జటాయువు
తురగా శివరామవేంకటేశ్వర్లు
ఆరోజు మంగళవారం, సమయం ఉదయం ఏడుగంటలు. శంకర శాస్త్రి ఇంట్లో ఫోను మ్రోగింది. శంకర శాస్త్రి ఫోను ఎత్తగానే “సార్! నేను మెకానిక్ కృష్ణంరాజుని మాట్లాడుతున్నానండి. రాత్రి వాటరు పంపు రిపేరు చేసాక గరువుమీద పొలానికి నీరు తోడేమండి. పొలానికంతా నీరు ఎక్కేడప్పటికి తెల్లవారు ఐదుగంటలయిందండి. రాత్రంతా మూగాడు మాతోనే ఉండి పనిచేసాడండి! కాని ఒక అరగంట క్రితం మూగాడు కళ్ళు తిరిగి పడిపోయాడండి. పంపురూములో బల్లమీద పడుకోపెట్టామండి. మీకు యీవిషయాలు చెపుదామని ఫోను చేసానండి” అని చెప్పాడు. శంకర శాస్త్రి “వెంటనే అక్కడున్న ఎడ్లబండి మీద మూగవాడిని యింటికి తీసికొచ్చేయండి. ఈలోగా డాక్టరు గార్నిపిలుస్తాను". అని చెప్పి ఫోనుపెట్టేశాడు. డాక్టరు సుబ్రహ్మణ్యానికి ఫోనుచేసి విషయం చెప్పి వెంటనే రమ్మన్నాడు. ఈ మాటలు వింటున్న శంకర శాస్త్రి భార్య “ఎవరికండి? ఏమయిందీ?" అని అడిగింది. “రాత్రి వేళ యీ వయస్సులో పొలం వెళ్ళకరా! అని చెపితే మూగాడు విన్నాడుకాదు. రాత్రంతా పొలంలో పని చేసాడట. యిప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడుట. పొలం నుంచి ఫోను వచ్చింది" అని చెప్పాడు శంకర శాస్త్రి.
డాక్టరు సుబ్రహ్మణ్యం కారు,మూగాడి ఎడ్లబండి శంకర శాస్త్రి మేడ ముందు వచ్చి ఆగాయి. డాక్టరు సుబ్రహ్మణ్యం మూగాడిని పరీక్షించి పెదవి విరిచి “లాభంలేదు,దారిలోనే ప్రాణంపోయింది వీడిది. ఈ డెడ్ బాడీని వాళ్ళ వాళ్ళకు పిలిచి అప్పచెప్పేయండి." అన్నాడు. “ఈ మూగాడికి, తనవాళ్ళు, బంధువులు ఎవ్వరూ లేరండి! చిన్నప్పటి నుంచి పని చేసికుంటూ మా యింటిలోనే పడివుంటున్నాడు.” అని చెప్పాడుశంకర శాస్త్రి. “అయితే ఎవరినైనా పంపి అనాధ శరణాలయం వారికి చెప్పమనండి. వాళ్ళేవచ్చి బాడీని తీసికెళ్ళి కార్యక్రమంఅంతా చేస్తారు." అని సలహాయిచ్చాడు సుబ్రహ్మణ్యం. శంకర శాస్త్రి స్కూటరిచ్చి కృష్ణంరాజుని టౌను పంపాడు ఆపనికి.
డాక్టరు సుబ్రహ్మణ్యం అక్కడ నుంచి కారులో బయలు దేరి తన హాస్పిటలుకు వెళుతుండగా పొలం నుంచి కూరగాయల సంచితో నడిచి వస్తున్న మార్కండేయ శర్మ గారిని చూసి కారు ఆపి, దిగి వినయంగా నమస్కరించి “బాగున్నారా? అని అడిగాడు. మార్కండేయశర్మగారు, “నువ్వా? సుబ్రహ్మణ్యం! బాగానే ఉన్నాను. ఏమిటి? యింత ప్రొద్దున్నేవచ్చావు? ఎవరికైనా సుస్తీ చేసిందా వూళ్ళో?” అని అడిగారు. డాక్టరు సుబ్రహ్మణ్యం, “శంకర శాస్త్రి ఇంట్లో ఉండే మూగాడు కళ్ళు తిరిగిపడి పోయాడంటే చూడ్డానికి వచ్చాను. తీరా వచ్చి చూసేటప్పటికి ప్రాణంపోయేవుంది. పాపం! "అన్నాడు ఆ మాట విన్న మార్కండేయశర్మగారు ఉలిక్కిపడి, సరే! వెళ్తాను అని వేగంగా నడుచుకుంటూ ఇల్లు చేరుకున్నారు.
