పుష్యమిత్ర - 35 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 35
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు.  ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయిందన్న విషయం ప్రభుత్వం గమనిస్తుంది.  పాక్ వెళ్ళిన వెంకటేశన్ ను మళ్ళీ పోలీసులు అరెస్టు చేస్తారు. పాకిస్తాన్‌లోని ఉప్పుగనులకు టెండర్ వేసిన సుకేశ్ సుభానికి టెండర్ వచ్చిందని ఫోన్‌లొ మన ప్రధానికి పాక్ ప్రెసిడెంట్ శుభవార్త చెప్తాడు. (ఇక చదవండి)
"పుష్యమిత్రాజీ! మనం టెండర్ స్వాధీనం చేసుకున్నాం. దేవుని దయవలన మనకే వచ్చింది. నిధి విషయం తెలియని పాక్ ప్రెసిడెంట్ మనదేశం ఎక్కువ కోట్ చేసిందని అంత లాభం రాదని చెప్తే నేను మందులకోసం అని సర్దిచెప్పాను"
"శుభం! ఇక మనం మీరు చెప్పినట్లు అక్కడి ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ఎక్కువ డబ్బులు ఇచ్చి సమాధాన పరచి పంపివేసే  ఏర్పాట్లు ముమ్మరం చేయండి"
"అలాగే పుష్యమిత్రాజీ"
"ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ వ్యవహారలలో పొరబాటున కూడా పంచాపకేశన్‌ను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ  బాధ్యతలు అప్పజెప్పకండి. చాలా ప్రమాదం. ఈ బంగారం సజావుగా మనదేశం చేరే వరకూ ఏదో ఒక కేసులో యిరికించి బందిఖానాలో ఉంచండి"
"దానికీ మార్గం సుగమం చేశాను. మనకు అనవసరంగా తలనొప్పి తెస్తున్నాడు. పాక్‌కు కొంతమంది రహస్య ముఠాను పంపాడు. నిధిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని మన విదేశాంగ శాఖ మంత్రితోనూ మంతనాలు జరుపుతున్నాడు. పాక్‌కు వెళ్ళివచ్చిన ముఠాలో ఒకడు మన దగ్గర బందీ గా ఉన్నాడు. ఎంత టార్చర్ పెట్టినా పంచాపకేశన్ పేరు చెప్పడంలేదు.
"మీరు వాడిన నా వద్దకు రహస్యంగా పంపండి. నేను వాడితో మాట్లాడి చెప్పిస్తాను"
"మీకాలం శిక్షలు వేస్తే వాడు కాస్తా చచ్చివూరుకుంటాడేమో!" అని గట్టిగా నవ్వాడు.
"లేదు. చెప్తాను. పంపండి"
"అలాగే ! వాడిని రేపే మీ ముందు హాజరు పరుస్తాను"
"సంతోషం. తర్వాత నేను అడిగిన వేదగ్రంధాలకు సంబంధిని కొన్ని తాళపత్ర గ్రంధాలు తంజావూరు గ్రంధాలయంలో ఉన్నాయి. అవి తెప్పించండి అర్జెంటుగా!"
"మన దగ్గర ఉన్న పుస్తకాలు బాగాలేవా?"
"చాలా తప్పులున్నాయి వాటిల్లో. అలా మంత్రాలు పఠిస్తే చాలా ప్రమాదం. మొదటికే మోసం వస్తుంది."
"సరే! మీరు జాబితా ఇవ్వండి. వెంటనే విమానంలో వెళ్ళి మనవాళ్ళు తెస్తారు"
"అలాగే! సంతోషం. వెళ్ళిరండి"
*    *    *
“వెంకటేశన్!నా పేరు పుష్యమిత్ర! వినే ఉంటావు. నీకొచ్చిన భయం ఏమీ లేదు. చెప్పు! నిన్ను మీ కుటుంబ సభ్యులను సంరక్షించే పూచీ నాది. లేదంటే నేను ఒక్క కనుసైగ చేస్తే నీ శవమే బయటికి వెళ్తుంది"
"సార్! మీరు ఏవిషయం గురించి మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదు నాకు" మళ్ళీ బుకాయించడానికి ప్రయత్నించాడు.
"నిన్ను ఏ విషయమై పాకిస్తాన్‌కు పంచాపకేశన్ పంపాడు? ఆ విషయం చెప్పు!"
ఊపిరి ఆగిపోయింది. ఏమి చెప్పాలో తెలీడంలేదు. వీరికి అంతా తెలిసి పోయింది. మెల్లిగా నోరు విప్పాడు.
"అయ్యా! నాకేమీ తెలీదు. కొంతమంది బృందంతో నన్ను పంపాడు. ఆ ఉప్పు గనులలో ఒక సొరంగ మార్గం ఉందని దాన్ని కనుక్కోమని చెప్పాడు".
"ఆ సొరంగ మార్గంలో ఏమి ఉందని చెప్పాడు?"
"అంతవరకే చెప్పాడు. ఆ తర్వాత మన గూఢచారులు నన్ను పట్టుకున్నారు. తప్పించుకుంటే మళ్ళీ పట్టుకున్నారు"
"నీకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తాము. నీ పేరు మార్చుకుని క్రొత్త ప్రాంతానికి వెళ్ళవచ్చు. నిన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ఏర్పాట్లు చేసి పంపుతాము. నీకు కేరళలోనో ఎక్కడో ఒక మంచి అపార్ట్మెంట్ కొనిస్తాము. బ్రతికినంత కాలం కాలుమీద కాలువేసుకుని బ్రతకవచ్చు. నీకు మొదటినుండి పంచాపకేశన్ చెప్పిందంతా కాగితం మీద రాసి సంతకం పెట్టి యివ్వు. లేదంటే అదుగో అక్కడ కాగుతున్న నూనె నీపై బొట్లు బొట్లుగా పడుతుంది. పెడబొబ్బలు పెడుతూ మరణిస్తావు. ఏది కావాలో కోరుకో!"
"రాసిస్తాను"
"రాసివ్వు. త్వరగా! మొత్తం వివరంగా ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా వచ్చి చెప్పమన్నచోట సాక్ష్యం చెప్పాలి. నీకు 10 మంది సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాము. ఏమీ భయం లేదని మాట ఇస్తున్నాను."
"అలాగే!"
*    *    *
ఆర్ధికశాఖామాత్యుడు పంచాపకేశన్ అరెస్టు
దిల్లీ, నేటి తెల్లవారుఝామున ఆర్ధికశాఖామాత్యుడు ఒక అవినీతికేసులో యిరుక్కుని అరెస్టయ్యారు. కేసు సి.బి.ఐ కి చెందిన ఒక ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. ప్రాధమిక అంచనాల ప్రకారం ప్రత్యేక కోర్టులో కనీసం ఐదేళ్ళు జైలు శిక్ష పడవచ్చు.
వార్త దావానలంలా వ్యాపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరినీ చూడడానికి అనుమతించడంలేదు సి.బి.ఐ బృందం.
*    *    *
"ఇంకో వారంరోజుల్లో ఉప్పుగని మొత్తం మనచేతుల్లోకి వచ్చేస్తుంది పుష్యమిత్రాజీ. పనివాళ్ళు రెండు సంవత్సరాల జీతం ఇస్తామనే సరికి పచ్చ జెండా ఊపేశారు"
"ఇక్కడ నా పని కూడా పూర్తి ఔతోంది." అన్నాడు చదువుతున్న తాళపత్రాలను ప్రక్కన పెట్టి.
"ప్రధానిగారూ! మనం పాక్‌నుండి తరలించే ఉప్పును మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు తనిఖీ చేయకూడదు. మొదటగా ఆ ఒప్పందం చేసుకోండి. ఏవిధమైన తనిఖీలు ఉండకూడదు అని చెప్పండి."
"మొదటి నెలరోజులపాటు మనం ఏమీ చెయ్యం. తరువాత మెల్లిగా ప్రారంభిద్దాం"
"కానీ వాళ్ళను నమ్మకూడదు ప్రధానిగారూ! అంభి మహారాజు నమ్మకద్రోహం చెయ్యబట్టే మన దేశానికి అలెగ్జాండర్ రాగలిగాడు. వాళ్ళు అలాంటివాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వాళ్ళ దేశంలో కూడా ఒక నకిలీ మందుల ఫాక్టరీ ప్రారంభించండి. అనుమానం రాకుండా ఈ ఉప్పుతోనే మనం ఔషధాలు చేస్తున్నామన్న ఆలోచనలో ఎప్పటికీ వాళ్ళు ఉండాలి."
*    *    *
"మేజర్.. సలాలుద్దీన్!"
"యెస్ జెనరల్. చెప్పండి"
" ఇండియన్ గ్లోబల్ ఐ ఎంత ప్రమాదమైనదో అమెరికా వెళ్ళివచ్చిన మన సైంటిస్టులు చెప్పారుకదా! ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి?"
"కానీ దాన్ని ధ్వంసం చేయడం మనం అనుకున్నంత సులభం కాదు. అహర్నిశము కొన్ని వేల మంది కాపలా ఉంటారు"
"నిజమే! అలా అని చేతులు కట్టుకుని కూర్చోలేం కదా!"
"దాని చుట్టూ వలయం లాగా 50 ట్యాంకర్లను పెట్టారు"
"యెస్"
" గ్లోబల్ ఐ పైభాగాన ఉన్న బిల్డింగ్‌లో 360 డిగ్రీలలో ప్రయోగించే మిసైల్స్ ఉన్నాయి. దాన్ని ముట్టుకుంటే ఒక 1000 కిలో మీటర్ల మేర మాడిమసిగా మారే మిసైల్స్ ఆటోమేటిక్‌గా అమర్చారు. అవన్నీ ఎక్కువ మన దేశం మీదకే గురిపెట్టబడ్డవే!"
"ఇవన్నీ నీకెవరు చెప్పారు?"
" ముక్తర్ అసాఫాలీ అనే ఒకడికి లంచం ఇచ్చి తెలుసుకున్నా!"
"వాడిని నెలరోజులు సెలవు పెట్టించి మన దేశానికి తీసుకురా!" 
"ఐ విల్ ట్రై మై బెస్ట్ జెనెరల్!"
"నో! ఇట్ షుడ్ బి డన్ ఎట్ ఎనీ కాస్ట్"
సెల్యూట్ చేసి నిష్క్రమించాడు. మేజర్ జలాలుద్దీన్. (సశేషం)

-0o0-

No comments:

Post a Comment

Pages