శ్రీగురునాథేశ్వర శతకము - దోమా వేంకటస్వామి గుప్తా - అచ్చంగా తెలుగు

శ్రీగురునాథేశ్వర శతకము - దోమా వేంకటస్వామి గుప్తా

Share This
శ్రీగురునాథేశ్వర శతకము - దోమా వేంకటస్వామి గుప్తా
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం:

శ్రీగురునాథేశ్వర శతకకర్త దోమా వేంకటస్వామి గుప్త క్రీ.శ. 1899 లో కర్నూలులో జనించారు. వైశ్య కులంలో జన్మించిన వీరి తలితండ్రులు దోమా కోటాంబ, దోమా గోవిందప్ప శ్రేష్ఠి. సంస్కృతాంధ్రములలో చాలా చిన్నతనంలోనే పట్టు సాధించిన ఈ కవి తన 11వ ఏటనే కవితా వ్యాసంగాన్ని ప్రారంభించారు. వీరు తమ 16వ ఏట అవధానములను చేయుట ప్రారంభించి దాదాపు 300 అస్టావధాన శతావధానాలను నిర్వహించారు. వీరి అవధానాలలోని పద్యాలు సుపద్యమంజరి అనే పేరుతో ప్రకటించారు.  ఈ కవి తన జీవితకాలంలో దాదాపు 49000 పద్యములను చెప్పినాడంటే ఈ కవి ఎంత ప్రతిభావంతుడో తెలుస్తుంది. 

ఈ కవి బహుగ్రంధరచయిత. వీరిరచనలు 1. శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణము (అనువాదము, 14000 పద్యాలు), 2. శ్రీపరకాల విలాసము (తిరుమంగై ఆళ్వారుచరిత్ర, 1000 పద్యాలు), 3. ప్రేమాభిరామము ( శృంగారప్రబంధము, 600 పద్యాలు), 4. శ్రీ కన్యకాపురాణము (పద్యకావ్యము, 1500 పద్యములు), అవధాన కవితామంజరి, 6. శ్రీగోమాతృ గౌరవము (400 పద్యాలతో కూడిన కావ్యము), 7.  శ్రీచంద్రకళా సుదర్శనము (నాటకము), 8. దూతాంగదము (నాటకము), 9. శ్రీకృష్ణదేవరాయల చరిత్రము (విమర్శ), 10. ఝుంఝామారుతము (విమర్శ), 11. విమలానందము (నవల) 12. చంద్రిక (నవల), 13. సీతాకల్యాణము (హరికథ), 14. శ్రీకన్యకా పురాణము ( హరికథ), 15. శ్రీసాయిబాబా చరిత్ర (హరికథ), 16. శ్రీత్రిపురదాసు చరిత్ర (హరికథ), 17. శ్రీలక్ష్మీనృసింహ ధ్వరీయం (శతకము), 18. శ్రీ వీరరాఘవ శతకము, 19. శ్రీ కామేశ్వరీ శతకము, 20. శ్రీగంగాలహరి (అనువాదం) 21. ముకుందమాల (అనువాదం), 22. రోహిదాసు, 23. శ్రీ బ్రహ్మేశ్వర పురాణము, 24. గౌమతీక్షేత్రమహాత్న్యము, 25. సుజనత్రయము, 26. ఆత్మబోధ, 27. దిలీపుని చరిత్రము, 28. శ్రీసాయి సప్తమంజరి, 29. అదవాని యువధానము, 30. శ్రీసాయి గురుచరిత్రము. 

అత్యంత ప్రతిబావంతుడైన ఈకవికి గజారోహణ, సన్మానపత్రం కనకస్నానం, గండపెండేరం సువర్ణపాత్ర లతోపాటు అనేక సన్మానాలు పురస్కారాములు బిరుదులు లభించాయి. వీరిబిరుదులు అనేకం. శ్రీమదాంధ్ర, సాహిత్యసరస్వతి, విద్యావినోదకవిభూషణ, విద్యాసాగర, కవిరత్న, ఆశుకవిరాధురీణ, ఆశుకవితల్లజ, అవధాన పంచానన, కవి చక్రవర్తి, అవధాన పితామహ, శతావధాని, వైశ్యకుల భూషణ మొదలైనవి వీరికి లభించిన బిరుదులు.

ఈకవి 1962 సంవత్సరం, ఫిబ్రవరి 13న గుంటూరు లో పరమపదించారు. 

