అటక మీది మర్మం - 14 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 14

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-పధ్నాల్గవ భాగం (14)
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవల)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)


(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. . మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. తండ్రి కోరిక మేరకు ఆమె డయానె ద్వారా డైట్ కంపెనీలోకి దూరి బుషీట్రాట్ అన్న వ్యక్తి అక్కడ పని చేస్తున్నట్లు కనుక్కొంటుంది. ఆ విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా, పక్కబట్టల కోసం అటక మీద పాత బీరువాలో వెతుకుతున్న ఎఫీని బ్లాక్ విడో సాలీడు కరిచిందని గమనించి డాక్టరు వద్దకెళ్ళి చికిత్స చేయిస్తుంది. జబ్బుపడ్డ ఎఫీ కోలుకొనేవరకు నాన్సీ మార్చ్ భవంతిలోనే ఉండిపోతుంది. ఆ రోజే గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా కోరుతూ ఉత్తరం వ్రాస్తుంది. భోజనాల సమయంలోమార్చ్ తన కుటుంబవిషయాలను నాన్సీకి చెబుతాడు. ఆ రాత్రి అటకమీద వెతుకుతుంటే అనుకోకుండా ఆమె టార్చీలైట్ ఆరిపోవటం, అదే సమయంలో ఎక్కడినుంచో కొన్ని విపరీత శబ్దాలు వినిపించటం జరుగుతుంది. ఎఫీ కోలుకొన్నాక యింటికొచ్చిన యువ గూఢచారి, తన తండ్రితో కలిసి బుకర్ ఫాక్టరీకి వెళ్ళి పట్టుకండువాలు చేసే విధానాన్ని గమనిస్తుంది. తరువాత తండ్రికోరికపై ఒక ప్రణాళిక ప్రకారం డయానె యింటికి వెళ్ళి, తనకు తెలిసిన ఒక పాపకు డయానె చెల్లెలుకి బిగువైన బట్టలను యిమ్మని అడుగుతుంది. ఆమె లోనికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని వారి హాబీలేమిటో గమనిస్తుంది. డయానె యిచ్చిన పాత బట్టలతో ప్లెజెంట్ హెడ్జెస్ కి చేరిన నాన్సీ, మార్చ్ అనుమతితో అటక మీద ఉన్న కొన్ని పాత సీసాలతో డైట్ ఫాక్టరీలోకి అడుగు పెడుతుంది. అక్కడ సీసాలను డైట్ కి చూపెడుతున్న ఆమెకు బుషీట్రాట్ కనిపిస్తాడు.వెంటనే వేగంగా కిందకొచ్చి బుషీట్రాట్ ను అనుసరిస్తూ ప్రయోగశాల్లోకి ప్రవేశించిన నాన్సీ అక్కడ గాజుకుప్పెల్లో ఉన్న రసాయనిక ద్రవాన్ని చిన్న సీసాలో నింపుతుంది. ట్రాట్ తాళాలేసి వెళ్ళిపోవటం వల్ల లోపల యిరుక్కుపోయిన ఆమె అక్కడ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుండగా బయట పరుగెడుతున్న పాదాల చప్పుడు వినిపిస్తుంది. కంగారు పడ్డ ఆమె అక్కడ కనిపించిన తలుపు తెరిచి బయట పడుతుంది. పరీక్షించి చూసిన ఆమె తాను భూగర్భంలో ఉన్నట్లు గమనించి, బయటపడే మార్గాన్ని వెతుకుతుంది. చివరికి ఆమె తాను కనుగొన్న మార్గం ద్వారా ఫాక్టరీ దక్షిణ గోడ పక్కకు చేరినట్లు గ్రహిస్తుంది. అక్కడనుంచి ఫాక్టరీ గేటుముందున్న తన కారు వద్దకు వెడుతుండగా అటునుంచి తనకు ఎదురొస్తున్న బుషీట్రాట్ కనిపిస్తాడు. ఎలాగో అతని కంట పడకుండా తప్పించుకొని తన యింటికి చేరుకొంటుంది. తనకోసం కంగారుపడుతున్న తండ్రికి తానెక్కడికెళ్ళిందీ చెప్పి, ప్రయోగశాలనుంచి సేకరించిన ద్రావకాల సీసాలను తండ్రికిస్తుంది. తాను ఎఫీకి తిరిగి వస్తానన్న మాటిచ్చినందున, ఎంత అర్ధరాత్రయినా తాను ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళాలని, అందుకే తనను అక్కడ దింపమని తండ్రిని కోరుతుంది. ఇక యిక్కడ నాంసీ రాలేదని ఎఫీ కంగారు పడుతూంటుంది. ఆ తరువాత కధ ఏమిటంటే. . . .)
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఇక్కడ మార్చ్ యింట్లో ఎఫీ, నాన్సీ రాలేదని విపరీతంగా భయపడిపోతోంది. రోడ్డు మీద కారు చప్పుడైన ప్రతిసారి ఆమె తన గది కిటికీ దగ్గరకు పరుగుతీసి, కారు శబ్దాన్ని శ్రద్ధగా ఆలకిస్తోంది. తన ముఖాన్ని కిటికీ అద్దానికి అదిమిపెట్టి నల్ల దేవదారు వృక్షాల మధ్యనుంచి కారు కనిపిస్తుందేమోనని తొంగిచూస్తోంది.