శర్మ గారు పెరట్లో కూరగాయలు పడేసి భార్య స్నానం చేస్తున్నట్లు గమనించి, తన పడకగదిలోకి వెళ్ళి పరుపు కింద తాళాలు తీసి ఇనప్పెట్టి లాకరులోని ఒక కవరు ఇరవై ఐదు వేలు డబ్బు, లాల్చీ జేబులో పెట్టుకుని శంకర శాస్త్రి యింటికి బయలు దేరడానికి చెప్పులు వేసుకుంటుండగా ఆయన భార్య స్నానం చేసి పెరట్లో చీర కొంగు నీళ్ళు పిండుకుంటూ, “మళ్ళా ఎక్కడికండి బయలుదేరారు?” అని అడిగింది. “అదే! శంకర శాస్త్రి ఇంట్లో ఉండే పని వాడు మూగాడు కాలం చేసాడట. ఇప్పుడే తెలిసింది. శంకర శాస్త్రిని చూసివస్తాను”. అని చెప్పారు. “ఇప్పుడా? స్నాన, జపాలు లేకుండా మంగళవారం పూటా, తిధి నక్షత్రం చూడకుండా ఆ అమంగళం జరిగిన చోటికి వెళ్ళాలా?” అని అడిగింది. “పట్టాభి గురించైనా వెళ్ళాలే! ఇప్పుడు” చెప్పారు శర్మగారు.” “ఏమండి! మీ స్నేహితుడు
పట్టాభిగారు పోయి సంవత్సరం అయింది. మీ చాదస్తంగాని, ఆమూగాడు మీ పట్టాభిగారి తమ్ముడా? లేదాయిప్పుడున్న ఆయనకొడుకు శంకర శాస్త్రీకి బాబయ్య? అవుతాడా? ఎందుకండీ... ఆ కంగారు?.” అడిగింది శర్మగారి భార్య. "కాదే! వెళ్ళాలి.” అన్నారు శర్మగారు. పెరట్లో మందారాలు కోస్తూ “ఏమండీ! మీరు ఏమిటో మీరు మర్చిపోతున్నారండి! అందరి చేత గౌరవించబడి నమస్కరింపబడే మీరు ఈ వూళ్ళోనేగాక చుట్టు ప్రక్కల వూళ్ళల్లో కూడా యజ్ఞ యాగాదులు, విగ్రహ ప్రతిష్టలూ మీ ఆధ్వర్యంలో మీ సలహామీద జరిపించే పేరున్న సిద్దాంతండీ.! ఆ కులగోత్రాలు తెలియని ఒక పనివాడు ఆమూగాడి విషయంలో ఎందుకు ఇంత శ్రద్ద చూపుతున్నారో అర్ధ మవట్లేదు” అంది శర్మగారి భార్య. “నువ్వు ఏమైనా చెప్పు. నేను వెళ్ళితీరాలి" అంటూ వేగంగా వెళ్ళి పోయారు శర్మగారు శంకర శాస్త్రి ఇంటికి.
