హరి నామస్మరణ ఎప్పుడు మొదలు పెట్టాలో! - అచ్చంగా తెలుగు

హరి నామస్మరణ ఎప్పుడు మొదలు పెట్టాలో!

Share This
హరి నామస్మరణ ఎప్పుడు మొదలు పెట్టాలో!

ఆండ్ర లలిత

నందుడిని రామాపురం వారంతా తాతా అని సంభోధిస్తారు. నందుడు కుటుంబమే రామాపురం. అందరి సుఖదుఖాఃలు నందుడు పంచుకుంటాడు. అందిరికీ పెద్దదిక్కుగా వ్యవరిస్తూ, నేనున్నానని నిలబడతాడు నందుడు. పొద్దన్న లేచిన మొదలు భగవంతుడిని స్మరించినా లేకపోయినా, నందుడు నామ జపం మటుకు చేస్తారందరూ రామాపురంలో. ఆ రోజు తెల్లవారుఝామున లేతపొగమంచు ఛేదించుకుని సూర్యనారాయణమూర్తి వస్తున్న దృశ్యం నందుడి కంట పడింది. ఆ దృశ్యం తిలకిస్తున్న అల్ప సంతోషి నందుడు ఆరుబయట మనమరాలు నిధి ఇంటి అరుగు మీద కూర్చుని, పరమానందంతో తంబూరా పట్టుకుని పాడసాగాడు. “రామ రామ రామ సీత రామా యన్నిరో” యనే పురందరదాసుకీర్తన. ఆ పాట తన్మయత్వంతో నందుడు పాడుతుంటే నందుడి మనవరాలు నిధికి బయటకి వచ్చి, తాత వచ్చాడంటూ  వాకిలి తెరచింది. తాతను చూసి “ఎలా ఉన్నావు తాతా! నిన్ను చూసి రెండు రోజులైంది. నా పెళ్ళి కుదిరిపోయింది. నన్ను ఆశీర్వదించవూ” అంటూ ప్రేమానందాలతో నిండిన కళ్ళతో నందుడికి పాదాభివందనం చేసి, నందుడి  పక్కన కూర్చుండి పోయింది నిధి.
ఈ మాట విని నందుడు పరమానందంతో  పొంగిపోయి “అంతా రాముని దయమ్మా. నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా వుంటుందంమ్మా” అని దీవించి తను పాడుతున్న పాటలోకి జారుకున్నాడు. నిధి కూడా తాత కంఠంలో కంఠం కలుపుతూ  
“రామ రామ, రామ సీత, రామా యన్నిరో; అమర పతియ దివ్యనామ అందువొదగదో|| 
భరతియమన భటరు బందు, హొరడిరందు మేట్టీమురియే; హొరళిదాత్మ సేరిదాగ హరియనామ వొదగదో||”
అంటూ తన్మయత్వంతో పాడసాగింది.
“తాతా! పురందరదాసు అవపోసనపట్టి జీవితసత్యాలు రంగరించి ఈ కీర్తనలో నింపారేమో అని అనిపించదూ? ఆ కీర్తనలో ఎంత చక్కగా రాసారు”. “ఏదో ఒక రోజు మనని తీసుకువెళ్ళటానికి యమదూతలు వచ్చి రమ్మని ఖంగారు పెడుతున్నప్పుడు, మన శ్వాస నిశ్వాలు నిలిచి పోయే సమయంలో, రామాయని నోరార పిలవగలమో లేదోకదా తాతా. అందుకే మనకి ఆ సమయం ఎప్పుడు వస్తుందో, ఎంత అకస్మికంగా వస్తుందో తెలియదు గాబట్టి, మనం ఎల్లప్పుడూ రామనామం స్మరించాలని కదా తాతా” అంది నిధి. 
“అవును తల్లి. ఎంతైన కారణ జన్ములు కదా. అందుకే గురువు వ్యాసతీర్థులవారి “దాసరేంద్రే పురందర  దాసరాయ‘’ అని ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు” అన్నాడు తన బంగారు పట్టి నిధి, విద్య వంటపట్టి పెద్దదైంది అని గమినిస్తూ.
