అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 11
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. . మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. ఆ కేసులో ముందుకు వెళ్ళాలంటే ముందుగా బుషీట్రాట్ అన్న వ్యక్తి డైట్ కంపెనీలో పని చేస్తున్నట్లు నిర్ధారించాలి. తండ్రి చెప్పినది విన్న నాన్సీ రైల్వే స్టేషన్లో డయానెను కలిసి తన మాటల్తో బోల్తా కొట్టించి, ఆమెతో డైట్ కంపెనీకి వెడుతుంది. డయానె తండ్రి దగ్గరకు వెళ్ళిన సమయంలో, ఆ కంపెనీ కార్యదర్శితో ఫాక్టరీలోపల చూడటానికి వెళ్ళిన నాన్సీ చిన్ననాటాకంతో అక్కడ పనిచేసే బుషీట్రాట్ ను చూస్తుంది. ఆ విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా పై అంతస్తునుంచి రక్తం గడ్డకట్టించే స్థాయిలో అరుపు వినిపిస్తుంది. పక్కబట్టలకోసం పాత బీరువాలో వెతుకుతున్న ఎఫీని బ్లాక్ విడో సాలీడు మరిచిందని గమనించి డాక్టరు వద్దకెళ్ళి చికిత్స చేయిస్తుంది. హన్నా ప్లెజెంట్ హెడ్జెస్ కి వచ్చి బ్లాక్ విడోని కనుక్కొని చంపేస్తుంది. జబ్బుపడ్డ ఎఫీ కోలుకొనేవరకు నాన్సీ మార్చ్ భవంతిలోనే ఉండిపోతుంది. ఆ రోజే గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా కోరుతూ ఉత్తరం వ్రాస్తుంది. భోజనాల సమయంలోమార్చ్ తన కుటుంబవిషయాలను నాన్సీకి చెబుతాడు. ఆ రాత్రి అటకమీద వెతుకుతుంటే అనుకోకుండా ఆమె టార్చీలైట్ ఆరిపోవటం, అదే సమయంలో ఎక్కడినుంచో కొన్ని విపరీత శదాలు వినిపించటం జరుగుతుంది. ఎఫీ కోలుకొన్నాక యువ గూఢచారి యింటికొస్తుంది. ఆరోజు తన తండ్రితో కలిసి బుకర్ ఫాక్టరీకి వెళ్ళి పట్టుకండువాలు చేసే విధానాన్ని గమనిస్తుంది. తరువాత తండ్రికోరికపై ఒక ప్రణాళిక ప్రకారం డయానె యింటికి వెళ్ళి, తనకు తెలిసిన ఒక పాపకు డయానె చెల్లెలుకి బిగువైన బట్టలను యిమ్మని అడుగుతుంది. ఆమె లోనికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని వారి హాబీలేమిటో గమనిస్తుంది. ఇంతలో డయానె తన చెల్లెలి పాతబట్టలను మోసకొచ్చి ఆ హాల్లో ఉన్న సోఫాలోకి విసురుకొంది. తరువాత ఏం జరిగిందంటే. . . . . )
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
"అక్కడున్నావా?" అంటూ తన చేతిలోని బట్టల కుప్పను సోఫాలోకి విసిరింది. "నీకు నచ్చితే అమ్మ వాటన్నింటినీ తీసుకొనిపొమ్మంది."
బట్టలిచ్చినందుకు నాన్సీ ఆమెకు ధన్యవాదాలు చెబుతూ, సీసాల సేకరణపై తనకున్న యిష్టాన్ని తెలియజేసింది.
"అవా? వాటిని సేకరించటం అమ్మకు సరదా" నిర్లక్ష్య ధోరణిలో డయానె బదులిచ్చింది. "ఆవిడ తన సమయాన్నంతా ఎక్కువగా వాటిని బేరమాడుతూ పురాతన వస్తువుల దుకాణాల్లోనే గడిపేస్తుంది. తనకి కొత్తవాటి కన్నా పాత సీసాలంటేనే ఎక్కువ యిష్టం."
