తమవేలితో తమకన్నేపొడుచుకున్నట్లు
ఆదూరి హైమావతి
“ఈ సంవత్సరపు ఉత్తమ ఉద్యోగి బహుమతికి ఎంపికైన వారు వాసుగారు.” అని ఆ ఆఫీసు ఉద్యోగుల సమావేశంలో సంస్థ అధినేత అఖండరావు గారు ప్రకటించారు. సమావేశానికి హాజ రైన వారంతా ఒకరిముఖాలొకరు చూసుకుంటూ గుసగుసలా డుతూ కూర్చున్నారు.
" అఖండుడోయ్ వాసు అఖండరావుకే వలవేశాడు. "
"ఆ రోజూ వెళ్లి ఇంట్లో పూలనుంచీ కావల్సినవన్నీ సప్లై చేసే వాట్ట."
"అంతేనా వాళ్లావిడచేత వడియాలూ, అప్పడాలూ పెట్టించి ఆయనింటికి పంపేవాట్ట!"
"వాళ్లావిడ స్వయంగా వెళ్ళి ఆవకాయా ,మాగాయా వంటివి పెట్టిచ్చేదిట."
" వాసు భార్య మైసూరిపాకు చేయడంలో దిట్ట. అప్పుడ ప్పుడు పండగలకెళ్ళి వాళ్ళింట్లో మైసూరుపాకు బిళ్లలు చేసిచ్చేది ట."
" వాళ్ళమ్మాయికి మల్లెపూలజడ వేసిచ్చేదిట."
"వాళ్ళ నాన్నగారికి వాసు మహాభారత రామాయణాలు చదివి వినిపించేవాడుట."
"వాసు శ్రీమతి అధినేత అమ్మగారికి సాయంగా వారి కార్లోనే ఆలయాలకెళ్లేదిట."
" వాసు కుమార్తె గణితంలో దిట్ట. ఆఅమ్మాయి అధినేత కుమా రునికి గణిత ట్యూ షన్ చెప్పేదిట."
" వాసు వాళ్ళింట్లో అంతా కలసి ఆర్గానిక్ కూరలు పండించు కుంటారుట, వాటిలో చాలావరకూ అధినేత ఇంటి కే వెళతా యిట. "
" ఓహ్ ఇంకా ఎన్నెన్ని చేశాడో ! అందుకే ఉత్తమ ఉద్యోగి బహు మతికి ఎంపికయ్యాడు.లేకపోతే వాసు ఉద్యోగ మెంత, వాని హోదా ఎంత? వాని క్వాలిఫికేషనెంత ? "
" ఏమైతే నేం లే కొట్టేశాడుగా బహుమతి, మంచి ఇల్లు, వాళ్ళ పిలల్లకు ఉద్యోగాలు, చదువులు ఫ్రీ. ఏమైనా అదృష్ట వంతు డు . “
“ ఆ ! ఏదో అధినేతను ఊరేసి బహుమతి పేర తేరగా అన్నీ కొట్టేయడమూ ఓ అర్హతాఏం"
" నిజంగానే అలా చేయగలగడమూ ఓకళే."
"పోన్లే ఆపేయండి. ఎవరైనా వింటే మనం కుళ్ళి చస్తు న్నామనుకుంటారు. ముఖాలకు కాస్త సంతోషపు రంగు పూసుకుని నవ్వండి."
ఇలా మిగతా ఉద్యోగులంతా వారి వారి భావనలను , ఓర్వలేనితనాన్నీ వెళ్ళబోసుకున్నారు.
నిజానికి అవన్నీ చేసిందీ, చేయయత్నించిందీ తామే అని వారి మనస్సులకు తెల్సు.
అధినేత మైక్ ముందు నిల్చుని చెప్పసాగాడు.
" ప్రియ ఉద్యోగులారా! మీరులేంది ఈ సంస్థే లేదు. అందుకే మీ పని తనాన్నిపెంచి, మీకు ఉత్సాహమూ పని పట్ల శ్రధ్ధా కలిగించను మేము బాగా ఆలోచించి ఒక పధకాన్ని రూపొం దించాం. ప్రతి ఏడాదీ ఒక్కో మార్గంలో దీన్ని అమలు పరు స్తుంటాం. ఈ ఏడాది ఒక ప్రత్యేక విధానాన్ని ఎన్నుకున్నాం. అదేంటో మీ అందరికీ కొంత తెలుసు, పూర్తిగా తెలీదుకూడా.
అదేంటంటే మీ అందరికీ ఒక్కో ప్రత్యేక లేఖ చాలా రహ స్యంగా అంది ఉంటుంది. దానికి సమాధానం కూడా రహస్య పధ్ధతిలో మీరేవ్రాసి మన ఆఫీసుపోస్ట్ బాక్సులో పోస్ట్ చేశారు. మీమీ సమాధానాలను బట్టి మేము ఈ బహుమతిని నిర్ణయిం చాం. అంటే మీరే ఓటింగ్ ద్వారా బహుమతికి వ్యక్తిని నిర్ణ యించా రన్న మాట.
