పల్లె కన్నీరు పెడుతోందో - అచ్చంగా తెలుగు

పల్లె కన్నీరు పెడుతోందో

Share This
పల్లె కన్నీరూ పెడుతుందో ...
కుందుర్తి స్వరాజ్య పద్మజ 


హైవే మీదుగా అతి స్పీడుగా ప్రయాణిస్తున్న మా కారు కాస్త నెమ్మదించికుడివైపుగా తిరిగి ,నెమ్మదిగా మావూరి బాట పట్టింది. మావూరొచ్చి దాదాపుపదిహేనేళ్ళవుతోంది .పిల్లలు కాస్త పెద్దచదువులకు రాగానే పట్నం చేరిన సంసారం.నెమ్మదిగా చదువులయ్యి ఉద్యోగాల్లోకి వచ్చాక ,అక్కడే స్థిరపడిపోయి ఇళ్ళూవాకిళ్ళూ ఏర్పరచుకోని పట్నాలకు పరిమితమయ్యాం. అప్పుడప్పుడూ పండక్కో,పబ్బానికో రావడమే ....ఇంక మా మామగారు పొయేక ,అత్తయ్యను మాతోతీసికెళ్ళటం వల్ల ఎప్పుడో పంటడబ్బులకోసం రావడమే ....ఆవిడ కాలం చెసేకపొలాలు కౌలుకు తిసుకున్నవాళ్ళు ప్రతీ సంవత్సరం ఏదో వంకతో కౌలు డబ్బులుఇవ్వకపోవటం ,ఒకవేళ ఇచ్చినా సరిగ్గా పండలేదుబాబూ ...అంటూ సగమే ఇవ్వటంఇవన్నీ విసుగొచ్చి ....ఇక్కడే వుంటున్న ఈయన తమ్ముడి వరసయ్యే మాధవరావుకుచౌగ్గా అమ్మేశాం .అందువల్ల పల్లెతోఅనుబంధమే పోయింది .ఇంక పిల్లలూ విదేశాల్లోస్థిరపడి మమ్మల్ని కూడా అక్కడే ఉండిపొమ్మని గొడవచేయడంతో మనవలూమనవరాళ్ళ కోసం అక్కడే ఉండిపోక తప్పింది కాదు. తిరిగి ఇంతకాలానికి మధవరావుకుతురిపెళ్ళంటూ కార్డు పంపించాడు. నాకూ ఏదోవంకతో ఇండియా ఎప్పుడువద్దామాఅని ఒకటే బెంగ పట్టుకుంది .అవసరమూ అవకాశమూ కలిసొచ్చాయి కనుక పిల్లలనిఒప్పించి ఇండియా వచ్చాము .ఒక రెండునెలలు ఇక్కడేవుండి బంధువులనీస్నేహితులనీ కలిసి వెళ్ళాలని ఆలోచన .కారు మలుపు తిరుగుతూనే ఏదో తేడాఅనిపించసాగింది నా మనసుకు ,ఇది మనూరి దారేనా !!...లేకపోతే ముందుకువచ్చామా !!కాసేపు అర్ధం కాలేదు .ఎందుకంటే .....మలుపు తిరగగానే ఎదురుగాఎంతో విశాలం గా పరచుకుని ....కింద పెద్ద అరుగుతో అమ్మతల్లిలాగా వుండేమర్రిచెట్టు కనిపించలేదు .అక్కడంతా ఖాళీగా ఉంది .ఒక చిన్న పొడవాటి రేకుల షెడ్డూ,దనికింద ఒక నాలుగు సిమెంట్ బెంచీలూ ఉన్నాయ్ .ఆ నాలుగు బెంచీలమీదాకూర్చొగా మిగిలిన వాళ్ళందరూ ఊసురోమంటూ ఎండలో నిలబడి ఉన్నారు .అప్పట్లోరోడ్డు మీదనుంచి బస్సు దిగగానే చల్లని ఆచెట్టు నీడకింద నిలబడే వాళ్ళం .మస్తానుసాయిబుదో ,కరీముదో గుర్రంబండి వచ్చేదాకా .