తీరం దాటిన బతుకులు - అచ్చంగా తెలుగు

తీరం దాటిన బతుకులు

Share This
తీరం దాటిన బతుకులు
మా బాపట్ల కధలు -28
భావరాజు పద్మిని

బాపట్ల దగ్గరలో ఉన్న సూర్యలంక సముద్రం ఒడ్డున కూర్చుని, అలల వెనుక లీలగా కనిపిస్తున్న పడవల వంకే ఆశగా చూడసాగింది సుక్కి. ఈ రోజే కాదు, మూడు నెలల నుంచి ఆమె అలా కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తూనే ఉంది.
“యాంది మే. ఈడున్నావా? పాలెమంతా నీకోసరం గాలించినాను.” దగ్గరకొచ్చి సుక్కి భుజాలు పట్టి కుదుపుతూ అంది లచ్చిమి. సుక్కి కళ్ళ నిండా నీళ్ళే. 
“సంద్రవంతా కండ్లల్లా నింపుకున్నట్టు గుడ్ల నీరు కక్కుతా ఉండావు. ఎంత ఏడిస్తే మట్టుకు పోయినోల్లు తిరిగొత్తారా? నీ పిచ్చి గాని. గుండె సిక్క బెట్టుకో. ఎనకమాల నీ బిడ్డడు పాల కోసరం ఎడుత్తా ఉన్నాడు. వాడికిక అమ్మైనా, నాన్నైనా నువ్వేగా. లే, లేచి రా.” సుక్కి రెక్క పట్టుకుని, గుడిసె లోకి లాక్కొచ్చింది లచ్చిమి.
బిడ్డకు పాలిస్తూ, ఏదో ఆలోచిస్తా ఉన్న సుక్కినే చూస్తా, తన చీర కొంగులో తెచ్చిన నెత్తాళ్ళను(ఒక రకం చేపలు) దాకలో వేసి, పులుసు కాచి, అన్నం వార్చింది. సుక్కి పరిస్థితి చూసి, ఆమె గుండె కరిగిపోతోంది. జాలరి మైలపల్లి రావయ్యతో సుక్కి పెళ్లై నిండా ఏడాదైనా కాలేదు. చూడ ముచ్చటైన వాళ్ళ జంటను చూసి, ఏ పాపిష్టి కళ్ళు కుట్టాయో గాని... పచ్చి బాలింతరాలు, పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.
మూన్నెల్ల ముందు సుక్కపొద్దునే సద్దన్నం మూట గట్టుకుని, పడవ లంగరు తీసి, తెడ్డేస్తా, నిండు చూలాలైన సుక్కి వంక నవ్వుతా సూస్తా, సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన రావయ్య మరిక తిరిగి రాలేదు. అప్పటినుంచి మనిషి మనిషిలో లేదు సుక్కి. ఎలాగో కానుపయ్యింది, పుట్టిన బిడ్డ ఆలనా పాలనా చూడాలన్న కోరిక లేదు. ప్రాణం లేని కట్టె లాగా తిరుగుతాంది. రామయ్య కనబడని కాడ్నుంచి వరసకు అతనికి చెల్లెలైన లచ్చిమే సుక్కి ఆలనా పాలనా చూస్తోంది. 
“సుక్కీ, రా, కాస్త ఎంగిలి పడు,” కంచంలో ఉడుకన్నం పెట్టి, నెత్తాళ్ళ పులుసేస్తూ పిలిచింది లచ్చిమి. సుక్కిలో చలనం లేదు. ఇక తప్పదన్నట్టు రోజూ లాగే, దగ్గరకెళ్ళి, ముద్దలు కలిపి, నోట్లో పెట్టసాగింది. యాంత్రికంగా నములుతూ లచ్చిమి కేసి చూసి, మళ్ళీ కన్నీరు కార్చసాగింది. 
“సాల్లే ఆపు. ఎన్నాళ్ళని ఇట్టా బెక్కుతా ఉంటావు? ఈడే ఉంటే, మడిసివి దక్కేలా లేవు. ఇట్టాగైతే, నిన్ను పేరలిలో ఉన్న మీ అన్న కాడికి పంపేత్తాను. ఆడనే పోయి ఉండు. గాలి మారితే మడసు ఏమారుతది. మీ అన్నకు కబురెట్టేదా?” సుక్కి చెంపలు తుడుస్తూ లాలనగా అడిగింది లచ్చిమి.
“వద్దు వదినీ. నీ కాళ్లు మొక్కుతా. నేనేడికీ బోను. ఈడనే ఉంటా. ఇయ్యాలో రేపో రావయ్య మావ తిరిగొత్తడన్న ఆశతో బతుకీడుత్తా ఉన్నాను. ఈ గాలిలో నా మావ ఊపిరి కలిసుంది. అది తల్సుకునే బతుకుతా ఉండాను.  ఆడికి బోతే నా పానం నిలవదు.”
“మరెన్నాల్లు ఇట్టనే కూసుంటా? గుంటడి సంగతైనా ఆలోచన చెయ్యొద్దా? సూడు సుక్కా, మనవి ఏటికి ఎదురీదే పానాలు. పెతి పొద్దూ పానాలకు తెగించి పోరుకు బోటమే.
ఏటకి బోతే కూడు, పోకుంటే పస్తు. నీకు తెలీంది కాదు. మీ నాన అట్టనే బోయిండు. మీయమ్మ ఆపైన బెంగెట్టుకుని, జబ్బుబడి పోయింది. మీ యన్న కాడనే బెరిగినావు. అన్న చేపలు వేటాడి దెస్తే, వీది వీదీ తిరిగి అమ్ముకుంటా వచ్చినావు. అంతదాకేటికీ, ఈ సుట్టుపక్కల నీకెరికైన జాలర్ల కుటుంబాల్లో ఇంటికి ఒక్కల్లైనా ఏట్లో కలిసినోల్లు లేకుండా, ఎవుల్లైనా ఉన్నారా చెప్పు ? మీ అన్నయ్య ఏట్లో గలిసిన కాడ్నుంచి, నేనూ ఆల్లు, ఈళ్ళు దెచ్చిన చేపలు యీదులెంట అమ్ముకుంటా బతుకుతన్నా. ఎంతకాలమని నేను మాత్తరం  మీకు తిండి పెడతాను? నా బాదలు నాకున్నాయ్. ఓ ఆదారం సూసుకోవాల. మన బతుకులింతేనే సుక్కా, అర్ధం చేసుకొవాల. సాగిపోవాల. ఎట్టాగొట్టా ఓ దారి సూడు.”
“చంటోడిని వదిలి యాడికిబోతా అక్కా? యాం జేస్తా? అగో, ఆడున్న బండెడు ఉప్పునీల్లు, అందులో ఉన్న జీవాలు, ఇసుక, నురుగు... ఇవిగాక నాకేటి తెలుసు? నానేటి సేత్తాను? నువ్వే చెప్పు?”

