ఆణిముత్యం గాడి నవ్వు
లోవరాజు కధలు - 18
కంభంపాటి రవీంద్ర
వంటింట్లో పీటేసుక్కూర్చుని తరవాణీ అన్నంలో మాగాయేసుకుని నంచుకు తింటూంటే 'ఏరా .. ఏంచేస్తున్నావు ?' అంటూ లోపలికొచ్చేసేడు లోవరాజు
నేనింకా బదులిచ్చే లోపే , వాడే 'తరవాణీ అన్నం తింటున్నావా ?.. మంచిది .. ఇవ్వాళే అమెరికా వాడు కూడా ' మిగిలిపోయిన అన్నాన్ని నీళ్ళల్లో పెట్టుకుని , మర్నాడుదయం తింటే ఒంటికి మంచిదని చెప్పేడు ' అన్నాడు
'ఆ ముక్క మన పెద్దలు ఎప్పుడో చెప్పేరు .. కొత్తగా అమెరికా వాడు కనిపెట్టేదేంటీ ?' అన్నాను
'మన పెద్దాళ్ళు చెప్పేరు సరే .. కానీ జనాలు పాటిస్తున్నారా అని ?'
'అదీ నిజమే .. ఈ మధ్య ఈ అమెరికా పిచ్చి ఒకటి తగులుకుని , కార్న్ ఫ్లేక్స్ అనీ , ముసెలి అనీ గాడిద గుడ్డనీ నానారకాల గడ్డీ మింగేస్తున్నారు .. మన పెద్దాళ్ళు మనకి అచ్చొచ్చినవని కొన్ని ఆహారపు అలవాట్లు చేసెళ్లిపోయేరు ..మంచో చెడో .. వాటితోనే బతకాలి .. కానీ ఇవన్నీ మానుకుని .. ఇలాంటి నానా పెంటా నోటికెక్కించుకుంటాం ' అన్నాను
'నీకు మన స్వాతిముత్యం గాడి కధ చెప్పేనా ? 'అన్నాడు లోవరాజు , నావేపు చూసి నవ్వుతూ
'ఆడికేవైంది ?' అడిగేను .
సుంకర వెంకటేషని .. మాతో పాటు తొమ్మిదో క్లాసుదాకా చదివేడు . మహా అమాయకుడు .. ఎవరు ఏం చెప్పినా పుటుక్కున నమ్మేసేవాడు . ఎలెక్ట్రీషన్ గా పన్జేసే వెంకటేషు గాడి నాన్న ఆడి చిన్నప్పుడే ఇంట్లో చెప్పకుండా కువైట్ వెళ్ళిపోయి , మళ్ళీ వెనక్కి రాలేదు . ఆయన గల్ఫ్ యుద్ధంలో చనిపోయేడనీ ..లేదు లేదు ..బతికేవున్నాడు .. మేం క్రితంసారి దుబాయ్ వెళ్ళినప్పుడు ఎవరో ఆడలేడీస్ తో చూసేమనీ ..జనాలు ఇలా రకరకాలుగా చెప్పుకునేవారు . జనాలెలా చెప్పుకున్నా వెంకటేషు గాడి అమ్మ కమల మటుకూ ఇంక మొగుడు లేడని డిసైడైపోయి , వెంకటేషు గాడిని అతి జాగ్రత్తగా పెంచింది, ఆడిని బయటికి ఏ పన్లకీ పంపకుండా అన్నీ ఆవిడే చూసుకునేది .
ఎనిమిదో క్లాసులో ఉన్నప్పుడనుకుంటాను , ఓసారి వీడు మా లెక్కల మాస్టారు పారుపల్లి శ్యామల్రావు గారి దగ్గిరికెళ్ళి, తన పరీక్ష పేపర్ చూపించి , 'సార్ .. నాకు వచ్చినాటి కన్నా ఎక్కువ మార్కులేస్సేరండి ' అన్నాడు , ఆయన వీడి మొహంకేసోసారి చిరాగ్గా చూసి 'ముప్పై ఐదు మార్కులొస్తే పాసవుతావు .. నీకు ముప్పై మూడొచ్చేయి .. పోన్లే కదా అని రెండు మార్కులు కలిపేను ' అంటే 'భలేవోరండి ..ఊరికే ఎవరి దగ్గిరా ఏవీ తీసుకోవద్దని మా అమ్మ చెప్పిందండి .. అలాంటిది .. మార్కులెలా తీసుకుంటానండి ?' అని వెంకటేషు గాడనేసరికి, శ్యామల్రావు గారు భళ్ళున నవ్వి 'ఒరేయ్ .. స్వాతి ముత్యం సినిమా చూసి .. అసలు అలాంటోడు ప్రపంచం లో ఉంటాడా అనుకున్నాను .. ఎందుకుండడు అని నువ్వు నిరూపించేసేవురా అబ్బాయ్ ' అన్నాడు . ఆ రోజు వెంకటేషు గాడి పేరు స్వాతి ముత్యంగాడైపోయింది !
