శ్లో: 86. మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే
చిరా దన్త శ్శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా ll
తా: అమ్మా! పార్వతీ దేవీ ! పొరపాటుగా నీ భర్త అయిన శివుడు నీ వద్ద గంగ పేరు ఉచ్ఛరించి కలవరపాటున ఏమిచేయవలెనో తోచక నీకు నమస్కారము చేసిననూ భర్తను నీ పాదపద్మముతో తాడనము చేయగా, చిరకాలముగా శత్రువుగా ఉన్న మన్మధుడు నవ్విన నవ్వు నీ కాలి అందెల చప్పుడుగా వెలువడెను, కదా !
శ్లో: 87. హిమానీ హన్తవ్యం హిమగిరినివాసైక చతురౌ
నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ
వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజన్తౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్ ll
తా: అమ్మా! మంచుపర్వతము నందు నివశించుట యందు మిక్కిలి నేర్పు గల నీ పాదములు రాత్రి యందునూ, తెల్లవారుఝామున యందునూ నిర్మలముగా ప్రకాసించుచూ నీ భక్తులకు లక్ష్మిని ప్రసాదించుచూ, మంచుచే నసించునవియు, అర్ధరాత్రి ముడుచుకుని పోవునవియు లక్ష్మీదేవి కి నివాసము అయిన పద్మములను జయించుచున్నవి కదా. ఇందు వింత ఏమియు లేదు.
శ్లో: 88. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం
కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయామానేన మనసా ll
తా: అమ్మా! పార్వతీ ! కీర్తులకు నెలవయిన ఆపదలను దరి చేర నీయని నీ పాదముల పై భాగమును కవి శ్రేష్ఠులు తాబేలు వీపు చిప్పతో ఎట్లు పోల్చినారు? వివాహ సమయమున దయకలిగిన హృదయము కల ఈశ్వరుడు తన చేతులతో ఎత్తి సన్నికల్లు మీద ఎట్లు ఉంచినాడు?
శ్లో: 89. నఖై ర్నాక స్త్రీణాం కరకమలసజ్కోచశశిభి
స్తరుణాం దివ్యానాం హసత ఇవ తే చణ్డి చరణౌ
ఫలాని స్వస్థ్సేభ్యః కిసలయకరాగ్రేణ దధతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియ మనిశ మహ్నాయ దదతౌ ll
తా: అమ్మా! చండీ అను నామముతో ప్రసిద్ధిగాంచిన నీవు చిగురుటాకుల వంటి చేతులతో స్వర్గలోక వాసులయిన దేవతల కోర్కెలను తీర్చు కల్పవృక్షములను, సర్వలోకముల యందు ఉండు దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చు నీ పాదములు దేవతా స్త్రీల పద్మములవంటి చేతులను ముడుచుకొనునట్లు చేయు గోళ్ళను చంద్రుల చేత పరిహాసము చేయునట్లు ఉన్నవి . కదా!
శ్లో: 90. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ
మమన్దం సౌందర్యప్రకరమకరన్దం వికిరతి
తవాస్మిన్ మన్దార స్తబకసుభగే యాతు చరణే
నిమజ్జన్మజ్జీవః కరణచరణై ష్షట్చరణతామ్ ll
తా: అమ్మా! భగవతీ! దీనులకు వారి వారి కోర్కెలకు అనుగుణముగా సంపదలు ఇచ్చు అధికమయిన లావణ్యము అను పూదేనెను వెదజల్లుచున్నదియూ, కల్ప కుసుమ పుష్ప గుచ్చము వలే సొగసైనదియు అగు నీ పాద కమలమునందు మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియ పంచకము అను ఆరు పాదములు కలవాడనయి తుమ్మెద వలె మునుగుదును గాక !
శ్లో: 91. పదన్యాస క్రీడాపరిచయమివారబ్ధుమనసః
స్ఖలన్త స్తే ఖేలం భవనకలహంసా న జహతి
అత స్తేషాం శిక్షాం సుభగమణిమఞ్జీరరణిత
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే ll
తా: అమ్మా! మనోహరమయిన చరిత్ర కలిగిన ఓ తల్లీ ! నీవు నడుచునప్పుడు నీ పాదముల మనోహరములయిన లయను నేర్చుకొనవలెనని నీ పెంపుడు హంసలు తొట్రుపాటు విడువకున్నవి. నీ పాద పద్మముల యొక్క అందెల శబ్దములు వాటికి పాఠము చెప్పుచున్నట్లుగా ఉన్నది. కదా !
శ్లో: 92. గతాస్తే మఞ్చత్వం ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః
శివస్స్వచ్ఛచ్చాయా కపటఘటిత ప్రచ్ఛదపటః
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృజ్గారో రస ఇవ దృశాం దోగ్ధికుతుకమ్.ll
తా: అమ్మా! దేవీ ! బ్రహ్మ విష్ణువురుద్ర ఈశ్వరులుఅను వేల్పులు నీకు మంచత్వమును పొంది యుండగా కప్పుకొను దుప్పటి లాగున ఉన్న సదాశివ తత్వము తెల్లని కాంతులు కలిగి నీకు ఆనందము కలుగ జేయుచున్నది .కదా!
శ్లో: 93. అరాళా కేశేషు ప్రకృతిసరళా మన్దహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహవిషయే
జగత్త్రాతుం శమ్భోర్జయతి కరుణా కాచిదరుణా.ll
తా: అమ్మా! జగన్మాతా! కురులయందు మాత్రమె వంకర కలిగి చిరునవ్వు నందు సహజముగానే చక్కదనము కలిగి మనస్సునందు దిరిసెన పూవు వలె మెత్త దనము కలిగి అందమయిన శరీరము కలిగి అనిర్వచనీయమయినదియు పరమ శివుని కరుణా స్వరూపమయిన అరుణ అను శక్తి లోకములను రక్షించు మహిమ కలదిగా ప్రకాశించు చున్నది. కదా !