"కొత్తవాటి కన్నా పురాతన వస్తువులే ఎక్కువ అందంగా ఉంటాయి" నాన్సీ వ్యాఖ్యానించింది.
"నేనలా అనుకోను. అందులోనూ ప్రధానంగా సీసాలు. ఏదైతేనేం, యిలా సేకరించేవాళ్ళు యింటికి ఒకరుంటే చాలని నా అభిప్రాయం."
నాన్సీకి వాదనకు దిగాలని అనిపించినా తెలివిగా మౌనం దాల్చింది. డయానె ఖచ్చితంగా తల్లి పట్ల మర్యాద చూపించని, దురహంకారియైన కూతురని అర్ధమైంది.
"బట్టలిచ్చినందుకు ధన్యవాదాలు. పాప సుశాన్ వీటిని చూసి పొంగిపోతుంది" అంటూ చెల్లాచెదురుగా నేలపై పడిన బట్టలను పోగేసి, వాటితో బయటకొచ్చిందామె.
డైట్ యింటి నుంచి ఆ యువతి తిన్నగా ప్లెజెంట్ హెడ్జెస్ కి చేరుకొంది. ఆమె గతంలో కొన్ని పాత సీసాలను చూసింది కదా! ముసలాయనకి సుశాన్ కోసం తెచ్చిన బట్టలను చూపించింది. అవి కంటికి యింపుగానే గాక ఎవరో కట్టి విడిచిన బట్టల్లా కూడా కనిపించటంలేదు.
"మిసెస్ డైట్ నా మనవరాలికి యింత మంచి బట్టలు పంపించింది" పెద్దాయన కృతజ్ఞత వ్యక్తపరిచాడు. "కానీ నేను దానాన్ని స్వీకరించను."
"ఆ అవసరం లేదు."
"అంటే నేను ఋణం తీర్చుకొనే మార్గం ఉందంటావా?" అడిగాడతను.
"మీ అటకమీద అందమైన పాతసీసాలెన్నో ఉన్నాయి. అవి చూరు క్రింద వరుసలో ఉన్నాయి. మిసెస్ డైట్ కు పాతసీసాలను సేకరించటమంటే సరదా. మీకు యిష్టమైతే ఈ బట్టలకు బదులుగా వాటిలోని ఒక సీసాను ఆమెకు యిస్తాను."
ఆమె ప్రతిపాదనకు మార్చ్ సంతోషించాడు.
"అలాగే చేయి. నువ్వు చెబుతున్న సీసాలేవో నాకు గుర్తుకొచ్చాయి."
"వాటిలో కొన్నింటిని అమ్మేయమంటారా?" నాన్సీ అడిగింది.
"తప్పకుండా! ప్రతిపైసా మనకు సాయపడుతుంది. ఆ నీలిపూల సీసాను మిసెస్ డైట్ కు యివ్వవచ్చు."
ఇంతవరకు తాను అనుకొన్నట్లే జరుగుతున్నందుకు ఆమె సంబరపడుతూ నాన్సీ అటక మీదకు వెళ్ళింది. అక్కడ ఉన్న చిన్న కిటికీ గుండా సూర్యకాంతి లోపలకు పడుతున్నా, దూరంగా మూలల్లో ఉన్నవాటిని చూడటం కోసం ఆమె కొవ్వొత్తిని వెలిగించక తప్పలేదు.
చివరకు ఆమె సీసాల దగ్గరకు చేరుకొంది. అక్కడ నాలుగు సీసాలు ఆకర్షణీయంగాను, పరిమాణంలో పెద్దదిగాను ఉంటే, మిగిలినవన్నీ చిన్నవి. అన్నీ నాణ్యమైనవే! నాన్సీ ఒక్కొక్క సీసాను ఎత్తి చూసింది. వాటి గాజు రంగును బట్టి ఆ సీసాలు పాతబడినా, వాటి విలువ ఏ మాత్రం తగ్గలేదని సూచిస్తోంది.
