జిహ్వ చాపల్యం - అచ్చంగా తెలుగు
"జిహ్వ చాపల్యం" 
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు

రాత్రి ఎనిమిది గంటలు.

"అమ్మ ఏవన్నా మాట్లాడిందా?" అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన శరత్ భార్యనడిగాడు.

"లేదండి" విచారంగా చెప్పింది ప్రత్యుష.

"నాన్నగారూ.."

"ఆయనా మౌనంగానే ఉన్నారు"

‘ప్చ్’ బాధగా నిట్టూర్చి స్నానం చేసి, బట్టలు మార్చుకుని భోజనానికి కూర్చున్నాడు.

అతనొచ్చేసరికే డైనింగ్ టేబుల్ మీద వేడి వేడిగా పదార్ధాలన్నీ సిద్ధం చేసి, అత్తామామల్ను కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టింది. 

కుర్చీలో కూర్చున్న శరత్ తల్లిదండ్రుల వంక చూశాడు. ఇద్దరూ మౌనాన్నశ్రయించి, కంచాల ముందు కూర్చున్నారు.

అందరూ తినడం మొదలెట్టాక ఏదో ఇంత కతికి వాళ్లిద్దరూ వెళ్లిపోయారు.

ప్రత్యుష వంక చూశాడు. పెద్దవాళ్లు అలా సంతృప్తిగా తినకుండా వెళ్లడం చేత ఆమె ముఖం లోనూ బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అత్తమామల్లో తల్లిదండ్రులను చూసుకునే మంచితనం ఆమెది. 

శరత్ ఆలోచనలో పడ్డాడు.

***

జగన్నాధం, పార్వతీదేవి దంపతులకు శరత్ ఒక్కడే సంతానం. అతను చక్కగా చదువుకుని, సాఫ్ట్ వేర్ కోర్స్ చేసి మాదాపూర్ లోని ఒక ఎమ్ ఎన్ సి సంస్థలో మంచి పొజిషన్, శాలరితో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం రాగానే అతనికి మంచి పిల్లను చూసి పెళ్లి చేశారు. ఆమె అణకువ గలది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో బాబాయి పెంచి పెద్దజేశాడు. తెలిసినవాళ్ల ద్వారా శరత్ సంబంధం రావడంతో, పెళ్లి చూపులు, ఇచ్చి పుచ్చుకోవడాలు లాంటి తతంగాలేవీ లేకపోవడంతో వెంటనే పెళ్లి జరిపించేశారు. శరత్ మాదాపూర్ లో ఫ్లాట్ తీసుకుని కాపరం పెట్టాడు. మూడేళ్లయింది. ఇంకా పిల్లల్లేరు.

జగన్నాధంగారు మెడికల్ డిపార్ట్మెంట్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేసి రిటైరయ్యారు. ఆకివీడులో ఇల్లు కట్టుకుని, వచ్చే పెన్షన్ తో చీకూ చింతా లేకుండా హాయిగా కాలం గడుపుతున్నారు.

తల్లిదండ్రులు వచ్చి తమతో పాటు ఉండాలని శరత్ కోరిక. ప్రత్యూషది కూడాను. చిన్నప్పట్నుంచీ ఆమె బాబాయి ఇంట్లో కూడా లేదు. హాస్టల్లో ఉండే చదువుకుంది. బయటవాళ్ల అభిమానాలు తప్ప ఇంట్లోవాళ్ల ఆప్యాతానురాగాలు ఎరగదు. అందుకని అత్తమామలు తమింటికొస్తే ఏలోటూ రాకుండా చూసుకోవాలని ఆమె కోరిక. కానీ ఇద్దరూ ఎన్నిసార్లడిగినా వాళ్లు సున్నితంగా ‘ససెమిరా’ అన్నారు. ఒకవేళ వచ్చినా ‘మేమిక్కడ ఇమడలేమని’ రెండు మూడు రోజుల్లో వెళ్లిపోయేవారు. 

కాని మూణ్నెళ్ల క్రితం భార్యతో ఆకివీడు వెళ్లిన శరత్ వాళ్లెలాగైనా తమింటికొచ్చి, తమతోపాటుకొంతకాలం గడిపి వెళ్లాలని మారాం చేశాడు. ప్రత్యుష కూడా భర్తకి వంత పాడుతూ చాలా బతిమిలాడింది.

భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ’సరే’ అన్నారు. శరత్, ప్రత్యుషల ఆనందం అంతఇంత కాదు. 

వాళ్లకి మాటిచ్చినట్టే జగన్నాధం దంపతులు శరత్ వాళ్లింటికి వచ్చి రెండు నెలలవుతోంది. డబల్ బెడ్రూం ఫ్లాట్ లో ఒక బెడ్ రూం, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మరీ వాళ్లకిచ్చేశాడు శరత్. ప్రత్యూష అయితే వాళ్లని నెత్తిమీద పెట్టుకుంటోంది. వాళ్ల అడుగులకు మడుగులొత్తుతూ అవసరాలు ముందే కనిపెట్టి కావలసినవన్నీ అమర్చుతోంది. ఆ పెద్ద దంపతులు పదిహేను రోజులు ఆనందంగానే గడిపారు. ఆ తర్వాత నుంచే నిశ్శబ్దమైపోయారు. ఎందుకోతెలీదు. తనవల్లగాని, ప్రత్యుషవల్లగాని కాదని శరత్ మనసు చెబుతోంది. అదే విషయం తల్లిదండ్రులను అడిగాడుకూడా ‘తమ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా?’ అని. లేదన్నారు కాని అసలు విషయం మాత్రం చెప్పలేదు.

రాబోయే ఆదివారం ఎలాగైనా విషయం రాబట్టాలని అనుకున్నాడు శరత్!

***

ఆదివారం.

శరత్ పదిగంటల సమయంలో జగన్నాధంగారి గదిలోకి వెళ్లాడు.

"నాన్నగారూ, టిఫిన్ చేశారా?"

చేసినట్టుగా తలూపారాయన.

"అమ్మా, నువ్వు"

"చేశాను బాబూ.."అంది.

కొద్దిసేపటి తర్వాత-

"నాన్నా! దాదాపు మీరిద్దరూ మౌనంగా ఉండబట్టి నెలదాటుతోంది. మీ మనసు ఎక్కడ, ఎందుకు, ఎవరి వల్ల నొచ్చుకుందో తెలియడం లేదు. మేమిద్దరం కారణం కాదన్నారు. ఇంకేమిటి? ఊరు గుర్తుకు వస్తోందా? ఊళ్లోవాళ్లు గుర్తుకొస్తున్నారా? ఇక్కడ ఏమన్నా తక్కువైందా? నేను మీతో సరైన సమయం గడపలేకపోతున్నానా? మీ మనసుల్లో ఉన్నది చెబితే సరిదిద్దుకుంటాం. అంతేకానీ మీ మౌనంతో మా గుండెలు కోసి గాయపర్చడం న్యాయమేనా? ముఖ్యంగా ప్రత్యూష ఎంత బాధ పడుతోందో తెలుసా?" ఉద్వేగంగా అడిగాడు.

జగన్నాధం కొడుకువంక ఒకమారు చూసి, తర్వాత భార్య వంక చూశాడు చెప్పమన్నట్టుగా.

"శరత్, మా మనోవ్యధ మీవల్ల ఎంతమాత్రం కాదురా. నిజానికి మీరు మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. పాపం, ప్రత్యూషైతే బహుశా వాళ్లమ్మానాన్నలున్నా ఇంత చక్కగా చూసుకునేది కాదేమో. నువ్వు అన్ని సౌకర్యాలతో మాకిచ్చిన ఈ గది ఎంతో హాయిగా, ఆనందంగా ఉందిరా కానీ.."

తల్లి ఏం చెబుతుందో అన్నట్టుగా మరింత శ్రద్ధ కనబర్చాడు శరత్!

