ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -25
రెడ్లం రాజగోపాలరావు
విశ్వరూప సందర్శనయోగము
భగవానువాచః
ద్రోణంచ భీష్మంచ జయద్రధంచ కర్ణంతధాన్యానపియోధ వీరాన్
మయాహతాంస్త్వంజహిమావ్యధిష్ఠా యుధ్యస్వజేతాసిరణేసపత్నాన్
- 34 వ శ్లోకం
భగవంతుని సంపూర్ణ శరణాగతిపొంది కర్తవ్య, ఆచరించవలెను. భగవంతుని శరణాగతిపొందినవారికి సుఖదుఃఖములు రెండును సరిసమానములే. సర్వేశ్వరుని శరణుబొంది కర్తవ్యమునకు ధర్మపూర్వకముగా నాచరించువారికి దిగులుపొందవలసిన పనిలేదు. కనుకనే మరమాత్ముడు అర్జునునకు తన కర్తవ్యమును,తన విద్యుక్త ధర్మమును, ధైర్యముతో, నిర్భయముతో నాచరించవలసినదిగా భోదించుచున్నాడు.
శ్రీకృష్ణపరమాత్మ గీతను బోధించు సమయమున భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడుమున్నగువారు జీవించియేయున్నారు. వారు మరణించినట్లు భగవానుడు అర్జునునకిచట తెలిపెను. పుట్టిన ప్రతి ప్రాణియుగిట్టుట తప్పదన్నసత్యాన్నిచట తెలియజేసెను. భగవంతుడు కాలాతీతుడన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయుచున్నారు.ఈ కనుపించుబంధు మిత్రాదులు సిరిసంపదలు మున్నగునవన్నియు భవిష్యత్కాలమున వినాశమొందునవే అయియున్నవి. విజ్ఞులు ఈ దృశ్యమాన జగత్తంతయు అశాశ్వతమని భావించి, వైరాగ్యాదులనభ్యసించి భగవంతుని శాశ్వతత్వమును గుర్తించవలెను.బుద్ధ భగవానుడు దేహాదుల అశాశ్వతత్వమును, మృత్యువుయొక్క విషపుకోరలనుండీ ఎవరూ తప్పించుకొనలేరన్న సత్యాన్ని ముందుగానే తెలుసుకొని విరాగియై శాశ్వత ఆనందమునుపొందినాడు.
నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమోనమస్తే
నమః పురస్తాదధపృష్ఠతస్తే నమోస్తుతే సర్వతయేవసర్వ
- 40 వ శ్లోకం
పూర్ణ భక్తియే మానవుని భగవంతునిదరికి జేర్చు ముఖ్యభూమిక. ఆ విషయమును అర్జునుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు.
సర్వరూపుడవగు ఓ కృష్టా ఎదుటను వెనుకను మరియు అన్ని వైపులను నీకు నమస్కారములు అపరిమితమగు సామర్థ్యము, పరాక్రమముగలవాడవగు నీవు సమస్తమును బాగుగా వ్యాపించియున్నావు. నీవు సర్వ స్వరూపుడవై యున్నావు అర్జునుడు తన హృదయమున పొంగిపోరలుచున్న భక్తి భావమును వ్యక్తముచేయుచున్నారు.
భగవంతుని శక్తికి పరిమితిలేదు. ఒక చిన్న విసనకర్రతో వీచుకున్న కొద్దిగాలి వచ్చును ఒక్కసారి జంఝూమారుతము వీచినచో గొప్పగాలి ఉద్భవించును మొదటిది మనుష్యశక్తి. రెండవది దైవశక్తి ఒక దీపము వెలిగించినచో కొద్ది వెలుతురువచ్చును సూర్యుడుదయించినచో లోకమంతయు దేదీప్యమానముగా వెలిగిపోవును. అనన్య భక్తితో భగవంతుని అనంత భక్తితో భగవంతుని అనంత శక్తివంతునిగా భావించుటయే నిజభక్తి. అట్టి శరణాగతియే మానవుని శాశ్వత ఆనందప్రాప్తిని కలుగజేయును. భగవంతునికి ప్రతి రూపమే మానవుడు, ఆ అనంతుని అన్ని లక్షణములను మానవునికి ప్రసాదించాడు ఒక్క ఆనందం తప్ప పూర్ణభక్తియే ఆనందానికి ప్రతి పదార్థము.
కిరీటినం గదినం చక్రహస్త మిచ్ఛామిత్వాం ద్రష్టుమహంతథైవ
తేనైవరూపేణచతుర్బుజేన సహస్రబాహో భవవిశ్వమూర్తే
- 46 వ శ్లోకం
పరమాత్మా నేనునిన్ను మునుపటివలెనే కిరీటము, గద, చక్రము చేత ధరించిన వానిగా జూడదలచుచున్నాను. అనేక హస్తములుగలవాడా జగత్ప్రభో నీ పూర్వ రూపమునే మర ధరింపుము
శ్రీ భగవానువాచః
మయా ప్రసన్నేనతవార్జునేదం రూపం వరందర్మితమాత్మయోగాత్
తేజోమయం విశ్వమనన్త మాద్యం యస్మేత్వదన్యేనదృష్ట పూర్వమ్
- 47 వ శ్లోకం
అర్జునా ప్రకాశముచే పరిపూర్ణమైనదియు, జగద్రూపమైనదియు, అంతములేనిదియు,మొదటిదియు, నీవుతప్ప ఇతరులచేనిదివరకెన్నడును జూడబడనిదియునగు ఏ యీ సర్వోత్తమమైన విశ్వరూపముగలదో, అయ్యది ప్రసన్నుడనగునాచే స్వకీయయోగశక్తి వలన నీకు చూపబడినది.అనన్య భక్తిగలవారికి భగవానుని అనుగ్రహము కలుగునని ఇచట స్పష్టమగుచున్నది. జ్ఞాననేత్రం ద్వారా దర్శించుకున్న విశ్వరూపాన్ని ఉపసంహరించమని భగవానుని అర్జునుడు అభ్యర్థించుచున్నాడు. అంటే అర్జనుని జ్ఞాననేత్రం శ్రీ కృష్ణపరమాత్మసంకల్పము వలన తెరువబడినది. అనన్య భక్తి కలిగిన భక్తునికి భగవంతుడు తన అనుగ్రహాన్ని ఏ విధంగా అనుగ్రహిస్తాడో స్పష్టమగుచున్నది. సర్వమానవాళి ఈ అనుగ్రహాన్ని పొందవచ్చు. అందుకు అనన్య భక్తి, సంపూర్ణ శరణాగతి అత్యంత ఆవశ్యకము. అట్టి అర్హతగలిగిన ప్రతిమానవుడు ఒక అర్జనుడే అందుకు మన యొక్క హృదయపూర్వకమైన ప్రయత్నమే ప్రధానమైనది.
ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
మీ రాజగోపాల రావు రెడ్లం
పలమనేరు
9482013801
No comments:
Post a Comment