సుబ్బు మామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు
మనుషుల్ని చదవండి

పిల్లలూ ఎలా ఉన్నారర్రా!
చక్కగా చదువుకుంటున్నారు కదూ!
మన పెద్దవాళ్లు లౌకిక జ్ఞానం అని వాడడం మీరు వినే ఉంటారు కదూ!
అంటే ఏంటో తెలుసా? సమాజంలో మనం నష్టపోకుండా, మోసపోకుండా జాగ్రత్తగా ఉండడం అన్నమాట! సమాజం అంటే మనుషులే! మనుషులందరి మనసులు ఒక్కలా ఉండవు. మంచి చెయ్యాలని చూసేవాళ్లుంటారు. చెడు చెయ్యాలని అనుకునేవాళ్లుంటారు. ఏదో ఒకటి మన అనుభవంలోకి వచ్చేదాకా మనకు తెలియదు. అలా అని అనుభవంలోకి వచ్చాక ఇంకేం చెయ్యగలం? అందుకే మనకి ఒక మనిషి పరిచయం అవ్వంగానే, అతని రూపాన్నిగాకుండా మనసును పరిశీలించాలి. అది అంత సులభం కాదర్రా. దాన్ని గ్రహించాలంటే అతని మాటలు, చేష్టలు క్షుణ్ణంగా పరిశీలించాలి. 
మనిషి మనుగడకు నమ్మకం చాలా ముఖ్యమైనది. నమ్మకం మీదే అన్ని పనులు సానుకూలమవుతాయి. నమ్మించి మోసం చేశాడనీ అనడం వినే ఉంటారు. అయితే ఎవర్ని నమ్మాలి, ఎవర్ని నమ్మకూడదన్నది కూడా ఓ పజిలే. అదీ ఎదుటి వ్యక్తిని అంచనా వేయడంతోనే జరుగుతుంది.
కొంతమంది తీయగా మాట్లాడుతారు కాని వాళ్ల మనసులో కుట్ర ఉంటుంది. కొంతమంది కుండ బద్దలు కొట్టినట్టు కరకుగా మాట్లాడతారు, కాని సహాయం చేస్తారు తప్ప హాని చేయరు. అంచేతే మనవాళ్లంటారు తెల్లనివన్నీ పాలూ కాదు, నల్లనివన్నీ నీళ్లుకావని. 
మనిషిగా మనం ఈ సమాజంలో చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలంటే, మనం మనుషుల్ని చదవడం, అంచనా వేయడం నేర్చుకోవాలర్రా. మన పరవస్తు చిన్నయసూరిగారు ఈ నేపథ్యంలోనే మిత్రలాభం, మిత్రబేధం కథలు రాశారు. అవి శ్రద్ధగా చదవండి.
మంచి వాళ్లను వదులుకోకూడదు, చెడ్డవాళ్లకు దూరంగా ఉండాలి. ఇదర్రా మీరు పాటించాల్సిన మంచి జీవిత సూత్రం. పాటిస్తారు కదూ!
ఉంటానర్రా!
మీ సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages