శ్రీ శంకర శతకము
గ్రంథ పరిచయము మరియు పద్య విశ్లేషణ
రవిభూషణ్ శర్మ కొండూరు
నాలుగైదు రోజుల క్రితం కవి రామయోగి వ్రాసిన “శంకర శతకం” గురించి ఇంటర్నెట్లో వెతుకుతుంటే శ్రీ చాగంటి సుందర శివరావు గారు వ్రాసిన “శ్రీ శంకర శతకము” తారస పడింది. ఈ శతక కర్త పేరులో "చాగంటి" అని చూడగానే వీరు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి ఏమైనా బంధువు లవుతారేమో అని అనిపించింది. ఈ పుస్తకంలోని ముందు మాట చదివితే, నా అనుమానం తీరింది, ఈ శతక కర్త శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి తండ్రి గారేనని, ఈ ముందు మాట వ్రాసినది కోటేశ్వర రావు గారి కుమారుడని తెలిసింది. దాంతో కోటేశ్వర రావు గారి మీద ఉన్న భక్తి గురు భావంతో ఈ శతకం మీద మరింత ఆసక్తి కలిగింది, ఇందులో ఏముందో చదవాలని కోరిక మొదలైంది.
సర్వ సాధారణంగా తెలుగు శతక సాహిత్యంలో జ్ఞానమూ, భక్తి, వైరాగ్యము, శృంగారము అను అంశాములతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాలను కవితాంశంగా తీసు కుంటారు శతక కర్తలు. ఈ శతకంలో ప్రతి పద్యానికి ఒక నేపధ్యమున్నది. ఆ నేపద్యం తెలిసిన తరువాత ఈ శతకం మీద మరింత గౌరవము, భక్తి భావము ఏర్పడ్డాయి. శతక కారుడు తన జీవితంలో ఏవైనా ఓడుదుడుకులు వొచ్చినప్పుడు, తనకు భక్తి పెల్లుబికి నప్పుడు, కష్టాలు వొచ్చినప్పుడు ఆద్రతతో, ఆత్మ సమర్పణ భావంతో కొన్ని పద్యాలు వ్రాసి ఇంట్లో పూజా గదిలో శివుని సన్నిధిలో పెట్టేవారట. ఒకసారి ఇంటి పెరట్లో కూరగాయలు కోసుకుంటున్న తరుణంలో గుండె పోటులా రావటంతో ఈ శతకంలో “రోగము” అనే శీర్షిక క్రింద కొన్ని పద్యాలు వ్రాసి సమర్పణ చేసు కున్నారుట. ఒక సారి సుందర శివరావు గారి స్నేహితుడు శ్రీ సీతా రామయ్య గారు, ఈ కాగితాలు గాలిలో ధూళిలో కలసి పోకూడదని వీటిని ప్రోగుచేసి సంకలనము చేసి శతక కర్త అనుమతితో 1963లో ప్రధమ ముద్రణ చేయటంలో ముఖ్య కారకులయ్యారట. ఆ తరువాత 2017లో చాగంటి కోటేశ్వర రావు గారి కుమారుని వివాహం సందర్భంగా ద్వితీయ ముద్రణ చేయించి తదుపరి పలువురు ప్రముఖ కవుల సమక్షంలో పుస్తకావిష్కరణ జరిగింది.
శతక పరిచయం:
ఈ పుస్తకంలో కేవలం ఇరువదినాలుగు (24) పుటలున్నాయి. ఇందులో ప్రతి పద్యం ఒక ఆణిముత్యం; ఈ శతకము పరిశీలన తరువాత నాకు ఇందులో శతక కారుడు తన శరణాగతిని, తన ఆత్మ జ్ఞానాన్ని, అద్వైత తత్వాన్ని, సంపూర్ణ సమర్పణ, హృదయ సమర్పణ, ఆద్రత, మరియు ఆర్తి మొదలగు వాటిని కవితాంశంగా తీసుకున్నారనిపించింది. తెలుగు సాహిత్యంలో అధికశాతం శతక కారులు పాటించిన విధంగానే ఈ శతక కారుడు కూడా "శ్రీ" కారంతో మొదలైన ఇష్ట దేవతా ప్రార్థనలో “శ్రీ శర్వాణి నిజాంకమందు నగుచున్ జొన్నెంద లంబోదరుం” అల్లసాని పెద్దన వ్రాసిన “అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక ... నభీష్టసిద్ధికిన్” అను పద్యమును జ్ఞప్తికి తెచ్చి తన పద్య నిర్మాణ శైలి అల్లసాని పెద్దన శైలిని రుచి చూపించారు, ఆ తరువాత గణపతి పార్థనలో “వందన మీశు పుత్ర శుభ, వందన మిందు సమాన గాత్ర, నా వందన మేకదంత, యభి వందనమోకరుణా హృదాంతరా వందన మాఖువాహన సువందనమోసుర దైత్య పూజితా వందనమోయి విఘ్నపతి వంద వందనముల్ గ్రహింపు మా” అని అతి సరళమైన పదజాలముతో నిత్యమూ పారాయణము చేయదగ్గ పద్య రాజాన్ని కాదు కాదు శ్లోకాన్ని అందిస్తూ సహజ కవి పండితుడైన బమ్మెర పోతనామాత్యుని స్మరణకు తెచ్చారు. తదుపరి గురు ప్రార్ధనతో శతక ప్రారంభం చేసారు. శతక కారుడు, “శంకరా!!” అను పదాన్ని మకుటంగా ఎంచుకున్నారు. అందువల్లనే దీనికి “శంకర శతకము” అనునది సార్ధక నామదేయము అయినది. ఇందులోని పద్యాలన్నీ రమారమి శార్దూలము, మత్తేభము, ఉత్పలమాల వంటి వృత్త ఛందస్సులో వ్రాయటం జరిగింది. ఈ శతక కారుని, పద్యాలు పరిశీలన చేసినచొ, పైన చెప్పిన విధంగా పద్య శిల్ప నిర్మాణములో, పద్య రచనా చమత్కారములో అలనాటి అల్లసాని పెద్దన శైలిని, సరళ పద ప్రయోగములో సహజ కవి పండితుడైన బమ్మెర పోతనామాత్యుని, హృదయ సమర్పణలో, పద్య పారదర్శకతలో ధూర్జటి మహా కవిని, పద్య ప్రౌఢత పద గాంభీర్యంలో కవిసార్వభౌముడైన శ్రీనాధ మహా కవిని పోలినట్టు మనకు స్పురణకు రాక మానదు. కొన్ని పద్యాలు చదువు తుంటే ఎదో తెలియని అలౌకికానందము, ఎదో చెప్పలేని భావావేశము మనకు కలుగుతాయి అంటే అతిశయోక్తి కాదు.
ఒక చోట “నమ్మితి నాగభూష నిను, .... నమ్మితి నిర్వికల్ప... నమ్మితి నా మనసార... కనికరమ్మున గావుము నన్ను శంకరా!!” అంటూ సరళమైన పద ప్రయోగముతో శంకరా!! నిన్నే నమ్మి నీ చరణములే పట్టిన నన్ను కావుము నాపై కరుణ చూపుమని ప్రార్థన కనిపిస్తుంది. ఈ పద్యము నరసింహ శతకంలోని “నళిన దళనేత్ర! నిన్ను నేనమ్మినాను జేరి రక్షింపవే నన్ను ... భూషణ వికాస! ... నరసింహ - దురితదూర!” అనే శేషప్ప కవి రచించిన పద్యం యొక్క శైలి మనకు జ్ఞప్తికి వస్తుంది అంతే కాదు అతి సామాన్య పదజాలముతో సహజ కవి పండితుడైన బమ్మెర పోతనామాత్యుని స్మరణకు తెచ్చారు.
మరోచోట శైశవదశ, బాల్యదశ, యవ్వనదశ మరియు వృద్ధాప్య దశలలో భగవంతుని గురించి ఆలోచించక సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న తన గురించి చాలా చక్కటి పద్యాని మనకు అందించారు “మల మూత్రంబులతో.. మహా భయముతో.. సదా భ్రమతతో.. కఫ జ్వర గ్రహమహా... కలనైన తమ చింత లేక చేడితిన్.. శంకరా!!” అంటూ చేసిన పద ప్రయోగముతో ధూర్జటి యొక్క శైలి పద్య శిల్ప ప్రయోగము కనపడుతాయి, అంతే కాదు, శ్రీకాళహస్తీశ్వర శతకములోని “దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే ... జరక్రాంతంబు గానప్పుడే ... చింతింపన్వలె నీపదాంభుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా” అనే పద్యం మనకు స్పురణకు రాక మానదు.
మరోచోట గంగావతరణం గురించి వర్ణిస్తూ ఆకాశగంగ శివుని జటాజూటంలో ఎలా వొదిగి పోయింది అని వివరించిన పద్యం చదువు తుంటే గంగ మన కళ్ళ ముందే నింగి నుంచి నేల రాలిందా అన్నట్టు కళ్ళకు కట్టి నట్టు ఉంటుంది. “రంగ త్తురంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో ... జాఱన్ గంగమ్మ ... శంకరా!!” అంటూ చేసిన పద ప్రయోగముతో శ్రీనాధ మహా కవి ప్రౌఢత పద గాంభీర్యం కనిపిచక మానదు.
మత్తేభము:
రంగ
త్తురంగసంఘ ములతో రంజిల్లు ఘోషంబుతో
పొంగారంబగు
పొంగుతో నుఱగతో పువ్వాటు తంపర్లతో
భంగుల్సూపుచుజెంగలించుచు
నభోభాగంబు నందుండి జా
ఱన్ గంగమ్మనుదాల్చి తే శిరమునన్ రంజిల్లు
చున్ శంకరా!!
