తామరాకు - అచ్చంగా తెలుగు
తామరాకు
లోవరాజు కథలు
కంభంపాటి రవీంద్ర


పూర్ణా టాకీసు పక్కనుండే మాచారమ్మ వేసే బెల్లం జిలెబీలు తినకపోతే ఇంతకాలం బతికిన బతుక్కి అర్ధం లేదంటూ సాయంత్రం ఇంటికొచ్చి మరీ లాక్కెళ్లిపోయేడు లోవరాజు గాడు. నాకెందుకో చిన్నప్పట్నుంచీ జిలేబీలంటే పరమ చిరాకు , కానీ వీడిలా లాక్కెళ్లిపోయేసరికి కాదనలేక, చూద్దాం నా బతుక్కు ఏం అర్ధం కనబడతాదో అనుకుంటా వెళ్ళేను .

లోవరాజు గాడు చెప్పింది నిజమే .. ఆ మాచారమ్మ పాక ముందు ఓ పాతిక మంది జనాలున్నారు . ఈవిడ వేడేడి గా జిలేబీలెయ్యడమేంటి , ఒక్కోడు నాకంటే నాకంటూ కుట్టుడాకుల్లో పెట్టించుకుని తినేస్తున్నారు .  మా ఇద్దరికీ పొట్లం కట్టించుకునొచ్చి చెప్పేడు లోవరాజు 'ఇయి ఇలా యేడిగా తినేస్తేనే రుచి .. గబుక్కున తినెయ్యి '.

రోడ్డుకావతల ఉన్న చెరువులో నీళ్లనిండా తామరాకులూ , అక్కడక్కడా తామర పువ్వులూ ఉన్నాయి . 'ఎన్నేళ్ళయిందో తామరాకులూ , తామరపువ్వులూ చూసి .. ఏదో తామరాకుల మీద నీటిబొట్టులా అంటూ సామెతలు వినడమే కానీ .. వీటిని చూడ్డం కుదరడం లేదు ' అన్నాను.

' తామరాకంటూ బానే గుర్తు చేసేవు... నీకు శేషమ్మ గారి కధ చెప్పి తీరాలి' అంటూ మొదలెట్టేడు లోవరాజు.

'శేషమ్మ గారా ??ఆవిడెవరు?' అడిగేను.

'ఇప్పటి కధ కాదులే .. చాలాకాలం క్రితం జరిగిందిది .. కాపోతే కొన్ని కధలు ఎప్పటివైనా మనతోనే ఎప్పటికీ ఉండిపోతాయి కదా .. ' అన్నాడు.

'సరే చెప్పు ' అన్నాను.

'కాట్రావులపల్లి పక్కనే ఉండే ఎర్రంపాలెం లో .. లావు గోపన్న గారనీ .. పెద్ద మోతుబర్లే .. ఆయన పెద్ద కూతురే శేషమ్మ .. ఈవిడెనకాల ఇంకో ఆరుగురు చెల్లెళ్ళు , తమ్ముళ్లు పుట్టుకొచ్చేసేరు . ఆళ్ళమ్మ ఏ ఏడాదికా ఏడాది కాన్పుల్లో బిజీగా ఉంటే , ఈ శేషమ్మ తన చెల్లెళ్లని , తమ్ముళ్ళని చూసుకోడం లో బిజీగా ఉండేది .. చిన్న పిల్లైనా తల్లి తర్వాత తల్లనుకో .. అంత బాగా చూసుకునేదాళ్ళందరినీ ! అసలా వయసు పిల్ల మీద ఇంటి పన్లన్నీ పడేసినా , ఎప్పుడూ ఓ విసుగు గానీ కోపం గానీ చూపించేది కాదు . ఎప్పుడూ మొహం నిండా మంచి నవ్వూ , పలకరింపు తప్పితే ,శేషమ్మ కోపంగా మొహం పెట్టుకునుండడం ఇంతవరకూ చూసినోళ్లెవరూ లేరు మరి !

శేషమ్మ గారికి  పదహారేళ్ళొచ్చేసరికి మనూరి సంబంధమే, కానూరు మార్కండేయులని , ఆళ్ళ కుటుంబం నీకు తెల్దులే , ఆస్తుల్తో బలిసిపోయిన కుటుంబం ఆయనకిచ్చి పెళ్లి చేస్సేరు ' అన్నాడు.

'పదహారేళ్లకే పెళ్లా ?' ఆశ్చర్యంగా అడిగేన్నేను.

'ఎదవ కొచ్చన్లడక్కు .. ముందే చెప్పేను కదా .. చాలా కాలం క్రితం విషయం అని ' కోప్పడ్డాడు లోవరాజు.

'సారీ .. మర్చిపోయేను .. చెప్పు ' అన్నాను.

