తీరని మొక్కు - అచ్చంగా తెలుగు

తీరని మొక్కు

Share This
తీరని మొక్కు
లక్ష్మణరావు

మధ్య తరగతి జీవితాలు అలానే మధ్యస్తంగానే ఇబ్బందికరంగా ఉంటాయండీ అంటూ మంగామణి మౌనంగా ఉన్న తన భర్త శేషాచలంతో మాట కలుపుతూ "జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతులమవుతారు వయసు పెరిగితేముసలివారమవవుతారు."

కానీ మనలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగిలిపోతాం అందరకీ చిరకాలం గుర్తుండిపోతాం అని ఏదేదో చెప్పుకుంటూ పోతోంది భర్త వింటున్నాడో లేదో కూడా గమనించడం లేదు.
    "దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని, నాల్గు రాళ్ళు సంపాదిస్తున్నప్పడే ఓ రెండు రూపాయలు వెనకేసుకోవాలి.
         ఒంట్లో ఓపికున్నప్పుడు,కొద్దిగా డబ్బులు చేతిలోఉన్నప్పుడు మొక్కినమొక్కు,చేసిన అప్పు తీర్చుకోవాలి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి వీలైతే చేయగల్గిన, చేతనైన సహాయం చేసి మంచిపేరు
సంపాదించుకోవాలి" అంటుంటే శేషాచలం ఏంటి చెబుతున్నావని ప్రశ్నించాడు. బలే ఉంది మీతో, వెనకటి మీలాంటి వాడే రామాయణం అంతా విని రాముడికి,సీత ఏమవుతుంధి అన్నాట్ట!
    మంగా అలా కోప్పడకు ఏదో చెబుతున్నావుగా ఏంటీ మళ్ళీ ఇంకొక్కసారి చెప్పు ఇందాక ఏవో ఆలోచనల్లో ఉన్నాను.
            ఇప్పుడైనా శ్రద్ధగా వినండి గొప్పవారి జీవిత విశేషాలను తెల్సుకుంటే మనం కూడా గొప్పవాళ్ళం కాగలమో లేదో తెలీదు కానీ వారి అనుభవాలు, మనకి మార్గధర్శనం కాగలవు.
    నా చిన్నతనంలో మావీధిలో కిరాణదుకాణంలో  పద్దులు రాస్తే వచ్చే సంపాదనతో జీవితనావ సాగించిన సోమయాజులు గారు తమ జీవితంలో ఎన్నో కష్టాలనుభవించినా మానవతా మూర్తులుగా మిగిలిపోయారు తెల్సా వారి ఇల్లు చూసొద్దాం రండి! 
     ఆ ఇల్లు ఇప్పుడెలా అనాధశరణాలయంగా మారి ఆయన జ్ఞాపకంగా చిరకాలం గుర్తుండిపోయేలా ఉండిపోయిందో చెబుతా... అని ఆ ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తూ మంగామణి వివరిస్తోంది
***                 
      