మరీ దాహం వేస్తే వెంకయ్య బండిదగ్గరచల్లని గోలీసోడా ....నీళ్ళుచల్లి చల్లబరచిన గోనె పట్టకింద నించి తీసి ...క్రీచ్ ...మనేసౌండు తో కొట్టి ఇచ్చేవాడు .ఆ పదిపైసలు కూడా లేనివాళ్ళు పెద్దిరెడ్డిగారిచలివేంద్రంలో ...చల్లగా కుండలో నీళ్ళు ,వాళ్ళ బుడ్డజీతగాడు అబ్బులు పొడవాటిగరిట లాంటి దానితో సత్తు గ్లాసునిండా పోసి ఇస్తే గ్లాసు పైకెత్తి గటగటా తాగేవాళ్ళు.దూరంగా డొంకదారిలో గుర్రం కాలిగజ్జెల చప్పుడు లయబద్ధంగా వినిపించేది,మర్రిచెట్టుమీది పిట్టల కిల కిలల తో పాటు గా .దగ్గరికెచ్చేశానోచ్ ....అన్నట్లుగా కరీము,కదిలే బండి చక్రాల ఆకులమీద చర్నాకోల రాపాడిస్తూ టక టకా మని తమాషాశబ్దమేదో చెసేవాడు .అందరూ సామాన్లు అన్నీవున్నాయో లేదో లెక్కపెట్టుకుని రడీగాఉండేవాళ్ళు .పెద్దింటి వాళ్ళు ఎవరైనా ఉంటే ....ముందు నువ్వు వెళ్ళమ్మా మేమువెనక బండిలో వస్తాంలే అని సర్దుకునే వాళ్ళు. ఒకరిమీద ఒకరం లాగా పదిమందికూర్చుని ఆ గతుకుల్లో ఒకరిమీద ఒకరు పడుతూ ....ఆ డొంకలో మూడు మైళ్ళుప్రయాణించి ఊరు చేరేవాళ్ళం .ఆ పరిసరాలు ఇప్పుడు చూడగానే కొత్తగా ......ఏదోలోటుగా అనిపించసాగింది నాకు .
             కారు గతుకులు లేకుండా మెత్తగా పోతోంది .ఈమధ్యనే వేయించినట్టుగాతారు రోడ్డు నల్లగా తాచుపాములా మెరుస్తోంది .దూరం గా పచ్చని పొలాల మధ్యగానల్లగా గంభీరంగా నిలబడి ఉండే మావూరి కొండని చూడటం భలే ఇష్టం నాకు.ఎడమపక్కకు తిరిగి చూస్తూనే ఉలిక్కి పడ్డాను .అంత ఎత్తైన కొండ కూడా ఇంద్రుడివజ్రాయుధపు దెబ్బేదో తగిలినట్లుగా సగానికి విరిగి పోయి ఉంది !!...పక్కల అంతాకొట్టేసి సగం మాయమయి !!చిన్న రాళ్ళ గుట్టలా అనిపిస్తోంది !!అందమైన వర్ణచిత్రంకనులముందే కరిగిపోయినట్లు అనిపించింది .ఈ సమయానికి మాఊరి వరి పైర్లుమంచి పొట్టమీద ఉండేవి .ఆకుపచ్చరంగులో నలుపుకలిసినట్లుగా మంచి బాటిల్ గ్రీన్తివాచీ పరచినట్లు ఉండేది .........ఇప్పుడు రోడ్డు కిరువైపులా పత్తి ,పొగాకు లాంటివ్యాపార పంటలూ ,అకకడక్కడ కూరగాయల మడులూ కనిపిస్తున్నాయి .కొంతమందిసం రక్షణ అవసరం లేని సుబాబుల్ మొక్కలు కూడా వేసారు ఇవి మధ్య మధ్యలోగుబురుగా అడవుల్లాగా అనిపిస్తున్నాయ్ ..