"మేము తిండికి మొహం వాచిపోయాంరా, మన ఊళ్లో నేను ఇంగువ పోపేస్తే పది వీధులకి సువాసనతో ఘాటు తగిలేది. మన స్థలంలో వేసిన కొత్తిమీరతో పచ్చడి చేస్తే ఒక పూటకి చేసింది ఇంకో పూటకి మిగిలేది కాదు. కర్వేపాకుతో కారం చేసి కాస్త నూనెతో కలిపి దోశలు, ఇడ్లీలు నంజుకు తింటుంటే ఓహ్! ఆ ఆనందమే వేరు కదరా. కారం, ఆవాలతో నేనే గుండ తయారు చేసుకుని కొత్తావకాయ వేస్తే, ఆవఘాటు నషాళానికి అంటి ముఖమంతా చెమట్లు పడుతున్నా ఎర్రని పెద్ద, పెద్ద ముద్దలు తింటుంటే ఆ రుచికి సాటి ఏం ఉంటుందిరా? మాగాయ, గోంగూర, చింతకాయ..ఇలా ఒక్కటేమిటి? అన్నీ రుచులూ నిత్యం నాలుక మీద నాట్యం చేయాల్సిందే. ముక్కల పులుసు లో వేసిన మునగముక్కల్లోని గింజలు పళ్లతో లాక్కుని తింటుంటే ఆ ఆనందమే వేరు కాదట్రా. అసలు వడియాలంటే ఎలా ఉంటాయో, ఎన్ని రకాల వడియాలుంటాయో ఇక్కడ ఎంతమందికి తెలుసు?  తినడం కోసం జీవించడం కాదు, జీవించడం కోసం తినాలని ఎవరో మహానుభావుడు చెప్పాట్ట. అయ్యుండొచ్చు. కాని ఆ తినేది సుష్టుగా తినాలి. కడుపునిండా తినాలి. కష్టపడి పని చేయాలి. ఇప్పటి తరానికి జిహ్వ చాపల్యం అనే మాట తెలియకపోవచ్చు. కాని మనిషిని ఉత్తేజ పరిచే గొప్ప పదంరా అది. తిండి కలిగితేనే, కండ గలిగేది. ఆ కండ గలిగినోడే మనిషి. అందుచేత మనిషిని నిర్వచించడానికి ముందు తిండే అగ్రస్థానం తీసుకుంటుంది. మా పెద్దమ్మ ఒకావిడ ఉండేది. ఆవిడ మామిడికాయ పప్పు చేస్తే నోట్లో నీళ్లూరాల్సిందే! మనూళ్లో శాంతమ్మ గుత్తొంకాయ కూర చేసిందంటే వీధిలోని వాళ్లందరికీ తలో వంకాయీ రావలసిందే! అంతెందుకు నేను చేసే పులిహోర నీకు తెలియంది కాదు కదా! వారానికి మూడుసార్లు చేయించుకునేవాళ్లు మీరు. పనసపొట్టుతో, అరటి దూటతో, పువ్వుతో, కాయతో నోరూరించే పదార్ధాలు చేసుకోవచ్చని ఇక్కడ ఎంతమందికి తెలుసు. ఒకప్పుడు కమ్మని వంటలు పారంపర్యంగా వచ్చేవి. పెళ్లి చూపుల్లో ‘వంటొచ్చా?’ అని అమ్మాయిని అడిగేది అందుకే. ఉద్యోగం చేసేప్పుడు మీ నాన్న ఆఫీసు పనిమీద క్యాంపుకెళితే మళ్లీ ఇంటికొచ్చి నా చేతి వంట తినేదాకా నీర్సపడిపోయి ఉండేవారు. భార్య చేసే కమ్మటి వంట భర్తనీ, పిల్లల్నీ కట్టి పడేస్తుందన్నది నిజం.

ఇక్కడికొచ్చి మా ఇద్దరికీ నోరు కట్టెసుకున్నట్టయింది. పిజ్జాలు, బర్జర్లు, మోమోలు, హాట్ డాగ్స్, ఫ్రాంకీలు ఏవిట్రా ఈ పేర్లు? మొన్న విన్నాలే! పక్కింటి ఫ్లాట్ వాళ్లు వాటిల్లో ఒకటి రుచి చూపించారు. ఒక రుచా, పచా? ఏవిట్రా అది. గడ్డి కదూ. నాలుక చవి చచ్చిపోతుంది. ఎప్పుడో వారానికోసారెళ్లి కూరగాయలు తెచ్చి ఫ్రిజ్జులో పెడతారు. అవి నవలాడుతూ ఉండొచ్చుకాని తాజా రుచి మాత్రం కలిగి ఉండవు. మీ ఫ్రిజ్జులోది కర్వేపాకు, కొత్తిమీర మన ఊరు తీసుకురా, మనింటి నేలలోంచి అప్పుడే కోసిన వాటితో వాసన చూడు తేడా నీ మనసుకు తెలుస్తుంది. ‘ఏం తింటే, ఏ రోగాలు వస్తాయో’ అని భయపడుతూ, భయపడుతూ ఇంత తిని పనులకెళితే, బ్యాటరీ ఛార్జ్ చేసుకుని పనిచేసే రోబోకి మనకీ తేడా ఏముంటుంది? 

