"పెండ్లికూతురి ఆతృత"
ఆండ్ర లలిత
సాహితీకి ఎంత ప్రయత్నించినా నిద్ర రావటంలేదు. పక్కకి ఒత్తిగిలి, చీకట్లో కళ్ళు చిట్లించుకుంటూ తన మంచం పక్కన బల్ల మీద చార్జింగ్లో ఉన్న మొబైల్ ఫోన్ అందుకుంది. మొబైల్ చూసి సమయం చూసుకుంది. రాత్రి ఒంటి గంటైంది. ఒక వారం రోజుల క్రితం తన పెళ్ళి కుదిరిన విషయం తనకి తెలిసినప్పటి నుంచీ అడప తడప ఇదే పరిస్థితి తనది. సాహితీకి తను భర్తగా స్వీకరించాలనుకుంటున్న రాజేష్ నచ్చాడు. కానీ ఈ నచ్చాడన్న అనుభూతిలో ఎంత ఆనందముందో, మరొక ప్రక్క అంతే భయం కూడా! తన పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతున్నకొద్దీ, తన వాళ్ళనుంచి దూరం వెళ్తున్న భయం. ఎక్కడకో తెలియని వివాహ బంధాలతో ముడిపడుతున్నాననే భయం. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తనకి కావలసిన విధంలో జీవిస్తూ, తన వాళ్ళ మధ్యలో ఉండక, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాననే భయం. తన పెళ్ళైయాక తనకు కొత్తగా ఏర్పడే బంధాలు అనుభందాల ప్రహేళికలు విప్పగలనో లేదో అనే భయం. కుటుంబాన్ని, తనకీ రజేష్కి కావలిసినట్లు సమకూర్చుకోవాలనే ఆరాటంలో తెలిసీ తెలియక చేసే తప్పులు దిద్దుకోగలమో లేదో అనే భయం. రాజేషూ తనూ ఒక్క తాడుమీద భవసాగరంలో ఈదుతూ ఎవరి ఆశయాలను వారు సముదాయించుకుంటూ, ఒక మాట ఒక బాట మీద నడిపించగలమో లేదో అనే భయం. పెళ్ళి తరువాత ఏర్పడ్డ ఆశ నిరాశాల వలలో చిక్కుకున్న మనసులను ఒకటిగా నడిపించగలమో లేదో అనే భయం. కాల చక్రంలో అగుపడే ఎండమావుల వెంట పరుగులు తీస్తూ ఎక్కడకి చేరతామనే భయం. ఆ పరుగులలో జీవిత కాలంలో తప్పటడుగులు పడచ్చేమోనని! అదీ తెలీయదు. అలాంటి తరుణంలో అవన్నీ ఎక్కడివి అక్కడ వదిలేసి మళ్ళీ తిరిగి పాత రోజులు, బంధాల మధ్యలోకి రాగలమో లేదోయనే భయం. ఈ భయాలు, ఆందోళనల ఆలోచనలు ఆతృతమాత్రమేనని,అదే anxiety అని, బయటకి రావాలనే ప్రయత్నంలో సాహితీ మంచం మీద నుంచి లేచి దీపం వేసుకుంది . కాస్త మంచినీళ్ళు తాగిపడుకుందామనే ఆలోచనతో, భోజనాల గదిలోకి వెళ్ళి సన్నగా వెలుగుతున్న నీలపు దీపకాంతిలో టేబుల్ మీదున్న చిన్న కూజా నుంచి గ్లాసులోకి నీళ్ళను వంపుకుని గడ గడా తాగింది. రెండుసార్లు అటూ ఇటూ పచారులు చేసింది. కానీ మన స్థిమితం రాలేదు. ఏమి చేయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్న సాహితీకి ఎప్పటిలాగే తన మనసు బామ్మ గదికేసి లాగింది. ఆప్తబంధువైన బామ్మతో పంచుకుందామని బామ్మగదిలోకి వెళ్ళి దీపంవేసింది, బామ్మ దీపపు కాంతికి లేచి, “ఏరా నిద్ర పట్టటంలేదా,రాజేష్ గుర్తు వస్తున్నాడా!”అంది చిరునవ్వుతో ఆట పటిస్తూ సాహితీతో.
“పో బామ్మా. అదేమీ కాదు. మీ అందరి మీద బెంగ. జరుగు బామ్మా నిన్ను పట్టుకుని నీ దగ్గర చిన్నప్పుడులాగ పడకుంటాను. అప్పుడు నిద్ర పట్తుందేమో” అలసి వాడిపోయిన ముఖంతో అంటూ బామ్మ మంచంమీద పడుకుని పక్కకి ఒత్తిగిలి బామ్మ పొట్ట మీద చేయి వేసింది సాహితీ.