***
అధినేత అలాచెప్తుండగా అందరిమనస్సులూ కొద్ది వారా ల క్రితం తమకు అందిన లేఖలమీదికీ, వాటికి తాము వ్రాసిన రహస్య సమాధానాలపైకీ పోయింది.
సరిగ్గా పక్షరోజులక్రితంకొందరికీ, వారంక్రితం కొదరికీ, నెలక్రితం కొందరికీ ఇలా ఒకరికి తెలీకుండా ఒకరికి లేఖలు వివిధమార్గాల్లో అందాయి. ఎవరూ మత ప్రియ స్నేహితులకు సైతం దాని గురించీ చెప్పనేలేదు. స్వార్ధమో , మరేమైనానో తమచే రహస్యాన్ని కాపాడించింది. దానిలోని అంశాలకు స మాధానాలు వ్రాసి చాలా రహస్యంగా పోస్ట్ చేసినట్లు ప్రతి ఒక్కరికీ గుర్తు కొచ్చింది..
దాన్లో
1. ఆఫీసు లో మీమీ విభాగాల్లో బాగా పనిచేసేవారెవరు?
2. ఎవరి పని తీరు మీకుబాగా నచ్చింది?
3.ఎవరు సరిగా పనిచేయకుండా ఊరికే ఆఫీసుకు వచ్చి
పోతున్నట్లు మీరు భావిస్తున్నారు?
4. ఎవరికి ప్రెమోషను ఇవ్వవచ్చు?
5. ఈ సంవత్సరపు బహుమతి ఎవరికి ఇవ్వడం ఉచి
తంగా ఉంటుంది?
దీన్లో సంతకాలు , మీపేర్లు వ్రాయకూడదు.
ఎవరికి వారే బాగా గుర్తుకు తెచ్చుకుని తాము వ్రాసిన సమాధానాల ను గురించీ ఆలోచించసాగారు.
***
అధినేత మాటలు మైక్ లో వినిపిస్తున్నాయి.
"పేర్లు వ్రాయ కూడదని కోరినందున ఎవరికి వారే వారి పేర్లను ప్రేమోషన్ కూ . బహుమతి ఎంపికకూ వ్రాసుకు న్నారు. మీకు అయిష్టులైనవారి పేర్లను , వారు ఎంతో శ్రధ్ధాసక్తులతో పని చేస్తున్నా సరిగా పని చేయనట్లు వ్రాశారు.
అందరూ ఇదేరీతిగా తమతమ పేర్లను బహుమతికి అర్హులుగా వ్రాసుకున్నారు.మిగతా వారిని వేస్ట్ క్యాండి డేట్స్ గా వ్రాశారు.
కేవలం ఒకే ఒక వ్యక్తి నీతి నిజాయితీలతో తమ విభాగపు పని తీరును, చక్కగా పనిచేయగలిగిన వారిపేర్లనూ, ప్రెమోషన్ కు అర్హత గలవారిపేర్లనూ, ఈ బహుమతికి ఎంపిక కాగల అర్హత ఉన్న వారి పేర్లనూ వరుసక్రమంలో వ్రాశాడు. అతని పేరు వ్రాయ లేదు గనుక అతడెవరో గురించను మేము అందరి చేతి వ్రాత నూ పోలిక చేశాం.ముందునుంచే మా మనస్సుల్లో తన ప్రవర్తనతో ఒక మంచి భావన కలిగించిన వాడు సహనం, స్నేహ భావన, కష్టపడి పనిచేసేతత్వం,తోటి వారి ఉన్నతికి సంతోషించే ఔన్నత్యం గలిగి, అసూయ, ద్వేషం, పగ, ఓర్వ లేనితనం, లేని నిష్కల్మష హృదయు డు, ఒక్క నిముషం ఆఫీసు కాలాన్ని వృధాచేయని వాడు, కార్యా లయపు నియమ నిబంధనలకు లోబడిన వాడూ, పనినే దైవంగా ఆరాధించే వాడూ వృత్తికి అంకిత మైనవాడూ , నిరాడంబరుడూ , నెమ్మది ప్రవర్తన గల వాడూ ఐన వాసుదేవరావును ఈ బహుమతికి ఎంపిక చేయడంలో మీకు తెలీకుండానే మాకు సహకరించిన మీ అందరికీ ధన్యవా దాలు. తమవేలితో తమకన్నే పొడుచు కున్నట్లు మీ అసూయా పూరిత హృదయాలే మీ చేత అలా రాయించాయని భావిస్తున్నాం.
ఇపుడు వాసుదేవరావు వేదిక మీదికి వచ్చిబహుమతిగా మేము అందించే , కొత్త ఇంటి తాళం చెవులూ, చెక్కూ అందుకోవలసినదిగా సంస్థతరఫునకోరు తున్నాను." అని ప్రకటించగానే ఎవరికి వారు మనస్సుకు బుధ్ధి చెప్పు కుని వాసుదేవరావు వేదిక మీదికి వస్తుండగా కరతాళ ధ్వనులు చేశారు.
******
No comments:
Post a Comment