ఈ దారి మనసైనది -11
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత.)
“ఏం లేదు అనురాగ్ ! సజ్జక్ట్ ప్రాబ్లమ్. ఈ సారి నిన్ను అడుగుతానులే " అంటూ అక్కడినుండి వెళ్లి పోయింది.
ఆమెనలా చూస్తుంటే ఏదో అంతుతెలియని అభద్రతా భావంతో క్రుంగిపోతున్నదానిలా అన్పిస్తోంది.
*****
ఉదయం తొమ్మిది గంటలకి రెడీ అయి ఎప్రాన్ వేసుకొని, స్టెత్ పట్టుకొని మెడికో సూడెంట్స్ అంతాకాలేజి బస్ లో ఎం.జి.ఎం హాస్పిటల్ కి వెళ్ళారు.
అక్కడ పేషంట్ల సమస్యల్ని తెలుసుకున్నారు. వారికిచ్చే ట్రీట్ మెంట్ గురించి తెలుసుకున్నారు.
వారికి సహాయంగా - వారికొచ్చేడౌట్స్ ని క్లారిఫై చెయ్యటానికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూడెంట్స్ వున్నారు.
పన్నెండు గంటలకి హాస్పటల్లో పోస్టింగ్స్ అయిపోవటంతో లంచ్ ముగించుకున్నారు.
సరిగ్గా 1 గంటకి ఫార్మ కాలేజి క్లాస్ కి అటెండ్ అయ్యారు.
క్లాసు అయిపోయిన తర్వాత 2 గంటలకి మైక్రోబయోలజిలాబ్లోకి వచ్చారు.
ఆ ల్యాబ్ మొదలైనప్పటి నుండి - అనురాగ్, దీక్షిత పక్కపక్కన నిలబడి ప్రయోగం చేస్తుంటే మన్విత మనసు బాధతో ముడుచుకుపోతోంది.
అనురాగ్ పక్కన దీక్షిత తప్ప యింకెవరున్నా ఆమె అలా ఫీలవ్వటంలేదు.
ఎందుకంటే దీక్షిత అతని పక్కన వున్నప్పడు వాల్చిన అతని కనురెప్పల్లో దోబూచులాడే ఊహల వెన్నెలకిరణాలు బయటకు తొంగి చూస్తున్నాయి. ఆ వెలుగు ఆమె మనసులో దు:ఖాన్ని రేపుతోంది.
చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ప్రేమకావ్యాలను చదివిన అనుభవంతో వాళ్లను పోల్చుకుంటోంది మన్విత,
తను చదివిన షేక్స్పియర్ నాటకాలన్నీ ఇలాంటి ప్రేమికుల్ని చూసే రాసుంటారని ఆమె భావన. ఆ భావన ఆమెకంటే ముందు మేల్కొని ఆమె తర్వాత నిద్రపోతూ నిత్యం ఆమెతో ఆడుకుంటూవుంది.
మనసున మనసై ప్రేమించు కోవడం అనేది ఒక అద్భుతం ... ఒక కొత్త ఊపిరి ... రెండు హృదయాలలో అడక్కుండా ఏర్పడే ప్రతి స్పందన. నీకు నేనున్నాననే మానసికమైన తృప్తి ... బలీయమైన అనుభూతి... అంతుపట్టని రహస్యం ... సమాధానం లేని ఓ అందమైన ప్రశ్న...ఆ ప్రశ్న భాషకు, భావాలకు అందని అండపిండ బ్రహ్మాండం... మనసులోని దాహాన్ని తీర్చే అతి సహజమైన భావ ఉద్వేగం....
దు:ఖం మన్విత ఎదనిండి, గుండెనది పొంగి పొర్లి ,కళ్లలోని కన్నీటి చుక్కలు చెక్కిలిమీదకి ప్రవహించాయి.
మన్వితా ! ప్రయోగం చెయ్యకుండా ఏంటి ! ఆలోచిస్తున్నావ్ ?" అంటూ ప్రొఫెసర్ మేడమ్ గారొచ్చి తిట్టారు.
ఆ తిట్లకి గతంలోంచి బయట కొచ్చిన మన్విత బాగా హర్టయింది.
ఇదంతా అనురాగ్ పై తనకి వున్న ప్రేమ వల్లనేగా అనుకుని కెమికల్స్ వున్న వైపు కదిలింది మన్విత,
అవసరమైన కెమికల్స్ తీసుకొని వస్తూ దీక్షిత భుజాన్ని విసురుగా తగిలింది. అది ఆమె కావాలని తగలకపోయినా గట్టిగానే తగిలింది.
దీక్షిత స్థిరంగా నిలబడి వుండటంతో అదృష్టవశాత్తూ మనిషి కదలలేదు కాని, కదిలుంటే ప్రమాదమే జరిగుండేది. ఆ తాకిడికి దీక్షిత చున్నీ మాత్రం వెంటనే కెరటంలా కిందకి జారింది.
దాన్ని చాలా క్యాజువల్గా తీసుకొని, చున్నీసర్దుకొని తను చేస్తున్న ప్రయోగం మీదనే దృష్టి నిలిపింది దీక్షిత, అనురాగ్ కూడా అంతే.
అది చూసిన మన్విత మనసులో జ్వలనం మొదలైంది.
*****
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment