నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) - సృష్టిలో తీయనిది స్నేహమే!
శారదాప్రసాద్
అలా B.Sc రెండవ సంవత్సరం మంచి మార్కులతో ఉత్తీర్ణుడనయ్యాను.ఆ సంవత్సరం మా నాన్న గారికి గుంటూరుకి బదిలీ అయింది.అందుచేత నేను ఒక్కడినే నరసరావుపేటలోనే రూమ్ లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది.నా రూమ్ మేట్ మరెవరో కాదు,నా చిరకాల స్నేహితుడు బాబురావే !చిన్నతనం నుంచి హై స్కూల్ లో కూడా మేము సహాధ్యాయులమే!మేమిద్దరమే ఆ రూమ్ లో ఉండేవాళ్ళం.రూమ్ పక్క ఇంట్లో శ్రీనివాసమూర్తి అనే మరో సహాధ్యాయి ఉండేవాడు.శ్రీనివాసమూర్తి శ్రీకాళహస్తి నివాసి.అతని తండ్రి నరసరావుపేటలో పోస్ట్ మాస్టర్. నాకూ,బాబూరావుకు అరమరికలు లేవు.ఇప్పటికి కూడా ఆ స్నేహం అలానే కొనసాగుతుంది. మా ఇంట్లో శుభకార్యాలకు కూడా వాడు వస్తుంటాడు.నరసరావుపేటలో ఉన్నప్పుడు మా ఇద్దరికీ ఒకే ఒక్క విషయంలో బేధాభిప్రాయాలుండేవి!నేను ఎన్టీఆర్ కు వీరాభిమానిని ,వాడు ANR అభిమాని.ఎన్టీఆర్ ను యెగతాళి చేస్తూ నన్ను వాడు ఉడికించేవాడు.కాసేపు అలికిన తర్వాత వాడే నన్ను బుజ్జగించేవాడు.ఒంటరిగా ,పెద్దల అజమాయిషీలో లేనందున మేము ఆడింది ఆట ,పాడింది పాట లాగా సాగాయి ఆ రోజులు.సిగెరెట్స్ తాగటం పెరిగింది.సినిమాలు కూడా ఎక్కువగా చూసేవాళ్ళం .తరగతులు ఎగ్గొట్టి మాత్రం సినిమాలను ఎప్పుడూ చూడలేదు.కాలేజీ తరగతులు అయిన తర్వాత కాసేపు ఇతర స్నేహితులతో కాలాన్ని గడిపి ,రాత్రి 7.30 గంటలకు హోటల్ లో భోజనం చేసి ,సిగరెట్లు తాగి నెమ్మదిగా 9 గంటలకు చదువు మొదలు పెట్టేవాళ్ళం.ఒక పావుగంట కాగానే తెల్లవారుఝామునే 5 గంటలకు లేపమని బాబూరావుతో చెప్పి నేను నిద్రకుపక్రమించేవాడిని.అప్పటికే వాడు నిద్రపోయి పది నిముషాలు అయ్యేదని మరుసటి రోజు వాడు చెబితే తెలిసేది.ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగి ఒక రెండు గంటలు చదివే వాళ్ళం!మేము ఇద్దరమూ ఎన్నో పనులను చేసాం!మా ఇద్దరి రహస్యాలు మూడోవాడికి తెలియవు.ఈ సందర్భంలో నాకొక సంఘటన గుర్తుకొస్తుంది.ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రాజాజీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రకాశం గారు ప్రతిపక్షంలో ఉండేవారు.వారిద్దరూ మంచి స్నేహితులే.విధాన పరంగా చెరొక పార్టీలో ఉన్నారు.రాజాజీ కుమారుడిని గురించి ప్రకాశం గారు సభలో ఏదో ఆరోపణమీద ప్రశ్నించబోయే సమయంలో రాజాజీ గారు వెంటనే లేచి, "When friends became enemies they should not reveal their past history!" అని చెప్పి కూర్చొనగానే ప్రకాశం గారు కూడా సైలెంట్ అయిపోయి కూర్చున్నారు.ఇది నేటి రాజకీయనాయకులు నేర్చుకోవలసిన ముఖ్యమైన నీతి.పార్టీలు మారిన తర్వాత ఒకరి మీద మరొకరు బురద చల్లుకునే రోజులివి.