'ఆడు నీకింకా గుర్తున్నాడన్నమాట ' అంటూ లోవరాజు గాడు చెప్పడం మొదలెట్టేడు.
'మన స్వాతిముత్యం గాడికి చదువు సరిగా అబ్బకపోవడం, అమాయకుడవడంతో ఆడు ఏ పన్లోనూ కుదురుకోలేకపోయేడు . కమల కి వయసు మీద పడుతున్న కొద్దీ , కొడుకు ఏమైపోతాడో అనుకుని తెగ బెంగెట్టేసుకుంది . కాకపోతే ఆవిడ నోరు మంచిదవడం తో చుట్టుపక్కలాళ్లందరితో ఆవిడకి మంచి సంబంధాలున్నాయి . మన సోమేశ్వర్రావు మాస్టారి దగ్గిరికెళ్ళి ఈవిడ తన బాధలు చెప్పుకుంటే, ఆయన స్వాతిముత్యం గాడి నాన్న పన్జేసిన ఎలక్ట్రిసిటీ ఆఫీసులో పెద్దాళ్ళని కలిసి, వీళ్ళ కుటుంబానికి సహాయం చెయ్యమని అడిగేడు, వాళ్ళు కూడా జాలిపడి , వీడిని ఆ ఆఫీసులో అటెండరు గా చేర్చేసుకున్నారు .
ఎంతైనా గవర్నమెంటు ఆఫీసులో ఉద్యోగం కావడంతో మన స్వాతిముత్యం గాడికి సంబంధాలు కూడా రావడం మొదలెట్టేయి... ఆ వచ్చినాటిలోకెల్లా బత్తిన సత్యానందం గారమ్మాయి కల్పలత బాగా నచ్చేసింది కమలకి . పిల్ల చాలా నెమ్మదస్తురాలు, మనోడికి సరిగ్గా సరిపోతుందని, ఆ సంబంధాన్నే కుదిర్చి పెళ్లి జేసేసేరు.. ఆ తర్వాత ఏడాది ఓ కొడుకు పుట్టేడాళ్లకి.. సతీషని పేరెట్టేరా కుర్రాడికి ' అన్నాడు లోవరాజు
'ఇందులో విశేషం ఏముంది ?' అన్నాను
'విశేషమేంటో ఇప్పుడు చెబుతాను .. ఆ స్వాతిముత్యం గాడి కొడుకు కొంచెం తేడా గా ఉండేవోడు .. ఆ చూపులెప్పుడూ నెలకంటుకుపోయేవి .. ఎప్పుడు చూసినా ఏడుస్తా ఉండేవోడు .. ఓ ఏడాది తర్వాత కల్పలత కి ఎందుకో అనుమానం వచ్చి కాకినాడ లో పిల్లల డాక్టరు దగ్గిరకి తీసికెళ్తే , ఆవిడ చూస్తూనే చెప్పేసింది .. మీ కుర్రాడికి డవున్స్ సిండ్రోమ్ .. ఎదుగుదల సరిగా ఉండదు .. జాగ్రత్తగా చూసుకోండి ' అని
కొడుక్కి ఎదుగుదల సరిగా ఉండదు, అనేసరికి కల్పలత గుండెజారిపోయింది . విషయం అందరికీ తెలిసిపోయింది . సతీషగాడిని చూసి, ఇంటి చుట్టుపక్కలాళ్ళు స్వాతిముత్యం గాడికో ఆణిముత్యం పుట్టేడ్రోయ్ అని తెగ జోకులేసుకుంటావుండేవోరు.
