బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-03
అమరాంగనలదె యాడేరు
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0305-02 సం: 04-026
పల్లవి: అమరాంగన లదె యాడేరు
ప్రమదంబున నదె పాడేరు
చ.1: గరుడవాహనుఁడు కనకరథముపై
యిరువుగ వీధుల నేఁగీని
సురలును మునులును సొంపుగ మోఁకులు
తెరలిచి తెరలిచి తీసేరు
చ.2: యిలధరుఁడదివో యింద్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలఁగి సేవలటు సేసేరు
చ.3: అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుఁ డరదమున నెగడీని
నలుగడ ముక్తులు నారాదాదులును
పొలుపు మిగులఁ గడుఁ బొగడేరు
భావం
పల్లవి:
అదుగో ! అలమేల్మంగమ్మతో వేంకటేశ్వరుడు రథముపై కదలుతున్న సమయంలో దేవతా స్త్రీలందరూ ఆడుతున్నారు.సంతోషముతో పాడుతున్నారు.
చ.1:
గరుత్మంతుడు వాహనముగా కలిగిన విష్ణువు(వేంకటేశ్వరుడు) బంగారు రథముపై ఒప్పునట్లుగా వీథులలో సాగుతున్నాడు.
దేవతలు మునులు ఎక్కడో ఉన్న లావుతాళ్లను అందంగా కదల్చి కదల్చి బయటికి తీస్తున్నారు. (వీథులలో జనులను అజమాయిషీ చేయుటకు అని భావం)
చ.2:
వరాహావతారములో భూమిని ధరించిన విష్ణువు(వేంకటేశ్వరుడు) ఇంద్రరథముపై విజృంభించి దిక్కులన్నింటిని గెలిచాడు.బలము కలిగిన శేషుడు మొదలయినవారు , బ్రహ్మ ,శివుడు అతిశయించి సేవలు చేస్తున్నారు.
చ.3:
అలమేల్మంగతో కలిసి ఆ విధంగా శ్రీవేంకటనిలయుడయిన వేంకటేశ్వరుడు రథములో వర్ధిల్లుతున్నాడు.
రథానికి నాలుగు ప్రక్కల ఉండి ముక్తి పొందిన నారదుడు మొదలైన వారు అందంగా స్వామివారిని పొగుడుతున్నారు.
విశేషాలు
జనన మరణ బంధ విమోచనం ముక్తి. అవిద్య నశించడం ముక్తి. ఇలాంటి ముక్తులు నాలుగు విధాలని కొందరు, ఐదు విధాలని కొందరు అంటారు. ఐదు విధాల ముక్తులివి : 1. సార్ష్టి (అంటే సృష్టించే శక్తి, సమానాధికారం కలది అనే అర్థాలు ఉన్నాయి), 2. సాలోక్యం, 3. సావిూప్యం, 4. సారూప్యం, 5. సాయుజ్యం. నాలుగు విధాలనే వారు ‘సార్ష్టి’ని ఇందులో చేర్చరు. సార్ష్టి, సాయుజ్యం ఒకటే అని శ్రీ. సూ. ఆం. ని. వివరణ.( పారమార్థిక పదకోశం)
***
No comments:
Post a Comment