నెత్తుటి పువ్వు
(కొత్త నవల)
మహీధర శేషారత్నం
గుంటూరు జిల్లాలో పక్కా పల్లెటూరు రికార్డింగు డాన్సులు... ఈలలు, చప్పట్లు.. హోరెత్తి పోతోంది. గాలిలో ముద్దులు అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ ఎగురుతున్నాయి.
“బన్నీ... బన్నీ.... జారుతోందీ చున్నీ.. లగ్గం ఎప్పుడవుతుందని అడుగుతోంది పిన్నీ"!
అక్కడ చున్నీలే కాదు, వదిలేసిన విలువలతో పాటు పలవలూ ఎగురుతున్నాయి. తాగిన మైకంలో రకరకాల అసహ్యకర భంగిమలతో, భయంకరమైన డాన్సులతో హోరెత్తిపోతోంది అనూహ్యంగా ఆకాశం మేఘావృతమైంది. చల్లటి గాలి హాయిగా తగులుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం మరింత మత్తేకిస్తోంది. అంత చలిలో మరీ వేడిగా తయారయింది ఆ ఆవరణ.
సన్నని చినుకులతో మొదలైన ఆ వాన చూస్తుండగానే జడివానలా కమ్మేసింది. జనం మత్తు వదిలి ఎక్కడి వాళ్ళక్కడ పరిగెత్తారు. స్టేజి మీద డాన్సర్లందరూ స్టేజిదిగి పరిగెట్టారు. ఎక్కడో అక్కడ తలదాచుకోవాలనే తాపత్రయంతో జనం కకావికలై పోయారు. ఆ హడావుడిలో ముద్దబంతిలాంటి డాన్సరు తాగుడెక్కువై, మత్తు దిగక, స్టేజిదిగలేక స్టేజికి, తెరకి మధ్య భాగంలో కాలు మెలికపడి పడిపోయింది.
ఆపడడం పడడం వాన కుండపోతగా రెండు గంటలు కురిసింది. ఆహోరు గాలిలో, వానలో జనం ఇళ్ళుచేరి వెచ్చగా నిదరోయిన తరువాత అక్కడికి ఒక వ్యక్తి సైకిలు పై వచ్చాడు. అర్దనగ్నంగా ఉన్న ఆమెకు తాను తెచ్చిన నైటీ దిగేసి జాగ్రత్తగా సైకిలుపై ఎక్కించి తీసుకుపోయాడు. తెల్లవారీ ఊరు గుప్పుమంది. కొన్నాళ్ళు గుసగుసలాడారు. తరువాత గమ్మునున్నారు. అక్కడ ముగిసిన కథ పట్నం లో కళ్ళు తెరిచింది.
“నీ పేరేంటి?
“నా పేరుతో నీకు పనేంటి?
“నిన్న పిలవాలిగా?" స
“నన్ను పిలవడమెందుకూ?"
“ఒకచోట ఉన్నప్పుడు మాటలుండవా?"
"నీకు మాటలతో పనేమిటి?
“మరి నాకేం పని?"
“ఏం పనో నాతో చెప్పించడమెందుకు? నా తెల్ల తొక్కా నడుం బరువులు చూసి తీసుకొచ్చేవు. నీ పనయిపోయాక పంపిస్తావు"
ఇలా ఎందుకనుకుంటున్నావ? నిన్ను ప్రేమించాననుకోవచ్చుగా
“ప్రేమా ఎలా ఉంటుంది? ఏ రేటు కమ్ముతారు?" -కళ్ళ నిండా, గొంతు నిండా పొంగుతున్న హేళన.
క్షణం మౌనంగా ఉన్నాడతను.
“నిన్ను క్రిందటిసారి కోటప్పకొండ తిరునాళ్ళలో చూసాను బందోబస్తుకొచ్చి....
మాట పూర్తి కాకుండానే ఉలిక్కిపడింది.
“పోలీ సోడివా?.." బిత్తరపోతూ లేచి నుంచుంది.
"నిలబడక్కర్లేదు. కూర్చో.... ఎందుకో నీలో నాకు చిన్నపుడే తప్పిపోయిన...."
“చెల్లెలు గుర్తొచ్చిందా ...." ఏదో ఆశ ఆమె గొంతులో ఆది గమనించినా గమనించనట్టు ఊరుకున్నాడు.
ఒక్క క్షణం ఆగి.... "నాతో ఎలిమెంటరీ స్కూలుకు కలిసి వచ్చేది.... ఎవరో మా ఊరు వచ్చి డాన్సు ప్రోగ్రాములు పెడితే తెలియకుండానే వాళ్ళతో వెళ్ళి తప్పిపోయింది. ఆ అమ్మాయి జ్ణాపకం వచ్చింది. "
"తెలుగు సినిమా కథా!" ఆమె కళ్ళలో వ్యంగ్యం తొంగి చూసింది. "నూటికి కోటికి జరిగి వాటినే చక్కటి కథలుగా మలుస్తారు."
“నీ భ్రమ అక్కర్లేదు. నేను జ్ఞానం వచ్చిన దగ్గర్నుంచి వీళ్ళతోనే ఉన్నాను." అంది నిర్లక్ష్యంగా.
"మల్లె పూవులా ఉన్న నన్ను చూస్తుంటే నీకు..." అంది మళ్ళీ తనే.
“ఉహుఁ! నువ్వు మల్లెపూపువి కావు. మొగిలిరేకుని. మత్తెకిస్తావు" నవ్వుతూ అన్నాడు. .
"నాగుపాములా కాపలా ఉంటావా? కాటు వేస్తావా?నీకు మనుష్యులు మీద నమ్మకం పోయింది కాబోలు!
“పోవడానికి నాకు నమ్మకం అనేది ఎప్పుడూ లేదు."
అతని మెత్తదనం చూసి ఆమెకు ధైర్యం వచ్చిందీ కాబోలు నిర్భయంగా మాట్లాడేస్తోంది.
“సరే! నువ్వేదైనా అనుకో! నేను బయటికి వెళ్ళి తినడానికేదైనా తెస్తాను. అదిగో బాత్రూం . శుభ్రంగా స్నానం చెయ్యి" వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ తలుపు దగ్గరగా వేసాడు. తాళం వేసిన చప్పుడు వస్తుందేమోనని చెవులు రిక్కించింది. ఊహూ! వినపడలేదు. చుట్టూ చూసింది. పక్కనే స్టూలుమీద ఒక డ్రెస్ కొత్తది పెట్టి ఉంది. స్నానం చేసి వేసుకోవడానికి కాబోలు. ఒకటే గది కాని పెద్దది. పైగా పక్కనే బాత్రూం . లేచి వీధి తలుపు తెరచి చూసింది. చల్లనిగాలి ముఖాన్ని కొట్టింది. వెళ్ళిపోతే... ఒక్క క్షణం ఆలోచించింది. ఎక్కడికి? మళ్ళీ ఆ గ్రూపు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. బ్రతుకులో తేడా ఏం ఉండదు. కొత్తగా ఏదో పోగొట్టుకుంటానన్న భయం లేదు. ఎందుకు తెచ్చాడు? అంత వానలో, అంత వానలో,అంతా చీకట్లో...ఎందరి కళ్ళోకప్పి...
ఆఁ! ఆలోచించేదేముంది? చూద్దాం! స్నానం చేద్దామా? వద్దా? అనుకుంది. ఒళ్ళంతా చిరాకుగా ఉంది. చేస్తే పోలా? అనుకుంది. తలుపు గడియ పెట్టింది. డ్రస్, టవలు తీసుకుంది.
(సశేషం)
No comments:
Post a Comment