శ్రీరంగనాథ క్షేత్రాలు - 3
శ్రీరామభట్ల ఆదిత్య
శివనసముద్రం { మధ్య రంగం } ( మాండ్య జిల్లా, కర్ణాటక )
శ్రీరంగపట్నం నుండి దాదాపు 80 కిలోమీటర్లు దిగువన ఉంటుంది శివనసముద్రం, అదే మధ్యరంగ క్షేత్రం. శివనసముద్రం కూడా మాండ్య జిల్లాలోనే ఉండడం విశేషం. ఈ ఊరు మాండ్య - చామరాజనగర జిల్లాల సరీహద్దులో ఉంటుంది.
ఇక్కడ కూడా కావేరి నది రెండు పాయలుగా చీలిపోతుంది. ఇక్కడ శివనసముద్ర ద్వీపమే నదిని రెండుగా చీలుస్తుంది. అలా రెండు పాయలుగా చీలిన నది అక్కడ కాస్త దూరం ప్రయాణించాక కిందకు దూకుతుంది అలా అద్భుతమైన జలపాతం ఏర్పడుతుంది. దీన్నే శివనసముద్ర జలపాతం అంటారు. ఈ జలపాతం 305 మీటర్ల వెడల్పుతో 93 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ఈ రెండు జలపాతాలను గగనచుక్కి మరియు భారచుక్కి అంటారు. ఇక్కడ ఆసియా ఖండంలోనే మొదటగా నిర్మించిన జలవిద్యుత్ కేంద్రం ఉంది.
ఇక ఆలయ విషయానికి వస్తే ద్రావిడ శైలిలో అద్భుతమైన ప్రాకారాలతో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ రంగనాథస్వామిని 'మోహన రంగ'డని, 'జగన్మోహన రంగ'డని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ రంగనాథస్వామి యవ్వన రూపుడని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ విగ్రహం అత్యంత సుందరంగా ఉంటుంది. అలాగే ఈ విగ్రహం పూర్తిగా 'శాలగ్రామ' శిలతో తయారుచేయబడింది అంతేకాక శివకేశవ అభేదానికి ప్రతిరూపంగా ఇక్కడ శివుడు సోమేశ్వరుడై రంగనాథస్వామితో కలిసి ఈ ద్వీపంలోనే కొలువై ఉన్నాడు. అలాగే శివనసముద్రం దట్టమైన అడవిలో ఉండడం వలన ఇక్కడ వనదుర్గాదేవి కూడా కొలువై ఉంది.
ఒకసారి పార్వతీపరమేశ్వరులిద్దరి గగనవిహారం చేస్తుండగా ఈ ప్రాంతాన్ని చూసి చాలా ఆనందపడ్డారట, ఇక్కడి కావేరి ప్రవాహం వెడల్పుగా ఉండి జలపాత అందాలను చూసి శివుడు చాలా ఆనందపడగా పార్వతీ దేవి ఈ ప్రాంతానికి శివనసముద్ర అని పేరు పెట్టిందట. అలాగే ఒకసారి వృత్తాసుర హత్య వలన పొందిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు ఇక్కడ రంగనాథస్వామిని అర్చిస్తూ తపస్సు చేస్తుండగా కావేరి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఆ ప్రవాహం వలన తన తపస్సుకు భంగం కలుగుతుందేమోనని ఇంద్రుడు ఒక్క పెద్దరాయిని ఇక్కడ చేర్చి దానికి ఇరువైపులా కావేరి ప్రవహించేలా చేసి నదీప్రవాహ వేగాన్ని తగ్గించాడట. అలా ఈ ద్వీపం ఏర్పడింది. అందుకే ఈ క్షేత్రాన్ని 'శిలా భేదన క్షేత్రం' అంటారు.
శివనసముద్రం బెంగుళూరు నుండి 135 కిలోమీటర్లు, మైసూరు నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా శివనసముద్రం చేరుకోవచ్చు. కావేరి నది ఇక్కడ నుండి 290 కీలోమీటర్లు ప్రయాణించి తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి వద్ద మళ్ళీ ఇంకో ద్వీపాన్ని తయారుచేస్తుంది అదే శ్రీరంగంగా పిలిచే 'అంత్ర రంగం'...... సశేషం....
No comments:
Post a Comment