“తాత చేయి పట్టుకుని, ఉండు తాతా ఫలహారం చేసి వెళ్దువుగాని. నిన్న రాత్రి ఎప్పుడు తిన్నావో! ఇంకొన్ని రోజులే నేనుండేది. మళ్ళీ నేను మా అత్తవారింటినుంచి ఎప్పుడు వస్తానో. నిన్ను ఎన్నాళ్ళకి చూస్తానో. పట్టణ జీవితం ఎలా వుంటుందో. అసలే నాకాబోయే భర్త పట్టణంలోనే పుట్టిపెరిగిన మనిషి. ఏమిటో ఒక ప్రక్క ఏదో తెలియని ఆనందం, మరొక ప్రక్క భయంగా కూడా వుంది.” 
“భయపడకు నిధి. నువ్వు నీ క్రొత్త జీవితాన్ని ప్రేమతో యధావిధిగా స్వీకరించు. మొదటి రోజునుంచే  ప్రవహించే మీ ఇరువురి భావముల సెలయేరును మలచటానికి ప్రయత్నించకు. మహా నది కావాలి. నీ భావాలకీ, వాళ్ళ భావాలకి వ్యత్యాసం ఉండవచ్చు. ఆ వత్యాసం మనస్పూర్తిగా అంగీకరించనపుడే జీవితం మధురాతి మధురంగా మారుతుంది నిధి. అధికారం,  ప్రేమాభిమానాలు ఇంకా గౌరవం నీకు వస్తాయి, ఎప్పుడంటే నీవు వాళ్ళ భావాలో మమేకమైనప్పుడు. 
మనం పుట్టిన మొదలు ఆఖరి నిమిషం వరకు మన ప్రయాణం నిరంతరంగా సాగుతూనే ఉండాలి. మన లలాటలిఖితం ఎవరు మార్చగలరు నిధి. ఒకొక్కసారి తానొకటి తలుస్తే దైవమొకటి తలచినట్లు జరుగుతుంది. ఎదురుకోవాలి. భగవత్ప్రసాదమని స్వీకరించాలి ఆనందంగా. మన జీవితాలలో  గజిబిజి మలుపులు వస్తాయి.  కొన్ని ఆనందాలలో దింపుతే, మరి కొన్ని వైరాగ్యంలో దింపుతాయి. కొన్ని వాంఛలు పెంచితే, మరి కొన్ని విరక్తితో నింపుతాయి. ఇవన్నీ యధాతధంగా  స్వీకరించాలంటే భగవంతుడి కృపా కటాక్షములుండాలి. హాయిగా నీ పనిపాటలు చేసుకుంటూ నిత్య జీనితాన్ని నవరసభరితంగా నడిపిస్తూనే పాడుకో తల్లి హరి నామం. పుట్టించినవాడికి తెలీయదంటావా నిధి, మనం  ఏ విధంగా  ఆయనని స్మరించాలో? తెలుసు! ఆయనే తనకి కావలిసినట్లు మనని మలుస్తాడు. అంతా ఆయన చేతులలోనే ఉంది నిధి. 
ఇప్పుడు పురందరదాసు నే తీసుకుంటే వర్తకుడిగా “Work is worship”అని తన పనిని ప్రేమించాడు. 
తను సంప్రదాయంగా వచ్చిన రత్నమాణిక్యాల వడ్డీ వ్యాపారంలో  చాల సంపాదించి కోట్లకు పడగలెత్తి  ‘’నవకోటి నారాయణ‘’ అని ప్రసిద్ధిగాంచి అందరి ప్రశంసలను అందుకున్నాడు. పురందరదాసుని పరిక్షింప తలచి శ్రీనివాసుడు ఒక పేద బ్రాహ్మణ రూపంలో కనిపించి తన కుమారుని ఉపనయనానికి ధన సహాయం చేయమని కోరాడుట. ఎవరికీ చిల్లి గవ్వ కూడా ఇవ్వటానికి ఒప్పుకోని ఆ పిసినారి నవకోటి నారాయణుడుని, ఆ పేద బ్రాహ్మణుడు ఎంత బ్రతిమిలాడినా కనికరించలేదుట. ఎంతైనా పిసినారి కాదా! దాన ధర్మములు చేసేటందుకు మనసువచ్చేదే కాదు.  ఆ పేద బ్రాహ్మణుడు ఆశవదలలేక పురందరదాసు  దుకాణానికి  రోజూ వచ్చేవాడు. అలా ధనం అర్ధిస్తూ ఆరు నెలలువరుకు తిరిగాడు. రోజూ ఆ బ్రాహ్మణుడు రావటం పురందరదాసు రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అని వాయిదాల బేరంతో ఏదో ఒక కథ చెప్పి ఆ బ్రాహ్మణుని పంపించేయడం ఒక షరా అయి పోయింది. 
