సీత చెప్పిన కధ - అచ్చంగా తెలుగు
సీత చెప్పిన కధ.  
ఆదూరి హైమావతి 

సాయంకాలం వాడుకప్రకారం పార్క్ లో కూర్చుని, పేపర్ చదువుతున్న నాదృష్టి  ఒకవార్తపై పడింది. అమేరికాలో ఒకవిద్యార్ధి  ముందుగా టీచర్నూ, ఆతర్వాత కొందరు పిల్లలనూ కాల్చిచంపాట్ట ! మరో విద్యార్ధి తనక్లాస్లో ఒక అమ్మాయి గొంతు తనకు వినను బావులేదని, స్కూల్ బ్యాగ్ లో పిస్టల్ ఉంచుకుని వచ్చాట్ట, ముందుగా దాన్ని గమనించిన టీచర్ అది తీసిదాచి ,’ఎందుకుతెచ్చావని’ అడిగితే చెప్పా ట్ట!  
            అమేరికాలో ఈ తుపాకులు ఆటబొమ్మలు కొన్నట్లుకొని ఉంచు కుంటారంతా, అదే మంటే సేఫ్టీ కోసమనిట! ఎంతదారుణం !'అని బాధపడుటుండగా, పార్క్  లో ఆడుతున్న పిల్లలనుంచీ పెద్దగా అరుపులు కేకలూనూ. 
    గబ గబా అటుకేసి నడిచాను. ఎవరో ఒకపిల్లడు ఒక కత్తి తెచ్చి ఆటలో ఓడి పోయిన కోపంతో, ఎదుటి జట్టు వారిని పొడిచేస్తానని పై కెళు తున్నాడు!! అక్కడేఉన్నకాపలాదారు సమయానికి అడ్డుకుని ఆకత్తి దాచేశాడు. 
   మెల్లిగా వచ్చి నా బెంచ్ మీదకూర్చున్నానన్నమాటే గానీ  నా మనస్సు  బాధతో గట్టున వేసిన చేపలా తన్నుకుంటున్నది.
'అసలు పేరెంట్స్ పిల్లలకు కత్తులూ, తుపాకులూ ఆటవస్తువులుగా ఇవ్వటాన,వారు ఆటల్లోఎదుటి వారిని కాలుస్తున్నట్లు  భయపెట్టడం, వారి మనస్సుల్లో నిజంగానే కోపంవస్తే కాల్చేయాలనే భావనమొలకెత్తే ప్రమాదంఏర్పడుతుంది.
    ఈసమాజం ఎటువెళ్తున్నదో తెలీడం లేదు. రోజూ పార్కులోకలిసే నా స్నేహితుడు నాగేశంవచ్చి నాపక్కనే కూర్చున్నాడు. 
విచారంగా ఉన్న నాముఖాన్ని చూస్తూ" ఈరోజు నాక్కాస్త ఆలస్యమైంది మిత్రమా!,ఇదిగో ఈ రామాయణంలోని ఈఘట్టాన్నిచదువుతూ కూర్చుండి పోయాను. 
    ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి. మీరూ చదవండి"  అంటూ తన చేతిలోని ఆపొత్తం నా చేతికిచ్చాడు. సరే మనస్సూ కాస్త తెప్పరిల్లుతుందని తీసుకుని ఆయన చూపిన పేజీ నుంచీ చదవసాగాను.
                                              *****
అరణ్యవాసంలో శ్రీరాముడు, సీతా లక్ష్మణ సమేతుడై చిత్రకూట పర్వతంపై  పర్ణశాల నిర్మించుకుని నివసించసాగాడు. నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామీ ప్రతినిత్యంలాగే ఆ రోజూ అడవిలో లభ్యమయ్యే పండ్లూ ఫలాలూ ఏరి తేవడం కోసం సమాయత్తమయ్యారు .రామభద్రునికి,  లక్ష్మణునికీ వారి ధనుర్భా ణాలు అందజేస్తూ సీతమ్మ చిఱు నవ్వు నవ్వింది.
   “దేవీ!నీవు అకారణంగా నవ్వవు. విషయమేమి? " ఆసక్తిగా  అడిగాడు  రాముడు. 
“ప్రభూ!మరేంలేదు ,మీరు అరణ్య వాసానికి వచ్చారు కదా! ఎవరితోనో యుధ్ధానికి తయారై వెళుతున్నట్లు ఈ విల్లంబులూ బాణాల పొదలూ ఇలా ప్రతి రోజూ ధరించి వెళ్ళడం  ఎందుకాని?’నవ్వొచ్చిందంతే! "చిఱునవ్వుతో చెప్పింది సీతమ్మ. 