“సరే పండు. దీపం తీయటం మర్చిపోయావు. కాస్త దీపం తీసేసిరా” అంది బామ్మ ముద్దు చేస్తూ సాహితీతో. సాహితీ లేచి దీపం తీసి వచ్చేలోపల బామ్మ గురక పెట్తూ నిద్రలోకి జారుకుంది. సాహితీకి మటుకు నిద్ర రాలేదు. బామ్మా కేసి సాహితీ చూస్తూ, “బామ్మా లే... మాట్లాడుకుందాం. నిద్దర రావట్లేదు. బెంగగా ఉంది. ఎదో ఒకటి మాట్లాడవా?”అంటూ బామ్మ పొట్టపట్టుకుని కుదపసాగింది సాహితీ.
నిద్ర మెలుకువ తెచ్చుకుంటూ సాహితీ కళ్ళలోకి చూస్తూ “ఏవిటే తల్లీ దేనికి భయం. రాజేష్ ఇష్టంలేదా నీకు”అని అడిగింది.
“అలా ఏమీ లేదు. మిమ్మల్ని అందరిని వదలాలంటే బెంగ. అసలు నాకు తెలియక అడుగుతానూ, నువ్వు మీ అమ్మా నాన్నాలనీ తోబుట్టువులనూ, ఇంకా అందరిని ఎలా వదలగలిగావు బామ్మా, ఒక్క తాతయ్య కోసం. నీదేమన్నా రాతిగుండేమో. నాదికాదు. నేను ఉండలేను బాబు. నిన్ను వదిలి అసలుండలేను. అందుకే బుద్ధివచ్చింది బామ్మా నాకు. ఈ జీళ్ళపాకంవంటి బంధాలలో ఇరుక్కోకూడదు. ఎంత చాలా తప్పు చేయబోతున్నానో బామ్మా. ఇక నేను ఇరుక్కోను....మరెవ్వరినీ ఇరికించను. అసలు చెప్పు నువ్వు బామ్మా, ఒక ముక్కూ మొహం తెలియని వ్యక్తి కొరకు ఇంకా వారి కుటుంబం కొరకు చిన్నప్పటి నుంచి పెనవేసుకొన్న మన బంధాలు వదులుకోవాలా? మీరందరూ నాకు దూరమౌతారంటే ఈ పెళ్ళెందుకు. నాకు వద్దు ”అంటూ బరువెక్కిన గుండె భారం దింపుతూ అంది సాహితి బామ్మతో.
బామ్మ చిరునవ్వుతో సాహితీని దగ్గరకు తీసుకుని, తల నిమురుతూ “నువ్వు చిన్నప్పుడు అమ్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండగలిగే దానివి కాదు. అమ్మే నీ జీవితం. అమ్మ ఒడియే నీకు పట్టు పానుపు. అమ్మ గుండెలమీద పెరిగావు. అమ్మ నీదన్న తలపులు నీకు మనోధైర్యమిచ్చేవి. అమ్మ నీది.నిన్ను వదలి ఎక్కడికీ వెళ్ళదనే ధైర్యంతో మరింత సంతోషంగా ఆడుకునే దానివి. ఒకొక్క సారి నీ దోరణిలో నీవు నిమగ్నమైనా , అమ్మ గుర్తుకు వచ్చిన వెంటనే, ఒక్కసారి అమ్మ ఎక్కడుందో చూసుకొని వెళ్ళేదానివి. అలాగే ఇప్పుడు కూడా బెంగ పెట్టుకోకు. అమ్మ నీలోనే ఉంది.అయినా అమ్మతో మాట్లాడాలంటే ఒక్కసారి ఫోన్లో మాట్లాడు సాహితీ. ఇంక భయమెందుకే తల్లి. మనసు ఆనందంగా ఉంచుకుని, ప్రతీ నిమిషం అనుభవిస్తూ ఆనందిస్తు జీవించు అమ్మడు. జరిగిన కాలం తిరిగి రాదు సాహితీ. బంధాలలో మనము పెనవేసుకున్నపుడు ఒడుదుడుకులొచ్చినా తట్టుకోగలము. అవును నిజమేను,అవి జీళ్ళపాకంవంటివి. ఒకొక్కసారి మనస్థాపలకి గురి చేస్తాయి. కానీ బంధాలు నిలుపుకోవాలంటే అన్ని రుచులను అనుభవించాలి. అప్పుడే ఎప్పటికీ తెగిపోకుండా జీళ్ళపాకంలా సాగుతూ మనకి ఆపదవచ్చినప్పుడు మన బంధాలు మనకి అండగా నిలబడతాయి. సాహితీ నువ్వు బంధాలు వద్దనుకుంటే ఎలా! ఈ బంధాలు బల పరచుకోకపోతే ప్రేమ, వాత్సల్యం, మమకారం ఎలా వస్తాయి తల్లీ. ఒక్కసారి సాహితీ నీ గతం నెమరేసుకో. నువ్వు పుట్టినప్పటినుంచీ బంధాలు అనుబంధాలలో పెరిగావు. చాలా బంధాలనుంచి అవనరమైనంత, బయటకి రావడం కూడా నేర్చుకున్నావు నీకుతెలియకుండానే. నవ్వు గమనించలేదు. మనిషి తన వాంఛలను తీర్చుకోవడంలో లేక తనంతటతాను ఒక మనిషిగా బ్రతకంకోసంమో కొన్ని బంధాలను పెంచుకుంటూ కొన్నిటిని మనసున దాచుకుంటూ లేక మరుగుపరుస్తూ సహజంగా పెరుగుతాడు. అదే, కొన్ని రోజుల తరువాత తనంతటతానుగా బడికి వెళ్ళి పోవడం, స్నేహితులతో ఆటలకి వెళ్ళి పోవడం, బ్రతుకు తెరువు లేక ఏదో సాధించాలనే తపనతో పెద్ద చదువులకో లేక వృత్తులకో వెళ్ళి పోవడం అలా. తెలియకుండానే బంధాలు పెంచుకోడం వదులుకోడం లేక మరిచిపోవడం అభ్యాసం అయిపోతుంది, అవ్వాలి కూడా. అది సహజ ప్రవృత్తి. శిశువుగా వచ్చి, మనిషిగా తయారయ్యి, తోటి మనషులతో సహజీవనం సాగించి, ప్రకృతి వాంఛలను బాధ్యతలను సామాజక నిబధ్ధంగా తీర్చుకుని సంఘంలో బ్రతకాలి. ఈ ప్రయాణంలో పెళ్ళి చేసుకుని మన జీవితం మనం ఏర్పరుచుకోవడంకూడా ఒక దశ, అది మనందరము వెళ్ళే దారే” అంది బామ్మా సాహితితో తృప్తిగా.
“కానీ బామ్మా! ఈ బంధాలు మాసిపోతున్నాయనే ఆలోచన నన్ను బాధపెడుతోంది. ఒక్క సారి బంధం ఏర్పడ్డాక చెరిగి పోతుందేమో అనే భయం. ఒద్దు బామ్మా”అని సాహితీ బామ్మ వడిలో తల పెట్టుకుని నడుము వాల్చింది.
“కలత పడకు తల్లి. నా అనుభవంతో చెపుతున్నాను. ఒక బంధం చెరిగిపోతుంటే మరో బంధం మనని లాగుతుంది. మీ తాతయ్య శివైక్యం చెందినప్పుడు, అంతా చీకటిమయమైన నా జీవితంలో నీవు వచ్చి నాకొంగు పట్టుకుని లాగి, కన్నీరులో మునిగియున్న నా కళ్ళు తుడిచావు. బుడిబుడి నడకలతో నన్ను మైమరిపించావు. చిలక పలుకులు పలికి నువ్వు నన్ను ఆనందింపచేసావు. తాతయ్యలేని జీవితం వ్యర్థమనిపించిన నాకు, నేను నీకు కావలని చెప్పి మన ఇద్దరి మధ్యలో బంధం ఏర్పరిచావు. నీకోసం నేను జీవించాలని ఆశ కల్పించావు. బంధాలు అనుబంధాలు మనని జీళ్ళపాకంలాగ పెనవేసంకున్నా, సమన్వయతతో ఆలోచిస్తే అవి మనని స్థితప్రజ్ఞులుగా మారుస్తాయి.” అంది బామ్మా సాహితీకి తన పాత జ్ఞాపకాలను నెమరేస్తూ.
“ఇప్పటికీ అమ్మంటే నాకిష్టం..కానీ ఇప్పుడు నేను తనతో పంచుకోలేను గా. ఈ విషయం. మా బుజ్జి అమ్మ బాధ పడదూ. తను బాధపడకుండా చూసే బాధ్యత నీది బామ్మా. తను మీ అందరితో నవ్వుతూ ఉన్నా! తన మనస్సులో మటుకు నా గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. నేను దూరం వెళ్ళిపోయాననే, నా మీద బెంగతో” అన్న సాహితీ మాటలు బామ్మ మనసులో సాహితీ మీద బెంగ తెప్పించాయి. . కానీ బామ్మ తన బాధ తన మనసులో పదిలంగా దాచుకుని, బయటకి ఎక్కడా తేలకుండా “ఔనే పిచ్చి పిల్ల, నేను ఉన్నాగా చూసుకుంటా. నిశ్చింతగా ఉండు. అయినా అమ్మ ని ఊరికే ఉండనిస్తామా! మా బంధాలతో పెనవేయమూ” అంది బామ్మ సాహితి కళ్ళల్లో చూస్తూ.
