జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 10 - అచ్చంగా తెలుగు

జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 10

Share This
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 10
                                                                         చెన్నూరి సుదర్శన్            


ఆ మరునాడు నేను పరీక్షల విభాగంలో కూర్చొని ఫైళ్ళను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటున్నాను. రఘురామయ్య వచ్చాడు. నా నేర్పును పరిశీలిస్తూ మెచ్చుకున్నాడు.
            పాపారావు చేసిన గత సంవత్సరపు పరీక్షల కాంటింజెంట్ బిల్లు చూసాడు.
            “సార్..బిల్లు నాకంతగా తృప్తికరంగా లేదు” అంటూ కొన్ని సలహాలిచ్చాడు.
నేను శ్రీకొండలో పరీక్షలు నిర్వహించాను గాని బిల్లు చేయడం చూడలేదు.
రఘురామయ్య సలహాల ప్రకారం అదే సాయంత్రం తిరిగి నమూనా బిల్లు చేసి చూపించాను.  
“సూర్యప్రకాష్ సార్.. మీరు ఉద్దండులు.. చాలా బాగా చేసారు. ఇలా చేస్తే బోర్డు నుండి ఎలాంటి ఆక్షేపణలు రావు..” అంటూ మెచ్చుకున్నాడు. “సార్.. మరో విషయం. ఈసారి పరీక్షలు స్ట్రిక్ట్ గా నిర్వహించాలనుకుంటున్నాను. స్టాఫ్ సహాయం లేకుండా నేనేమీ చేయలేను” అన్నాడు.
“సార్.. దానికి కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి” అన్నాను.
“చెప్పండి” తానూ అనుభావజ్ఞుడే.. అయనప్పటికీ నా సలహా కోసం కుతూహలం చూపాడు.
నేను నా పథకం వివరించాను.
“ఓకె సార్.. అలాగే చేద్దాం.. రేపే పథకం ప్రారంభిద్దాం” అనేసరికి నాకు ఉత్సాహం కలిగింది.  నా మాటకు గౌరవమిచ్చిన రఘురామయ్యకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. 
నాపథకం ప్రకారం కాలేజీ మొత్తం ఒక గాడిన  పడ్తుందనే నమ్మకం నాకుంది. దానికి మద్దతు  సుధాకర్ అతడి బృందం ఉండనే ఉంది. నాప్రణాళికలన్నీ అంచెలంచెలుగా అమలు పరిచే విధానం సుధాకర్‍తో మధ్య మధ్యలో చర్చిస్తూనే ఉన్నాను.
ప్రగాఢ విశ్వాసంతో మరునాడు కాలేజీ సమయం తరువాత రఘురామయ్య.. కాలేజీ టీచింగ్ స్టాఫంతా కలిసి ముందుగా పంచాయితీ కార్యాలయానికి వెళ్లాం.
యువకుడైన సర్పంచ్ గారు సాదరంగా ఆహ్వానించాడు. టీ లు తెప్పించాడు. టీ ఆస్వాదిస్తూ నెమ్మదిగా రఘురామయ్య విషయం కదిలించాడు.  
            “సర్పంచ్ గారూ మన ఊరి కాలేజీ ఎలా నడుస్తుందో మీకు తెలియంది కాదు. ఇంత వరకు ఇంచార్జ్ ప్రిన్సిపల్‍తో నడుస్తుండేది. అతడి ప్రవర్తన వల్ల కాలేజీ బదునామయ్యింది. ప్రస్తుతం విధులకు దూరమయ్యాడు. నేను కొత్త ప్రిన్సిపల్‍ని. నాకు మీరు సహకరిస్తే కాలేజీని చక్కదిద్దుతాను. ఊరి ప్రజల సహకారం కూడా అందిస్తారని మాస్టాఫంతా కలిసి వచ్చాం”
రఘురామయ్య చెప్పబోయే విషయం నాకు మాత్రమే తెలుసు. ఏ విషయంలో సహకారం అడుగబోతున్నాడోనని మా స్టాఫంతా విస్తుబోయి వింటున్నారు.