శ్లో: 94. కళజ్కః కస్తూరీ రజనికరబిమ్బం జలమయం
కళాభిః కర్పూరై ర్మరకతకరణ్డం నిబిడితమ్
అతస్త్వద్భోగేన ప్రతిదిన మిదం రిక్త కుహరం
విధిర్భూయోభూయో నిబిడయతి నూనం తవ కృతే.ll
తా: అమ్మా చంద్రబింబము అనగా మరకతమణులచే నిర్మించబడిన పెట్టె. అందు నీవు రోజూ ఉపయోగించు పన్నీరు, కస్తూరి, కర్పూరము పలుకులు ఉంచి రోజూ ఉపయోగించుట వలన ఖాళీ అయిన వాటిని బ్రహ్మ దేవుడు మాటిమాటికి నింపును. కదా ఇది సత్యము.
శ్లో: 95. పురారాతేరన్తః పురమసి తత స్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరళకరణానా మసులభా
తథా హ్యేతే నీతాశ్శతమఖముఖాస్సిద్ధి మతులాం
తవ ద్వారోపాన్తస్ధితిభి రణిమాద్యాభిరమరాః.ll
తా: అమ్మా! నీవు పురారి అయిన పరమ శివుని పట్టపు రాణివి కావున, నీ పాదపద్మములను పూజించు భాగ్యము చపల చిత్తులకు లభించదు. అందువలన ఇంద్రాది దేవతలు ద్వారము వద్ద ఉన్న అణిమాది సిద్ధుల వలననే అభీష్టములు పొందిన వారైరి. కదా.
శ్లో: 96. కళత్రం వైధాత్రం కతికతి భజన్తేన కవయః
శ్రియో దేవ్యాః కోవా న భవతి పతిః కైరపి ధనైః
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యా మాసజ్గః కురువకతరోరప్యసులభః.ll
తా: అమ్మా! ఓ పతివ్రతా శిరోమణి! ఎందరెందరో కవులు సరస్వతీ దేవిని సేవింతురు? ఎందరో సంపదల వలన లక్ష్మీ దేవికి అధిపతులు అగును కదా. అమ్మా నీ ఉద్యానవనమున ఉన్న గోరింట చెట్టునకు కూడా నీవు పతితో కలసియే ఆలింగనము చేయుదువు కదా.
శ్లో: 97. గిరామాహుర్దేవీం ద్రుహిణగృహిణీ మాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీ మద్రితనయామ్
తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి.ll
తా: అమ్మా! పరమాత్మ యగు పరమ శివుని రాణి వగు ఓ తల్లీ, ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మదేవుని ఇల్లాలు అగు సరస్వతీ దేవిగాను , విష్ణువు సతియగు లక్ష్మీదేవి గాను శివుని సహచరి అయిన పార్వతి గాను చెప్పుచున్నారు. కాని నీవు యీ ముగ్గురు కంటే అపార మహిమ కలిగి సకల ప్రపంచమును మోహింప చేయు చున్నావు కదా.
శ్లో: 98. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్ధీ తవ చరణ నిర్జేజనజలమ్
ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా
కదాథత్తే వాణీముఖకమల తామ్బూలరసతామ్.ll
తా: అమ్మా! బ్రహ్మ విద్యను అర్ధించు నేను లత్తుక రసము కలుపబడిన నీ పాదోదకము ఎప్పుడు త్రాగుదునో కదా ! ఆ నీరు చెవిటి వారికి విను శక్తిని, మూగ వారికి మాట్లాడు శక్తిని ఇచ్చును కదా !
శ్లో: 99. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా
చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః
పరానన్దాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్.ll
తా: అమ్మా! నిన్ను సేవించు నీ భక్తుడు సరస్వతీదేవి, లక్ష్మి దేవి లకు ఇష్టుడయి వారితో విహరించుట వలన బ్రహ్మకు, విష్ణు మూర్తికి అసూయ కలిగించు చున్నాడు. మంచి అందముతో రతీదేవి పాతివ్రత్య భంగము కలిగించుచున్నాడు. అతడు చిరకాలము బ్రహ్మానందము అను సుఖమును పొందుచున్నాడు. కదా !
శ్లో:100. ప్రదీపజ్వాలాభి ర్ధివసకరనీరాజనవిధి
స్సుధాసూతే శ్చంద్రో పలజలలవై రర్ఘ్యరచనా
స్వకీయై రంభోభి స్సలిలనిధి సౌహిత్యకరణం
త్వదీయాభి ర్వాగ్భి స్తవ జనని వాచాం స్తుతి రియమ్ll
తా: అమ్మా! నీవు ఇచ్చిన వాక్కుల చేత నిన్ను స్తుతించుచూ చేయు వాక్కులు సూర్యునికి దివిటీల చేత నీరాజనము ఇచ్చుట వంటిది. ( అహంకారము త్యజించి సర్వమూ శ్రీ దేవి కరుణ అని శంకర భగవత్పాదులు ఈ స్తోత్రములను ముగించెను.)
ఇతి శ్రీ శంకర భగవత్పాదుల విరచిత సౌందర్యలహరి సంపూర్ణమ్.
ఏ తత్ఫలం శ్రీ లలితాపరమేశ్వరార్పణ మస్తు .
Super information really its great
ReplyDelete