"నాన్సీ యింతకు ముందెప్పుడూ మాట తప్పలేదు. ఆమె లేకుండా రాత్రిళ్ళు యిక్కడ ఉండటానికి నేను భయపడతానని తనకు తెలుసు" పెద్దాయనతో అందామె.

"ఏదైనా ముఖ్యమైన పని తగిలి రాలేదనుకొంటాను. చింతించకు" అని ధైర్యం చెప్పాడతను.

పదిగంటలు కాగానే అతను తన గదికి వెళ్ళిపోయాడు. నాన్సీ కోసం యింకా ఎదురుచూసి లాభం లేదని ఎఫీ నిశ్చయించుకొంది. అయిష్టంగానే తన గదికి వెళ్ళి పడుకోవటానికి పక్కబట్టలు సర్దుకొంది. నాన్సీ వస్తుందేమోనన్న ఆశ ఆమెలో యింకా చావక, తిరిగి కిటికీ దగ్గరకొచ్చింది.

"ఎంత దట్టమైన చీకటి. మబ్బులవల్ల బయటంతా అంధకారంగా ఉంది" పనిపిల్ల కిటికీలోంచి చూస్తూ అనుకొంది. "కనీసం చంద్రుడైనా. . ."

వాతావరణంపై ఆమె ఆశలు అకస్మాత్తుగా తెగిపోయాయి. కిటికీ కింద రహస్యంగా ఏదో అస్పష్టమైన వస్తువు కదులుతున్నట్లు అనిపించింది. ఆ భవంతిలో పాడుపడిన భాగానికి పక్కగా అడ్డదిడ్డంగా పెరిగిన ఎత్తైన గుబురుపొద ముందు ఎవరో నెమ్మదిగా నడిచిపోతున్నట్లు కనిపించింది.

అరవాలని చూసినా ఎఫీ నోట్లోంచి శబ్దం రాలేదు. భయంతో అప్రయత్నంగా కిటికీనుంచి ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమె తిరిగి ధైర్యాన్ని కూడగట్టుకొని బయటకు చూసింది. కానీ అప్పటికే అతను వెళ్ళిపోయాడు. ఎఫీ వణికిపోతూ మంచం మీదకు దూకింది. చెవుల వరకు దుప్పటి కప్పుకొని చాలాసేపు కొయ్యబారినట్లు ఉండిపోయింది.

"నేను పడుకొందుకు వచ్చే ముందు అన్ని తలుపులను, కిటికీలను మూసి వచ్చాను" ఆమె తనలో తర్కించుకొంది. "అలాంటప్పుడు మనిషెవడూ యింట్లోకి రాలేడు కదా!. . . .అయినా రాగలడా?"
అకస్మాత్తుగా విసురుగా వీచిన గాలికి కిటికీలు టపటపమని కొట్టుకొన్నాయి. పైనున్న దూలాలు మూలిగినట్లు వినిపించింది.

"అది నిజంగా గాలి వల్ల వచ్చిన చప్పుడేనా? లేక ఎవరైనా వదులుగా ఉన్న చెక్కలపై నడుస్తున్నారా?" ఆమె ఊహించుకొంటోంది.

ఆమెకు నిద్రపట్టడం లేదు. తాను బయట చూసిన వ్యక్తి యింట్లో దూరే ఉంటాడని ఆమె నిర్ధారించుకొంది.

"అతనికి యింట్లోకి వచ్చే రహస్యమార్గమేదన్నా తెలిసి ఉండొచ్చు. ప్రస్తుతం అతను యింట్లోనే ఉన్నాడు" అనుకొన్న ఆమెలో దుఃఖం తన్నుకొస్తోంది..