కానీ రాను రాను ఆ బ్రాహ్మణుని మొర ఆలకించలేక, ఆ బ్రాహ్మణుని వదిలించుకోదలచి పురందరదాసు తన దగ్గరనున్న పాత చెల్లని నాణాలు ఒక సంచీలోనుంచి తీసి ఆ బ్రాహ్మణుని ముందు గుమ్మరించి  ఏదో ఒక  నాణెము తీసుకో మన్నాడుట.  ఆ బీద బ్రాహ్మణుడు చిరునవ్వుతో ఒక్క నాణెం తీసుకుని చిరునవ్వుతో దీవించి తృప్తిగా ధన్యవాదాలు చెప్పుకుని దుకాణంనుంచి బయలుదేరి, పురందరదాసు ఇంటికి వెళ్ళాడుట. అక్కడ  పురందరదాసుని భార్య సరస్వతీ బాయిని కూడా కలసి ధన సహాయం చేయమని అర్థిస్తాడు. ఆ  బాపడు గోడు విని ఆ దయామయి అయిన తల్లి సరస్వతి బాయి మనసు కరిగి తను ఏదైనా ఇద్దామనుకుందిట. కాని ఇంటికి వచ్చి భర్త కోపగిస్తాడేమోనని భయంతో ధైర్యం సరిపోలేదు. భర్త మనసు నొప్పించటం యిష్టంలేక, తనకు తన పుట్టింటవారిచ్చిన తన ముక్కుకున్న ముక్కు పుడకను   తీసి బ్రాహ్మణుడికి ఇచ్చిందట. తాను  ఇచ్చింది సాక్షాత్తు శ్రీనివాసుడికే  అని ఆమెకు తెలియదు.    ఆ బీద బ్రాహ్మణుడు ఆ ముక్కుపుడకను అమ్మటానికి పురందరదాసు దుకాణమునకే తీసుకొనిపోయాడు. పురందరదాసు అది చూసిన వెంటనే తన భార్య నగని గుర్తుపట్టికూడా, ఆ బ్రాహ్మణుని నగకి విలువ కట్టి ధనము ఇస్తాడు.  ఆ తరువాత ఆ ముక్కెర ఒక భరిణిలో పెట్టి పదిలపరిచి, దుకాణం మూసి, హడావిడిగా ఆగ్రహభరితుడై ఇంటికి వచ్చి భార్య ముక్కుకు ముక్కెర లేదని గమనించి, సరస్వతిబాయిని తన ముక్కెర  ఏదని పురందరదాసు ప్రశ్నిస్తాడు. సరస్వతి బాయి దగ్గర సమాధానం లేనందున, అబద్ధం చెప్పటం యిష్టంలేక బాధ పడుతుంది. తనకు భర్త చేతిలో అవమానం తప్పదని బాధ పడుతూ, ఆ దిక్కు తోచని పరిస్థితిలో చావే శరణ్యమని తలుస్తుంది. తను పాలలో విషం కలిపి తాగటానికి నోటిదగ్గర పెట్టుకోగానే అందులో తన ముక్కుపుడక కనబడుతుంది.
ఇదంతా భగవంతుని లీలయేని తను  పట్టలేని ఆనందముతో, తను పుజించే ఆ ముకుందునికి మనస్పూర్తిగా నమస్కరిస్తుంది. తన ముక్కుపుడక భర్తకు చూపుతూ తనకు కలిగిన అనుభూతి విన్నవించుకుంటుంది. తన భర్త ఆ ముక్కెర చూసి, ఆశ్చర్యపోయి, తన దుకాణంకి వెళ్ళి చూస్తే ఆ భరణిలో తను పెట్టిన ముక్కుపుడక ఉండదు. ఆశ్చర్యంతో ఆ పేద బ్రాహ్మణుడికోసం  వెతికి  జాడ తెలియక, పురందరదాసు కూడా ఇదంతా భగవంతుని లీలయే అని భావించి తన భార్యకూ, తనకూ కనపడింది  సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడేననే నిర్ధారణనతో, శ్రీనివాసుని నిర్లక్ష్యం చేసాననే బాధ చోటుచేసుకుంది. దానివల్ల శ్రీనివాసుని చేరుకోవాలనే తపనతో 30వ ఏటనే తన సంపదనంతా త్యాగం చేసి పరమ భక్తుడుగా,  హరిదాసుడుగా, భాగవతోత్తముడై, భక్తి పారవస్యంలో మునిగిపోయాడు. ఆ భక్తి పారవస్యంలో  ఎన్నెన్నో కీర్తనములు రచిస్తాడు. నాటికి నేటికీ పుణ్యపురుషుడు  పురందరదాసు.
