదేవి భర్త అని పాడండి. ఇంద్రుడు కోపం వచ్చి గోగణాల విూద శిలలతో కూడిన పెను వర్షాన్ని కురిపిస్తే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద గోగణాలకు ఆశ్రయం కల్పించాడనీ, ఇంద్రుడు కృష్ణుడి శక్తిని తెలుసుకొని, అతడితో స్నేహాన్ని కోరి, గోగణాలకు కృష్ణుడిని అధిపతి కావించాడనీ అప్పటి నుంచి కృష్ణుడు గోవిందుడైనాడనీ మీకు తెలుసు కదా ! ఆ గోవిందుని గురించి పాటలు పాడండి.
3.వేంకటపతి యని వేదనిలయుఁడని
పంకజనాభునిఁ బాడేరో
అంకులచేతను నలరురవంబుల
బింకపుమాటల బృందావనమున ॥ఘుమ్మని॥
ఓ గోపికలారా ! ఈ బృందావనంలో అంకులలోని (ఆంకులనగా ఆభరణవిశేషాలు) చిరుగంటలతో మనోహరంగా వినిపిస్తున్న శబ్దములతో , ఉత్తుత్తి బడాయి మాటలతో(బింకపుమాటల)మనలను సంతోష పెడుతున్న ఆ బాల కృష్ణుని గురించి వేంకటేశ్వరుడని, వేదాలకు నిలయుడని, పద్మము నాభియందు కలిగిన వాడని పాడండి.
విశేషాలు
బృందావనం
యమునానదీ పశ్చిమతీరములో మధురలో ఉన్న వనం బృందావనం . దీనికి ఎదుట (అనగా యమునయొక్క తూర్పుగట్టున) గోకులము ఉంది. అక్కడే కృష్ణుడు గోపకన్యకలతో అనేకలీలలు చేసాడని చెబుతారు.
జనుల ఆటపాటలలో కలిసిపోయిన అన్నమయ్య కీర్తన ఇది. స్వస్తి.
*****
No comments:
Post a Comment