కడుపు నిండా తృప్తిగా, త్రేన్చుతూ రుచికరమైన పదర్ధాలు తినాలి, భుక్తాయాసంతో అటూ ఇటూ నాలుగడుగులేయాలి. మా ఆరోగ్యరహస్యం ఇదే! అన్నం పరబ్రహ్మ స్వరూపం అయ్యింది అందుకే! ‘కొసరి, కొసరి వడ్డించడం, తినిపించడం’ అన్న పదాలు తెలియకుండా భయపడుతూ, కొలుచుకుని తింటూన్నా అడ్దమైన బీ పీ, సుగర్లు మిమ్మల్ని వదలట్లేదు అది గమనించు ముందు. అందుచేత మేము మళ్లీ మన ఇంటికి వెళ్లిపోదామనుకుంటున్నాం. ఇంక ఎంతకాలం ఉంటామో తెలీదు. భగవంతుడి దయవల్ల మాకు ఏ రోగాలు రొచ్చులూ లేవు. ఏ లోటూ లేదు. ఉన్న నాలుగు రోజులూ హాయిగా తిని తిరుగుతాం ‘ఈ విషయం చెబితే నువ్వూ, అమ్మాయి ఎక్కడ నొచ్చుకుంటారో’ అని ఇన్నాళ్లూ మాలో మేమే మధన పడుతున్నాం. ఇవాళ నువ్వడిగావు కాబట్టి చెప్పాం. మా మనసులు తేలిక చేసుకున్నాం. ఏవండీ, ఇదేగా మనం చెప్పాలనుకున్నది" అంది భర్త వంక చూస్తూ.

ఆయన మెచ్చుకోలుగా భార్య వంక చూశాడు.

శరత్ కి విషయం అర్ధమైంది. అతనూ నవ్వుతూ, ప్రశాంత చిత్తంతో బయటకు అడుగుపెట్టి, అరగంటలో వాళ్లదగ్గరికి వచ్చి "ఇదిగో ఆన్ లైన్లో రాత్రి ట్రైన్ కి మీకు టిక్కెట్లు బుక్ చేశాను. మీరు చెప్పింది నిజమే! ఇహ నుంచి మీరు ఇక్కడికి రావద్దు. మేమే నెలకో రెండు సార్లు మన ఊరు వస్తాం. ఎందుకంటే, అమ్మా నువ్వు ఇందాక చెప్పినవి మనసులో మెదుల్తుంటే నోట్లో నీళ్లూరుతున్నాయి. కానీ ఉద్యోగం కదా, ఏం చేస్తాం. అక్కడకి వచ్చి అన్ని వెరైటీలూ తింటాం. ప్రత్యూషకీ నేర్పాలి మరి. ఇక్కడ మేమూ నాలుగు రుచులు కమ్మగా తినాలి కదా" అన్నాడు.

వాళ్లిద్దరి ముఖాలు వెలిగిపోయాయి. రాత్రి రైలెక్కేదాకా కొడుకు కోడలుతో ఆనందంగా, అలుపెరుగకుండా మాట్లాడుతూనే ఉన్నారు.  

***

1 comment:

  1. ఆహారపు పద్ధతులను కథ ద్వారా కూడా చెప్పొచ్చని నిరూపించారు.!
    అలాగే ఇప్పుడు సిటీల ముసుగులో పాశ్చాత్య ఆహారపు అలవాట్ల వలన రోగాల బారిన పడుతున్నాం అనేది కూడా అంతర్లీనంగా తెలియజేశారు.!
    మీ కథ చదువుతుంటే శరత్ కె కాదు మాకు కూడా నోట్లో నీళ్లూరుతున్నాయి.!
    మంచి విషయాలను తెలియజేసిన ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారికి ధన్యవాదములు.!!

    ReplyDelete

Pages