ఆ సమయంలో మార్కండేయశర్మ గారు తన ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయి శంకర శాస్త్రి, “శర్మగారూ! మూగాడు పోయాడండి! వాడికి వెనకాల ఎవ్వరూ లేనందుకు, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా పనిచేసుకుంటూ పోయాడండి పాపం! అనాధశరణాలయానికి కబురుపెట్టాను. కాస్సేపటిలో వాళ్ళు వస్తారు” అని తను చేసిన ఏర్పాట్లు చెప్పాడు శంకరశాస్త్రి
ఒక్కసారి శంకర శాస్త్రి వైపు తీక్షణంగా చూసి శర్మగారు “లోపలకి వెళాదాము రా! నీతో మాట్లాడాలి” అన్నారు. శంకర శాస్త్రి తన గదిలో సోఫాలో కూర్చుంటూ ఎదురుగా ఉన్న సోఫాలో శర్మగార్ని కూర్చోమన్నాడు. శర్మగారు తనలాల్చీ జేబులో ఉన్న కవరు తీసి, “ఏడాది క్రితం మీనాన్న పట్టాభి ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు హాస్పిటలులో వుండగా, యింకొక నాలగురోజులలో పోతాడనగా, నన్ను కబురుచేసి మూగాడి గురించి చెప్పి యీ కవరిచ్చాడు. మూగాడు పోతే పోయిన రోజున ఈ కవరు నీకిమ్మన్నాడు. ఈ కవరు నీకు నేను యివ్వవలసివస్తుందని, యింత తొందరగా మూగాడు పోతాడని నేను ఊహించలేదు. అనుకోలేదు. అంతాదైవనిర్ణయం!” అంటూ శంకర శాస్త్రి చేతిలో పెట్టాడు ఆ కవరును.
శంకర శాస్త్రి కవరు విప్పి అందులో ఉన్న ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. శంకరం!
“అప్పుడు నీకు రెండో ఈడురా. ఒక పదేళ్ళ కుర్రాడు రోజూ మనయింటికి వచ్చి అరుగుమీద చాలా సేపు కూర్చుని వెళ్ళి పోతుండేవాడు. ఒక రోజున నిన్ను అరుగుమీద ఆడిస్తున్న ఆకుర్రాడు మూగాడని, వెనుక ముందులు ఎవ్వరూ లేరని, ఒక అనాధ అని తెలిసి, మనకు పని చేయడానికి ఉంటాడని వాడిని మన ఇంట్లోనే వుండి పొమ్మని చెప్పాను. ఆరోజు నుంచి మూగాడు మనయింట్లోనే పనిచేస్తూ వుండి పోయాడు.
మనకు వాడు చేసిన సేవలు ఏమని చెప్పను? నీ చదువుకోసం వాడు పుస్తకాలు మోసి నిన్ను రోజూ స్కూలుకి తీసుకు వెళ్ళి తీసికొస్తూ వుండేవాడు. నేను ఊళ్ళో రాజకీయాల్లోను, కోర్టుగొడవల్లోను తిరుగుతూ ఇంటి గురించి పట్టించుకునే వాడను కాను. ఈ మూగాడు మన ఇంటి పనుల్లో పొలం పనుల్లో ఎంతో అండగా ఉండేవాడు. వయస్సు వచ్చాక నీకు కూడా తెలుసుకదరా! మనకుటుంబానికి మూగాడు చేసిన సేవలు. మన వరి పొలాలు పండి కోతలుకోశాక, కుప్పల నూర్చి ఇంటికి చేర్చే ముందు ఆ ధాన్యరాశులను పొలంలో నిల్వ ఉంచిన రోజుల్లో మంచులో పొలాల్లో పడుకొని ఆరాశులను ఒక్కగింజ పోకుండా కాశేవాడు. కొబ్బరితోటలో కాయ దింపుతీయించి వెయ్యేసికొబ్బరి కాయ గుట్టలను నిద్రాహారాలు మాని ఒక్కకాయ పోకుండా చూసి, మార్కెట్టుకి పంపేవాడు. ఇప్పుడు హాస్పిటలులో నాకు చేస్తున్న సేవలకు విలువ కట్టలేమురా! గ్రామ రాజకీయ కక్షలతో భూపతి తన మనష్యుల చేత నన్ను కొట్టించే ప్రయత్నంలో నాకు అడ్డంగా నిలబడి, నాకోసం తను దెబ్బలు తిన్నాడు. నీతాతకు నేను ఒక్కడినే కొడుకునయి నందుకు యీ మూగాడు నాకు దేవుడిచ్చిన