నాకు నచ్చిన నా కధ (ఇదీ నా కధే) -బ్రహ్మోపదేశం
శారదాప్రసాద్
B.Sc ఆఖరి సంవత్సరం పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఇతర కార్యకలాపాల మీద దృష్టి పెట్టటం మానేసాను .కష్టపడి చదువుతున్నాను.డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని నా తలంపు.నన్ను లెక్చరర్ గా చూడాలని మా నాన్నగారి ఉద్దేశ్యం.ఆ రోజుల్లో లెక్చరర్ ,బ్యాంకు ఉద్యోగాలకు మంచి క్రేజ్ ఉండేది.కేవలం ట్యూషన్స్ చెప్పి ఆ రోజుల్లోనే లక్షలు సంపాదించిన వారున్నారు.Mathematics లెక్చరర్స్ కు మరీ సంపాదన ఎక్కువ. ఇవన్నీ ఆ రోజుల్లో పెద్దల ఆలోచన.అయితే చదువుకునేటప్పుడు ఇవన్నీ నేను ఆలోచించలేదు. పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యాను .అంతకు ముందు సంవత్సరంలో మార్కులు బాగానే వచ్చాయి.పరీక్షలు బాగా వ్రాసాను.మా నాన్నగారు బాహుకుటుంబీకులు.అందుచేత ఆడపిల్లల పెళ్లిళ్లతో పాటుగా మగపిల్లల ఉపనయనాలు కూడా చేసేవారు.సంప్రదాయ కుటుంబం అయినప్పటికీ ,ఇతరత్రా కారణాల వలన నాకు ఉపనయనం చేయటం ఆలస్యమైంది.అది 1970 వ సంవత్సరం ,వైశాఖ మాసం .మా చెల్లెలికి పెళ్లి చేయటానికి నిశ్చయించారు.అప్పుడు అందరికీ సెలవు కూడా ఉంటాయి.పెద్దవాడిని కనుక,పెళ్ళికి ఒక మూడు రోజుల ముందర నాకు ఉపనయనం చేయటానికి కూడా నిశ్చయించారు. ఉపనయనం అయితే ఆలస్యంగా చేస్తున్నారు కానీ,అన్నీయధావిధిగా చేస్తున్నారు .పంచ శిఖలు పెట్టారు.నేను కూడా అభ్యంతరం చెప్పలేదు. ఒక్క రెండు నెలలు ఆగితే ,మళ్ళీ జుట్టు వస్తుంది.అదీగాక సెలవులు కూడా !ఇక చెవులు కుట్టటం ఒకటుంది.అదొక ప్రహసనమే!అప్పుడు నా వయసు 19 ఏళ్ళు.చెవులు ముదురుగా ఉంటాయి ఆ వయసులో .చెవులు కుట్టటానికి బత్తుడు వచ్చాడు .ఒక చెవికి రంధ్రం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు.బాగా నొప్పిగా ఉండటం చేత ,ఆ బాధలో బత్తుడిని పొట్టలో ఒక్క తన్ను తన్నాను.అతను గోడకుపోయి కరుచుకున్నాడు.ఈ అబ్బాయికి నేను చెవులు కుట్టనని వాడు అన్నీ సద్దుకొని వెళ్ళబోతున్నాడు. అరె !ఒక చెవి సగం కుట్టి,రెండవ చెవి కుట్టకుండా ఎక్కడికి వెళుతావని బత్తుడిని మా పెదనాన్న గారు మందలించారు.అందరూ రాజీకి వచ్చారు.నలుగురు నా కాళ్ళను గట్టిగా పట్టుకుంటే కుడతానని బత్తుడు తీర్మానం చేసాడు!సరే పని కావటం ముఖ్యం కనుక అందరూ వాడి తీర్మానాన్ని ఒప్పుకున్నారు.వాడి వంక నేను కోపంగా చూస్తున్నాను.వాడి భయం వాడికుంది.మనసులో మధన పడుతున్నాడు.ఇది గ్రహించిన పెద్దవాళ్లు వాడిని గట్టిగా పట్టుకొని తీసుకొని వచ్చారు.ఆ విధంగా చెవులు కుట్టటం పూర్తయింది.ఏ తండ్రి అయినా ఏ కుమారుడికైనా ఇచ్చేవి మూడే మూడు.ఒకటి దేహం,రెండు విజ్ఞానం ఇక మూడవది బ్రహ్మోపదేశం.మిగిలినవన్నీ ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే !మా నాన్నగారు నాకు బ్రహ్మోపదేశం చేసి ఆది గురువుగా మారారు.ఇప్పటికీ ఆయనే నాకు ప్రధమ గురువు.ఉపనయనం దివ్యంగా చేశారు.ఇక మా చెల్లెలి పెళ్లి మిగిలింది. ఉపనయనం,పెళ్లి ఈ రెండూ మా స్వగ్రామమైన మాచవరంలోనే జరిగాయి.
మాచవరం పల్నాడు ప్రాంతంలో పిడుగురాళ్ల దగ్గర ఉంది.అప్పుడు అదొక చిన్న ఊరు.నేడు మండల కేంద్రమైంది,బ్యాంకులు కూడా ఉన్నాయి. ఉపనయనం, పెళ్లి మధ్యలో నా పరీక్షా ఫలితాలు వచ్చాయి.ఆ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా తక్కువగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పత్రిక రేపు వస్తుంది.మానాన్న గారి బాబాయి గారి కుమారుడు ఆ ఊరిలోనే పోస్ట్ మాస్టర్.ఆరోజుల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది.అందువలన అందరి ఉత్తరాలను ఆయనే చదివి చెప్పేవారు.ఒకరిద్దరు వార్తాపత్రికను పోస్ట్ ద్వారా తెప్పించుకునేవారు.నా నెంబర్ ఆయన అడిగితే చెప్పాను.అక్కడే గోడమీద పెన్సిల్ తో వ్రాసుకున్నాడు.నా రిజల్ట్స్ మొదటిసారిగా పత్రికలో చూసి చెప్పింది మా బాబాయి గారే !డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో ప్యాసయ్యాను.అందరూ అభినందలు తెలిపారు.తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటానికి కుటుంబ సభ్యులందరూ తీర్మానించారు.నాకు కూడా అది అంగీకారమే! విధ్యాబ్యాసంలో ఒక ఘట్టం ముగిసింది!మరికొన్ని ముచ్చట్లు మరొకసారి!
***
మీ ఉపనయన వేడుక బాగా వర్ణించారు. ఆ రోజుల్లో పంచశిఖలు, చెవిపోగులు తప్పనిసరి తంతుగా ఉండేవి. ముఖ్యంగా బ్రాహ్మణకుటుంబాలలో ఈ ఆచారవ్యవహారాలూ మరీ నిక్కచ్చిగా పాటించేవారు. చాలామటుకు చిన్నతనంలోనే అంటే ఏడెనిమిది ఏళ్ళ వయసులోనే ఉపనయనం చేసేవారు కాబట్టి అంతగా ఇబ్బంది ఉండేది కాదు. మీకు మరీ 19 ఏళ్ళు అవడం వల్ల కొంత నామోషీగా ఉండుంటుంది.
ReplyDeleteమీ ఉపనయన ప్రహసనం బాగుందండీ!
ReplyDeleteమీ ఉపనయన ప్రహసనం బాగుందండీ!
ReplyDeleteమీ ఉపనయన ప్రహసనం బాగుందండీ!
ReplyDeletesimply superb
ReplyDeletechaalaa baagundandee!
ReplyDeleteఎంతో ఆనందంగా అనిపించింది చదువుతోంటే
ReplyDelete