జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12 - అచ్చంగా తెలుగు

జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12

Share This
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12
చెన్నూరి సుదర్శన్  

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)
            
 ఫోటో మార్పిడి కేవలం అటెండర్ రాములు పని అనుమానించాను. ఇటువంటి తెలివి తేటలు అతడికి మాత్రమే ఉంటాయనడానికి రెండు సంఘటనలు గుర్తుకు వచ్చాయి.
            ఆరోజు విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించే గడువు  ముగిసింది. మరునాడు ఉదయమే నేను డబ్బులు బ్యాంకులో కట్టాలని డినామినేషన్ ప్రకారం సర్దుకుంటున్నాను. లిస్టు ప్రకారం టాలీ అయింది. ఇంతలో రాములు వచ్చాడు.
            “సార్ నేను పది మంది విద్యార్థులకు సరిపడే  ఫీజు డబ్బులిస్తాను. ఇవి కూడా బ్యాంకులో జమచెయ్యండి”
            నాకర్థం కాలేదు. “ఎందుకు రాములూ..” అంటూ అడిగాను.
            “సార్.. ఎలాగూ అపరాధ రుసుముతో కనీసం పదిమందైనా  ఫీజు కట్టకమానరు. ఆ పదిమందిని
సకాలంలో కట్టిన జాబితాలో చూపించి  అపరాధ రుసుము నేను తీసుకుంటాను” అంటూ చిరునవ్వు నవ్వసాగాడు.
            నాకు ఆశ్చర్యమేసింది. ఇలాంటి లొసుగులున్నట్లు నాకు ఆలోచనే రాలేదు. నేను కోపంగా తిరస్కరించాను. ఇక ముందు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు నీ మదిలోకి రానివ్వకని హెచ్చరించాను.
            మరో సంఘటన..
            అప్పట్లో మేన్ ఆన్సర్ బుక్స్ లకు కేవలం శ్రేణికి సంబంధించిన ఆంగ్లక్షరాలుండేవి. వాటికీ సరియైన లెక్కా డొక్కా ఉండేవి కావు. బోర్దు వాళ్ళు వ్యాన్లో వచ్చి గోనె సంచుల్లో కుక్కిన సమాధాన పత్రాలు కాలేజీ ముఖాన కొట్టి వెళ్ళే వారు. నా గదిలో ఓమూల కుప్పలుతెప్పలుగా పడిఉన్నాయి. వాటిని లెక్కించి ఒక క్రమపద్ధతిలో రాములుతో పేర్పించాను.
మరునాటి పరీక్ష కోసం అవసరమైన సమాధానపత్రాలు లెక్కించి తీసి రాములుకిచ్చాను. నాస్వంత ఐడియాతో చేయించుకొచ్చిన తేదీ మిషనిచ్చి వాటి పైన స్టాంపింగ్ వేయించాను. ఆ తరువాత రూంవైజ్ సమాధాన పత్రాలు కవర్లలో సర్దుతుంటే రెండు సమాధాన పత్రాలు తక్కువ వస్తున్నాయి. అనుమానంతో చెక్ చేస్తే రాములు ధరించిన బనీను లోపలదొరికాయి. ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగిచ్చాను.
