అందమె ఆనందం
మొక్కరాల కామేశ్వరి
సుందరికి అందం అంటే ఆరోప్రాణం. అందుకే తన జీవితం అనే టైటిల్ కి "అందమె ఆనందం" అనే టేగ్ లైన్ పెట్టుకుంది. తన చుట్టూ ఉన్న వాతావరణం అంతా అందంగా ఉండాలి. పరిసరాలన్నీ శుభ్రం గానే కాదు సుందరం గా కూడా ఉండాలి. తను వాడే ప్రతి వస్తువా ప్రత్యేకం గా ఉండాలి. మొత్తం మీద సుందరి సౌందర్య పిపాసి.
పేరుకి తగ్గట్టుగానే సుందరి అందం గానే ఉంటుంది. మరీ బాపూ బొమ్మలా కాకపోయినా, బాపూబొమ్మకీ, వపా బొమ్మకీ మధ్యస్థంగా చూడ చక్కగా ఉంటుంది. మంచి శరీర చాయ. అంత పొడుగూ, పొట్టీ కాని ఎత్తు, ఎత్తుకి తగ్గ ఒళ్ళు, తీరైన ముఖ కవళికలతో చూడగానే ఆకట్టుకునే రూపం. కాలెజీ రోజుల్లో ఒక వెలుగు వెలిగింది. దేవుడిచ్చిన రూపానికి తోడు శ్రధ్ధగా చేసుకునే పోషణతో, మరింతఆకర్షణీయం గా ఉంటుంది. తన అందం పట్ల ఆమెకు గొప్ప ఆరాధనా భావం. చిన్నప్పుడు గంటల కొద్దీ అద్దం ముందే గడిపేది
సుందరికి ప్రతీదీ అందం గా ఉండాలి. తన పేరు మరీ సాధారణం గా ఉందని చాలాసార్లు అనుకునేది. ఇంతకన్న మంచి పేరు నీకు దొరక లేదా? అని తల్లిని సాధించేది. అయితే తన పేరుకిఉన్న అర్ధం రీత్యా, కొంతలో కొంత సమాధాన పడేది.
అందమయిన సుందరికి అనువయిన సంబంధం దొరకడం కొంత కష్టమే అయింది. నల్లగా ఉన్నారని కొందరినీ, పొట్టిగా ఉన్నారని కొందరినీ, ముక్కూ మొగం బాలేవని కొందరినీ కాదనుకుంటూ పోవడం తో పాతికేళ్ళు పై బడే వరకూ పెళ్ళి కాలేదు. ఆరోజుల్లో పెళ్ళి కూతురికి పాతికేళ్ళంటే చాలా ఆలస్యం కిందే లెఖ్ఖ. ఆపాటికి ఆమెస్నేహితులందరికీ, పెళ్ళిళ్ళే కాదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా అయిపోయాయి.
మొత్తానికి ఆమె కోరుకున్నట్టే, గ్రీకు శిల్పం లాంటి ఆరడుగుల అందగాడు, మంచి ఉద్యోగం లో ఉన్నవాడూ అయిన శ్రీకాంత్ భర్త గా లభించాడు. సుందరి అదృష్టానికి అందరూ అబినందించారు. కాలక్రమం లో సుందరికి ఒక కొడుకు, ఒక కూతురు కలిగారు. అందమైన దంపతులకు పుట్టిన బిడ్డలు కనుక,సహజం గానే చూడముచ్చటగా ఉన్నారు.
పిల్లలకు పేర్లు కూడా ప్రత్యేకం గానే ఉండాలంటూ చాలా పరిశోధన చేసింది సుందరి. పేరు వినడానికి సొంపుగా ఉండాలి. అర్ధవంతం గా ఉండాలి. అన్నిటికన్నాముఖ్యం గా చుట్టు పక్క ల ఎవరికీ ఆపేరుండ కూడదు. యిన్ని షరతులు కుదరాలంటే కష్టమే. చివరికి ఆలోచించి, ఆలోచించి, కొడుక్కి తారణ్ అని పేరు పెట్టింది. అంటే తరింప చేసేవాడు అని అర్ధంట అలాగే కూతురికి తన్వి అని పేరు పెట్టింది. తన్వి అంటే అందమైన స్త్రీ అని అర్ధం ట.