‌    "చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాడుట" వెనుకటికొకడు మీలాగే!బావుంది సంబడం ఊగుతూ, జోగుతూ మీరు, లేస్తే కూర్చోలేను, కూర్చుంటే లేవలేని నేను పడే ఈ అవస్తలు చాలవా! ఇంకా మన మొహాలకి పూజలు, వ్రతాలు తక్కవయ్యాయా..... ఊరుకొండి బాబూ నా వల్ల కాదు.        రేపో,మాపో అన్నట్టున్న మన బతుకులకి పూజలు, పునస్కారాలు కూడానా...  చాల్లే బాబూ ఈ రోజులిలా గడవనీయండీ అంటే వినరు, ఏం చేసి ఏం లాభం ఒక్కడంటే ఒక్కడూ దక్కలేదు. పిల్లలే లేని మనమెలాగు పున్నామ నరకానికే పోతాం. ఆ మాత్రానికి పూజలెందుకు,
వ్రతాలెందుకు?   క్రిష్ణా!రామా!అనలేరు గానీ వ్రతాలు చేస్తారా... వ్ర...తా.... లు  చాలు చాల్లే చెప్పేరు గాని "మన తలరాతే బాగుంటే మునిమనవల్ని చూడాల్సిన వాళ్ళం " గంజిమెతుకులు కూడా కానలేకపోతున్నాం... 
కనీసం కన్న పిల్లల్ని కూడా దక్కించుకోలేని ధౌర్భాగ్యులం మనకెందుకొచ్చిన వ్రతాలు,పూజలు అని కాస్త కటువుగా మాట్లాడుతున్న జోగులాంబను సముదాయించే ప్రయత్నంలో సోమయాజులు గారు చాలా ఓపిగ్గా మొక్కిన మొక్కు తీర్చకపోతే అనర్ధం జరుగుతుందట అని చెబుతున్నారు.
        చాల్లెండి జరిగిన అనర్ధం ఇంతకన్నా ఇంకేం జరగాలి ఇంత జరిగినా ఇంకా మనం సత్యన్నారాయణ స్వామి వ్రతం చేయడమా... వినడానికే విడ్డూరంగా ఉంటుంది జనాలకి మళ్ళీ ఇక ఆ ఊసెత్తకండి నాయనా... మీకు పుణ్యముంటుంది బాబూ మీ పనేదో ఉందన్నారుగా చూసుకొండి. 
 నడి వయస్సులో హాయిరంగా! అని కాలుమీద కాలేసుకుని కులుకుతున్నప్పుడే రా! రా! మొగడా ఓ సారి అన్నవరం కొండకెళ్ళి సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని ఆ మొక్కేదో తీర్చుకుందాం, వ్రతం చేసుకు వద్దామంటే విన్నారు గాదు గానీ ఇప్పుడు మీకు వ్రతం చేయాలనే తలంపెలా వచ్చిందండీ బాబూ? ఇప్పుడెందుకు గుర్తొచ్చింది మీకా మొక్కు?
        ఇప్పటికే ఆ పాత మొక్కిన మొక్కులు అలానే ఉండి పోయాయి. అవి తీరేలోపు, మీరో నేనో ఎలాగూ సాములోరి చెంతకు వెళ్ళడం ఖాయం అంటూ జోగులాంబ, భర్త సోమయాజులుతో గొడవ పడుతోంది.
           వినిపించీ, వినపడనట్టు అస్పష్టంగా వినబడే సోమయాజులకి భార్య జోగులాంబ దెప్పి పొడుస్తున్న మాటలు మాత్రం ఈ సారి చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. 
         కానీ భార్య గయ్యాళితనానికి,ఆ నోరు పారేసుకునే తీరుకి తిరుగు సమాధానం చెప్పలేక, చేసేదేంలేక భయపడి మనస్సులోనే భగవంతుడా ఇదంతా నా తలరాతే గదా అనుకుని ఓ దండం పెట్టుకుని ఊరుకున్నాడు.
          సోమయాజులు ఓ ఎనబై ఏళ్ళ వయస్సు పైబడినవాడు వీధిలో కిరాణా అమ్మే దుకాణదారులకి రోజువారీ పద్దులురాస్తూ వచ్చే దినసరి వేతనంతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు .
          ఈ మధ్య నడవలేక, ఎటూ వెళ్ళలేక ఇంటి పట్టునే ఉంటున్నాడు. పైగా కంటి చూపు కూడా సరిగ్గా కనబడటం లేదు. సోమయాజులుగారికి కంటి ద్రృష్టి సరిగ్గా  లేకపోవడం వల్ల మా దుకాణ యజమానులు కూడా జీతం ఇవ్వడం ఇష్టంలేక,అలాగని ఆ విషయం మొహమాటానికి ఆయనకు చెప్పలేక, రాసే పద్దుల లెక్కలు ఖచ్చితంగా ఉండటంలేదు, తప్పులు దొర్లుతున్నాయనే వంకతో, సోమయాజులు గార్ని మాన్పించేయాలని తీర్మానించుకుని  మా కుర్రాళ్ళు పట్నం చదువులైపోయి వచ్చీసేరు ఆళ్ళు తప్పో,ఒప్పో ఏవో లెక్కలు రాసెత్తామంటున్నారు బాబుగారు. "రేపటినుండి మీరిక అంత శ్రమపడి రానక్కర్లేదు ఇక మీ వయస్సు కూడా పెరిగింది గదా కళ్ళు సరిగా ఆనడం లేదుగదా ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకొండి" అని ఖరాఖండీగా చెప్పేసారు ముక్త కంఠంతో.
