బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-02 (ధ్వజారోహణం)- అల్లదెకో విజయధ్వజము - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-02 (ధ్వజారోహణం)- అల్లదెకో విజయధ్వజము

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-02 (ధ్వజారోహణం)
-డా.తాడేపల్లి పతంజలి

అల్లదెకో విజయధ్వజము జగ -
మెల్లజేకొనియె నీతడు॥పల్లవి॥
తొక్కనిచోట్లు దొక్కెటి తురగపు
రెక్కలమీదటి రేవంతుడు
చక్కుగ నసురల సంహరించి యిదె
దిక్కులు గెలిచెను దేవదేవుడు॥అల్లదె॥
వోడక శంఖము నొగి చక్రముతో
సూడుకుదిరిగేటి శూరుడు
యీడనుండి సురలిందరి గాచెను
మేడెపు మన లక్ష్మీ విభుడు॥అల్లదె॥
శరణన వారల జయ్యన గాచిన
శరణాగత రక్షణ ఘనుఁడు
తిరమై యింతకు దిక్కై నిలిచెను
గరిమెల శ్రీ వేంకట విభుడు॥అల్లదె॥(04-364)
భావం
అదిగో !  విజయాన్ని సూచించే జెండా(విజయధ్వజము).  ఈ ప్రపంచమంతా ఇతడు  ( =శ్రీ వేంకటేశుడు) జయించాడు.  
01 ఇంతవరకు ఎవరూ  తొక్కనిచోట్లు తొక్కిన   గుర్రపు రెక్కలమీద అశ్వశిక్షకుడు ( =రేవంతుడు) ఉన్నాడు. చక్కగా రాక్షసులను   సంహరించి    ఆ దేవదేవుడు  దిక్కులు గెలిచాడు. 
02.ఎప్పటికి ఓడని వాడై   శంఖాన్ని   క్రమముగా   చక్రముతో   శత్రువును గిరగిరా తిప్పిన(=సూడుకుదిరిగేటి) శూరుడు -)  మన లక్ష్మీ భర్త  ఇక్కడే - ఈ తిరుపతిలో ఉండి( =యీడనుండి) మేలైన ( =మేడెపు ఇంతమంది దేవతలను రక్షించాడు    
03. శరణము అన్నవారిని వెంటనే  (చయ్యన) రక్షించే  శరణాగతరక్షణ ఘనుడు మా వేంకటేశ్వరుడు.  స్థిరుడై  గొప్పతనంతో (గరిమెల)   శ్రీ వేంకటేశ్వరుడు ఇంతమందికి   దిక్కుగా   నిలిచెను
విశేషాలు
బ్రహ్మోత్సవాలు  మొదటిరోజున  'ధ్వజారోహణం'.చేస్తారు. ఆలయ ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. వేంకటేశుని  వాహనం గరుడుడు . కనుక ఒక కొత్త బట్ట మీద గరుడుడి బొమ్మ వేయిస్తారు. ('గరుడధ్వజపటం')    బ్రహ్మోత్సవమునకు చేయు ధ్వజారోహణాన్ని నెల్లూరు మాండలికంలో “కొడి” అంటారు. కొడితాడు ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన తాడు  కొడితాడు . ఊరేగించిన గరుడధ్వజపటాన్ని  గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేర్చటమే ధ్వజారోహణం . సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం  ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ ధ్వజం. 
అన్నమయ్య ఈ కీర్తనలో విజయధ్వజాన్ని వర్ణించాడు.ప్రత్యేకంగా ఈ ధ్వజారోహణ వర్ణనకు సంబంధించిన కీర్తన అన్నమయ్య సాహిత్యంలో కనబడదు.
1.ఇటు గరుడని నీవెక్కినను
2.కంటిమి నేఁడిదె గరుడాచలపతి
3.కందర్పజనక గరుడగమన
4.గరుడగమన గరుడధ్వజ
5.గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి
6.గరుడాద్రి వేదాద్రి కలిమి యీపె
7.పరిపూర్ణగరుడాద్రి పంచాననం
8.మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజ
ఇవి పల్లవిలో  గరుడ పద ప్రసక్తి ఉన్న అన్నమయ్య కీర్తనలు.ఇందులో గరుత్మంతుడు ధ్వజముగా కలవాడని అర్థం వచ్చు – గరుడ ధ్వజ పదం -  మూడు కీర్తనల్లో  ఉంది.