            “తప్పకుండా సార్..  కాలేజీ బాగుపడడమంటే ఒక రకంగా ఊరు కూడా బాగు పడుతున్నట్లే.. నేనేం చెయ్యాలో చెప్పండి” అంటూ తన మద్దతు తెలిపాడు సర్పంచ్.
“ఇక ముందు కాలేజీ కాలనిర్ణయ పట్టికానుసారం సక్రమంగా నడుస్తుంది. పాఠాలు చెప్పకుంటే మమ్మల్ని ఊరి మధ్యలో ఉరేయండి. కాని విద్యార్థులు పరీక్షల్లో కాపీ చేసేందుకు ప్రోత్సహించకండి.
            పేరెంట్స్ ఇంటికి వెళ్లి విన్నవించుకుంటాం. కాపీ చేస్తున్న  విద్యార్థులను మా స్టాఫ్ మాల్ ప్రాక్టీసు కింద బుక్ చేసే అవకాశమివ్వకండి.
            కాపీ నిరోధించ గలిగితే రత్నాల్లాంటి విద్యార్థులు పుట్టుకొస్తారు. వారి భవిష్యత్తు బంగారమవుతుంది” అంటూ వివరించాడు రఘురామయ్య.
            “వాస్తవమే సార్.. కొత్తగా ఎవరో మ్యాథ్స్ లెక్చరర్ వచ్చాడని చాలా బాగా చెబుతున్నాడని నాకు తెలిసింది..” అని సర్పంచ్ అంటుంటే రఘురామయ్య నన్ను చూపించాడు. మిగతా లెక్చరర్లు నీళ్ళు నములుతున్నారు.
‘వెంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది’ అన్నట్లు రఘరామయ్య  ప్రపోజల్‍తో అంతా నిశ్శబ్దమయ్యారు.
“సార్.. నిజం చెప్పాలంటే.. పరీక్షల్లో కాపీ చెయ్యడం నాకూ నచ్చదు. ఇన్నాళ్ళూ కాలేజీ విషయాల్లో అడ్మిషన్లు తప్పితే ఎందులోనూ కలుగచేసుకోలేదు. మీరంతా ఐకమత్యంగా కాలేజీ బాగు కోసం ఇంతగా కృషి చేస్తామంటే నాకూ ఆనందంగానే ఉంది. నా నుండి ఊరి ప్రజల నుండి మద్దతు ఉంటుంది” అంటూ సర్పంచ్ వాగ్దానం చేసాడు.
            సర్పంచ్ వద్ద సెలవు తీసుకొని దాదాపు ఇల్లిల్లూ తిరిగాము. ‘పాఠాలు చెప్పకుంటే తన్ని తరిమేయండి.. కాపీ చేస్తే కనికరం చూపం’ అని హెచ్చరికలా  చెప్పాం.
            పురయువజన సంఘానికి వెళ్లాం. యువకులతో  మాట్లాడుతుంటే “మాకు సుధాకర్ ఈ విషయం చెప్పాడు సార్.. మా సపోర్ట్ ఉంటుంది.. ప్రామీస్ ” అంటూ ప్రమాణం చేసారు. మాలో ఉత్సాహం రెట్టింపయ్యింది.
            క్రాంతికుమార్ నన్ను అభినందించాడు. తన కుటుంబ సమస్యలతో కాలేజీని నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గు
పడ్తున్నానని విచారించాడు.
స్కాలర్‍షిప్ వ్యవహారాన్ని తీర్చిదిద్దాడు.
            లెక్చరర్లంతా ఊళ్లోనే గదులు అద్దెకు తీసుకోక తప్పలేదు.  
నేను జహీర్ జువాలజీ లెక్చరర్‍ను రూమ్మేట్‍గా చేర్చుకున్నాను. జహీర్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతాడు. కవిత్వం కూడా రాస్తూంటాడు.
ప్రతీరోజు సాయంత్రం ఇద్దరం కలిసి వాకింగ్ చేసే వాళ్ళం. జహీర్ కవిత్వం వినిపించే వాడు.
