రఘుకులతిలక శతకము -దిట్టకవి రామచంద్రకవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవిపరిచయం:
దిట్టకవి రామచంద్రకవి గురించి మనం ఈ కవి వ్రాసిన మహిషాసురమర్ధని శతకంలో చర్చించుకున్నాము. క్రీ.శ. 1750 ప్రాంతములలో జన్మించిన ఈ కవి దిట్టకవి వంశమున వాడు. ఆర్వేలనియోగి. కాశ్యపగోత్రుడు. శకుంతలా పరిణయము, సేతుమాహాత్మ్యము, రామకథాసారముని తచించిన దిట్టకవి పాపరాజకవి ఈతని తాత. రంగరాయ చరిత్రమును రచించిన దిట్టకవి నారాయణకవి ఈతని తండ్రి. ఈకవి ఆంధ్రసంస్కృత కవితావిశారదుడేకాక, శాపానుగ్రహ సమర్థుడు కూడా. ఈతని ప్రతిభ ఈ క్రిందిపద్యం వనల తెలిస్తుంది.
దిట్టకవి రామచంద్రుడు
దిట్టిన రాయైనఁ బగులు దీవించిన యా
బెట్టైన చెట్టుచిగురగు
గట్టిగఁ దొల్లింటి భీమకవి కాఁబోలున్
ఈకవి నివాసము కృష్ణాజిల్లా నందిగామాతాలూకా గొట్టుముక్కల. ఊయ్యూరు తాలూకాలోని పెదమద్దాలి గ్రామమునకూడా ఈతను కొంతకాలం నివసించాడు. ఈయన బహుగ్రంధకర్త. ఈతని రచనలు 1. రఘుకుల తిలక శతకము. 2. మహిషాసురమర్ధనీశతకము, 3. ఉద్దండరాయ శతకము, 4. రాజగోపాల శతకము, 5. హేలావతీదండకము, 6. వాసిరెడ్డివంశ చరిత్ర.
శతకపరిచయం:
రఘుకులతిలక శతకము కందపద్య శతకము. ఇంది 101 కందపద్యములు గల భక్తిరస శతకము. మకుటము "రఘుకులతిలకనిటలతటనటదలకా" అని యుండుటచే సర్వత్రతవర్గయతి కలిగిన శతకము. ఇందలి పద్యములలో శ్రీరాముని దివ్యలీలలు కవి సజీవముగా చిత్రించినాడు. శ్రీరాముని దయ శాంతిమానవాతీత లీలలను ఒక్కక్కటి ఒక్కొక్క పద్యమున కూర్చినందువలన అత్యంత మనోహరమై భక్తులకు ప్రమోదము కలిగిస్తాయి.
కొన్ని పద్యాలను చూద్దాము.
కం. నానాఁటికి నానోటికి
తేనై చెఱకై యనంటితెఱఁగై వెఱఁగై
యానందమొసఁగు నీయభి
ధానము రఘుకులతిలక నిటలతటనటదలకా
కం. 'రామా' యనువర్ణద్వయి
లో మఱిపాపములఁ దోలు లోనికిచొరకుం
డా 'మా' కవాటమగు శుభ
ధామా రఘుకులతిలక నిటలతటనటదలకా
కం. ఊడుతయొకఁ డిసుము సేతువు
నిడినంతనఁ గరుణజేసి యేలితివఁట యీ
యెడ నాయెడ్ గృపసేయుట
తడవా రఘుకులతిలక నిటలతటనటదలకా
కం. శరణన్న యంతమాత్రనె
పరికించి విభీషణునకు బహుతరవిభ
స్థిరసుఖ మొసఁగినయఖిలో
త్తరుఁడవు రఘుకులతిలక నిటలతటనటదలకా
శతకమున 73వ పద్యమునుండి 82 పద్యము వరకు దశావతార వర్ణనము కావించినాడు.
కం. వరాహరూపమున నమ
రారి హిరణ్యాక్షుఁ దునిమి యవనివిషాణో
ద్ధారతం జేసిన జగదా
ధారక రఘుకులతిలక నిటలతటనటదలకా
కం. వామనుఁడవగుచుఁ ద్రొక్కితి
మోమోటములేక బలిని మూఁడడుగు లిలన్
గామించి మనిపితివి సు
త్రామున్ రఘుకులతిలక నిటలతటనటదలకా
పురాణాలలోని మరికొన్ని ఘట్టాలను మనోహరమైన కందపద్యములలో చిత్రించిన ఈ కవి ప్రతిభ అద్భుతం
కం. కొంచక మోహినివై మఱి
వంచించితి నసురవరుల వడి సురలకునై
నించితి నమృతము సుగుణో
దంచిత రఘుకులతిలక నిటలతటనటదలకా
కం. త్రిపురములను గూల్చునప్పుడు
త్రిపురారికిఁ గొండవింటాదివ్యాస్త్రమవై
నిపుణత నెఱపితివి పరం
తపుఁడవు రఘుకులతిలక నిటలతటనటదలకా
ఆంధ్ర సంస్కృతాలలో దిట్ట యగుటవలన ఈ కవి కొన్ని కందాలను సంస్కృతంలోనే రచించారు.
కం. గహనటసైన్యసేవిత
గుహనాంకిరాతవినుత గుణధూర్వాహన
కుననాసురవంశవనీ
ధన రఘుకులతిలక నిటలతటనటదలకా
కం. ప్రాచేతసకవికవితా
వ్యాచిక్రింసాభిరామ హర్షితహృదయా
యాచకకాంక్షాఫలసం
ధాచణ రఘుకులతిలక నిటలతటనటదలకా
మా మవ తవ దాసోహం
కామితఫలద ప్రభావకరుణాసింధో
త్వమేవ నహి శరణ్యం
ధామగ రఘుకులతిలక నిటలతటనటదలకా
ఇంత చక్కని భక్తిరసమయ శతకం అందరూ చదవదగినది. మీరూ చదవండి. ఇతరులచే చదివించండి.
***
No comments:
Post a Comment