కాలచక్ర గమనం లోముఫ్ఫై ఏళ్ళు గడిచి పోయాయి సుందరి పిల్లలు పెద్దవాళ్ళయి, పెళ్ళిళ్ళయి, విదేశాలలో స్థిర పడ్డారు. చాలా యిళ్ళలొలాగే భార్యభర్త లిద్దరే మిగిలారు ఇండియాలో. నగరానికి దూరం గా వెలసిన ఒక కొత్త కాలనీలో Flat కొనుక్కుని, విశ్రాంత జీవనం ఆస్వాదిస్తున్నారు. మొత్తం అపార్ట్ మెంట్స్ లో వీళ్ళ Flat ప్రత్యేకం. తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటీరియర్స్ చేయించుకుంది సుందరి. ఇంటిని ఎంతో అందంగా, పొందికగా తీర్చి దిద్దుకంది. ఆమె యిల్లు చూసిన మిత్రులంత, ఏమయినా సుందరి సుందరే అన్నారు. మురిసి పోయింది సుందరి.
* * * *
సుందరిగారి ఫ్లోర్లో మూడే ఫ్లాట్స్ ఉన్నాయి వీళ్ళది త్రీ బెడ్ రూంస్ కాగా,, ఎదురుగా రెండు టూ బెద్ రూంస్వి. చాలా రోజులుగా ఒకటి ఖాళీగా ఉంది. రెండవ దాంట్లోని వారు నడివయసు దంపతులు . వాళ్ళపిల్లలు కాలేజీల్లో చదువుతున్నారు. యింటావిడ బాగా చదువుకున్నది. గొప్ప భక్తురాలు. పూజలూ, వ్రతాలూ భీకరంగా చేసేస్తూ ఉంటుంది. అయితే ఆవిడకి ఎవరి తోటీ పడదు. అపార్ట్ మెంట్ వాసులంతా ఆవిడకి దూరంగా ఉంటారు. మొత్తానికి సుందరికి పొరుగువారితో కాలక్షేపం లేదు.
చాలా రోజులనుంచీ ఖాళీగా ఉన్న ఫ్లాట్ లోకి యిద్దరమ్మాయి లొచ్చి చేరారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లట. అవివాహితలు. వాళ్ళే వచ్చి పరిచయం చేసుకున్నారు. ఒకామె సంతోషి. చిక్కని చామనచాయ, కొద్దిగా పళ్ళెత్తు. నోరు మూసుకుంటే బానే ఉంటుంది. కాని, మూసుకోదు. పళ్ళికిలిస్తూ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. రెండోపిల్ల దామిని. పీలగా, పొట్టిగావుంది. పైగా కొంచెం మెల్ల కన్ను. చురుకు తప్ప ఏమాత్రం తళుకు లేదీ పిల్లలో అనుకుంది సుందరి. దామిని అంటే మెరుపు. అని అర్ధం. తెలిసే పెట్టారా ఆపేరు? అనుకుంది మనసులో. వాళ్ళ మొహాలు సుందరికి అస్సలు నచ్చ లేదు. పాపం వీళ్ళకి పెళ్ళి ళ్ళెలా గౌతాయో అని జాలి పడింది కూడా.
అయితే వాళ్ళలో సుందరికి నచ్చిన విషయం ఒకటుంది. మాటల సందర్భంలో ఆ యిద్దరు సుందరి యింటిని తెగ మెచ్చుకున్నారు పైగా ఈవయసులోనే యింత బాగున్నారు. వయసులో ఉన్నప్పుడింకెంత చక్కగా ఉండేవారో అని అబ్బుర పడ్డారు. అందం మాటకేంగాని, మంచి అభిరుచి ఉన్న పిల్లలు అనుకుంది సుందరి. కారిడార్లో కనిపించి నప్పుడల్లా నోరారా పలకరించే వాళ్ళు. సుందరి మాత్రం తానుగా వాళ్ళని పలకరించడం గాని, వాళ్ళ యింట్లోకి తొంగి చూడడం కాని చేయలేదు.