“అగ్గదీ. ఇప్పుడు నా దారికొచ్చినావు. ఈ ఇసుక, నీళ్ళు, జీవాలతోనే కొత్త బతుకు గడిపేదానికి సిచ్చన ఇత్తారంటా. మన బెస్త గూడెంలో అంతా పేర్లిస్తా ఉండారు. నీ పేరూ ఇచ్చేసి వచ్చినా. ఇగో, మనసుంతోల్ల కోస్కరమే ఎతుకులాడకుంటా సర్కారోల్లు ఎవుల్లో ఈడికి వచ్చుండారు.  సేపల తొట్టెలు సేసి, అందులో మనకు దెల్సిన నీళ్ళే బోసి, సేపలు పెంచి, అమ్మి, యాపారం సేసుకుని బతకడం నేర్పుతారంట. అంతేకాదు, మచ్చకార సంఘం కూడా పెడతారంట. అందులో సేరే దానికేదో దుడ్లు కట్టమంతన్నారు. అదేదో నేను సూత్తా గాని సుక్కా, నువ్వా సిచ్చనకు పోవాలే. నా మాట తియ్యకు, ఒక పది రోజులు సంటోడి మాట నేను సూసుకుంటా. ఇంకేం జెప్పకుండా రేపటి కాడ్నుంచి ఎల్లవే. నీ బతుకే మారిపోద్ది. ఇవి సేతులు గాదు, కాల్లనుకో,” సుక్కి సేతులు బట్టుకు కళ్ళలోకి సూత్తా అంది లచ్చిమి.

“అంత మాటనకు వదినీ. పెద్దదానివి, నాకంటూ ఉన్నది నువ్వేగా. సిచ్చనకి పోతాలే. బెంగెట్టుకోబాక,” తన చేతులు విడిపించుకుని, కళ్ళు తుడుచుకుంటా అంది సుక్కి.

“మరైతే ఏదీ, పున్నమి రేతిరి పుచ్చపువ్వు పూసినట్టు నవ్వే మా సుక్కి నవ్వేదీ, ఓ పాలి నవ్వు పిల్లా, శానా రోజులైంది“ సుక్కి గడ్డం పట్టుకు బతిమిలాడతా, సక్కిలిగింతలు పెడతా అడిగింది లచ్చిమి. కిలకిలా నవ్వింది సుక్కి.

బెస్తపాలెం పక్కన ఉన్న బంగాళా... వసారాలో కూర్చుని ఉన్నారు జాలరి మహిళలు... వాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన శ్రీకళ ఇలా చెప్పసాగింది.

“చూడండి.  ఇంతవరకూ మీకు తినే చేపల గురించే తెలుసు. కానీ మేం ఇక్కడ శిక్షణ ఇవ్వబోతున్నది వాటి గురించి కాదు. అలంకరణగా ఉపయోగించే చేపల గురించి. వాటితో చేపల తొట్టెల తయారీ గురించి నేర్పుతాం. అలంకరణ చేపలకు ఏ ఉష్ణోగ్రతలు అనువుగా ఉంటాయి, చేప పిల్లల వృద్ధి చేయడానికి ఎలాంటి నైపుణ్యాలు పాటించాలో చెబుతాం. వాటితో పాటూ... అద్దాలు కత్తిరించి వాటికి నగిషీ అద్ది, పెట్టెలుగా తయారుచేయడం వాటిలో మొక్కలూ, రంగురాళ్లూ, లైట్లూ అమర్చడం వంటి విషయాల్లో శిక్షణ ఇస్తాం. ఒక వేళ చేపలకు ఏవైనా వ్యాధులు వస్తే నివారించడం ఎలానో  నేర్పుతాం. “ ఆమె చెబుతుండగానే దిగ్గున లేచింది పోలి. 

“నువ్వు సెబుతుంటే బాగానే ఉండాది. కాని, మాకు సదూకోడానికి బడిలేదు. సేతిలో సిల్లి గవ్వ నేదు. రోగం వస్తే నయం చేయించుకునే దానికి ఆసుపత్రుల్లేకున్నా, మా మగోల్లు సంపాదించినదంతా తగలేట్టడానికి అడుగుకో సారా దుకాణం మాత్రం ఉండాది. అసలు సదువే రాని మాసుంతోల్లు ఇయ్యన్నీ నేర్సుకోగలరా? సేయ్యగాలరా?” సాగతీస్తూ, చేతులు తిప్పుతూ అంది పోలి.

ఆమె వాలకం చూసి నవ్వి, ఇలా అంది శ్రీకళ“ చాలా మంచి ప్రశ్న వేసావు. మీలాంటి బెస్త మహిళలే ఈ రోజున బ్రతుకులు  మార్చుకుని, బాగుపడ్డారు. ఆ సంగతి చెబుతాను వినండి. మేము చెప్పిన ఈ నైపుణ్యాలతో ఐదునెలల క్రితం విజయనగరం జిల్లా బెస్తకాలనీలో అక్వేరియం అమ్మే దుకాణాన్ని ప్రారంభించారు అక్కడి జాలరి మహిళలు. మా శిక్షణ, శ్రమ వృథా కాలేదు. ఇప్పుడు చేపలతొట్టెలు కొనేందుకు ఎంతో మంది అక్కడికి ఇష్టంగా వస్తున్నారు. రోజూ ముగ్గురు చొప్పున దుకాణంలో ఉండి ఈ తొట్టెలని తయారుచేస్తుంటారు. కాస్త చేయి తిరిగిన వాళ్లయితే అరగంట నుంచి గంటలో ఓ పెద్ద అక్వేరియంని సులభంగా తయారుచేసేస్తారు. అందుకే మీరూ వాళ్ళ లాగా లాభం పొందాలనే మేము ఇక్కడికి వచ్చాము.”

అక్కడున్న జాలరి మహిళల మొహాల్లో ఆ మాట వినగానే కొత్త ఆనందం తొంగిచూసింది. ఎలాగైనా నేర్చుకుని, సాధించాలన్న ఆశ పెరిగింది. రకరకాల చేపల ఇంగ్లీష్ పేర్లు నేర్చుకున్నారు. చూస్తుండగానే వారు గోల్డ్‌ ఫిష్‌, టెట్రాష్‌, డాలర్‌ ఫిష్‌, గప్పీలూ, మోలీష్‌, కోయ్‌ కార్ప్‌, ప్యారెట్‌ ఫిష్‌ వంటి చేపరకాలనీ, గమ్మత్తుగా పలకసాగారు. శిక్షణలో భాగంగా చేపల తొట్టెలో ఉంచే అలంకరణ వస్తువులని హోల్‌సేల్‌లో ఎలా కొనచ్చో చెప్పారు. ఈ  చేపలతోపాటూ ప్యారెట్‌ ఫిష్‌ వంటి అరుదైన రకాలని కూడా సేకరించడం, విక్రయించడం ఎలాగో చెప్పారు. 

“ప్యారెట్‌ ఫిష్‌  - విజయనగరం దుకాణంలో తక్కిన చేపలు  జత నలభై, యాభై ఉంటే, ఇవి మాత్రం జత ఏడొందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకూ అమ్ముడు పోతాయి. ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉండి, అరవై రూపాయల నుంచి 300రూ.ల మధ్యలో ధర పలుకుతాయట. రోజుకి చిన్నవీ, పెద్దవీ చేపలు అన్నీ కలిపి డజను వరకూ అక్కడ అమ్ముడుపోతున్నాయి. సాయంత్రం పూట సిమెంట్‌ తొట్లలో ఉన్న చేపల ఆరోగ్యాన్ని అక్కడి సభ్యులు పరీక్షిస్తారు. అవసరం అయితే మందులు వేస్తారు. ఎందుకంటే చేపలకి ఏదైనా జబ్బొస్తే తక్కిన వాటికి వ్యాపిచడం తేలిక. అందుకే ఆ పని పెద్ద సవాల్‌ . రోజుకి వెయ్యి రూపాయలు విలువ చేసే చేపల్ని ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు, ఆనందంగా ఉన్నారు.’ బోర్డు మీద బొమ్మ వేసి చూపుతూ చెప్పింది శ్రీకళ. 

ఆ పది రోజులూ అనేక విషయాలు తెలుసుకుంటూ వారికి పది క్షణాలలా గడిచిపోయాయి. చలాకీగా, చురుగ్గా ఉండే సుక్కి, అన్ని పద్ధతులూ త్వరగా నేర్చుకుని, అందరికీ తలలో నాలుకలా మారిపోయింది. సుక్కి బతుకులో మళ్ళీ వెలుగును చూసి, మురిసిపోయింది లచ్చిమి. మత్స్యకార సంఘానికి ప్రభుత్వ సబ్సిడీ కూడా లభించింది. స్థానిక నేతలు ధనసహాయానికి ముందుకు వచ్చారు.