“ఇంకా చెప్పు బామ్మ”అంటూ సాహితీ ప్రేమతో బామ్మ చేయి పట్టుకుంది.
“ఎంత సేపు అమ్మ చుట్టూ గిరగిరా తిరిగే దానివి. మూడేళ్ళు వచ్చాక బడిలో వేసారు, మీ అమ్మా నాన్నా. మొదటి రోజు మా అందరికీ టాటా చెప్పి నవ్వుకుంటూ బానే వెళ్ళావు సాహితీ అమ్మ చెంకెక్కీ. కానీ అక్కడ అమ్మ నిన్ను వదిలి వచ్చేస్తుంటే గుక్క తిప్పుకోకుండా ఏడ్చీ , ఇంటికి వచ్చేసావు. వారానికి రెండు రోజులు బడిలో నిన్ను కూర్చో పెట్టటం గగనం. అలాంటిది మెల్లి మెల్లిగా చదువుకోవాలనే ఆశక్తి పెరగడం. చదువుల సరస్వతి ప్రసన్నించి నీకు ఎన్నో ప్రశంసలు అందుకునేలా చేయటం జరిగింది సాహితీ. అలా బడి నచ్చి, దృష్టి చదువుకేసి మళ్ళి బడి అలవాటైంది. అదేకాదు ఇంకొకటి మెల్లి మెల్లిగా నీకు అర్థమైనది. ఇంట్లో నీకు ఏర్పడిన బంధాలు, నీకు సొంతమనీ అవి నువ్వు పదిలంగా గుండెలలో దాచుకుని ముందుకు సాగి పోవాలని. అలా అలా ఈ రోజు మంచి డాక్టర్ అయ్యావు. అలాగే సంసార బంధాలను అర్థంచేసుకుంటూ మానవసేవే మాధవసేవ పద్ధతిలో సాగి పో తల్లీ. మేమంతా నీ వాళ్ళం. నీ మనసులో మాకు ఎలా చోటుందో, మా మనసులో కూడా నీ చోటు శాశ్వతం. అయినా మనసులో ఒకసారి స్థానం ఏర్పాడ్డాక ఎప్పటికి చెరిగిపోదు. ఎన్ని రోజులైనా లేక ఎంత దూరాన్నున్నా. మన ఒత్తిడ్ల కాలుష్యంతో మాసిపోవచ్చు. కానీ చెరిగిపోదు సాహితీ. సాహితీ నువ్వు మా మీద బెంగ వదిలి మేము నీతోనే ఉన్నామని అర్థం చేసుకుని మీ అత్తావారింట్లో నాజుకైన కొత్త బంధాలలో మమేకమై, దృడపరుచుకోవాలి. వాళ్ళ నోట్లో నాలుకలాగ మసులుకుంటూ ముందుకు సాగిపో తల్లి. నాదీవెనలు నువ్వు ఎక్కడున్నా నీవెంటే. సాహితీ, పిచ్చి తల్లీ పడుకో.
బంధాల మాధుర్యం అనుభవించనిదే బంధాలను సన్యసించగలమా. చెప్పు సాహితీ.. రేపు పొద్దున్నే లేవాలి. ముస్తాబవ్వాలి. పెళ్ళికూతురుని చేస్తారు నిన్ను. ఒక్క రెండు గంటలన్నా నిద్ర ఉండాలిరా. పడుకో అమ్మడు. మనసు పాడిచేసుకోకు. అంతా సవ్యంగా జరుగుతుంది. ఆ భగవంతుని దయవల్ల. నేను చూసుకుంటాను అమ్మని. నిశ్చింతగా రాజేష్ కుటుంబంలో కలిసిపో”అంది బామ్మ తన బంగారు పట్టి సాహితీ మనమరాలిని చిరునవ్వుతో జోకొట్తూ.
“బామ్మా నీ మనవరాలిని బామ్మా. అందరిని ఆకట్టుకుంటాను.నా కొత్త ప్రయాణం చిరునవ్వుతో మొదలు పెడ్తాను”అంటూ బామ్మని పట్టుకుని ఆదమరిచి సాహితి పడుకుంది.
***
No comments:
Post a Comment