వీస్తున్న పైరగాలిలో కూడా ఏదో క్రిమిసం హారక మందుల  వాసన .......ముక్కుపుటాలుపగిలిపోతున్నాయ్ .పల్లెగాలి పీలుద్దామని ఆశగా కారు విండో తీసిన నేను చప్పునమూసేసాను ముఖం చిట్లించుకుని .నా వాలకం చూసిన మావారు చిన్నగానవ్వుకోవడం నా దృష్టిని దాటిపోలేదు .ఎందుకంటే ఇంట్లో మా మనవలకు నేనుగొప్పగా చెప్పే పల్లెటూరి ముచ్చట్లు రోజూ వింటూ ,"మా సొంతవూరు ......ఆవూరిగురించి నాకే ఇన్నివిషయాలు తెలియవ్ !!కోడలివి ...!ఇవన్నీ ఎప్పుడు చూసావ్ ?అయినా మరీ గొప్పలు పోతున్నావ్ అంతలేదు !!"అని నన్ను వెక్కిరిస్తూ ఉండేవారు.ఈ రోజు నా మొహంలోనే మనసు చదివేసినట్టున్నారు .....అందుకే ఆనవ్వు .చిన్నచప్టా వుండే పెద్దకాలవమీద మంచి బ్రిడ్జ్ కట్టారు .కాలవదాటి కొంచెం ముందుకువెళ్ళగానే పూరి గుడిసెల స్థానంలో మంచి సిమెంటురోడ్లతో గవర్నమెంటు పేదలకుకట్టిచ్చిన కాలనీ చిన్న చిన్న ఇళ్ళతో ఇళ్ళముందు పూలమొక్కలతో కనిపించింది.చూడటానికి కూడా చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్ళేకొద్దీ ..పెంకువసారాలస్థానంలో అందంగా కట్టబడ్డ చిన్న చిన్న డాబాఇళ్ళు కనిపించాయి పొలాలకు వెళ్ళితిరిగివస్తున్న పశువులూ ,ట్రాక్టర్ ల హారన్ మోతలతో వూరు హడావుడిగాఅనిపించింది .ఇంకా నాలుగు రోడ్ల కూడలిలో రకరకాల చాట్ బండ్లూ ,బజ్జీలూ గారెలూవెసే చిన్న చిన్న హోటల్సూ ,కూల్డ్రింక్ షాపులూ వున్నంతలో ఇక్కడకూడా సెంటర్బిజీగానే అనిపించింది .
        కారునెమ్మదిగా మాధవరావ్ ఇంటిముందు ఆగింది. ఇంటిముందు వేసినషామియానా చూస్తూనే నాకేదో గా అనిపించింది. నా మనసు ఊహించిన పచ్చనితాటాకు పందిరీ ,దానికి అటూ ఇటూ స్వాగతం పలుకుతున్నట్లు గెలల తో కూడినఅరటి చెట్లూ ,ఊహించిన మనసు కాస్త చిన్నబోయింది. ఎదురొచ్చిన మాధవరావ్"రండి వదినా ....ఎలా ఉన్నారూ ప్రయాణం బాగా జరిగిందా ?"అంటూ ఇంట్లోకితీసుకుని వెళ్ళాడు .ఫ్రిజ్ లోంచి తీసిన కూల్ డ్రింకూ ,చల్లని మంచినీళ్ళూ ఇచ్చింది,మాధవరావ్ భార్య హేమ "బాగున్నారా అక్కయ్యా ....పిల్లలూ ,మనవళ్ళూ క్షేమమేనా..."అంటూ పలకరించింది. ఆమెకు సమాధానం చెబుతూ మంచినీళ్ళు మాత్రం తాగికూల్ డ్రింక్ పక్కన పెట్టేసాను. "పెళ్ళికూతురేదీ ....?పిలువు చుద్దాం ..,ఎప్పుడోచిన్నప్పుడు చూశాను ."అంటూ అడిగాను ."ఫేషియల్ చెయించుకోవటానికి పార్లర్ కిపట్నం వెళ్ళింది అక్కయ్య ....వచ్చేస్తూ ఉంటుంది ఈ పాటికి మీరు స్నానం చెస్తారా...ప్రయాణం చెసి వచ్చారు కద .."అంటూ వెనక పెరడువైపు తీసుకెళ్ళింది. వెనకబండపరుపుతో శుభ్రంగా ఉంది పెరడు. మేము ఉన్నప్పటి సపోటా ,బాదం ,మునగ,కుంకుడు లాంటి చెట్లేవీ లేవు !!కనీసం పూలమొక్కలు కూడా లేవు .