మహాభారతము లోని విరాట పర్వములో ఆరుగురు కురువీరుల జండాలను వివరించే ప్రసిద్ధమైన పద్యం ఉంది.
. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు
సింహలాంగూలభూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాడు ద్రోణసుతుడు
కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాడు కృపుడు
లలిత కంబుప్రభాకలిత పతాక విహారంబువాడు రాధాత్మజుండు
మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర
శిఖరఘన తాళతరువగు సిడమువాడు సురనదీసూనుడేర్పడ జూచికొనుము
ధ్వజాన్ని  కేతనము, కేతువు, ధ్వజము, పతాకము, పడగ,  సిడము వంటి వివిధమైన వ్యుత్పత్తులతో  తిక్కన అపురూపంగా ప్రయోగించాడు. కేత్యతే జ్ఞాయతేఆనేన ఇతి కేతనం – కిత జ్ఞానే అన్న ధాతు రూపము నుంది ఇది  వచ్చింది. అశ్వత్థామకు , ద్రోణునకు కేతనం అన్న పదం వాడారు.
ద్వజము అంటే దీప్తివంతంగా ప్రకాశిస్తూ కదిలేది  ఇది  కృపునకు ప్రయోగించారు.
పతతి ఇతి పతాకా. ఇది రెపరెపలాడుతుంది, కాని చెడిపోతే పడిపోవచ్చు. పతాక పదం   కర్ణుడికి వాడడం లో వ్యంగ్యముంది.
భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు తదితర యోధుల రక్షణలో ఉన్నవాడు కనుక  దుర్యోధనునికి పడగ పదం వాడాడు.  .
తాళ వృక్షంతో ఉన్న సిడము కలవాడు భీష్ముడు. అతని పరాక్రమము కూడా తాళ వృక్ష మంత ఉన్నతమైనది కదా !  
అన్నమయ్య వేంకటేశుని ఉద్దేశించి –ధ్వజము అన్నాడు. దీప్తివంతంగా ప్రకాశిస్తూ కదిలేది ధ్వజం. శరణము అన్నవారిని వెంటనే  రక్షించే  శరణాగతరక్షణ ఘనుడు మా వేంకటేశ్వరుడు అని మూడవ చరణంలో పేర్కొన్న అన్నమయ్య  స్వామి వారి మూర్తిమత్వాన్ని , అవతార తత్వాన్ని తెలియచేసే ధ్వజ(= దీప్తివంతంగా ప్రకాశిస్తూ కదిలేది) పదాన్ని సార్థకంగా ప్రయోగించాడు. జయహో అన్నమయ్య.

Evening - Chinna Sesha Vahanam
5-12-2018 - Wednesday 
Mor - Pedha Sesha Vahanam 
Eve - Hamsa Vahana

6 Dec 2018 - Thursday
Mor - Muthupandal Vahanam
Eve - Simha Vahanam

7 December 2018 - Friday
Mor - Kalpa Vriksha Vahana
Eve - Hanuman Vahanam

8 December 2018 - Saturday
Mor - Pallaku Utsavam
Eve - Gaja Vahanam

9 December 2018 - Sunday
Mor - Sarva Bhupala Vahanam
Eve - Golden Chariot, Garuda Vahanam

10 Dec 2018 - Monday
Mor - Suriya Praba Vahanam
Eve - Chandra Prabha Vahana

11 Dec 2018 - Tuesday
Mor - Rathotsavam (Car Festival)
Eve - Ashva Vahanam

12 December 2018 - Wednesday
Mor - Chakra Snanam, Panchami Teertham
Eve - Dwaja Avarohanam

13 Dec 2018 - Thursday - Pushpayagam
***

No comments:

Post a Comment

Pages