శతక పరిచయం:

శ్రీగురునాథేశ్వర శతకము "గురునాథేశా! జగద్వల్లభా" అనేమకుటంతో శార్ధూల మత్తేభ వృత్తాలలో రచింపబడిన 125 పద్యాలు కల శతకము. కవి ఈశతకాన్ని గుంటూరునందలి బ్రాడీపేటలో నున్న శ్రీగురునాథేశ్వరుని ప్రతిష్టాపన సమయంలో చెప్పినారు. ఈ విషయాన్ని కవి శతకాంతములో ఈవిధంగా చెప్పికొనినాడు.

మ. సరస క్రోధనవర్షమునందునను జేష్ఠ్ఖ్యాతమాసాసితా 
దరషష్ఠిన్ భృగువాసరంబు, గ్రహచంద్రబ్రహ్మభూసంఖ్యవ
త్సరపున్ జూన్ పదిరెండుగాఁదగిన ప్రాంచత్పుణ్యమొప్పారునాఁ
డరుదై గుంటురిబ్రాడిపేటను ద్వదీయంబౌ ప్రతిష్ఠాపన
స్థిరసత్కార్యమునుప్పుటూరి సుకులశ్రేష్టుండుపున్నాభిధుం
డిరవౌ పేర్మినిజల్పె, దేవా! గురునాథేశా! జగద్వల్లభా!

కవి సంస్కృతాంధ్రభాషా కోవిదుడగుటవలన ఈశతకంలో పద్యములు ఈ రెండు భాషలలోని పదాలతో నిండి ఉన్నది మధ్యలో కొన్ని అచ్చతెలుగు పద్యములు కూడా మనకు కనిపిస్తాయి. శతకము మొత్తము గురునాథేశ్వర నామధేయుండైన శివుని లీలవర్ణనముచే నిండియున్నది. కొన్ని పద్యములు ప్లకూరిసోమనాధుని పద్యాలకు, కూచిమంచి తిమ్మకవి పద్యాలకు అనుసరణలుగా తోస్తున్నవి.

కొన్ని పద్యాలను చూద్దాం

మ. ధర తేరై, నిగమంబు లశ్వచయమై, తన్మేరువే చాపమై
ససీజాక్షుఁడు బాణమై ఫణిపుఁడుం జ్యావల్లియై, శారదా
వరుఁడే సారధియైచెలంగఁ ద్రిపురాభంగోరుగర్వంబు భం
గురతంగాంచఁగఁజేసినట్టిభవపదంఘృల్ కొల్చి, యాంతర్యబా
హిరజాడ్యంబును బాపికొందు, గురునాథేశా! జగద్వల్లభా!

మ. పునుకల్ పాములు భూష లేంగుచరుమంబుందాల్తు వన్నంబుఁబు
ఱ్ఱెనుబిచ్చంబును గొందు వింకమెయినర్ధింబూదినిబూసికోఁ
గనెడన్ మించెద విట్టినీవఖిల భాగ్యంబుల్ దయంగొల్పుటే
యెనయున్నీదు విచిత్రలీల, గురునాథేశ్వరా! జగద్వల్లభా!

మ. తెలికొండ, యందెలిమేన నందుఁదెలిబూదింబూసియున్ దెల్లచం
ద్రునిబూఁజేసియుఁ దెల్లయేరుజడలందున్నిల్పి తెల్లెద్దునె
క్కిననీకుంగొఱయౌనె, తెల్లనగుసత్కీర్తి? నిన్నుంగొల్వ, హా
యిని దెల్వింగన సందియంబె? గురునాథేశ్వరా! జగద్వల్లభా!

శా. జ్వాలాజలజటిలమై యటు జగజ్జాలంబుగాల్పంగ, నా
క్ష్వేళం బెంతో విజృంబిలన్ సురముఖుల్ భీతిన్నినుంజేర, నా
భీలాకారముఁదద్విషంబు గడువేవే నుంచినావయ్య స
ల్లీలంగొంతున నీలకంఠ! గురునాథేశ్వరా! జగద్వల్లభా!

శా. రమ్మా నీకునమస్కరించెదను వైరమ్మా? కృపాసాంద్ర భా
రమ్మా నన్నుననుగ్రహించుటకు బేరమ్మా అనుంజేర దూ
రమ్మా నీకిలనా నమస్కృతులు కారమ్మా విరోధత్వమా
యిమ్మా నాకును జ్ఞానశక్తి గురునాథేశ్వరా! జగద్వల్లభా!

ఇటువంటి ఎన్నొ చక్కని పద్యరత్నాలున్న ఈశతకాన్ని మీరు చదవండి. అందరిచే చదివించండి. 

No comments:

Post a Comment

Pages