ముకుంద శతకము - దూపాటి తిరుమలాచారి - అచ్చంగా తెలుగు

ముకుంద శతకము - దూపాటి తిరుమలాచారి

Share This
ముకుంద శతకము - దూపాటి తిరుమలాచారి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవి పరిచయం: ముకుంద శతక కర్త దూపాటి తిరుమలాచార్యుడు లోహితస గోత్రుడు. క్రీ.శ. 1871కి పూర్వుడు. దూపాటి కొండమాచారులులు రంగనాయకమ్మలకు జ్యేష్ఠకుమారుడు. తిరుమల సింగరాచార్యుని శిశ్యుడు. ఈకవి సంస్కృతాంధ్రములందు విశేషప్రజ్ఞ నార్జించి కవితారచనయందు చక్కని ప్రతిభకనపరచినాడు.  ఈకవి నివాస స్థానము బాపట్లకు పదిమైళ్లదూరంలో సముద్రతీరంలో ఉన్న ఓడరేవు. చిరకాలము ఈకవి అచటనేయుండి తన 87వ ఏట పరమపదించెను. ఈ కవి సోదరుడు దూపాటి శేషాచార్యకవి ప్రౌఢకవి. 

ఈకవి ముకుంద శతకమేకాక, రావిపాటి రామశతకమును కూడా రచించినాడు. ఈశతకములో 108 సీసపద్యములలో సంపూర్ణరామకథను నిమిడించి రచించినాడు. ఈకవి ఇతరరచనలు గురించి వివరములు తెలియుటలేదు.

శతకపరిచయం: ముకుంద శతకములో 108 కందపద్యములు కలవు. భక్తిరస ప్రధానమైన శతకము.  భాగవతాకథా భరితము. పద్యములు అంత్యనియమపద్యములు,  ఏకసమాస పద్యములు, శ్లోక రూపపద్యములు, దశావతారవర్ణనము, దశమస్కంధపూర్వోత్తరభాగ కథాసూచక పద్యములు, అష్టభార్యలవివాహము, షోడశోపచారపూజ, అను వర్గములుగా విభజించబడినవి. 

కొన్ని పద్యాలను చూద్దాము.

1. అంత్యనియమ పద్యములు

కం. దనుజ సముదాయ శిక్షా
సనకాదిమునీంద్రపక్ష సజ్జనరక్షా
వనజభవాండాధ్యక్ష
వనురుహపత్రాక్ష విపులవక్ష ముకుందా

కం. పశుపతి విదిత విలాసా
విశదాబ్జవికాస హాసవిద్యుద్వాసా
దశరథరాజోల్లాసా
దశవదననిరాస ముదితదాస ముకుందా

2. ఏకసమాస పద్యములు.

కం. రామం రావణదనుజవి
రామం జనకాత్మజాభిరామం సుజనా
రామం వంచిత భార్గవ
రామం త్వం హృది సదాస్మరామి ముకుందా

కం. గోమద్గోరుహగోయుగ
గోమర్దితదనుజజాల గోకులబాలా
గోమద్గోనిలయార్చిత
గోమజ్జారాధితాంఘ్రిగోజ ముకుందా

3. దశావతార వర్ణనము. 

కం. కుశలాకారము గైకొని
సకలామరులెన్న వేదసముదాయము సో
మనుకుబరిమార్చి బ్రహ్మకుఁ
బ్రకటముగా నొసఁగలేదె పరమముకుందా

కం. పరశువుగైకొని నృపులను
దురమున ముయ్యేడుసార్లు దునుమాడియశం
బరుదుగ జగములు నిండఁగ
బరపవె భార్గవుఁడగుచుఁ బరమముకుందా

3. దశమస్కంధపూర్వోత్తరభాగ కథాసూచక పద్యములు

కం. కృష్ణాష్టమియం దిలపై
కృష్ణాఖ్యను జననమొంది కితవతతిని వ
ర్ధిష్ణుఁడవై తునిమితివౌ
యుష్ణాంశునికాశతేజమొప్ప ముకుందా

కం. నీ చిన్నారికరంబులు
నీ చారుపదాబుజములు నీ చిఱునగవుల్
నీ చక్కఁదనము పొడఁగని
వాచస్పతికైనఁ బొగడవశమె ముకుందా

4. అష్టభార్యలవివాహము.

కం. క్రూరులగుచైద్యముఖనృప
వీరులను నిరాకరించి విశ్వజననియౌ
శ్రీరుక్మిణీసతీమణి
నారీఢిపరిగ్రహించి తౌరా ముకుందా

కం. భగ్నం బొనర్చి నృపతుల
నగ్నిప్రభనొప్పుశౌర్యమలర శుభశ్రీ
లగ్నంబునఁ జేసొనవే
నాగ్నజితిన్ లోకపూతనామ ముకుందా

కం రుద్రాదులెన్న జలచర
ముద్రితయంత్రంబుఁ దునిమి మోహనలీలన్
భద్రన్ శమదమసుగుణస
ముద్రం గైకొనవె కృష్ణమూర్తి ముకుందా

5. షోడశోపచారపూజ

కం. ముదమున నార్ఘ్య మొసంగెద
సదయుడవై గొనుము దివిజసన్నుతచరితా
విదురముఖభక్తవరదా
మదనశరోల్లాసితరూపమహిత ముకుందా

కం. సీతా రమణీకళాత్రా
శితాశుఖరాంశునేత్ర చిత్రచరిత్రా
పీతాంబర మొసఁగెదఁ గొను
చేతోమోదాతిశయముచేత ముకుందా

మచ్చుకి కొన్ని పద్యములను మాత్రమే చూపించినాను. చక్కని భక్తిరస ప్రధానమైన ఈ శతకం అందరూ పఠించదగినది.
మీరు చదవండి. మీ మిత్రులచే చదివించండి

No comments:

Post a Comment

Pages