"ఇదే మార్చ్ చెప్పిన నీలి పూల సీసా" అంటూ ఆమె దాన్ని పరీశీలనగా చూసింది. "అందమైనది. తానిచ్చిన కొద్ది బట్టలకే దీన్ని పొందుతున్న మిసెస్ డైట్ అదృష్టవంతురాలు."
ఆ గాజుసీసాలన్నింటిని ఒక పెట్టెలో పెట్టి మెల్లిగా మెట్ల దగ్గరకు చేర్చింది.
"ఓ! నా ఎత్తు ఫలిస్తోంది" అంటూ దీర్ఘశ్వాస విడిచింది. "అంతా సవ్యంగా వెడితే, రెండు పనులను ఒకేసారి పూర్తిచేయవచ్చు. వాటిలో మొదటిది తాను తెచ్చిన బట్టలకు ప్రతిగా ఈ సీసాను మిసెస్ డైట్ కి అందజేయటం కాగా, ఆ వంకతో డైట్ ఫాక్టరీలోకి అడుగుపెట్టటం రెండవది."
ఎఫీ సాయంతో ఆమె సీసాలన్నింటినీ మెరిసేలా కడిగింది.
"వీటితో నువ్వేమి చేయబోతున్నావు?" పనిపిల్ల అడిగింది.
"పాత సీసాలు సేకరించే ఆమె భర్తకు వీటిని అమ్మబోతున్నాను" నాన్సీ చెప్పింది.
ఆమె మధ్యాహ్నం చాలాసేపు పుస్తకపఠనం, సుశాన్ తో కబుర్లు చెప్పటంతో గడిపింది. తరువాత తాతామనవరాళ్ళకు వస్తానని చెప్పి, నాన్సీ పాత సీసాల కోసం వంటింట్లోకి వెళ్ళింది.
"రాత్రి వెనక్కి వస్తావా?" ఎఫీ భయపడుతూ అడిగింది. "ఈ ప్రాంతాన్ని అంటిపెట్టుకొని వేలాడే దయ్యాలతోను, దొంగలతోను నువ్వు లేకుండా ఉండటం క్షేమం కాదనిపిస్తోంది."
"అసలు దయ్యాన్ని మనమింకా చూడలేదే!" అంటూ నాన్సీ నవ్వింది.
"నువ్వెలా పిలిచినా సరే! నన్ను మోసం చేయొద్దు. ఇక్కడ ఒక మనిషి రహస్యంగా సంచరించటం చూశాను. అతను తన యింటికి వెడుతూ దారిలో మన లాన్ దాటుకొని వెళ్ళాడని సమాధానపడ్డాను. తరువాత బట్టల బీరువాలో అస్తిపంజరం వేలాడుతూ కనిపించింది. ఆపైన బ్లాక్ విడో పాకుతూ వచ్చి నన్ను కరిచింది" ఆమె ఫిర్యాదు ధోరణిలో చెప్పింది.
ఆమె భయాలను తొలగించటానికి రాత్రికి తప్పకుండా వచ్చి ఉంటానని యువగూఢచారి మాట యిచ్చింది. " నేను సాధ్యమైనంత త్వరగా వస్తాను" అని ఎఫీని సముదాయించింది.
సీసాలన్నింటిని తనతో తీసుకొని రివర్ హైట్స్ ప్రాంతాన్ని చేరుకొంది. కారుని డైట్ ఫాక్టరీకి దూరంగా నిలిపి, కాలినడకను బయల్దేరింది
ఆమె ఫాక్టరీని సమీపించే సమయానికి దాన్ని మూసివేసే సమయమైంది. అప్పటికే కార్మికులంతా గేటుల్లోనుంచి బయటకు రావటం మొదలెట్టారు. నాన్సీ ఒక్క నిమిషం ఆగి వాళ్ళలో బుషీట్రాట్ కనిపిస్తాడేమోనని చూసింది. అతను కనిపించకపోయేసరికి కార్యనిర్వాహక విభాగాలవైపు వెళ్ళింది.