తాగుడుకు డబ్బుల కోసం రాములు ఎంతకైనా తెగిస్తాడని  రఘురామయ్య గ్రహించి తనూ వార్నింగ్ ఇచ్చాడు.. పిల్లల వద్ద డబ్బు తీసుకున్నట్లు తెలిస్తే అభియోగాన్ని డైరక్టర్‍కు రాస్తానని బెదిరించాడు.
            ఈ నేపథ్యంలో రాములు పైన అనుమానం కలిగింది. ఫిజిక్స్ పరీక్ష రోజు రఘురామయ్యను తీసుకొని నేరుగా ఆగదిలోకి వెళ్లి డూప్లికేట్ అభ్యర్థిని పట్టుకున్నాను. రఘురామయ్య ఆశ్చర్యపోయాడు. వెంటనే పోలీస్ కానిస్టేబుల్‍ను పిలిచాడు. అభ్యర్థి గజ, గజ లాడుతున్నాడు.
            కానిస్టేబుల్ సహాయంతో అభ్యర్థిని తీసుకొని ప్రిన్సిపల్ చాంబర్‍కు  వెళ్లాం. అలా అందరు చూస్తుండగా తీసుకెళ్తే మిగతా పిల్లలు భయపడతారని రఘురామయ్య ఉద్దేశ్యం.
అరా తీస్తే నా అనుమానం నిజమైంది. రఘురామయ్య కాళ్ళపై పడ్డాడు రాములు.
            “కేసు బుక్ చేసాం. నేనేమీ చేయలేను. నాచేతుల్లో ఏమీ లేదు” అంటూ రఘురామయ్య చేతులెత్తేసాడు.
అభ్యర్థిని పోలీసు స్టేషన్‍కు తీసుకెళ్ళాడు కానిస్టేబుల్.
ఆ రోజునుండి పరీక్షల నిర్వహణ మరింత సులువయ్యింది. నకలు చిట్టీలకు పిల్లలు స్వస్తిపలికారు.
ఆ సంవత్సరం కాలేజీ ఫలితాలు మెరుగు పడ్డాయి. కేవలం పరీక్షల దృష్టి గాకుండా విద్యార్థులను వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు, అట పాటలలో తీర్చిదిద్దాం. రెండు సవత్సరాలు గడిచే సరికి మునిపల్లి జూనియర్ కాలేజీ పేరు రంగారెడ్డి జిల్లాలో మారుమ్రోగి పోయింది.
డైరక్టరు గారు కాలేజీని సందర్శించి స్టా్ఫ్‍ను అభినందించాడు.
ఇంత మారు మూల గ్రామంలో చేస్తున్న మా కృషిని కొనియాడాడు.
విద్యార్థుల అభిలాష, గ్రామ ప్రజల సహకారం ఇంకా స్టాఫ్ అంకితభావంతో ఇది సాధ్యమైందని రఘురామయ్య డైరెక్టర్ గారికి వివరించాడు.   
            సుధాకర్‍ను పిలిచి విద్యార్థుల నాయకుడని డైరక్టర్ గారికి పరిచయం చేసాను. సుధాకర్ నాయకత్వంలో విద్యార్థుల మద్దతు మరువలేనిదని కొనియాడాను. డైరక్టర్ సైతం సుధాకర్‍ను అభినందించాడు.
            సుధాకర్ జూనియర్ కాలేజీ చదువు పూర్తయ్యింది. కాలేజీ విడచి వెళ్ళిపోయాడు.
            నేను దాదాపు ఐదు సంవత్సరాలు మునిపల్లి జూనియర్ కాలేజీలో పని చేసాను. అ తరువాత నేను కోరుకున్న కాలేజీకి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి.
***

1990 లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ రంగనాథపురంకు  బయలు దేరాను.

 ఒక పేరు మోసిన పెద్ద ప్రైవేటు ‘భార్గవ పారిశ్రామికసంస్థ’ పట్టుదలతో కాలేజీని  ఆగ్రామంలో ప్రారంభించారు. కాలేజీకి అధునాతన రెండస్తుల భవనంతోబాటు  కావాల్సిన వసతులన్నీ సమకూర్చారు.
స్టాఫ్ అందరికీ కంపెనీ క్వార్టర్స్ ఇచ్చారు. వాటర్ ఫ్రీ.. కరెంటు ఫ్రీ..  రెంటు  నామమాత్రం.    
 కాలేజీ సమయానుసారం ప్రిన్సిపాల్‍ను కార్లో తీసుకు రావడం.. తిరిగి తీసుకెళ్లడం వంటి సౌకర్యమూ ఉంది.
ఆకంపెనీలో పనిచేసే కార్మికుల పిల్లల సంఖ్య కాలేజీలో అధికం కనుకనే అలాంటి సౌకర్యాలు కల్పించారని నాకు తెలిసిన విషయం.
            రంగనాథపురం జూనియర్ కాలేజీలో జాయినయ్యాను. స్టాఫ్ పరిచయమయ్యింది. మొత్తం పదమూడు మంది స్టాఫ్‍లో ముగ్గురు  మహిళా లెక్చరర్లు.  ఇంద్రాణి ఇంగ్లీష్ .. హిమజ హిందీ.. లలితాంబ లైబ్రేరియన్.
అందులో నాక్కాస్తా మాటల మరాఠీగా  కనబడ్డాడు ఫణీంద్ర జువాలజీ లెక్చరర్. అతడి మాటలు సామెతల మూటలు. చూపులు ఎక్స్ రే కైపులు. చేతలు గారడీ చెణకులు. పాపారావుకేమాత్రం తీసిపోడనుకున్నాను.
ఎంతో ఉత్సాహంతో కాలేజీలో జాయినైన నేను అక్కడి వాతావరణం చూసి నీరుగారి పోయాను.
కంపెనీ మేనేజ్ మెంటు స్టాఫ్‍కు క్వార్టర్స్ ఇవ్వడం మానేసింది. ప్రిన్సిపాల్‍కు కారు  సౌకర్యం కాలరాసింది. వసతుల మాట దేవుడెరుగు. కాలేజీ అంటేనే కస్సుమంటుంది..
“కంపెనీ మేనేజ్ మెంటుతో కాలేజీ ఏమైనా గొడవ పడిందా సార్..” అంటూ ఆమరునాడు ఫణీంద్రను పలుకరించాను.
బిగ్గరగా నవ్వాడు. నేను బిక్కమోగమేసాను. నా ముఖం చూసి నవ్వును కొనసాగించబోయి ఆగాడు.
“సూర్యప్రకాష్ సార్.. మీరీకాలేజీ పూర్వ వైభోగం తెలుసు కొని వచ్చారనుకుంటాను. అందుకే ఆ ప్రశ్న వేసారు. అంతా స్వయంకృపారాధమే.. ‘పందికేం తెలుసు పన్నీరు వాసన’అన్నట్లు దాన్ని పరుపుల్లో పడుకోబెడ్తే మాత్రం పడుకుంటుందా.. బురద గుంటలో పొర్లుతూ పొంగి పోయే గుణం దానిది” అంటూ అసలు విషయం చెప్పసాగాడు.
            “రెండు సంవత్సరాల క్రితం ఒక శనిగ్రహం ఈ కాలేజీకి దాపురించాడు. తెలుగు లెక్చరర్ పాపారావు. శకునిలా వచ్చి గత ప్రిన్సిపాల్‍ను బుట్టలో వేసుకొని వెలగబెట్టిన ఘనకార్య ఫలితమిది”
            “పాపారావా..? ఏం చేసాడు సార్.. ” ఆశ్చర్యంగా అడిగాను. పాపారావు కాలాంతకుడు.. డబ్బు ఎర జూపి ఇక్కడ వాలాడనుకున్నాను. 
            “ప్రైవేటు కంపెనీ.. లక్షల్లో డబ్బులు ఇంటర్మీడియట్ బోర్డులో డిపాజిట్ చేసి ఇంగ్లీష్ మీడియంతో సహా కాలేజీని సాంక్షన్ చేసుకున్నారు ఇక్కడి మేనేజ్‍మెంటు. కోటి రూపాయల ఖర్చుతో భవన నిర్మాణం చేసి సకల సదుపాయాలూ కల్పించారు. స్టాఫ్‍ను ప్రిన్సిపాల్‍ను చాలా గౌరవించే వారు. కంపెనీ డైరక్టర్  ప్రతీ నెల ప్రిన్సిపాల్‍ను  తన ఆఫీసుకు కార్లో పిలిపించుకొని  మీటింగ్ పెట్టేవాడు. కాలేజీ ఇబ్బందులు అడిగి తెలుసుకునే వాడు.
            పాపారావు వచ్చాక ప్రిన్సిపాల్‍తో మందు పార్టీలు పెట్టి మనసు మార్చాడు. కంపెనీ డైరక్టర్ పిలిస్తే వెళ్ళడం మన హోదాకు తగింది కాదు. అతన్నే మీ చాంబర్‍కు  పిలిపించు కోవాలి. మనం కోరింది సమకూర్చుకోవాలి..
అంటూ బాగా నూరి పోసి ప్రిన్సిపాల్ కాళ్ళు కట్టేశాడు.
            కాలేజీని దోచుకోవడం మొదలు పెట్టాడు. కాలేజీలోని ఫ్యాన్లు విప్పుకొని పోయి తన ఇంట్లో అమర్చుకునే వాడు. అటెండర్‍ను ఒక ఫ్యాను విప్పరా అంటే వాడు మరో రెండు అదనంగా ఫ్యాన్లు విప్పుకొనిపోయి అమ్ముకునే వాడు.
            రాత్రుళ్ళు కాలేజీలోనే ప్రిన్సిపాల్,తనూ.. కలిసి  విద్యార్థులను చేరదీసి పేకాటలాడటం..
అమ్మాయిలకే ప్రత్యేకంగా ప్రైవేటు క్లాసులంటూ వేధించే వాడు. ఒక రోజు ఒక అమ్మాయితో అసభ్యంగా మాట్లాడాడట. దాంతో విద్యార్థులంతా కాలేజీ బహిష్కరణ.. కంపెనీ జోక్యం చేసుకుంది. ప్రిన్సిపాల్‍ను ఉసిగొలిపి మన డైరక్టర్‍కు లెటర్ రాయించాడు పాపారావు. పెద్ద గొడవ జరిగింది. స్టాఫ్ అందరికీ బదిలీలు వచ్చాయి.. కొత్త స్టాఫ్ వచ్చింది కాని కంపెనీతో తత్సంబంధాలు తెగిపోయాయి” అంటూ కాలేజీ చరిత్రను హరికథలా వివరించాడు ఫణీంద్ర.
పాపారావు ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అన్న మాట. అని మనసులో అనుకుంటూ..
“ఇక్కడి నుండి బదిలీ మీద పాపారావు ఏకాలేజీకి వెళ్ళాడు సార్..”
“పైకెళ్ళాడు” అంటూ చూపుడు వేలు పైకి చూపించాడు ఫణీంద్ర.
“ప్రమోషన్‍పై డిగ్రీ కాలేజీ  వెళ్ళాడా?”
“ఆ ప్రమోషనే.. డిగ్రీ ఏం ఖర్మ ఏకంగా పైలోకానికే”  ఎత్తిన వేలును మరో మారు చక్రంలా తిప్పాడు. ఇంతలో కాలేజీ బెల్ అయింది.
            “నాకు క్లాసుంది సరే.. వస్తాను” అంటూ ఫణీంద్ర తన కప్ బోర్డు ఓపెన్ చేయబోయాడు.
            “నాకూ ఉంది సార్ క్లాసు.. పాపారావు చనిపోయాడా” ఆశ్చర్యంగా అడిగాను.
            “అవును సార్.. ఓ రోజు రాత్రి బాగా తాగి స్కూటర్‍పై  ఇంటికెళ్తూ  రోడ్డు డివైడర్‍కు గుద్దుకున్నాడు. స్పాట్ డెడ్”
            లిప్త కాలం అచేతనుడయ్యాను. ‘పాపం..!’ అంది నా మనసు.
            “పాపాత్మున్ని పాము కరుస్తుంటారు.. కాని పాపారావును డివైడర్ కరిచింది” అంటూ వెకిలి నవ్వు ప్రదర్శిస్తూ  క్లాసుకు దారి తీసాడు.
            నేనూ అతని వెనకాలే క్లాసుకు కదిలాను.
            నేను రావడం గమనించి వెనక్కి తిరిగి చూస్తూ “సూర్యప్రకాష్ సార్.. మన రికార్డు అసిస్టెంటు ఎవరనుకున్నారు?..పాపారావు కొడుకే.. బియ్యే వెలగబెట్టి యమ్మే తగలబెట్టిన ప్రబుద్ధుడు. కారుణ్య నియామకమిచ్చారు” అన్నాడు ఫణీంద్ర.
***

No comments:

Post a Comment

Pages