జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 11 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 11
చెన్నూరి సుదర్శన్  

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)
“జహీర్.. ఈ సమయంలో వాళ్ళు మాట్లాడుకునేదేముంటుంది. అదీ.. ఊరికి దూరంగా.. ఏకాంతంలో.. ఊహించాను.. అది నిజమని తేలింది.. ఇక మునగడమో..! తేలడమో..! వారి చేతుల్లో ఉంది. చెప్పడం మన ధర్మం..” అంటూ ఆకాషం వంక చూసాను. జహీర్ నిజమే అన్నట్లుగా తలూపుతూ చెరకుచేనులో దూరాడు. రెండు గడలు విరుచుకొచ్చి నాకొకటిచ్చాడు.
            ఇరువురం చేను గట్టుపై కూర్చొని గడలు నములసాగాం.. దూరంగా ప్రభాకర్ అనితలు రోడ్డుపై ఆగిన బస్సెక్కే దృశ్యం కనబడింది. దాంతో  నాకు జహీర్ భార్య గుర్తుకు వచ్చింది.
            “జహీర్.. నీభార్యనింకా  పుట్టింటి నుండి తీసుకు రాలేదా..” అమ్మాయి పుట్టి ఆరుమాసాలు కావస్తోంది.. వారాంతంలో ఇంటికి వెళ్ళడం లేదని.. అనుమానమేసి అడిగాను.
            “లేదన్నయ్యా..”
అతడి ముఖంలో రంగులు మారసాగాయి.
            “ఏం..”
            “అమ్మాయి పుడితే అరతులం బంగారం పెడ్తామన్నారు.. ఇప్పుడు మాట దాటవేస్తున్నారు అత్తవారు. బంగారంతో అడుగుపెట్టాలని  నా పేరెంట్స్ గొడవ చేస్తున్నారు. ఇద్దరి మధ్య నేను నలిగి పోతున్నాను. అయినా అమ్మాయి కదా..’ అనే నిర్లక్ష్యధోరణి అతడిలో కనబడే సరికి నాక్కాస్తా కోపం వచ్చింది.
            “జహీర్.. నీ అభ్యుదయ భావాలన్నీ కవిత్వానికే పరిమితమా?” అంటూ ప్రశ్నించాను. నాలోని కోపం ఏర్పడకుండా..
            జహీర్ మౌనంగా ఉండటం ఊర్కోలేకపోయాను. ఒక క్లాసు పీకాను. బంగారం లాంటి అమ్మాయిని కనడం భార్య  తప్పే అయినట్లు ఒక జువాలజీ లెక్చరర్ మాట్లాడడం శోచనీయమన్నాను. రాబోయే రెండవ శనివారం..ఆదివారం సెలవుల్లో వెళ్లి బిడ్డను తెచ్చుకొమ్మని..లేకుంటే నా రూంలో ఉండనివ్వననికాస్తా కటువుగా మాట్లాడాను.
            ఇద్దరం మౌనంగా తిరిగి రూంకు వచ్చాం. ఆ రాత్రంతా జహీర్‍తో మాట్లాడ లేదు..
            ఆ మరునాడు సెలవుపెట్టి ఊరెళ్ళాడు జహీర్..  
            కొన్ని కొన్ని సందర్భాలలో అలా కటువుగా మాట్లాడ్డం తప్పదు.. అదీ అతడి మంచికే..  అని మనసులో నవ్వుకున్నాను..       
            నా కటువుతనం అతన్ని కనికరించింది. తల్లిదండ్రులనెదురించి.. భార్యా, బిడ్డను నేరుగా మునిపల్లికి  
తీసుకు వచ్చాడు. 
            నేను ఆశ్చర్యపోయాను. నా గది వారి కప్పగించి నేను ఫిజిక్స్ లెక్చరర్ ఏరువాక భూమయ్య  గదికి మారాను.
            భూమయ్య చాలా సరదామనిషి. కదిలిస్తే చాలు పెద్దలకు మాత్రమే జోక్స్  కడపారా నింపుతాడు. నవ్వీ.. నవ్వీ.. పొట్టచెక్కలయ్యేవి. మేము ఇంటికి దూరంగా ఉంటున్నామనే ధ్యాసే దరికి చేరక పోయేది. అతడి ఇంటి పేరులోని  ‘ఏ’ సరిగ్గా సరిపోయిందని నవ్వుకునే వాళ్ళం. నాకు పరీక్ష విభాగంలో  సహాయం చేస్తూండేవాడు.
***

            విభిన్న కాలేజీలలో పిల్లలు మరో  అడ్మిషన్ పొందకుండా ఉండెందుకు నేనొక సలహా ఇచ్చాను.

దాన్ని వెంటనే అమలు పరిచాడు రఘురామయ్య. 
 అ సంవత్సరం కాలేజీలో అడ్మిట్ అయిన పిల్లల ఒరిజినల్ మెమొరాండం అఫ్ మార్క్స్ షీట్ వెనకాల,విద్యార్థి కాలేజీలో జాయిన్ అయిన విద్యాసంవత్సరం తరగతి గ్రూప్ వివరాలు పొందు పరిచిన స్టాంప్ వేయించాడు.
కాలేజీ వ్యవహారమంతా గమనిస్తున్న విద్యార్థులు తరగతులకు క్రమంగా హాజరవుతున్నారు. నిర్లక్ష్యపు ధోరణి కలిగిన పిల్లలు కొందరున్నారు. వారిని గమనించి  సరియైన దారిలో పెట్టాలని కౌన్సిలింగ్ చేసాం.
కాలేజీకి ఫిజికల్ డైరక్టర్ పోస్ట్ మంజూరు కాలేదు. దాంతో రఘురామయ్య, నేను  కాలేజీలో తరగతుల నిర్వహణ పర్యవేక్షించే వాళ్ళం.
కాలేజీ వాతావరణమంతా మారిపోయింది. నాగమణి అన్నట్లు నాతరగతి పిల్లలు గణితంలో చాలా వెనకబడి ఉన్నారు. కొన్ని తరగతులు ప్రత్యేకంగా తీసుకుంటూ వారికి గణిత ప్రాథమిక సూత్రాలు చెప్పేవాణ్ణి. కొద్ది రోజుల్లోనే వారిలో మార్పువచ్చింది..
వార్షిక పబ్లిక్ పరీక్షలు వచ్చాయి. చాలా స్ట్రిక్ట్ గా నిర్వహించాం. కొందరు విద్యార్థులు తలబిరుసుతనంతో కాపీ కొడ్తుంటే మాల్ ప్రాక్టీసు కింద బుక్ చేయక తప్పలేదు. గొడవలు గాకుండా సుధాకర్ మాకెంతో సహకరించాడు.      
పరీక్షల మధ్యలో పరీక్షల విభాగపు ఇంచార్జ్ చిరునామా కలిగిన ఒక ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. దానిలో మా కాలేజీ పూర్వపు అనుత్తీర్ణుడైన విద్యార్థి బదులు వికారాబాదు డిగ్రీ  కాలేజీ విద్యార్థి ఫిజిక్స్ పరీక్ష రాయబోతున్నట్లు వివరంగా ఉంది. ఉత్తరంలో ఉన్న హాల్ టిక్కట్టు నంబర్ ప్రకారం డూప్లికేట్ హాల్ టిక్కట్ చూసి నిర్థారణకు వచ్చాను.  

No comments:

Post a Comment

Pages