'సరే .. ఏముందీ .. ఆవిడ ఈ మార్కడేయులుని పెళ్లి చేసుకుని మనూరికి వచ్చింది .. పెళ్ళైన తర్వాత ఆవిడికి తెలిసొచ్చింది .. మార్కండేయులుకి లేని ఎదవలవాట్లేదని .. అయినా కూడా ఆవిడ పన్లూ , పూజలూ చేసుకోడం తప్ప , ఎప్పుడూ కూడా ఆవిడ బాధ బయటకి చెప్పలేదు , అసలా మాటకొస్తే ఎవరికీ కూడా మొగుడి విషయం లో ఈవిడికి ఏ బాధా లేదా  అనిపించేది, రోజూ తెల్లవారుఝామునే లేచి, పవిత్రంగా తయారై  , దేవుడికి దీపాలెట్టి , అన్ని స్తోత్రాలు చదివికానీ ఆవిడ రోజు మొదలెట్టేది కాదంట .. బహుశా ఆ దేవుడి మీద భక్తే ఆవిడకింత ఓర్పూ , ప్రశాంతత తీసుకొచ్చేయేమో  ' అన్నాడు.

'కావచ్చు .. బహుశా ఈ ఎదవింతే  అనుకుని ఆవిడ మొగుణ్ణి పట్టించుకునేది కాదేమో ' అన్నాను.

'బహుశా ఆవిడ ఆయన్ని పట్టించుకున్నంతగా ఆయన ఆయన గురించి పట్టించుకునేవాడు కాదు .. అంతలా సేవలు చేసేది .. ఆయన తాగొచ్చినా , ఎవత్తితోనో పడుక్కునొచ్చినా ఒక్క మాట అనేది కాదు .. శుభ్రంగా , కడుపు నిండా అన్నీ ఒండిపెట్టేది , ఆఖరికి అత్తారింటివేపాళ్లు ..' నీ మొగుడిన్నేసి ఎదవ పన్లు చేస్తూంటే గడ్డి పెట్టవేం ? ' అని అడిగితే , 'నాకు లేని బాధ మీకెందుకండీ ?.. ఎక్కడికెళ్లినా , ఏంచేసినా రాత్రయ్యేపాటికి మా ఇంటికే చేరుకుంటాడాయన .. అది చాలు నాకు ' అని నవ్వేసేదావిడ ' అన్నాడు.

'ఆవిడకి పిల్లల్లేరా ?' అడిగేను.

'ఉంది .. ఒక్కతే కూతురు .. పద్మావతి అని పేరెట్టుకున్నారా పిల్లకి .. అచ్చం తల్లి పోలికే .. ' అన్నాడు.

'మరింకేం ?' అన్నాను.

'మరింకేం అనుకుంటే , ఇంక కథేముందీ ?.. పెద్దాపురంలో రత్నం అనే అమ్మాయిని తగులుకుని , ఆవిడ కోసం మనూళ్ళోనే ఓ మేడ కూడా కట్టించేసి ఇంక అక్కడే ఉండిపోడం మొదలెట్టేడు మార్కండేయులు .. అయినా కూడా శేషమ్మ ఏమీ అనుకోలేదు .. ఎవరైనా రత్నం మాటెత్తితే ఇంకో ఆడదాని ఊసు మనకెందుకులెండి అని నవ్వేసేదంట .. అలాంటిది ఓసారి దీపాలెట్టకముందే , ఇంటికొచ్చేసిన మార్కండేయులు శేషమ్మ తో 'రేపు మన పద్మావతి పెళ్లి సంబంధం కోసం కోటిపల్లి వెళ్ళాలి .. దాని ఫోటో మంచిదేమైనా ఉంటే ఇవ్వు అన్నాడు '

'అవునా .. చాలా సంతోషమండీ .. ఆ సంబంధం వివరం ఏవైనా తెలుసా ? ' అడిగింది శేషమ్మ

'శానా  పెద్ద సంబంధం లే .. మనకన్నా ఎక్కువాస్తులే ఉన్నాయాళ్లకి ' అన్నాడు.

'బావుంది .. చెప్పండి .. మనం ఎన్నింటికెళ్ళాలో ?' అంది.

'మనం కాదు .. నేనూ , రత్నం వెళ్లి సంబంధం మాటాడొస్తాం .. నువ్వెళ్ళి ఫోటో పట్రా ' అన్నాడు.

వెళ్లి పద్మావతి ఫోటో తీసుకొచ్చి  మార్కండేయులుకి ఇచ్చి , పూజ గదిలోకెళ్ళిందావిడ.

'నీ పూజలు తర్వాత .. నేనెల్తన్నాను .. తలుపేసుకో ' అని మార్కండేయులు అరిచేపాటికే , దీపం నూనె ఒంటిమీదోసుకుని ఒళ్లంటించేసుకుందా శేషమ్మ గారు ' అన్నాడు లోవరాజు.

ఒక్కసారి చేతిలో తినకుండా పట్టుకున్న జిలేబీ పొట్లం అలా ఒదిలేసేను.

'తామరాకు మీద నీటి బొట్టు అంటదు కానీ .. ఒక్కసారి కుంభవృష్టి కురిసిందనుకో , ములిగిపోతుంది ' అంటూ లేచేడు లోవరాజు.
***

No comments:

Post a Comment

Pages