"నాట్య భారతీయం" పుస్తక పరిచయం
భావరాజు పద్మిని
నాట్యం ప్రతి క్షణాన్ని ఉత్సవంగా మారుస్తుంది, ప్రతి కణాన్ని ఆనందనిలయం చేస్తుంది. తాదాత్మ్యం చెందిన కళాకారుడి మనసు నిజంగా దైవ నిలయమే. ఆ దివ్యత్వాన్ని, మాధుర్యాన్ని అనుభూతి చెందాల్సిందే గాని మాటల్లో చెప్పేందుకు సాధ్యం కాదు.
ఆత్మకథ అంటే 'ఆత్మస్తుతి - పరనింద' అన్నారు ముళ్ళపూడి వారు. కానీ ఈ కోవలోకి చెందని విలక్షణమైన జీవిత గాథ 'నాట్య భారతీయం'. ప్రముఖ నర్తకి, సినీనటి, రచయిత్రి, సంఘసేవిక బహుముఖ ప్రజ్ఞాశాలి, శ్రీమతి ఉమా భారతి గారి ఆత్మకథే ఈ పుస్తకం. 'గో తెలుగు' పత్రికలో 'నాట్య భారతీయం' అన్న శీర్షికతో బహుళ జనాదరణ పొందిన ఉమా భారతి గారి రచనల్ని అదే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు వంగూరి ఫౌండేషన్ వారు.
తల్లి, తండ్రి, గురువు, దైవం అని పెద్దల నుడివిన విధంగా, ఈ పుస్తకంలో ముందుగా ఉమా భారతి గారు తమ తల్లి శారద గారి గురించి, తండ్రి మేజర్ సత్యనారాయణ గారి గురించి చెప్పడం మొదలుపెట్టి, అటుపై తన గురువులకు, దైవానికి, సంఘానికి అందరికీ నీరాజనం సమర్పిస్తారు.
పిల్లల అభిరుచిని గుర్తించే ప్రోత్సహించడం లోనే అమ్మానాన్న యొక్క ఘనత ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఉమాభారతి గారి తల్లిదండ్రులు కాలానుగుణంగా ఆమె అభిరుచులను గుర్తించి ప్రోత్సహించారు. ఒక ఆణిముత్యాన్ని మన ముందు నిలిపారు. శిల్పంలోని సౌందర్యం రాతిని చెక్కిన శిల్పి యొక్క ఘనతే అయితే, ఇది పూర్తిగా ఉమా భారతి గారి తల్లిదండ్రులు సాధించిన ఘనవిజయం.
కుటుంబంలోని ప్రేమలు, అనుబంధాలు విలువలు, సమస్యలను ఎదుర్కొనే విధానాలు అన్నింటినీ తన అపారమైన సృజనతో కలగలిపి కమనీయమైన చిత్రాలను జోడించి, తన జీవిత గాథ గా మలిచి, మనకు అందించారు రచయిత్రి. ఆమెదో చిన్న ప్రపంచం - అమ్మా,నాన్న, తమ్ముడు నాగేంద్రప్రసాద్(ప్రముఖ సినీ నటుడు లఘ చిత్రాల నిర్మాత, దర్శకులు)నాట్యం, చదువు ఇదే ఆమె లోకం. చిన్నతనంలోనే నాట్యంలో స్టేట్ లెవెల్ అవార్డు పొందిన ప్రతిభాశాలి ఉమా భారతి గారు. విదేశీ పర్యటన లతో రోజుకు ఎనిమిది గంటలు నాట్యం ప్రాక్టీస్ చేస్తూనే, బి.ఎ పరీక్షలను రాసి ఉత్తీర్ణులైన మేధావి ఆవిడ. డాన్స్, చదువు, రచనలు, సమాజసేవ ఇన్ని రంగాల్లో రాణించడానికి కేవలం తన తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని ఆవిడ చెబుతారు.
తన కూచిపూడి నాట్య గురువులైన వెంపటి చినసత్యంగారు, వేదాంతం జగన్నాథశర్మ గారికి ఈ పుస్తకంలో ప్రత్యేక నీరాజనం సమర్పించారు ఉమా భారతి గారు. అలాగే తన భరత నాట్యం గురువులైన పద్మశ్రీ ఫకీర్ స్వామి పిళ్ళై, శ్రీ త్యాగరాయ రాధాకృష్ణన్ గార్లతో తన అనుబంధాన్ని కూడా ఈ పుస్తకంలో చక్కగా వివరించారు.
చిన్నతనం నుండి నాట్యం పట్ల అనురక్తి ఉన్న ఉమా భారతి గారికి నృత్యంలో ఉండే సాహిత్యం పట్ల ఆకర్షణ కలిగింది. ఆమె తొలి రచనలన్నీ నాట్యానికి సంబంధించినవే. సినారే గారి ప్రభావం ఆమెపై ఉంది. అందుకే తన భావప్రకటనకు, భాషను ఆలంబనగా చేసుకుని అనేక కథలు నవలలు వ్యాస సంపుటులు మొదలైనవి రచించారు.
నిత్య ప్రవాహిని జీవితం. జీవితంలో అనుక్షణం మారే పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలో ఉమాభారతి గారి జీవితాన్ని చూస్తే మనకు స్పష్టమవుతుంది. మేటి సినీ నటిగా ఎన్టీఆర్ సావిత్రి అక్కినేని లతో మంచి స్టార్ డమ్ తో నటిస్తుండగానే ఆమెకు వివాహమైంది. వివాహం తర్వాత అమెరికా వెళ్లినా కూడా తనలోని స్ఫూర్తిని కళను మరుగున పడనివ్వకుండా పలు హిందూ దేవాలయాల పునరుద్ధరణకు, నిధుల సేకరణకు గాను, ఆవిడ ప్రదర్శనలు ఇచ్చారు. 'అర్చన డాన్స్ అకాడమీ' స్థాపించి, నాట్య గురువు గా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. పిల్లలకు సంగీతం, నాట్యం, మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పలు రామాయణ, భారత కథలు ఇటువంటి వాటిలో ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. విదేశాలకు వెళ్లినా స్వదేశీ సౌరభాలను పంచి పెడుతున్న ఆమె నిజంగా దేవలోక సౌగంధికా పుష్పం.
ప్రమాదాలు ఆమె లోని ధైర్యాన్ని సవాలు చేయలేక పోయాయి. అలజడులు ఆమెలో ఆత్మ స్థైర్యాన్ని సడలించలేక పోయాయి. చుట్టూ ఉన్న వారి మనోభావాలలోని కల్మషాలు ఆమె స్ఫూర్తిని ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. రాజకీయాలకు, వివాదాలకు అవరోధాలకు అతీతంగా ఒక శిఖరంలా నిలబడి సమాజ సేవ చేస్తూ నాట్య గురువుగా తన కూతురు శిల్ప తో పాటు, మెరికల్లాంటి అనేకమంది శిష్యులను తీర్చిదిద్దుతున్న ఆమె జీవనం నిజంగా మన అందరికీ ఆదర్శం.
ఈ ఒక్క జీవితాన్ని చదివితే చాలు మనకు జీవితకాల స్ఫూర్తి లభిస్తుంది చక్కటి ఈ పుస్తకాన్ని చదవండి చదివించండి మీ ఆత్మీయులకు బహుమతిగా పంచి పెట్టండి ప్రతులకు సంప్రదించండి:
JV publications
Ph: 8096310140
Vanguri foundation
Ph: 9849023852
Padmini garu,,,,
ReplyDeleteఇంత చక్కని విశ్లేషణకి సరిపోయేట్టుగా ధన్యవాదాలు తెలియజేసే భాష నా వద్ద లేదు...
హృదయ పూర్వక కృతజ్ఞతలు...పద్మిని గారు...