ఈళ్ళ మాటలన్నీ వింటున్న కల్పలత కి కొడుక్కి తండ్రి పోలికలే వచ్చేసేయి అని గట్టి నమ్మకం వచ్చేసింది. ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండే సతీషు గాడిని చూస్తే కంపరం వచ్చేసేది ఆ అమ్మాయికి . నెలకోసారి కాకినాడ కి సతీషు గాడిని డాక్టరు దగ్గిరకి తీసుకునెళ్ళేది , ఆ క్రమంలో అక్కడి కాంపౌండరు జాకబ్ అనే కుర్రాడు, కల్పలత మీద జాలి చూపించడం, ఆ జాలి ప్రేమగా మారి, ఇద్దరూ సంబంధమెట్టుకోడం దగ్గిర సెటిలయ్యింది .
ఆ తర్వాత రోజూ మొగుడితోనూ, అత్త తోనూ ఊరికే గొడవెట్టేసుకునేది .. ఈ పిచ్చాడిని నాకిచ్చి పెళ్లి చేసి, నా జీవితం నాశనం జేస్సేరు ' అని అందరికీ వినపడేలా పెద్ద గొడవ పెట్టినా , కమల, స్వాతిముత్యం గాడు ఏమనేవారు కాదు . దాంతో ఇంకా చిర్రెత్తిపోయిన కల్పలత ఆ కోపం సతీషు గాడి మీద చూపించేసేది 'ఎదవనాకొడక .. ఈ మొహానికి ఎప్పుడూ ఏడుపే ..నా బతుకులాగా' అంటూ రెండు తగిలించేసరికి, ఇంకాస్త గట్టిగా ఏడ్చేవాడా సతీషు గాడు .
'ఆ తర్వాత కల్పలత ఆ జాకబ్ గాడితో లేచిపోయిందా ?' అన్నాను
'బాగానే ఊహించేవు ' అన్నాడు లోవరాజు
'ఇందులో ఊహించడానికేముంది .. సరే చెప్పు ' అన్నాను
'ఆ జాకబ్ గాడితో కల్పలత లేచిపోయింది , ఇద్దరూ కాకినాడ జగన్నాథపురం లో కాపురమెట్టేరు .. .. ఇంకో ఏడాదికి కల్పలత కి కవల పిల్లలు పుట్టేరు , ఇద్దరూ ఆడపిల్లలే .. అప్పట్నుంచీ జాకబ్ గాడు రోజూ తాగేసొచ్చి , కల్పలతని చితక తన్నేసేవోడు.'
'ఎందుకూ .. ఆడపిల్లలు పుట్టేరనా ?' అడిగేను.
'అందుక్కాదు .. ఆ పిల్లలిద్దరికీ సతీషు గాడికున్నట్టే డవున్స్ సిండ్రోము ' అన్నాడు లోవరాజు.
'అయ్యయ్యో .. '
'కల్పలత పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది .. ఇటు పిల్లల్నీ చూసుకోలేక, అటు జాకబ్ గాడి బూతులూ , తన్నులూ తినలేక నానా బాధలూ పడేది .. ఇంకొన్నాళ్ళకి ఆడిని కూడా వొదిలేసి త్రిపురసుందరి గుడి దగ్గిర అట్ల బండి పెట్టుకుంది . ఓ రోజు సాయంత్రం ఆ బండి పక్కనే ఇద్దరు కూతుళ్ళనీ చూసుకుంటా అట్లేస్తూంటే , ఎవరో నవ్వుతున్నట్టనిపించింది .. ఎవరా అని చూసేసరికి .. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గిర ఆగిఉన్న కారు కిటికీ దగ్గిర కూచుని తనవైపే చూస్తూ నవ్వులు నవ్వుతున్నాడా సతీషు గాడు' అన్నాడు లోవరాజు.
'ఏం ? స్వాతిముత్యం గాడు కారు కొన్నాడా ? ' ఆడిగేను.
'లేదు .. స్వాతిముత్యం గాడి తండ్రి కువైట్ లో తెగ సంపాదించేసి , ముసలాడినైపోయేను ఇంక చాలని భార్య, కొడుకు దగ్గిరికొచ్చేసేడు .. ఇప్పుడా మనవణ్ణి ఆయనే ఎంతో ప్రేమగా సాకుతున్నాడు ' అంటూ ముగించేడు లోవరాజు.
***
No comments:
Post a Comment