ఊయల
తిమ్మన సుజాత
"కస్తూరి రంగ రంగ.." అంటూ అమ్మపాడేటి లాలిలో..
బిడ్డపై చూపించు మమతల వెన్నలే...
ఊయలై ఊగుతుంది..
కుహు..కూహు అంటూ కోకిలమ్మ కులుకు గీతాలలో..
మావిచిగురులను మేసిమత్తెక్కిన మాధుర్యం...
ఊయలై ఊగుతుంది..
కల్లా కపటం తెలియని పసిపాపల ఆటలలో..
విభేదాలు తెలియని...స్వార్ధం ఎరుగని స్నేహం.
ఊయలై ఊగుతుంది..
అట్లతద్దినాడు..ఆడపిల్లల అష్టా చెమ్మా పోటిలలో..
చెట్లకొమ్మల్లోంచి ఆకాశంలోకి ఆనందం ...
ఊయలై ఊగుతుంది..
ఎదసంద్రంలో...జ్ఞాపకాల కెరటాలపై...
ఎప్పుడూ ...ప్రేమించేవారి తలపు..
ఊయలై ఊగుతుంది...
తల్లి గర్బంలోంచి జనించిన జీవితం....
కష్ట సుఖాలని అనుభంలోనికి చేర్చుకుంటూ..
అనుబందాలను తెంచుకొని...చిట్టచివరికి ...
నేలతల్లి ఒడిలోనికి చేరిన మరణం..
మిగిల్చిన అసువులపై..ఊయలై ఊగుతుంది...!!
***
No comments:
Post a Comment