“మత్స్యకన్య అక్వేరియమ్స్” అనే పేరుతొ శిక్షణ పూర్తయ్యాకా అక్కడి మహిళలు ఒక దుకాణం ప్రారంభించారు. అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లు ఓపిగ్గా ఎదుర్కున్నారు. నెమ్మదిగా హోటళ్ళ నుంచి, ధనవంతుల నుంచి పెద్ద పెద్ద ఆర్డర్లు రాసాగాయి. చేపల తొట్టి లోపల సరికొత్తగా అలంకరించడంలో జిల్లా మొత్తం పేరు పొందింది సుక్కి. బెస్త గూడానికి శ్రీకళ మేడం ప్రోత్సాహంతో చిన్న బడి, ఆసుపత్రి వచ్చాయి. ఆరు నెలలు గడిచేసరికి వాళ్ళ గుడిసెల స్థానంలో రేకుల షెడ్లు, పక్కా ఇళ్ళు నిర్మించుకున్నారు. 
ఒక రోజున చేపల తొట్టిలో రంగురాళ్ళు, చిన్న మోటారు, నాచు మొక్కలు అలంకరించసాగింది సుక్కి. ఇంతలో అక్కడికి పరుగున వచ్చింది లచ్చిమి. నోట మాట రాక వగరుస్తూ నిల్చుంది.
“ఏం వదినీ, యాంది సంగతి, అట్టా పడతా లేస్తా వచ్చినావు?” చేస్తున్న పని ఆపకుండానే అడిగింది సుక్కి.
అయినా లచ్చిమి పలకలేదు. ఆమె కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారసాగింది. లచ్చిమి స్థితి చూసి, కంగారుగా అటు నడిచింది సుక్కి. ఆమె భుజాలు పట్టుకు కుదిపి, “ఏటైనాది వదినీ, సెప్పు, “ అని అడిగింది.
రొప్పుతూనే దూరంగా తనకు కుడి వైపుగా చేయి చాచింది లచ్చిమి. అక్కడ అస్పష్టంగా ఏదో రూపం... సుక్కి ప్రేమకు ప్రతిరూపం... ఆమె ప్రాణమే ఆకృతి దాల్చిన రూపం... నెమ్మదిగా, ఆశగా తనకేసే రాసాగింది. రామయ్య... పోల్చుకోగానే, సుక్కి బొమ్మలా అక్కడే నిలబడిపోయింది. 
“రావుడు మావా...” అప్రయత్నంగా పలికాయి ఆమె పెదాలు. దగ్గరకొచ్చి, ఆమెను ఆత్రంగా హత్తుకున్నాడు రామయ్య.
“ఏమైపోనావు మావా? ఇన్నాల్లు ఏడున్నావు? “ ఒళ్ళంతా తడుముతూ అడిగింది సుక్కి.
“తుఫాన్లో సిక్కుకు మునిగిపోనానే సుక్కి. అటుపైన నాకేటీ తెలవదు. ఎక్కడో ఒడిస్సా లో తెలానంత. అక్కడి ఆశ్రమంలో సాములోర్లు తీసుకుపోనారు. ఇన్నాళ్ళు శవంలా కోమాలో పడున్నానంత. తెలివి కలిగాకా, నా ఆరాలు అయ్యీ అడిగి, ఈడికి పంపినారు ఆ దేవుల్లు. నేరుగా నా దేవత కాడికే పంపినారు. నీ పేవే నా పాణం కాపాడిందే సుక్కీ, నీ కోసరమే నాను బతికినాను.” ఉప్పొంగే ఆనందంతో గొంతు జీర పోతుండగా అన్నాడు రామయ్య.
“ నా మావని కాపాడిన దయగల సాములు, నూరేల్లు బతకాల. ఇగో మావా, మన సంటోడు, యీడు పుట్టినాకా నువ్వు సూడలేదుగా, ఎత్తుకో. “ కొడుకుని అందిస్తూ అంది సుక్కి. 
మళ్ళీ ఒక్కటైన ఆ జంట సంబరాన్ని చూస్తూ, కష్టాల తీరం దాటిన బతుకులన్నీ సుక్కిని, రామయ్యను, చల్లగా దీవించాయి.

 ***

No comments:

Post a Comment

Pages