    “ఓహ్ అంతేకదా! స్వీయరక్షణకు అనుకోవచ్చుగా సీతా!” సమాధానంగా అన్నాడు రామయ్య.
"కావచ్చు, కానీ సర్వఙ్ఞులైన మీకు తెలీంది కాదు కానీ ,నేను బాల్యం లో  , ఆయుధాలు ధరించి ఉండటం వలన జరిగిన అనర్ధాన్ని గురించి విన్న ఒక కధాంశం గుర్తుకు వస్తున్నది, తమరు అనుమతిస్తే చెప్పాలని ఉంది, " అంది సీతమ్మకమ్మని స్వరంతో. 
       ఒకింతదూరంలో ఉన్న లక్ష్మణుడూ ,ఆమె చెప్పనున్న కధాంశాన్ని వినను కుతూహల పడుతున్నాడు.    చెప్పమన్నట్లు తల ఊచి అక్కడే ఉన్న అరుగుపై  ఆసీనుడయ్యాడు రఘురాముడు. సీతమ్మా ఆయనకు ఎదురుగా ఉన్న మరో చిన్న బండ రాతిపై  సుఖాసీనురాలై చెప్పసాగింది. 
లక్ష్మయ్యా చెవులురిక్కించాడు.
     “పూర్వం ఒక ఋషి తీవ్రమైన తపస్సుచేయ సాగాడు. ఆయన తపోమహిమ ఉష్ణరూపంలో స్వర్గలోకాన్ని చేరి,దేవేంద్రుని  భయ పెట్టింది. దేవేంద్రుడు తన పదవికి  భంగం వాటిల్లు తుందనే భీతితో, బాగా యోచించి ఒక పధకం పన్నాడు.  దానిని అమలు  చేయను తాను  ఒక బ్రాహ్మణ రూపంలో, పదునైన తళతళ లాడే ఒక పొడవైన కరవాలాన్ని జాగ్రత్తగా ఒరలో ఉంచి చేతబూని ఆఋషి వాటికను చేరాడు.
      ఆ ముని పుంగవులు విశ్రాంతి పొందేవేళ కై మాటు వేసి ఉండి, ఆయన ధ్యానంచాలించి కళ్ళుతెరచి నంతనే సమీపిం చాడు.
     " పాహి పాహి ఋషీశ్వరా! రక్షరక్ష "అంటూపాదాలపై బడిశరణు వేడాడు. 
   మందస్మితవదనంతో దయా మయుడైన ఆఋషి " వత్సా!ఏమి నీకు వచ్చిన ఇక్కట్టు? ఆలసించక చెప్పు, నీఇబ్బంది తప్పక తీర్చే ప్రయత్నంచేస్తాను."అని అభయమిచ్చాడు.
   " మరేంలేదు స్వామీ! నేను కార్యర్ధినై దూరప్రాంతం వెళుతున్నాను.  నాఈ కరవాలం నాపయనానికి పెద్ద సమస్యగా ఉంది. దీన్ని జాగ్రత్త పరచను ఎవ్వరూ లభించక మిమ్ముఆశ్రయించాను. దీని పదును తరుగ కుండా ప్రతినిత్యం తైలం అద్ది తుడిచి శుభ్రపరచి ఒరలో ఉంచాలి. మీకుశ్రమ ఇస్తున్నందుకు మన్నించండి మునీంద్రా!. " అంటూ వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు.   
            వచ్చినవాడు దేవేంద్రుడనీ, అతడి అభ్యర్ధనవెనుక దాగున్న మర్మాన్నీ , తనకు రానున్న ప్రమాదాన్నీ గుర్తించలేని ఆ ఋషీశ్వరులు మందస్మితవదనంతో ఆ బ్రాహ్మణునిచూశారు. 
"అదెంత భాగ్యం? లోకోపకారమే కదా మా ధర్మం! తప్పక నీకరవాలా న్ని మాఆశ్రమంలో ఉంచి వెళ్ళిరా బ్రాహ్మణోత్తమా!" అని బ్రాహ్మణ రూపంలో ఉన్న దేవేంద్రుని పంపాడు.
  ప్రతిరోజూ స్వయంగా ఆకరవాలాన్ని ఒరలోంచీతీసి తైలం అద్ది శుభ్ర పరచి మెత్తని వస్త్రంతో తుడిచి తిరిగి దాన్ని ఒరలో ఉంచడం ఆ ఋషీశ్వరుని దినచర్యలో భాగమైంది.            
   కొంత కాలానికి తాను ఇచ్చిన మాటమేరకు దాన్ని చక్కగా శుధ్ధి చేశానో లేదో  అన్న భావనమనస్సులో దూరి కరవాలాన్ని తీసి చూడటం, పదును పరీక్షించడం మొదలెట్టాడు. అతడి తపస్సు, ధ్యానం అటకెక్కాయి. 