ఇంతలో కింద హాల్లో తలుపేదో తెరుచుకొన్నట్లు కిర్రుమన్న శబ్దం స్పష్టంగా వినిపించింది. తరువాత హాలులో ఎవరివో ఒకే స్థాయిలో ఉన్న అడుగుల చప్పుడు వినిపించింది.

"అయ్యబాబోయి! ఏమిటది?"

ఎఫీ తనలో చెలరేగే సందేహాలను సహించలేకపోతోంది. సగం ఊహలతో ఆమె కలవరపడుతున్నా, మెల్లిగా ధైర్యం కూడగట్టుకొని మునివేళ్ళపై నడుస్తూ, తన పడగ్గది తలుపుల దగ్గరకొచ్చి భళ్ళున తెరిచింది.

"ఓ! మీరా మిస్టర్ మార్చ్?" అంటూ అతన్ని చూసి నిట్టూర్చింది. " ఎవరో హాల్లో దొంగతనంగా దూరారనుకొన్నా!" అంటూ తను బయట చూసిన అపరిచితుని గురించి అతనికి చెప్పింది
.
"లోపల ఎవరూ లేరు" అని పెద్దాయన ఆమెకు ధైర్యం చెప్పాడు. తను కూడా స్వయంగా ఆ విచిత్రమైన శబ్దాలను విన్నా, వాటి గురించి చెప్పి భయపడే ఎఫీని మరింత బాధపెట్టదలుచుకోలేదు. "ఎఫీ! నువ్వెళ్ళి పడుకో!"

"నాన్సీ గురించి ఆలోచిస్తూంటే నాకు నిద్ర పట్టటం లేదు" ఆమె గొంతు దుఃఖంతో బొగురుపోయింది. 
"ఆమె రాత్రికి తప్పకుండా తిరిగి వస్తానంది. భగవంతుడా! ఆమెకేమీ జరిగి ఉండదని ఆశపడుతున్నాను."

మార్చ్ ఆమెను ఓదార్చటానికి ప్రయత్నిస్తున్నాడు. "బాగా పొద్దుపోయిందని ఫోను చేసి ఉండకపోవచ్చు."

అతని మాటలకు ఆమె సంతృప్తి చెందింది. మంచమెక్కిన కొద్దిక్షణాలకే ఎఫీ గాఢనిద్రలోకి జారుకొంది
మార్చ్ మనసులో కూడా ఏదో తెలియని గాభరా చోటుచేసుకొంది. "నాన్సీ ఈ రాత్రికి యిక్కడే ఉంటుందనుకొన్నాను" అని తనలో గొణుక్కొన్నాడు.

"నేను పైకి వెళ్తాను" అంటూ పెద్దాయన కొవ్వొత్తి కోసం వెళ్ళాడు. జాగ్రత్తగా అటకమెట్లు ఎక్కి చుట్టూ చూశాడు. మూడవ అంతస్తులో అతనికి ఎవరూ కనిపించలేదు. అటక మీద ఉన్న అనేక రకాల పెట్టెలు, ట్రంకులను కెలికి చూసినా కొత్త వస్తువేదీ అతనికి కనపడలేదు.

"ఎఫీ, నేను శబ్దాలను స్పష్టంగా విన్నాం" అని గొణుక్కొంటూనే ఉన్నాడు.

చివరికి మార్చ్ అటక దిగి తన పడగ్గదిలోకి వెళ్ళాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు.

హఠాత్తుగా పెద్దాయనకు బయటనుంచి కారు యింజను శబ్దం, మాటలు వినిపించాయి. తన గదిలోని కిటికీ నుంచి తొంగిచూసిన అతనికి, యింటిముందు మాట్లాడుకొంటున్న నాన్సీ, ఆమె తండ్రి కనిపించారు. యువ గూఢచారిని చూడగానే అతనిలో ఒత్తిడి మాయమైంది.

మార్చ్ కంగారుగా కిందకెళ్ళి తండ్రీకూతుళ్ళను లోనికి ఆహ్వానించాడు. నాన్సీ తండ్రి ఒక్క క్షణం మాత్రమే ఉండి తన యింటికి కారులో వెళ్ళిపోయాడు.

"బాగా ఆలశ్యమైనందుకు మన్నించండి" ఆమె క్షమాపణ కోరింది.