మరోచోట “అరయన్ మన్మధుపత్నిపై, విజయు పై, అంబ పై, చెంచు పై, కరి పై, కాళము పై, ... నీ చరణాబ్జంబులు నమ్మినాను జగధీశా కావవే ...శంకరా!!” అను మత్తేభ పద్యములో శంకరా, ఏవిధముగా నీవు రతీదేవిని (మన్మధుని సతీమణిని), పాండవ మధ్యముడైన అర్జునుని, పాముని, సాలె పురుగును, ఏనుగును నీ కృపా కటాక్ష పాతముతో ఎలా ముంచెత్తి నావో? నీ పాదములే నమ్మి ఉన్న నన్ను కూడా కృపతో చూడుము తండ్రీ అని వేడుకుంటారు. ఈ పద్యం చూసినచో మనకు ధూర్జటి యొక్క శైలి పద్య శిల్ప ప్రయోగము కనపడుతాయి, అంతే కాదు, శ్రీకాళహస్తీశ్వర శతకములోని “ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దానే విద్యాభ్యసనం బొనర్చెఁగరి;” అను పద్యము గుర్తుకు రాక పోదు.
మరోచోట “భవదీయార్చన లేని హస్తములు నీ భవ్యంపు రూపంబు చిత్తవధానంబున జూడ జాలని కనుల్... దండుగ గాదె ...శంకరా!!” అను మత్తేభ పద్యములో శంకరా నీకు అర్చన చేయని చేతులు, నీ దివ్యమంగళ రూపము చూడని కళ్ళు, పురాణేతిహాసముల లోని నీ లీలలు వినని చెవులు, నీ సాన్నిధ్యమును కోరని శరీరము శుద్ధ దండుగ. అంటూ శివుని అర్చన, కీర్తన, సమర్పణ భావము లేని మానవ జన్మ వృధా నిరుపయోగము అని చెప్పారు. ఈ పద్యం చూసినచో మనకు బమ్మెర పోతనామాత్యుడు ఉపయోగించు సరళ పద ప్రయోగముతో పాటు, భాగవతంలోని “కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;” అను పద్యము గుర్తుకు రాక పోదు.
మత్తేభము:
భవదీయార్చనలేని హస్తములు నీ భవ్యంపు రూపంబు
చి
త్తవధానంబున జూడ జాలని కనుల్ దాల్మిన్ భవత్
సత్కధా
శ్రవణానందము లేని వీనులును నీ సాన్నిధ్యమున్
గోర నీ
భవమున్దండుగ గాదె సత్య మరయన్ భక్త ప్రియాశంకరా!!
మరో సందర్భంలో ఎదో అనారోగ్యముతో బాధపడుతూ ఇలా రోగముతో జీవించుట కన్నా తక్షణమే మరణించుట మేలని, రోగము పలు విధముల భుక్తికి ముక్తికి ఆర్ధికముగా చేటని, అట్టి రోగములను రూపు మాపమని ఆ పరమ శివుని వేడు కున్నారు.
ఉత్పలమాల:
భోగము
బుగ్గి పాలు కడు భుక్తికి ముక్తికి లోటు వచ్చు సత్
త్యాగము
సున్న వాంఛయతి దారుణ మిన్నిట యర్థనాశముల్
వేగమె
జచ్చుటే సుఖము వేగుట భారమటంచు దోచు ఛీ
రోగమె
రోత దానినిక రూపము మాపుము నీవు శంకరా!!
మరొక విషయం ఏమిటంటే, కోటేశ్వర రావు గారి ప్రవచనాలు వినే ప్రతి వారికీ ఈ శతకంలోని పద్యాలు చాలా సుపరిచితములుగా బాగా దగ్గరగాను అనిపిస్తాయి, దానికి కారణం, ఈ పద్యాలను "శ్రీ చాగంటి కోటేశ్వర రావు" గారు ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సభల్లో, ఎన్నో ప్రసంగాలలో ఎన్నో ఏళ్లుగా ఉటంకిస్తూ ప్రజలకు బాగా చేరువ చేసే ప్రయత్నము చేయటమే. దానికితోడూ ఈ-టివీ వారు జొన్నవిత్తుల వారిచే శతక పరిచయము అను ఒక ధారావాహికగా జరిపిన ఒక ప్రాయోజిత కార్యక్రమములో కూడా ఈ శతకమును ఈ-టివీ ప్రేక్షకులకు పరిచయం చేసారు.
పుస్తకము పేరు: శ్రీ శంకర శతకము
శతక కర్త: శ్రీ చాగంటి సుందరశివరావు
ప్రచురణ: మోహన్ ఆఫ్సెట్ ప్రింటర్స్ కాకినాడ
వెల: నిర్ణయించ బడ లేదు
పుటలు: 24
ప్రధమ ప్రచురణ 1963లో
ద్వితీయ ప్రచురణ 2017లో
***
dhanyavaadaalu, konDUru vaaru!
ReplyDelete