           మా దుకాణం యజమానులలా చెప్పేసరికి  "సోమయాజులు గారి పై ప్రాణం పైనే పోయినట్టయి" ఒక్కసారిగా బజారులో నడి రోడ్డుమీదే కూలబడిపోయారు.అక్కడ చుట్టుపక్కలున్నవారు చల్లని నీళ్ళు మొహమ్మీద జల్లి, నిమ్మరసం, ఉప్పు కలిపిన షర్బత్ పట్టించే సరికి కొంచెం తేరుకున్నారు తర్వాత రిక్షాలో వారిని ఇంటికి దిగబెట్టారు.
         ఎప్పుడూ నడిచేవచ్చేవారు అలాంటిది రిక్షాలో ఆహా! ఏం రాజభోగం అనుకుంటూ జోగులాంబ ఇంటికి వచ్చిన సోమయాజుల్ని చూసి "ఏంటో రాజావారికి ఈవేళ వాహన యోగం లభించినట్టుంది"మాస ఫలాలు మారుతున్నాయన్నమాట, లేక ఏదైనా లాటరీ తగిలిందా? ఐనా మనలాంటి ధౌర్భాగ్యులకి అంతోటి అధ్రృష్టంకూడానా అంటూ వ్యంగ్యంగా లోపల్నుంచి అనుకుంటూ వస్తుంటే సోమయాజులు రిక్షా రాములుకి సౌంజ్ఞ చేసి బజారులో జరిగిందేం చెప్పొద్దని వెళ్ళిపొమ్మన్నారు.
            రిక్షా రాములలా వెళ్ళిపోగానే భార్యతో సోమయాజులు ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని భార్యకి బదులు చెబుతూ రాణివారు మరి ఈ రాజావారికి ఏ వంటకాలు సిద్దంచేసారో? ఏంటో అసలే అపరాహ్న వేళయ్యింది ఆకలి బాగా దంచేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భోజనానికి వడ్డించండి అన్నారు.
      నిజానికి ఏం తినాలని లేదు గానీ ఏం సాకు చెప్పాలా అనే ఆలోచన, మరోప్రక్క భార్యకి తనను పనిలోకి రా వద్దన్నారని ఎలా చెప్పాలో అనే ఆలోచన మనస్సుని దొలిచేస్తున్నాయి. ఏం మాట్లాడనీయడం లేదు అందుకే ఏదో ఒకటి మాట్లాడి మనస్సు తేలిక పరచుకుందాం అనుకున్నారు.
         రాజావారు ఎండన పడొచ్చారు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు,దాహానికింత మజ్జిగ, సేద తీరడానికి వింజామరులు వీచడంలాంటి సేవలు ఏం లేవా? అడిగితే తప్ప చెయ్యరా.. ఏంటని భార్యను ఆట పట్టించే ప్రయత్నం చేస్తూ మాట్లాడే మాటల్లో తడబడుతున్నారు. అది జోగులాంబ గ్రహించేసింది ఏదో జరగకూడనిది జరిగుంటుందని.
   యాబై ఏళ్ళ దాంపత్య జీవితంలో ఆమాత్రం భర్తను గ్రహించలేదా? ఏంటీ? మనిషి కఠువుగా కనబడుతుందేమో గాని ఆమె మనస్సెంత మెత్తనో! 
          జోగులాంబ మనిషి కఠువుగా కనబడుతుందని అందరూ గయ్యాళి అనుకుంటారు కానీ ఆవిడలా మారడానికి కారణం పుట్టిన పిల్లలు కొందరు పురిటిలోనే చనిపోతే, మరికొందరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చనిపోగా మిగిలిన ఒక్కగానొక్క కొడుకు అందొచ్చాడు అనుకుంటుంటే మొన్నామధ్య అమెరికాలో  రోడ్డు ప్రమాధంలో చనిపోయాడు. అదిగో అప్పట్నుండి ఆవిడ మరింత కఠినాత్మురాలుగా మారిపోయింది.  
       మొత్తానికి మధ్యాహ్న భోజనాలు ముగిసాక తీరిగ్గా కూర్చుని చెబుదామనుకున్న సోమయాజులుకిక అసలు విషయం చెప్పక తప్పలేదు తనని పనిలోనుండి తీసేసారని విశ్రాంతి తీసుకోవాలని       ఇందాక ఉదయం పద్దులు రాయడానికి ఇక రావద్దన్నారని చెప్పగానే తాను కళ్ళు తిరిగి పడిపోవడం, షర్బత్ పట్టించివ్వడం, రిక్షాలో దిగబెట్టడం మొదలగు అన్ని వివరంగా పూసగుచ్చినట్టుగా వివరించారు భార్యకు.
           ఇక ఆరోజిద్దరూ మధ్యాహ్న భోజనం కూడా మానేసారు జీవితంలో ఎన్నో కష్టాలు, ఆటుపోటులు భరించారు.ఇక భరించే ఓపిక కూడాలేని వ్రృద్ధులయ్యారు 
