నాగరాజు - అచ్చంగా తెలుగు
నాగరాజు.
వేమూరి ఎస్.ఎస్.ఎస్.శ్రీనివాస్ 

సత్యరాజు  పద్ధతయిన మనిషి. నీతి, నిజాయతి ఎక్కువ. పరాయిసోమ్ముకు కక్కుర్తి పడడు. కాకపోతే కాస్త చాదస్తుడు, మూక్కుసూటిగా మాట్లాడతాడు. వీటికి మించి విచిత్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు.
మా కాలనీలో వినాయక చవితి ఈ సారి బాగా గ్రాండ్ గా చేయాలని అందరం తీర్మానం చేశాం.  దాంతో చందాలకు  బిజినెస్ పీపుల్,. డాక్టర్స్, గృహస్తులు అందరి దగ్గరకు వెళ్ళటం మొదలు పెట్టాం.
చందాలు వసూలు చేసేటపుడు మొదటి రోజు కొంత తేడా జరిగినట్టు మా కమిటీ మెంబెర్స్ గుర్తించారు. తప్పు చేసిందెవరో తెలిసినా పైకి అనడానికి ఎవరూ సాహసం చేయలేదు. కానీ రోజూ ఇలాగె జరిగితే కాలనీకి అప్రతిష్ట. ఏమి చేయాలా అని ఆలోచిస్తూంటే, సడన్ గా సత్యరాజు పేరు ప్రస్తావనకు తెచ్చాను.
అందరూ నా ప్రస్తావనకు సమ్మతించినా, అతని పేరు ప్రపోజ్ చేయటానికి,  ఎవరూ ముందుకు రాలేదు. అందరూ తటపటాయిస్తుంటే నేనే ఇనీషియేట్ తీసుకుని ప్రపోజ్  చేసాను. నా ధైర్యం చూసి మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వచ్చారు.
అందరం సత్యరాజు మొత్తం ట్రెజరీ వ్యవహారాలు చూడాలి అని తీర్మానించాం. అందరూ సరే అన్నారు.
సత్యరాజు ముందే చెప్పినట్టు పద్ధతయిన మనిషి. పిలవని పేరంటానికి రాడు. పిలిస్తే పిడుగులు మీద పడి అడ్డంకులు వచ్చినా  వస్తాడు. బాధ్యతలు అప్పచెబితే సొంత పనిలా చేస్తాడు. ఒక్కొక్కసారి మరీ బాధ్యత తీసేసుకుని, పని ఇచ్చిన వాళ్ళని కూడా అరిచేస్తాడు. మొదట్లో ఇబ్బంది అనిపించినా అతని తీరు తెలిశాక, ఆయన పెద్దరికాన్ని కాలనీవాళ్ళం మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాం.  
ఆయన సేవలకు కృతజ్ఞతతో, వాళ్ళింట్లో  రెండు పెళ్లిళ్లు జరిగినపుడు  కాలనీ మొత్తం అక్కడే ఉంది. అంతేకాదు అందరూ  తలోపని అడిగి మరీ చేశారు. దాన్ని బట్టి  అర్థం చేసుకోండి, ఆయనంటే  మాకు ఎంత గౌరవమో!
మరి అంత గౌరవం ఉన్న వ్యక్తి పేరును  ప్రపోజ్ చేయటానికి   ఎవరూ ఎందుకు ముందుకు రావటంలేదు అనేగా మీ సందేహం?
దానికీ  కారణం ఉంది. ఉన్న బాధ్యతలు తీరి, వయసు పైబడే కొద్దీ ఆయనకి చాదస్తం పెరిగింది.  చిత్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు.
కాలనీ మొత్తం తమ ఇంట్లో పెళ్లిలా,  ఆయన ఇంట్లో పెళ్లి పనులు చేసేసరికి తట్టుకోలేకపోయాడు.  కాలనీ వాసులకు  ఎదో ఒక ఉపకారం చేయాలని సంకల్పించాడు. తన తరువాత కూడా, తనలాగా పని చెయ్యడం కోసం సెకండ్ లైన్ తయారుచేసే బాధ్యత నెత్తి మీద వేసుకున్నాడు.
లోగడ ఒక ఫంక్షన్లో  అన్ని బాధ్యత తీసుకోవడమే కాకుండా, సొంత డబ్బులతో వాలంటీర్లకు, వెరయిటీ యూనిఫార్మ్ కుట్టించాడు.  అవి కట్టుకోవడానికి  వాళ్ళు తటపటాయిస్తుంటే,  గదమాయించి మరీ తొడిగించాడు. ఎదిరిస్తే పెద్దాడు ఏవనుకుంటాడో అని, కిక్కురుమనకండా వేసుకున్నారు వాలంటీర్లు.
పెళ్ళికి పక్క ఊరునుంచి వచ్చిన ఒక వ్యక్తి, వాలంటీర్లలో ఒక కుర్రాడిని గుర్తుపట్టి పక్కనున్న వాళ్లతో గుసగుస లాడాడు. వాళ్ళు ఆ అబ్బాయిని పరీక్షగా చూసి, అర్థమయినట్టు తలాడించి, ఫంక్షన్ అయ్యి ఇంటికి వెళ్లిన తరువాత, ఆ పిల్ల వాడి ఇంటికి ఒక ఉత్తరం రాసారు.
అయ్యా, పిల్లవాడు ఇంజనీర్, ఉద్యోగస్తుడు అని మీరు మాట్రిమోనిలో పెడితే నిజమే అనుకున్నాం. మొన్న పెళ్ళిలో మాకు తెలుసున్నాయన మీ వాడిని గుర్తుపట్టి చెప్పేవరకూ తెలియలేదు, మీ వాడు పెళ్ళిళ్ళలో బ్యాండ్ మేళం ఉద్యోగం చేస్తాడని. ఇంజనీర్లకు ఉద్యోగాలు లేవంటే ఎదో అనుకున్నాం గానీ, మరీ ఇలాంటి ఉద్యోగం అని తెలియలేదు. క్షమించాలి, మీ సంబంధం మాకు అక్కరలేదని తెలియబరచారు. మరి సత్య రాజు గారి యూనిఫార్మ్ ఆ లెవెల్లో ఉంది.
పిల్లాడి తల్లిదండ్రులు లబోదిబో మంటూ ఆయన దగ్గరకు వెళ్లారు.  ఆయనే పూనుకుని పెళ్ళివారి ఇంటికి వెళ్లి పిల్లవాడి, ఉద్యోగం, చదివిన చదువు తాలూకు సాక్ష్యాలు చూపించిన తరువాత ఆ సంబంధం ఖాయం చేయించాడనుకోండి. అది వేరే విషయం.
ఇంత జరిగినా  ఆయన చెప్పే పని కాలనీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే, ప్లానింగ్. ఏ పని చేసినా ఒక ప్రాజెక్టులా టేకప్ చేస్తాడు. అసలే చెయ్యి తిరిగిన తెలివయిన ఇంజనీర్,  దానివల్ల ప్రాజెక్ట్  అనాలిసిస్, వర్క్ డిస్ట్రిబ్యూషన్, ఈవెంట్  వైజ్ టైమింగ్ తో సహా సెట్ చేసి మొత్తం కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తాడు.  మానేజ్మెంట్ మీద ఆయనకుఉన్న  గ్రిప్ అలాంటింది.  ఆయన చేతికింద కొన్ని ఫంక్షన్స్ కి వాలంటీర్ గా ఎవరైనా పని  చేస్తే,  వాళ్ళు  ఎంతటి  పనినైనా  సునాయాసంగా చేసేసే సమర్ధత తెచ్చుకుంటారు.  అదీ ఆయన వర్క్ మాన్ షిప్.
కాకపోతే పని చేస్తున్నంత సేపు, ఫంక్షన్ లో అందరూ మంచి బట్టలేసుకుని నవ్వుతూ,  తుళ్ళుతూ తిరిగి ఎంజాయ్ చేస్తూంటే, ఈయన వలంటీర్లు టీ కప్పులు, కూరలు, బెసీన్లూ మోస్తూ గడపాలి. పనిలో తేడా వస్తే తిట్లు తినాలి. ఆ ఓపికలేని వాళ్ళు  ఆయనకు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడైనా వినాయక చవితి చందాల పని ఆయన  నెత్తిమీద పెట్టడానికి కారణం, దీనిలో యూనిఫార్మ్స్, గట్రా పెట్టడన్న  చిన్న ఆశ. అందరిలాగానే ఆయనా ఆలోచిస్తే, మజా ఏముంది?
అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఒక మీటింగ్ పెట్టి అందరినీ సమావేశ పరచాడు. అందరి చేతికి  పాముల వాళ్ళు ఊదే నాద స్వరం బూరా తలొకటీ  ఇచ్చి, చందాల  కోసం వెళ్ళేటప్పుడు, విధిగా  తీసుకువెళ్లాలని, ఫత్వా జారీ చేసాడు. కాదంటే తిడతాడని భయం. తీసుకువెళ్లాలంటే సిగ్గు. వద్దనడానికి ఎవడికీ ధైర్యం లేదు. ఎందుకంటే అందరికన్నా పెద్ద బూరా ఆయనే పట్టుకుని తిరుగుతున్నాడు. దానికి కారణం కూడా మీటింగ్ లో చెప్పాడు. అది విన్నాక కాదనలేక అందరూ ఆయన్ని అనుసరించారు. ఆయన చందాల పని టేకప్ చేసిన దగ్గరనుంచి ఒక్కరోజు కూడా లెక్కల్లో తేడా రాలేదు.
మా ఇంటికి దగ్గర్లో ఒక  డాక్టర్గారు, కొన్ని రోజుల క్రితం ఎదో మీటింగ్ మీద వెళ్లి ఆ రోజే రావటం వల్ల, ఆయన దగ్గర చందా వసూలు చేయటానికి నేను బూరా పట్టుకుని బయలుదేరాను.
నన్ను చూడగానే, సాదరంగా బయటకొచ్చిన డాక్టర్ గారు. నా చేతిలో బూరా చూసి బిక్క చచ్చిపోయాడు. భయం భయంగా లోపలికి తీసుకెళ్లి, మాటా మంతీ లేకుండా పదివేలకు  చెక్కురాసి నా చేతిలో పెట్టాడు.
నేను థాంక్స్ చెప్పి లేవబోతూంటే, "నాకు పాములంటే భయం , ఒక వేళ మా ఇంటికి ఏదైనా పాము పిల్లని మీతో తీసుకొచ్చి ఉంటే తీసుకొని వెళ్ళిపోరా! ప్లీజ్ అని ప్రాధేయపడ్డాడు.
"నేను పాములు పట్టుకు రావటమేమిటండి బాబూ!"  అని అడిగా.
మరి చేతిలో ఆ బూరా ఏవిటీ? అన్నాడు.

        

ఈ మధ్య బాగా అలవాటయ్యి దాని గురించి పట్టించుకోవడం మానేసాను. ఆయన అడిగిన తర్వాత స్పృహలోకి వచ్చి, అదేం కాదండి బాబూ! ఇదంతా, మన సత్యరాజు గారి ఏర్పాటు అన్నా

అయన ఆశ్చర్యపోతూ, "చందాలకెళ్లేటపుడు "బూరా దేనికండీ"" అన్నాడు"

అది చేతిలో ఉన్నంత సేపూ చందాలు ఎవరూ స్వలాభం కోసం ఉపయోగించకుండా ఆ ఏర్పాటు"

"అదెలా సాధ్యం? అమలు దానికీ, దీనికీ ఏమిటి సంబంధం?"

"పరుల సొమ్ము పాము లాంటిది కదండీ! అది గుర్తు చెయ్యటానికే పాము బూరా.  అది  చేత్తోపట్టుకుని చందాలు  వసూలు చేస్తే  చేతిలో ఉన్నది పరాయి సొమ్మని ఎప్పటికప్పుడు హెచ్చరికగా ఉంటుంది. 

"అలాగా!" అని అయన తెల్లబోయాడు.
తర్వాత ఆ షాక్ నుంచి కోలుకుని ఆయనే అన్నాడు. "అలా అయితే ఇప్పుడు చెక్కు ఇచ్చానుకదా  దాని ముందు కూడా బూరా ఊదండి, అదీ పరులసొమ్మే కదా!"  అని బలవంతం పెట్టాడు. 

నాకు రాదన్నా వినడే!

ఎదో మేనేజ్ చేసి ఆ గండం నుంచి బయట పడ్డాననుకోండి.

కాసేపాగి ఆయనే  ఇంకో సందేహం వెలిబుచ్చారు.

అయ్యా! నాదస్వరం విన్న పాము చెప్పినట్టు వింటుందంటారు కదా, అంటే పాము, మీరు  చెప్పినట్టువింటే మచ్చికయ్యి మీతో వచ్చేస్తుందేమో?

మీరన్నదీ పాయింటే సుమీ! అయితే ఇప్పుడు ఏం  చేయాలంటారు?

"బూరకన్నా కర్రబెటరెమో, స్వార్థంఅనేది మీలో తలెత్తితే దాన్ని దండిస్తా అనేందుకు దండం బెటరని నా అభిప్రాయం",  అన్నాడు.

కానీ కర్రుచ్చుకుని చందాలకెడితే తప్పుడు సంకేతాలు వెడతాయి కదండీ!

"అప్పుడు రెండూ పుచ్చుకుని వెళ్ళండి"

ఒకచేతిలో కర్ర, ఒకచేతిలో బూరా ఉంటె, చందా పుస్తకం ఏ చేత్తో పట్టుకోవాలండీ"

"అంత ఆలోచించాడా, ఇంజినీరుగారు? అని ఆశ్చర్యం ప్రకటించారు డాక్టరు గారు.

సత్యరాజుగారి బూరా వార్త ఆ నోటా ఆ నోటా పాకి, మా నిబద్ధత కాలనీ జనాల్లో విశేష ప్రాచుర్యం సంతరించుకొంది.

ఎప్పుడూ పైసా ఇవ్వని వాళ్ళు కూడా చందా ఇవ్వడానికి ముందుకొచ్చారు.

సత్యరాజు గారు చేపట్టిన వేళా విశేషమో ఏమిటో గానీ, ఆ సవంత్సరం కలెక్ట్ అయిన సొమ్ముతో  వినాయక చవితి బ్రహ్మాండంగా జరిగింది.  ఇంకా ఫండ్స్ మిగిలిపోతే  శాశ్వతంగా ప్రతీ పండక్కీ ఉపయోగపడేలా! ఐరన్ పోల్స్ తో డిజైన్ చేయించి డిటాచ్ బుల్ పందిరి చేయించారు. అలాగే కుర్చీలు కూడా కొన్నారు. ఇదంతా చూసి, మరి కొంతమంది దాతలు ముందుకొచ్చి స్టేజి కోసం చందాలిచ్చారు. ప్రస్తుతం అవన్నీ మా కమ్యూనిటీ హాల్లో భద్రపరచాం.  చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినా, మీటింగులు పెట్టుకున్నా అవే పైసా ఖర్చు లేకుండా కాలనీ అంతా ఉపయోగపడుతున్నాయి. 

సత్యరాజు గారి సలహామీద ఆ సామానులు అన్నిటిమీదా నాగరాజు బొమ్మ వేయించారు. అప్పటి నుంచీ ఆయనను కూడా సత్య రాజు, అని కాకుండా నాగ రాజు అనే పేరు సార్ధకం చేసారు మా కాలనీ వాళ్ళు. 

"మీ లోనూ ఉంటారు ఇటువంటి నాగ రాజులు. వారి నిబద్ధతకు శిరసు వంచి చేయాలి నమస్కారం. 
***

No comments:

Post a Comment

Pages