* * * * *
మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. సుందరి ఒక్కతే ఉంది ఇంట్లో. భర్త పనిమీద సొంత వూరికి వెళ్ళాడు. వారం దాకా తిరిగి రాడు. కాలనీ లోతట్టు ప్రాంతం లో ఉండడం వల్ల వాన నీరు నిలిచి పోయి, గ్రౌండ్ ఫ్లోర్, లిఫ్టు మునిగిపోయాయి. ఆ బిల్డింగ్ మొత్తం రెండు రోజులుగా జల దిగ్బంధం లో వుంది. లోపలి వాళ్ళు బయటికి పోవడానికి లేదు. బయటి వాళ్ళు లోపలికి రావడానికి లేదు. పాలు లేవు. నీళ్ళు లేవు. కూరలు లేవు. పవర్ లేదు. సుందరి అసలే సున్నిత మనస్కురాలు. పరిస్థితులు ఏమాత్రం కిందు మీదయినా తట్టుకోలేదు. అప్ సెట్ అయిపోతుంది. పొద్దుటి నించీ కాఫీ కూడా లేదు. నిస్సహాయంగా,నిస్పృహతో కూచుని ఉంది.
తలుపు చప్పుడైతే వెళ్ళి తీసింది. సంతోషి, దామిని వచ్చారు. గత మూడు రోజుల నుంచీ వాళ్ళు కూడా యింట్లోంచే పని చేస్తున్నారట." ఎలాఉన్నారాంటీ? ఒక్కరే ఉన్నట్టున్నారు. ఏమయినా సాయం కావాలా ?" అని అడిగారు. సుందరి ముఖం చూస్తే వాళ్ళకి జాలేసింది. పొద్దుట్నించీ సుందరి కాఫీ కూడా తాగలేదని తెలిసి పరిగెట్టుకెళ్ళి కాఫీ కలుపు కొచ్చారు. కాఫీ పడ్డాక సుందరి ప్రాణం కాస్త తేరుకుంది. సంతోషి, దామిని సందడిగా ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళని చూస్తే సుందరికి ఆశ్చర్యం వేసింది. ఈ వాతావరణం వల్ల వీళ్ళకేమీ యిబ్బంది లేదా? అంత హుషారుగా ఎలా ఉన్నరు? అనుకుంది.
వర్షం ఎలాగుందో చూడడానికి సంతొషి బాల్కనీ లోకి వెళ్ళింది. వాన తగ్గింది కాని, ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లని,తెల్లని మబ్బులు గుంపులు గుంపులుగా పరిగెడుతూ మనోహరంగా ఉన్నాయి. "దామినీ యిటు రావే వ్యూ చాలా బాగుందిక్కడ సెల్ఫీ తీసుకుందాం రా."అని ఓ కేక పెట్టింది సంతోషి అక్కడినించే. దామిని కూడా సంబరపడుతూ మీరు కూడా రండాంటీ అంటూ సుందరిని కూడా లాక్కెళ్ళింది. సంతోషి చకచక నాలుగు సెల్ఫీలు క్లిక్ చేసేసింది. ఏమన్నా కావాలంటే మమ్మల్ని పిలవండాంటీ అంటూ బై చెప్పేసి వెళ్ళిపోయారా యిద్దరూ.
సెల్ ఫోను తీసుకుని మెసేజెస్ చూసుకోవడం మొదలు పెట్టింది సుందరి. బాల్కనీలో తీసిన సెల్ఫీలు ఫార్వర్డ్ చేసింది సంతోషి. ఫొటోలు చూస్తున్న సుందరి కాస్త కలవర పడింది. ఇదేమిటి? నేనిలాగున్నాను? అనుకుంది. చిరచిరలాడుతున్న ముఖం, ముళ్ళ మీద కూచున్నట్టున్న భంగిమ. పక్కని యిద్దరి మొఖాలూ వెలిగి పోతున్నాయి. ఎత్తు పళ్ళ సంతోషి, మెల్లకంటి దామినిల ముందు తను వెల వెల పోతోంది. చాలాసేపటి వరకు తేరుకో లేక పోయింది. తేరుకున్నాక దీర్ఘంగా నిట్టూర్చింది. తన మనసులోని జీవితం అనే టైటిల్ కి తాత్కాలికంగా కొత్త టేగ్ లైన్ రాసుకుంది. "ఆనందమె అందం." అని.
***
No comments:
Post a Comment