బురద చల్లుకునే వారి చేతికి కూడా బురద అంటుతుందనే ఇంగిత జ్ఞానం కూడా లేదు నేటి నాయకులకు. బాబూరావుకు ,నాకు అరమరికలు లేవు.రహస్యాలు లేవు!రహస్యాలు లేవంటే అవి వేరొకరికి చెప్పేవి కావు.మా ఇద్దరి మధ్యనే ఉండేవి. శనివారం సాయంత్రం వాడు సత్తెనపల్లిలోని వాడి తల్లి తండ్రుల వద్దకు వెళ్ళేవాడు,నేను గుంటూరు వెళ్ళేవాడిని మళ్ళీ సోమవారం నుంచి అదే ప్రణాళిక!అయితే బాగా చదువుకునే వాళ్ళం!మంచి మార్కులు వచ్చేవి.సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అన్న ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు మా స్నేహాన్నే దృష్టిలో పెట్టుకొని ఆ మాట అన్నారేమో అనటం అతిశయోక్తి(కాదేమో!). ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు అలా అన్నారో లేదో వెంటనే బాపూ రమణలు,"మేము తీసాం!" అని వ్యంగ్యంగా చెప్పారు.వారు స్నేహం అనే సినిమాను తీశారు.అదీ అందులోని హాస్యం!డిగ్రీ అయిపోయిన తర్వాత వాడు,బి.ఇడి, ఎం.ఇడిచేసి గ్రేడ్ 1 గెజెట్టెడ్ హెడ్ మాస్టర్ గా ఎక్కువ కాలం తెలంగాణలో పనిచేసి ,పదవీ విరమణ అనంతరం హైదరాబాద్ లో స్థిర పడ్డాడు. నేను తర్వాత M.A చదివి బ్యాంకు లో చేరాను.ఇప్పటికీ వారానికొకసారి ఇద్దరమూ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నాం.మాది 60 ఏళ్ళ స్నేహబంధం.దీన్ని నేటి యువతీ యువకులు ఆదర్శంగా తీసుకోవాలి!అరమరికలు లేని స్నేహంలో తారతమ్యాలు ఉండవు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు అన్నట్లు సృష్టిలో తీయనిది స్నేహమే!మరికొన్ని వివరాలు మరొకసారి.
***
Your style of writing is very simple and feel like reading immediately.
ReplyDelete'సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ ! అందుకనే జీవితంలో కనీసం ఇద్దరు స్నేహితులు తప్పక వుండాలి .
ReplyDeleteశారదా ప్రసాద్ గారికి ధన్యవాదాలు
నాగయ్య
స్నేహానుబంధం అనే పదం లో స్నేహం అనే పదానికి ఎంత అర్థం విలువ ఉంటాయో బంధం అనే పదం అల్లుకు పోయిన వైనమే స్నేహానుబంధం. స్నేహం , స్నేహితులు రెండూ ప్రతి వారి జీవితాలలోను అనుభూతి పరమైన జీవశక్తి లాంటిది. స్నేహం చేయని మానవుడెవ్వడూ ఈ సృష్టిలో లేదు. శ్రీ శాస్త్రి గారు అంశం ఏదైనా వారి అనుభవాలను జోడించి వ్రాయడం లో సిద్హ హస్థులైన వారు. అభినందనలతో , కొత్త స్నేహితుడు భాస్కర్ దత్.
ReplyDeleteస్నేహం ఎప్పుడూ తీయనిదే. కానీ, దాన్ని కాపాడుకుంటేనే మరింత తీయగా తయారవుతుంది. లేకపోతే చేదుగా మిగిలిపోతుంది. రాజాజీ, ప్రకాశం గార్ల ఉదంతం ఉటంకించడం బావుంది.
ReplyDeleteEXCELLENT NARRATION
ReplyDeleteచాలా పారదర్శకంగా ఉన్నాయి మీ అనుభవాలు!
ReplyDeleteచక్కని రచనా సంవిధానం
ReplyDeleteఅనుభవాలను ఆసక్తికరంగా చెబుతున్నందుకు సంతోషం
ReplyDelete