  *     *      *        *     *
       గతజ్ఞాపకాలను, తన జీవితంలో తాననుభవించిన సంఘటనలను గుర్తు చేస్కుంటుంటే సోమయాజులుకి ఆకస్మికంగా వాళ్ళమ్మగారు చెప్పిన మాటలు"ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత తేలిక కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండటం మంచిదిరా అనే మాట అలాగే వాళ్ళమ్మగారు మొక్కిన మొక్కు కూడా గుర్తొచ్చింది.
     పెళ్ళైన తర్వాత సత్యన్నారాయణ స్వామి వ్రతం చేయాలనే మొక్కు అదలా కుదరకపోవడం వల్ల అప్పటినుండి నేటివరకూ వాయిదా పడుతూ వస్తోందని అందుకే ఉదయం బజారుకెళ్ళేముందు భార్యతో మొక్కినమొక్కు సత్యనారాయణవ్రతం చేయాలనే మ్రొక్కు గురించి గుర్తుచేస్తుంటుంటే కోప్పడింది.
       ఇక వ్రతమిప్పుడెలాగు చేయలేనని ఢీలా పడ్డాడు. కరుగుతున్న కాలానికి జరుగుతున్న సమయానికి, అంతరించే వయసుకి మిగలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం అందుకే పోయేముందు ఓ మంచిపని చేసి పోవాలని అనుకున్నారు సోమయాజులు గారు. 
       సోమయాజులు గార్కి తన తాతగారికి దానంగా ఇచ్చిన రెండుగదుల పెంకుటిల్లు వారసత్వ సంపదగా లభించింది. అది తప్ప తన దగ్గర ఇక  ఏ ఆస్తిపాస్తుల్లేవు. 
      ఇప్పుడా ఇంటిని అమ్మితే తప్ప  మొక్కిన మొక్కు తీర్చు కోలేడని గ్రహించాడు. కానీ అదేం అంతగొప్ప విషయం కాదని అనుకున్నాడు. ఉన్న ఆస్తులను కాపాడుకోవడం గొప్ప గానీ అమ్ముకోవడం కాదని అనుకుంటూ జీవితపు చివరి రోజులు కూడా కదా ఈ జన్మ ఋణం మరుజన్మ దాకా ఎందుకు ఇక్కడే తీర్చుకుంటే పోలా..అని మరలా మొక్కిన మొక్కుని గుర్తు తెచ్చుకుంటూ...      ఈ ఆరాటంలో ఎలాగైనా  ఇల్లు అమ్మి  రేపు తొలి ఏకాదశీ పుణ్యదినం కూడాను మొక్కు తీర్చుకుందామని అనుకుంటూ ఇంటి దస్తావేజులు మరోసారి చదివి చూసుకున్నారు.
           అమ్మడం కన్నా తమ జ్ఞాపకంగా ఉండిపోవాలనే ఉద్దేశ్యంతో... మనస్సు మార్చుకుని "అనాధశరణాలయానికి చెందాలని" వీలునామా స్వదస్తూరితో రాసి తన తల్లి మొక్కిన మ్రొక్కు కన్నా చెప్పిన మాట  నెరవేరుస్తున్నాననే ఆనందంతో రాత్రైందని పడుకున్నారు తెల్లారేసరికి ఇక లేవకపోవడంతో జోగులాంబ ఆయనేలేని నా జీవితమెందుకని ఏడుస్తూనే ఆవిడా కన్నుమూసింది. 
              *      *      *       *        *
    అలా సోమయాజులుగారి జ్ఞాపకంగా ఆ ఇంటిని అనాద శరణాలయంగానూ,
వాళ్ళబ్బాయి చేసిన భీమా సొమ్ము నిర్వాహణ ఖర్చులకు ఉపయోగిస్తున్నారన్నమాట. అదేనండి ఈ ఇల్లు .   ఈ రోజు మీ పుట్టినరోజు కూడానూ తెల్సు కదా. మీకు కాబట్టి ఈ సందర్భంగా మీరు కూడా ఏదో ఒకటి శాశ్వతంగా గుర్తుండిపోయే మంచిపని చెయ్యండి. 
    ఓహ్! అలాగే ఇప్పుడే చెబుతున్నా.. నా  అనంతరం నాఅవయవాలను దానంగా ఇస్తున్నా... అలాక్కూడా నేను కొంత మందికి ఉపయోగపడొచ్చు గదా!   నా తదనంతరం నా దేహాన్ని వైద్య విద్యాలయానికి అప్పగించు వారి పరిశోధనలకి పనికొస్తుంది, అని శేషాచలం భార్య మంగామణితో చెప్పాడు. 
       అబ్బ!బాగుందండి మీ కొత్త ఐడియా ఇలా చేస్తే మరికొంత మందికి మరికొంత కాలం జీవితం ప్రసాదించినట్టే. మొక్కీన మొక్కు తీర్చకపోతే అనర్ధం గానీ ఇదలా కాదు. మీరెక్కడ కాలం చేసినా ఆ టైముకి వాళ్ళొచ్చి తీసుకుపోతారు. మీ దేహాన్ని మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు రాసి ఇవ్వండి.
***
         
             

No comments:

Post a Comment

Pages