  మనస్సంతా ఆకరవాలం మీదే! కొంత కాలమయ్యాక ఆకరవాలాన్ని చేత్తో పట్టుకుని నడిస్తే ఎలా ఉంటుందోని తన హస్తంలో ధరించి నడవ సాగాడు. 
   ఒకదినం అతడి కరవాలం తగిలి ఒక చిన్న మొక్క మధ్యకు తెగి పోయింది. ఆఋషి " ఆహా! కరవాలం తగులగానే మొక్క తెగి పోయిందంటే దానికి పదును చక్కగా ఉంది, మరి ఈ వృక్ష శాఖ తెగుతుందేమో చూద్దా”మని తలచి ,ఒక వృక్ష శాఖను నరి కాడు. ఒక్క వేటుతో అదితెగిపడింది.
  ఆమునివరునికి ఎంతో ఆనందమైంది. అలా ఆ అడవిలోని మొక్కలు, వృక్షశాఖలను నరక సాగాడు, క్రమేపీ ఎదురైన జంతువులనూ, క్రమ క్రమేపీ అడవిలో కనిపించిన మానవులను సైతం నరికి నర హంత కునిగా మారి పోయాడు. అతడి ధ్యానం, తపస్సు అన్నీ నశించి, ఒక క్రూరునిగా తయారై, మృత్యువు అనంతరం యమ లోకాన్ని చేరాడు. ---- 
   ఆయుధాలు ధరించి ఉంటే జరిగే అనర్ధాన్ని నేను ఈకధాంశం వల్ల విన్నందున మీరు ఈ అరణ్య వాసంలో ఈధనుస్సు, బాణాలూ ధరిం చవలసిన అవసరం ఉందాని నాచాపల్యం కొలదీ అడుగుతున్నాను." అంది సీతమ్మతల్లి.   
" నీసందేహం  వాస్తవమే కానీ నేను వనవావాసం పేరుతో వచ్చింది , యదార్ధానికి రాక్షస సంహారం కోసం కానీ ,అడవుల్లో నివసించను కాదు సీతా!అందు వలన ఈ ధనుర్బాణాలు ధరించ వలసిన అవ సరం ఎంతై నాఉంది." అని ఆమె సందేహ నివృత్తి చేశాడు రామ చంద్రుడు. అంతా విన్న  లక్షమణుడూ చిరునవ్వునవ్వాడు.
                                          &&&&
    ఆ రామాయణ ఘట్టం చదివాక నా మనస్సుకేదో స్పురించింది .‘రానున్నకాలంలో ఆయుధాలు ధరించి సామాన్య మానవులు  తోటి వారిని ఎలా సంహరిస్తారో,ఆయుధధారణ ఎంత అనర్ధమో ముందుగా తెలుపనే  సీతమ్మ నోట   రామచంద్రుడే  ‘భవిష్యవాణి’ పలికించాడేమో అనిపించింది. యుగాలు మారి కలియుగం ప్రవేశించడంతో, విశ్వ వ్యాప్తంగా ఆయుధకర్మాగారాలు  వెలిసి, ఆయుధాలు మానవుల చేతుల్లోకి వచ్చి ప్రళయం  సృష్టించ బడుతున్నది. పిల్లలుసైతం ఆట వస్తువులుగా కత్తులు, తుపాకులూ  పట్టుకుని " షూట్ " చేస్తాననడం పరి పాటైంది. ఇహ బాంబుబ్లాస్టర్స్ లోవందల మంది అమాయకులు బలై పోడం ఇహ అమేరికా వంటి దేశాల్లో ఆయుధాలు కలిగి ఉండే హక్కు పౌరులందరికీ ఉన్నందున ఇలా కాల్చి చంపుకోడం జరుగు తున్నది.      
   ఆయుధాలు ఉండటం వల్లే కదా ఈ అనర్ధ మంతా.! అందుకే రామాయణ కాలంలోనే సీతమ్మనోట 'ఆయుధాల'మాట చెప్పిం చాడు పరమాత్మ. ఇంకా రానున్న కాలంలో ఎలాంటి ప్రమాదాలు ఆయుధాల వలన పొంచి ఉన్నాయో అనే భీతి  నన్ను పీడించినా ‘రామాయణంలోని  ఘట్టాన్ని చదివాక , రామాయణం సర్వకాలాల్లో మానవుకల ఆ దర్శ గ్రంధం ఎలా ఐందో, ఎన్నిసామాజిక  నీతులు దీనిలో దాగి ఉన్నాయో ,అనే నిజం స్పురించి ఆగ్రంధాన్ని కళ్ళకద్దుకుని నాగేశాని కి ఇచ్చేశాను. 
***             

No comments:

Post a Comment

Pages