మేము ఉండగాగోడమీదుగా రెండువైపులా ఎగబాకి అందంగా విరబూసే మల్లె ,జాజి పందిర్లు కూడాలేవు. కాసే పటికి మాధవ రావు ఒక కుర్రాడ్ని పరిచయం చేస్తూ "మా అబ్బాయి సురేష్వదినా ....డిగ్రీ చదివి ఇక్కడే ఏదో ఫాక్టరీ పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతానికి మనకొండకింది క్వారీ లీజుకు తీసుకుని నడుపుతున్నాడు  "అని పరిచయం చేసాడు.నవ్వుతూ "నమస్తే పెద్దమ్మా ...బాగున్నారా అని పరిచయం చేసుకున్నాడు .వాకిట్లోఅతని కోసం చాలా మంది కూర్చుని వుండటం గమనించాను .వాళ్ళందరూ అతనిక్వారీ లో పనిచెసే పనివాళ్ళు ....వారాంతపు కూలి బట్వాడా కోసం ఎదురుచుస్తున్నారు .వాళ్ళందరూగోల గోలగా ఏదో మాట్లాడుతూ కీసర బాసరగాఅరుచుకుంటున్నారు. వాళ్ళందరినీ సమర్ధిస్తూ సంతకాలూ వేలిముద్రలూ తీసుకుంటూడబ్బులు పంచుతున్నాడు సురేష్ .బైట కూర్చున్న ఆడవాళ్ళందరూ మొగుళ్ళుడబ్బులు తీసుకోగానే వాళ్ళవెంట డబ్బులకోసం ఆశగా వెళుతున్నారు వాళ్ళచేతులోకొంతడబ్బుపెట్టి మగవాళ్ళు హడావుడిగా ఎటో వెళ్ళటం .ఆడాళ్ళందరూ బాధగావాళ్ళను చూస్తూ మెటికలు విరవడం విచిత్రం గాగమనిస్తున్ననన్ను చూస్తూ ,"ఇవాళకూలీ దొరికింది కదాపెద్దమ్మా ...అందరూ బెల్టుషాపుకి ....ఆ కాసినీ. తాగటానికి...వెళుతున్నారు ."అన్నాడు సురేష్ .
            సాయంత్రం సందడిగా అరుగుల మీదకూర్చుని పిన్నీ ,పెద్దమ్మా అని పలకరించేమనుషులెవ్వరూ లేరు .ఇంట్లోకూడా ఎన్ని పనులున్నా సరే ...ఎవరి ఫావరెట్ సీరియల్వచ్చినప్పుడు వాళ్ళు మిస్ కాకుండా కూర్చుంటున్నారు టీవీ ముందు. మర్రోజుపెళ్ళికూతురిని చెసే పేరంటానికి కూడా ఎక్కువమంది రాలేదు ."ఇంకా నయం వదినా...పగలు కనుక ఈమాత్రం వచ్చారు .సాయంత్రం పేంటాలకు ఎవ్వరూ రావడం లేదీమధ్య .."అంది .పెళ్ళికూతురి తల్లి .బాగా చీకటి పడ్డాక వాకిట్లో ఒక ముసలిసన్ననిఆకారం ...అన్నం కోసం నిలబడటం చూసాను .....ఎవరా అని పట్టి చుస్తున్నా.......నన్ను ..తనుకూడా  గుర్తు పట్టడానికి  ప్రయత్నం చెస్తున్నాట్టూనిపించింది .ఇంతలోమాధవరావ్ భార్య ...ఇదుగో కరీమూ ...అంటూజోలెలో అన్నం పెడుతుంటేపేరు విని గుర్తు పెట్టాను ,గుర్రం బండి తోలే కరీంసాయిబు !!సాయిబూ ....ఎమిటిలా .....అంటూపలకరించాను .వార్ధక్యం వల్ల వంగిపోయిన నడుమూ ....తగ్గిపోయిన చూపూ ..వీటివల్ల  అతికష్టం మ్మీద గుర్తుపట్టే ప్రయత్నం చెస్తూ ...ఎవరూ ??అన్నాడు కళ్ళమీదచేతులుంచి .నేను .....పంతులుగారి కోడలిని గుర్తు చెసాను .అమ్మానువ్వా ...!! గుర్తుపట్టలేదు తల్లీ ....అన్నాడు .అయ్యో ఇదేమిటి కరీం ....నీ భార్యా ,పిల్లలూ ...అడిగాను."అటోలు వచ్చాక గుర్రాలు వెనకబడ్డై తల్లీ ....నాకడుకు సదువుకోని ..ఆటో లాభంఅనిజెప్పి ఆప్పుజేసి ఆటో కొన్నాడు ...బాగానే సంపాయించాడు ...కానీ రాజకీయంపిచ్చి పట్టిందమ్మా వాడికీ ....ఒక వర్గం కొమ్ముకాసి ....ఐదారెళ్ళనాడు గొడవల్లో...నరికేశారమ్మా ....ఆటో అప్పుకింద కట్టుకున్నారు. ముసిల్దికూడా మూడేళ్ళనాడుకొడుకుమీది బెంగతో కాలంచెసింది .నేనూ నా ముసలి గుర్రమూ ఉన్నాం .ఇంకా మాకురోజులు రాలా .."అన్నాడు. అయ్యో అదేంటి కరీం .....!!!అంటూఇంట్లో కెళ్ళిబాగులోనించి ఒక వెయ్యి రూపాయలు తెచ్చి ఇచ్చాను .ఎందుకమ్మా ...... వద్దంటూనేతీసుకున్నాడు కాసేపు కబుర్లు చెప్పి జీతేరహో బేటీ ...అని వెళ్ళి పోయాడు .
     నేనూ పెళ్ళి హడావుడిలో పడిపోయాను .ఈయన మాత్రం చిన్ననాటి స్నేహితులతోకాలక్షేపం చేస్తూ ....ఈ ట్రిప్ బాగానే ఎంజాయ్ చెస్తున్నారు .పెళ్ళి బ్రహ్మాండంగా చెశాడుమాధవరావ్. కానీ నాకే ఏదో అసంతృప్తి. ఇదివరకు మా ఆడపడుచు పెళ్ళి ఇక్కడేచెశాం .అది కేవలం మాయింట్లో పెళ్ళిలాగా జరగలేదు .ఏదో పల్లెలోని ఒక సామూహికఉత్సవంలాగా జరిగింది. ఒడియాలూ అప్పడాలూ చెయ్యడం దగ్గరినుంచి ,దూరంనించి వచ్చిన అతిధుల్ని వాళ్ళ ఇళ్ళలో ఉంచుకుని భోజనాలు పెళ్ళింట్లో చేసినా,స్నానాలూ పడకా ఏర్పాట్లు వాళ్ళ  ఇళ్ళలోనే ఏర్పాటు చెశారు సాయంగా .పెళ్ళిసందడి కేవలం మా ఇంట్లోనే కాకుండా ఊరంతా పరుచుకుంది. అందరిలో ఎగసిపడేఉత్సాహమేదో మాకు మరింత ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు లక్షల్లో ఖర్చుపెట్టి గొప్పగాచేసినా జనం గుమిగూడినట్లుగా ఉందేకానీ ,సంబరమేదో జరిగిన భావం కనపడలేదు.పిన్నమ్మ, బాబాయ్ ,అన్నా ,బావా వరసలన్నీ ఇప్పుడు మీరు నువ్వుగామారిపోయాయ్ .మనుషుల మధ్య కనపడని తెరలేవో స్పష్టంగా కనపడుతున్నాయ్.ప్రతీమాటకూ నేను అసహనంగా "ఆప్పుడైతే అలా జరిగేది .....ఇప్పుడిలా వుందేమిటీ...."అంటూ నాస్టాల్జిక్ గా మాట్లాడుతున్న నన్ను మొదటినుంచీగమనిస్తున్నాడనుకుంటా సురేష్ "ఏమిటి పెద్దమ్మా ?.....మీ బాధ ....పల్లెటూర్లంటే...మార్పు రాకూడదా ?...మీ చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలా ?......ఇన్నికబుర్లు చెబుతున్న మీరు ..ఇక్కడ ఎందుకు వుండలేదు ?....ఉద్యొగాల వంకతోనో...పిల్లల చదువుల వంకతోనో పట్నానికీ ..అక్కడినుంచి విదేశాలకూ వెళ్ళలేదూ....అభివృద్ధి ,మార్పూ ..మీకేనా ?మా పల్లెలకు అక్కరలేదా ?....ఇప్పుడు మీకుపల్లెటూరంటే అందమైన కల .....ఇక్కడే బ్రతుకుతున్న మాకు వాస్తవం. గ్లోబలైజేషన్తాలూకు మార్పులు అన్ని చొట్లా వున్నాయ్ మా పల్లెలేమీ మినహాయింపు కాదు.మంచీ చెడూ అన్నిచొట్లాఉన్నాయ్ ...సమాజంలో జరిగే మార్పులకు మేముఅతీతులం కాదు ."అని కాస్త గట్టిగానే వాస్తవం నొక్కి చెప్పాడు .నిజంగానేఅతనిప్రశ్నలకు నాదగ్గర సమాధానం లేదు .మౌనంగా వూర్కున్నాను  .
