శ్రీరంగనాథ క్షేత్రాలు - 2
శ్రీరామభట్ల ఆదిత్య
శ్రీరంగపట్నం {ఆది రంగం} ( మాండ్య జిల్లా, కర్ణాటక )
మూడు రంగనాథ క్షేత్రాలలో మొదటిది ఆది రంగమైన శ్రీరంగపట్నం. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉన్నది శ్రీరంగపట్నం. ఆధ్యాత్మికంగానే కాక చారిత్రకంగా కూడా చాలా ప్రసిద్ధమైనది ఈ క్షేత్రం. కావేరి నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన ద్వీపంలో ఉన్నది ఈ రంగనాథ ఆలయం. చూడడానికి దాదాపు త్రికోణాకారంలో ఉంటుంది ఈ ద్వీపం. 9వ శతాబ్దంలో కర్ణాటకను పాలించిన పశ్చిమ గంగ రాజవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 984వ సంవత్సరంలో రాజవంశీయుల సహాయంతో స్థానిక నాయకుడు తిరుమలయ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయశాసనాలు చెబుతున్నాయి. 12వ శతాబ్దంలో హొయసల సామ్రాజ్యాధీశుడైన విష్ణువర్ధనుడు ఈ గ్రామాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతకర్త అయిన శ్రీరామానుజాచార్యుల వారికి అగ్రహార రూపేణ దానం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత చాలా ఏళ్ళపాటు ఆలయ సంరక్షణ హొయసల రాజులే చూసుకున్నారు. తరువాత 18వ శతాబ్దంలో వొడయార్ రాజవంశీయులు ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు.
నాలుగు రాజగోపురాలతో, రెండు దీర్ఘచతురస్ర ప్రాకారాలతో, అద్భుతమైన శిల్పసంపదతో కూడిన గర్భగుడితో, నవరంగ మండపం, ముఖమండపాలతో కూడి ఉంటుంది ఆలయం. ఇక్కడి గర్భగుడిని హంబి అనే ఆలయనర్తకి నిర్మించినట్లుగా చెబుతారు. ఏడుపడగలతో ఉన్న ఆదిశేషునిపై శ్రీమహావిష్ణువు నిద్రిస్తున్నట్లుగా ఉంటుంది మూలవిరాట్టు. నారాయణుడి కాళ్ళను నొక్కుతూ కనిపిస్తుంది లక్ష్మీదేవి. నృసింహస్వామి, గోపాలకృష్ణుడు, శ్రీనివాసుడు, హనుమంతుడు, గరుత్మంతుడు మరియు ఆళ్వార్ల ఉపాలయాలు కూడా ఉన్నాయి.
నాటి మైసూరు సామ్రాజ్యానికి అంటే వొడయార్ రాజవంశీయులకైనా, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వంటి రాజులకు దాదాపుగా 17వ శతాబ్దం మొత్తం రాజధానిగా ఉంది శ్రీరంగపట్నం. విచిత్రం ఏమిటంటే ఎన్నో హిందూ దేవాలయాలను నాశనం చేసిన టిప్పు సుల్తాన్ రంగనాథ స్వామి దేవాలయాన్ని మాత్రం ముట్టుకోలేదు. టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ రంగనాథ స్వామి గొప్ప భక్తుడు. ఓసారి ఆంధ్రదేశంలో యుద్ధం చేసి వస్తున్న హైదర్అలీ సైన్యాన్ని శత్రుసైన్యం వెంబడించసాగింది. తన సైన్యం ఇదవరకే అలసిపోయి ఉంది, ఇలాంటి సమయంలో శత్రువును జయించడం కష్టం అని నిర్ణయానికి వచ్చాడు హైదర్ అలీ. అయితే శ్రీరంగపట్నం దారిలో గోదావరినది అడ్డుగా ఉండడంతో నది దాటలేని పరిస్థితి ఏర్పడింది హైదర్అలీ సైన్యానికి. ఎటూ పాలుపోక హైదర్అలీ రంగనాథస్వామిని ప్రార్థించాడు. వెంటనే గోదావరిలో ప్రవాహం తగ్గింది, ఆలస్యం చేయకుండా తన సైన్యాన్ని నది దాటించాడు హైదర్అలీ. వారు దాటగానే గోదావరిలో నీరు ఒక్కసారిగా పెరిగి, ప్రవాహ వేగం భయంకరంగా మారింది. వెనకే తరుముకొస్తున్న శత్రుసైన్యం నది దాటలేక తిరుగుముఖం పట్టింది. అలా హైదర్ అలీ తన సైన్యంతో సహా శ్రీరంగపట్నం సురక్షితంగా చేరుకొని రంగనాథునికి పూజలు చేసి కాస్త తేరుకొని తిరిగి శక్తివంతుడై మళ్ళీ శత్రువుపై దండెత్తి విజయం పొందాడట.
తండ్రిలా కాకుండా టిప్పుసుల్తాన్ ఎన్నో హిందూ దేవాలయాలను నాశనం చేసాడు, బహుశా తన తండ్రికి నచ్చిన ఆలయం అనేమో శ్రీరంగపట్న రంగనాథ ఆలయాన్ని ముట్టుకోలేదు. ఆ సమయంలో టిప్పుసుల్తాన్ దాడుల నుండి మూలవిగ్రహాలను రక్షించడానికి ఎన్నో దేవాలయాలలోని మూలవిగ్రహాలను శ్రీరంగపట్నం గుడికి తరలించారు అక్కడి అర్చకులు. అలా వచ్చినవే శ్రీనివాస, నృసింహ, గోపాలకృష్ణ, హనుమాన్ విగ్రహాలు.
శ్రీరంగపట్నం మైసూరు నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బెంగుళూరు-మైసురు హైవే శ్రీరంగపట్నం లోనుండే వెళుతుంది. బెంగుళూరు, మైసురు నుండి సులభంగా రైలు, రోడ్డు మార్గాల ద్వారా శ్రీరంగపట్నం చేరుకోవచ్చు.
శ్రీరంగపట్నం నుండి దాదాపు 80 కిలోమీటర్లు దిగువన ఉంటుంది శివనసముద్రం అదే మధ్యరంగ క్షేత్రం. ఈ క్షేత్రం గురించి వచ్చే నెల తెలుసుకుందాం...... సశేషం.....
No comments:
Post a Comment