"మిస్టర్ డైట్ ని కలవటానికి వీలవుతుందా?" అతని ప్రయివేట్ కార్యదర్శి మిస్ జోన్స్ ని అడిగిందామె.
"ఆయనింకా ఆఫీసులోనే ఉన్నారు. అతను నిన్ను చూడవచ్చనుకొంటాను" కార్యదర్శి బదులిచ్చింది.
కార్యదర్శి లోనికెళ్ళి ఒక క్షణం తరువాత తిరిగొచ్చింది. ఆమె నాన్సీని డైట్ ప్రయివేటు ఆఫీసు (ఆంతరంగిక కార్యాలయాని)కి తీసుకెళ్ళింది. నాన్సీ గదిలోకి ప్రవేశించగానే లారెన్స్ డైట్ లేచి నిలబడ్డాడు కానీ ఆమెను మళ్ళీ కలవటం యిష్టం లేనట్లు కనిపించాడు.
"మిస్టర్ డైట్! మిమ్మల్ని యిబ్బంది పెట్టినందుకు మన్నించండి" అంటూ తను తెచ్చిన పెట్టెలోనుంచి అందమైన నీలిరంగు సీసాని తీసి నాన్సీ నేర్పుగా అతని బల్లపై పెట్టింది. " ఇదివరకు యిక్కడకు వచ్చినప్పుడు మీకు బాగా కోపం తెప్పించినట్లున్నాను" అంటూ వినయంగా అంది.
వెంటనే డైట్ చూపు అందమైన ఆ పాత సీసాపై కేంద్రీకృతమైంది.
"దీన్నెక్కడ సంపాదించావు?" ఆశ్చర్యంతో కనుబొమ్మలెగరేస్తూ అడిగాడతను.
"ఇది మీ భార్యగారి కోసం నేను తెచ్చిన చిన్న బహుమతి మిస్టర్ డైట్! ఆవిడ ఈ రోజు ఎంతో దయతో నాకు సాయం చేశారు" అంటూ బల్లమీద సీసాను చేత్తో పట్టుకొని పైకెత్తింది. ఆ గదిలోనున్న కిటికీలోంచి వస్తున్న సూర్యకాంతి ఆ సీసా గుండా ప్రయాణిస్తూ మెరుస్తోంది. " నా దగ్గర యింకా ఉన్నాయి. మీ భార్యగారు పాత సీసాలను సేకరిస్తారని విని తీసుకొచ్చాను."
డైట్ ఆ నీలం సీసాను పరీక్షగా చూశాడు. దాన్ని యిష్టపడటంతో అతని ముఖంలోని గంభీరత మాయమైంది.
"ధన్యవాదాలు. మిసెస్ డైట్ కోసం దీన్ని తీసుకొంటాను. మిగిలిన వాటిని కూడా చూడనీయి."
నాన్సీ పెట్టెలోనున్న వాటన్నింటినీ తీసి బల్లపై ఉంచింది.
"వాటికి ఎంత యిమ్మంటావు?"
నాన్సీకి అతని మాటలు వినిపించటంలేదు. ఆ గదిలో తెరచి ఉన్న ఒక కిటికీ దగ్గరగా ఆమె నిలబడి ఉంది. తలతిప్పి పైనుంచి చూసిన ఆమెకి ఆఫీసు భవనానికి, మరొక యిటుక కట్టడానికి మధ్యగా ఉన్న సందులో బాగా పరిచయం ఉన్న రూపం కనిపించింది. ఆ మనిషే బుషీట్రాట్!
తన ప్రశ్నకు బదులీయకుండా ఆమె కిటికీలోచి బయటకు చూడటం డైట్ కు కోపాన్ని తెప్పించింది.
"నీకెంత కావాలని అడుగుతున్నాను" కోపం నిండిన కంఠంతో ఆయన మరొకసారి అడిగాడు.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
No comments:
Post a Comment