మునిపల్లి ఒక రకంగా జంక్షన్. తాండూర్.. వికారాబాద్.. బుధేర వెళ్ళడానికి దారులున్నాయి. ఒక్కో రోజు ఒక్కో దారిగుండా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు  వెళ్లి తిరిగి వచ్చేవాళ్ళం. దారిలో జామతోటల్లో జామపండ్లు.. చెరకుచేల్లో..చెరకు గడలు మాకు అల్పాహారాలయ్యేవి. జహీర్ రేగుచెట్టెక్కి దులిపేవాడు. వారాంతం ఇంటికి వెళ్ళేప్పుడు సంచుల్లో తీసుకువెళ్ళే వాళ్ళం.
అలా మాస్నేహం అనతికాలంలోనే ధృఢపడింది. ఆప్యాయంగా అన్నయ్యా, తమ్ముడూ  అంటూ వరుసలు పెట్టి పిలుచుకునే  వాళ్ళం.
ఒక రోజు ఇద్దరం కలిసి వాకింగ్ వెళ్తుంటే రోడ్డుకు కాస్తా దూరంగా చెట్టుకింద ఒక జంట అతిచనువుగా మాట్లాడుకుంటూండటం మాకంట పడింది.
అమ్మాయిని గుర్తుపట్టాడు జహీర్. అమ్మాయి పేరు అనిత బైపిసి సెకండియర్ అన్నాడు. వెంటనే నాకాళ్ళు వాళ్ళ వైపు కదిలాయి.
“మనకెందుకన్నయ్యా..” అంటూ వారించాదు జహీర్.
“మన కాలేజీ అమ్మాయికదా..!” అంటూ వడి వడిగా అటువైపు వెళ్లాను.  ఇక తప్పదన్నట్లు జహీర్ నావెనకాలే వచ్చాడు. “అది కాదు.. ఇది కాలేజీ సమయం కాదుగదా.. అని” అంటూ నసుగుతున్నాడు.
మారాకను గమనించి చటుక్కున లేచి నిలబడ్డారిద్దరూ.. అబ్బాయి పేరు ప్రభాకర్ సియిసి సెకండియర్.. గుర్తుపట్టాను.
“సార్.. మాబస్సు మిస్సయింది.. ఎలా వెళ్దామా అని ఆలోచిస్తూ ఇక్కడ కూర్చున్నాం. నడుచుకుంటూ వెళ్దామని నేను.. ఇంకో అరగంటలో మరో బస్సుంది అందులో వెళ్దామని తను.. ” అంటూ ప్రభాకర్ చెప్పబోతుంటే మధ్యలోనే అడ్డుకున్నాను.
“మీ ఇద్దరిదీ ఒకే ఊరా?” అంటూ నిలదీసాను.
ఔనని ఇద్దరూ తలలూపారు.
“మీ ఇళ్ళల్లో గాని.. మీ ఊళ్ళో గాని మీప్రేమ వ్యవహారం తెలుసా..?” అంటూ నేరుగా అడిగేసరికి ఖంగుతిన్నారు. మాటలు రాక తడబడ్డారు.
“చూడు అనితా.. మీ వయసువారికి ప్రేమంటే ఏమిటో తెలియదు.. కేవలం ఆకర్షణమాత్రమే.. హద్దులు దాటారంటే.. ఆకర్షణ ఆవిరైపోయి ఆవేదన మిగులుతుంది. అప్పుడది ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ వైనం..
ఒకవేళ మీది నిజమైన ప్రేమ అయినా మీ ఇంట్లో వాళ్ళు అనుమతించకపోవచ్చు ఒకటి .. పెద్దలనెదురించి మీరు పెళ్ళాడినా మీకాళ్ళపై మీరు నిలబడలేని దుస్థితి రెండవది.. ఇలా రెండు విధాలా ఆత్మహత్యకు దారి తీయవచ్చు..” అనేసరికి అనిత కళ్ళు వర్షించసాగాయి.
“చూడు ప్రభాకర్.. ప్రేమలు  పెళ్లిళ్ళు తప్పనడంలేదు నేను. ఇది సరియైన సమయంకాదంటున్నాను. ఇకపై మీ ఇష్టం..” అంటూ వెనుతిరిగాను.
“అదేంటన్నయ్యా.. ఉన్నఫళంగా వాళ్ళ జాతకమంతా చెప్పారు” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు జహీర్. “వాళ్ళ ప్రేమాయణం ఎలా పసిగట్టారు?.. రవి కాంచని., కవి ఊహించనిది లేదంటూ కవిత్వంరాసే నాకే కనిపించని..” అంటూండగా నేను “నాకు వినిపించింది.. ఆ ప్రేమపక్షుల కిలకిలా రావం” అన్నాను అతడి కవిత్వధోరణిలో..
ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం.
(సశేషం )

No comments:

Post a Comment

Pages