తమ్ముడు, నీకు బాబయ్యలా వున్నాడురా! ఈ మూగాడికి పెళ్ళి చేసి, యింత డబ్బో పొలమో యిచ్చిఒక యింటి వాడిని చేద్దామనే నేను, మార్కండేయశర్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదనీ,మూగాడికి పిల్ల నివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని నీకు కూడా తెలుసు. ఒక సంఘటన నీకు గుర్తు ఉండే ఉంటుంది. నీ కొడుకు రమేష్ అమెరికాలో ఎమ్. ఎస్. చదవడానికి వెళ్తున్నప్పుడు విమానం ఎక్కించడానికి బొంబాయి వరకు రమేష్తో నీవు కూడా వెళ్ళావు. ఆ రాత్రి ఏమయింది? సిగరట్టు వాసనగాని, వక్కలు నవలడంగాని ఇష్టపడని యీమూగాడు సిగరట్టు ప్యాకెట్టు, అరడజను కిళ్ళీలు కొనుక్కొని,కిళ్ళీ మీద కిళ్ళీ వేసుకుంటూ సిగరట్టు మీద సిగరట్టు కాలుస్తూండడము నేను చూసి, కోప్పడి “ఇదేమి వెధవ పనిరా?” అని అడిగితే... నన్ను నీ రూములోకి తీసికెళ్ళి రమేష్ఫోటో చూపించి వాడి సైగలతో, సంజ్ఞలతో రమేష్ అమెరికా పెద్ద చదువులకి వెళ్ళడం తనకు చాలా సంబరంగా ఉందని, అందుకే సంబరం పట్టలేక యీపనిచేస్తున్నాను అని డ్యాన్సు చేస్తూ చెప్పుతూ ఉప్పెంగిపోయాడురా.! నిజానికి మన ఇంట్లో ఏవస్తువూ తనది కాకపోయినా మనం ఎవ్వరమూ వాడి వాళ్ళంకాక పోయినా మన ఆస్తిపాస్తులు తనవికాకపోయినా, అన్నీ తనవే అనుకొని, మనం అందరం తనవాళ్ళమే అనుకొని సేవలు చేసాడురా.
అందుకే శంకరం! నేను చెపుతున్నాను! మూగాడు పోయిన రోజున వాడితలకి నువ్వే కొరివి పెట్టాలి! నువ్వు కర్తవు అవ్వాలి. వాడు పోయిన రోజున ఒక అనాధకు జరిగినట్లు జరగకూడదు. వాడు ఒక అనాధగా మిగిలి పోకూడదు. వాడు పోయిన రోజున తండ్రిమాట విన్న రాముడివి అవ్వాలి నువ్వు.! తనకు ఉపకారం చేసినపక్షి జటాయువుకు దహనక్రియలు చేసిన రాముడివి అవాలినువ్వు! ఈమూగాడి ఋణంతీర్చుకోవాలి!
ఈ కార్యంచేయడానికి ఆసమయంలో నీకు మనోబలం, సమాజ బలంకావాలి. ఆరెండూ నాకు అత్యంత సన్నిహితుడు, ప్రియమిత్రుడు అయిన మార్కండేయశర్మ సమకూరుస్తాడు నీకు. ఇంటు వంటి పనులు చేయడానికి మనలను బలహీనపరిచే డబ్బు గురించి ఆలోచనలు లేకుండా మార్కండేయ శర్మకు పాతిక వేల రూపాయలు యిస్తున్నాను. మళ్ళీయింకో సారి చెపుతున్నాను. మూగాడు పోయినరోజున వాడి తలకి నువ్వు కొరివి పెట్టాలి. నువ్వు కర్తవి అవ్వాలి. వాడు ఒక అనాధగా మిగిలి పోకూడదు. ఒక అనాధకి జరిగినట్టు జరుగకూడదు.!!
ఇట్లు
నీతండ్రి
పట్టాభి.
శంకరశాస్త్రి ఉత్తరం మడత పెట్టి శర్మ గారు ఒళ్ళో పడుకుని ఏడుస్తూ, “శర్మగారూ! ఈమూగాడిని నేను గుర్తించలేక పోయానండి. ఈ మధ్య నాలుగైదు నెలలు నుంచి దండ వేసియున్న మానాన్న గారి ఫోటో దగ్గరికి నన్ను తీసికెళ్ళి ఆయనతనను పిలుస్తున్నారని,అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారని ఆయనకు పనులు చేసి పెట్టడానికి ఎవ్వరూ లేరని, తనకు ఆయన వద్దకి వెళ్ళి పోవాలని ఉందని, త్వరలో వెళ్ళిపోతానని తన సంజ్ఞలతో, సైగలతో తెలియ పరచేవాడండి" అన్నాడు.