  
మధవరావ్ ఇంట్లో శలవు తీసుకుని ,అతని భార్య బొట్టుపెట్టి ఇచ్చిన బట్టలూ,పండ్లూ పసుపుకుంకుమలు తీసుకుని హైదరాబాదు కు ప్రయాణమయ్యాం .ఇక్కడికివచ్చేటప్పుడు ఉన్న హుషారూ ఉత్సాహం ఇప్పుడు నాలో లేవు .ఊరి చివరకు రాగానేవిశాల మైన హైస్కూలు ....దానికి దగ్గర్లోనే ... కటకటాల లాంటి గ్రిల్స్ తో ఏర్పాటుచేయబడిన  బెల్టు షాపు కనిపిస్తోంది .దాని చుట్టూ గుమిగూడిన వారిలో ఎక్కువగాకనబడుతూ యువకులు !!......మనసేదో చెదుమాత్ర తిన్నట్టు ....దూరంగా మలుపులోవిరిగి పోయి ...శిధిలమై పోయిన కరీం సాయిబు గుర్రం బండి !!పచ్చ పచ్చని నా స్వప్న సౌధమేదో మసకబారి పోయినట్లు ...పచ్చని అమ్మతల్లి లాంటి మర్రిచెట్టు లాగా కూకటివేళ్ళతో పెకిలించినట్లు ....అబివృద్ధి అంటే ఇదేనా !ప్రయాణీకులకు షెల్టర్ కట్టాలంటేచెట్టుని కూల్చాలా ?...ఇదేనా అభివృద్ధి ?దీని ఫలితం మనుషుల్లో అంతరాలుపెరగటమేనా ??ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే తన అస్థిత్వాన్ని కోల్పోవాలా?.....ఇక్కడి రాకపోయినా బాగుడేదా ??నామనో చిత్రం లోని పచ్చని పల్లె అలాగేబ్రతికుండేదా ?నా మనసులో ఒకదానివెంట ఒకటిగా భావతరంగాలు .....అదిమిపెట్టినా ఆగకుండా ....చెలియలికట్ట దాటి కన్నీటి బొట్లుగా .......
                                       ***

1 comment:

  1. రచయిత్రి మనసులో కొన్ని వాస్తవాలున్నాయి, కొన్ని ఊహలున్నాయి.!
    చివరకి 'సురేష్' చెప్పిందే వాస్తవం.!
    ఎక్కడైనా మార్పు అనివార్యం.!
    దాన్ని ఆహ్వానించాలే కాని గాభరా పడకూడదు.!
    అంత గాభరా పడేవాళ్ళే ఉంటే, గాభరా పడడం మానేసి సమాజ సేవలో మునగాలి.!
    ఇది మాత్రం చేయరు కాని 'అలా అయ్యింది, ఇలా అయ్యింది' అంటూ మాటలు చెప్తారు.!
    కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నది జగమెరిగిన సత్యం.!

    ReplyDelete

Pages