అంతా భగవంతుని లీలలు నిధి. మనం నిమిత్త మాత్రులం” అంటూ నిధి తలపై తన చేయి పెట్టి ఆశీర్వదించాడు. 
“మరి తాతా! నీకు  చిన్నపటి నుంచే దైవభక్తి ఉందా తాతా?” తాత మాటలలో నిమగ్నమై అంది నిధి.
చిరునవ్వుతో “లేదు ! పురందరదాసు లాగే నేను  కూడా, నేను చేసే పనిలో దైవం చూసుకునేవాడిని.  నా జీవితం నా చేతులలో ఉందనే మనస్తత్వం నాది. ఒక రోజు కార్లో officeకి వెళ్తున్నాను. చాలా carefulగా drive చేసేవాడిని. కారు 60 miles per hour speedలో వెళ్తోంది highwayలో . ఒక కారు skid అయ్యి నా కారుని గుద్దితే నా కారు కూడా skid అయ్యి గిరగిరా తిరిగి కొంత దూరం వెళ్ళి road dividerని గుద్దుకుని ఆగింది. Air bags మూలంగా నేను save అయ్యాను. సురక్షితంగా  బయట పడ్డాను.  నా కారు తుక్కు తుక్కు అయిపోయిందని బాధ పడుతుంటే, ప్రమాదం జరిగిందని తెలుసుకొని ప్రమాద స్థలం చేరుకున్న police, “పోతే పోయింది కారు. మళ్ళీ కొనుక్కోవచ్చు. జీవితం ఒకసారి పోతే మళ్ళీ తిరిగిరాదని” అన్న పోలీస్ మాటలు నా మనసుకి హత్తుకుపోయాయి” ఇలా మాటాడుకుంటున్న సమయంలో నిధి వాళ్ళమ్మ బయట అరుగుమీదకి వసారాలోంచి వచ్చి టిఫిను తినేటందు ఇరువురిని చిరునవ్వుతో ఆహ్వానం పలికింది.
“తాతా! ఇన్నాళ్ళకి నువ్వు చెప్పేది అర్థమైంది తాతా. Bike నడిపే వాడికి helmet, car నడిపే వాడికి seatbelt ఎంత ముఖ్యమో for a safe ride, అలాగే మన సుఖమైన జీవన ప్రయాణానికి హరి నామం అంతే మఖ్యం. కదా తాతా!” తాత చేయి పట్టుకొని లోపలికి వెళ్తూ, నిధి తాతకేసి చూస్తూ చిరునవ్వుతో అంది.
“అంతేనమ్మా జీవితం కూడా నా కారు ప్రమాదంలోలాగా, మనం పరిస్థితి గ్రహించి బ్రేక్ వేస్తాం. కానీ  మన కారు వేగం నిర్దారించినట్లు ఎక్కడ ఆగాలో, మన జీవితం మన వేగంబట్టి నిర్దారిస్తుంది ఎక్కడ ఆగాలో. మరి ఆ పరిణామములు  మనసు స్వీకించేలా చేసేది దైవ భక్తి విశ్వాసాలు. దానిలో మనం ఎంచుకున్నది హరినామం.  అన్నమాచార్యులువారు కూడా అందుకే “భావములోనా బాహ్యమునందునూ గోవింద గోవింద అని కొలుకవే మనసా..” అని చెప్పారు. అలా చాలా మంది పెద్దలు పలురకాలుగా నీ ఇష్ట దైవములో నిరంతర భక్తి విశ్వాసములవసరమని చెప్పారు. అవి మన జీవిత నావకు స్తిరత్వాన్ని కలిపిస్తాయి.
తాత మాటలలో విశ్వాసముంచుకుని నిధి ముందుకు సాగిపోయింది జీవిత గమనాలలో. మరి తాత, నిధికి తను ఇచ్చిన సందేశం పంచుతూ, మంచి మాటలు చెప్తూ అందరికి రామామృతం గానం చేస్తూ, ఇంకా ఎంతోమందికి అవసరానికి చేయూతనిస్తూ ముందుకు సాగిపోయాడు.

1 comment:

  1. కథలో ఆ ఆంగ్ల పదాలు బాగులేవు. అలా రాయకండి,తెలుగులోనే రాస్తే బాగుంటుంది.

    ReplyDelete

Pages