శర్మగారు “వూరుకో! ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడు.” అని జేబులోంచి డబ్బుతీసి చేతిలో పెట్టారు. శంకర శాస్త్రిలేచి రెండు కళ్ళు తుడుచుకున్నాడు. భుజంమీద ఉన్న తువ్వాలుని నడుముకి బిగించాడు. వీధిలోకి వెళ్ళాడు. అనాధ శరణాలయం నుంచి వచ్చిన ట్రక్కును, మనుష్యులను తిరిగి పంపేశాడు. వెంటనే అన్నీ చురుకుగా పురమాయించాడు. ఆవు నెయ్యి, గంధపు చెక్క పూలమాల,క్రొత్త పంచలు చాపు సిద్దం మయ్యాయి. వెదురు కర్రలు వచ్చాయి. పుల్లల బండి కాలువ ఒడ్డుకి చేరింది. మార్కండే యశర్మగారు కబురుచేయగా అగ్రహారం నుంచి నలుగురు వాహకులు ఆటో దిగారు. కర్మలు చేయించే కాశీపతిగారి స్కూటరు శంకర శాస్త్రి మేడ ముందు ఆగింది. మూగాడు కట్టె ఎడ్లబండి నుంచి దిగింది కార్యక్రమంపూర్తి అవగానే శంకర శాస్త్రి నిప్పుతో మట్టి పాత్ర పుచ్చుకొని ముందు నడుస్తుండగా మార్కండేయ శర్మ గారు యింకో నలుగురువెంటరాగా నిశ్శబ్దవాతవరణంలో మూగాడి కట్టె ఆ వీధిలోంచి అంతిమ యాత్ర చేస్తుండగా శివాలయం గుడి మైకు నుంచి ఘంటసాల భగవద్గీత స్పష్టంగా వినబడుతోంది. ఆవీధిలో ఇళ్ళ నుంచి ఆడ మగ బయటకు వచ్చి చూస్తూ కొందరు ముక్కు మీద వేలు వేసుకొన్నారు. కొందరు శంకరశాస్త్రి, శర్మ గార్లను చూసి పళ్ళు కొరికారు. కొందరు మెచ్చుకుని యాత్రలో చేరారు. మూగాడి కట్టె కాలువ ఒడ్డుకు చేరింది. శంకర శాస్త్రి మూగాడి తలకి కొరివి పెట్టాడు, కర్త అయ్యా డు.!!
శంకర శాస్త్రి, శర్మగారలు చీకటి పడే వరకు ఉపవాసం ఉండి నక్షత్రదర్శనం చేసుకుని భోజనం చేసి ప్రొద్దున్నించి ఉన్న మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ వల్ల ఆరాత్రి గాఢంగా నిద్రపోయారు. రాత్రి పండ్రెండు గంటల వేళ శంకర శాస్త్రి లేచి ఎవరికోసమో వెతుకుతున్నాడు. ఎవరూ కనపడలేదు. అప్పుడు అర్ధమయింది శంకర శాస్త్రికి ఇంతకు ముందు ఎవరో పెద్దాయన తనను కౌగలించుకుని వీపుతట్టి, మెచ్చుకుంటూ “దీర్ఘాయుష్మాన్ భవ" అని దీవించింది కలలో అని. తిరిగి నిద్రలోకి జారుకున్నాడు.
అదే సమయంలో మర్కండేయ శర్మగారు కూడా లేచి కూర్చున్నారు. ఎవరికోసమో వెతుకుతున్నారు. ఎవరూకనపడలేదు. అప్పుడు అర్ధమయిందాయనక్కుడా. యింతకు ముందు ఒకాయన తనకు శిరస్సు వంచి నమస్కరిస్తూ “స్నేహధర్మాన్ని ఆచరించావురా!" అని అన్నది కలలో అని.
***
No comments:
Post a Comment