కొంతసేపాగి వింతశబ్దాల గురించి, ప్లెసెంట్ హెడ్జెస్ లో తచ్చాడిన ఆగంతకుడి గురించి ఆమెకు చెప్పాడతను. "కానీ ఈ రాత్రి అన్వేషించాల్సిన పని లేదు. ప్రస్తుతం అంతా సర్దుకొంది. ఎఫీ నిద్రపోయింది" అంటూ తన మాటలను ముగించాడు.

"పెందరాళే రానందుకు మన్నించండి. నాన్న గారి కోసం కొంత గూఢచర్యం చేయాల్సివచ్చింది" చెప్పిందామె.

"నాన్సీ! బాగా అలసిపోయినట్లున్నావు" శాంతస్వరంతో అన్నాడు. " వెళ్ళి నిద్రపో అమ్మా! ఈ పరిశోధనంతా రేపు చూసుకొందాం."

ఆమె ఆనందంగా పెద్దాయన వద్ద సెలవు తీసుకొని మంచంపై వాలిపోయింది. మరుక్షణమే నాన్సీ గాఢనిద్రలోకి జారుకొంది. మరునాడు ఆలశ్యంగా నిద్రలేచిన నాన్సీ తన టిఫిను ముగిస్తూండగా, మిసెస్ ఫ్రెంచ్ వీడ్కోలు చెప్పటానికి వచ్చింది.

"నా ముద్దుల పాప సుశాన్ ఎలా ఉంది? నేనామెను శ్రద్ధగా చూసుకోలేకపోతున్నాను" అందామె.

తన మనవరాలిని కొంతకాలం శ్రద్ధగా చూసుకొన్న తన పాత స్నేహితురాలిని పెద్దాయన నవ్వుతూ చూశాడు. "నేను, సుశాన్ నీకు దూరమవుతున్నాం."

"నేను కూడా!" అందామె. "దూరప్రాంతానికి నివాసాన్ని మార్చవలసివచ్చింది. వీలును బట్టి మీరు నా కొత్త యింటికి రావచ్చు."

మార్చ్ తోడు రాగా, ఆమె సుశాన్ కి గుడ్ బై చెప్పటానికి పై అంతస్తుకి వెళ్ళింది.

నాన్సీ తన యింటికి వెళ్ళి డైట్ రహస్యం పై పని చేయటానికి నిశ్చయించుకొంది. సాయంత్రం తిరిగి వస్తానని ఎఫీకి చెప్పి యువ గూఢచారి పాత భవనాన్ని విడిచిపెట్టింది

ఇంటి దగ్గర బెస్, జార్జ్ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు.

"నువ్వు నిజంగా ఒక రహస్యాన్నే కదిలించేస్తున్నావు" బెస్ ఉడికించింది. "నిన్ను యిక్కడ పట్టుకొవాలో, మార్చ్ యింటి దగ్గరో మాకైతే తెలియటం లేదు."

"కానీ మాయమైన సంగీతాన్ని కనిపెట్టటంలో నేనింకా చేరువ కాలేదు" నాన్సీ చెప్పింది. "ఆ యిల్లు తన రహస్యాన్ని బాగానే కాపాడుకుంటోంది."

"మంచి సెంటర్లో మధ్యాహ్న భోజనానికి మాతో రావాలి. దానికి ఏమంటావు?" జార్జ్ అడిగింది.

"చక్కటి ఆలోచన!" నాన్సీ హుషారుగా అంది. "నేనిక్కడ భోజనం చేయనని హన్నాతో చెప్పేస్తాను."

"అది సరె! డయానెతో నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?" జార్జ్ అడిగింది.

"ఆమె సుశాన్ కోసం కొన్ని బట్టలను యిచ్చింది" నాన్సీ బదులిచ్చింది. తండ్రి చేపట్టిన కేసు రహస్య స్వభావం కలది గనుక డైట్ ఫాక్టరీనుంచి తాను రాబట్టిన విషయాలను వాళ్ళకు చెప్పదలుచుకోలేదు.

హన్నాకు తన కార్యక్రమాలను చెప్పాక నాన్సీ బయల్దేరుతుండగా హాల్లో బల్ల మీద అప్పుడే వచ్చిన ఉత్తరాలు కనిపించాయి. వెంటనే బల్ల దగ్గర ఆగి చూస్తున్న ఆమెకు ఆ ఉత్తరాల మధ్యలో ఆక్స్ ఫర్డ్ లోని జెన్నర్ సంగీత ముద్రణాసంస్థ నుంచి వచ్చిన కవరు కనిపించింది. చాలారోజుల క్రితం బెన్ బాంక్స్ అన్న వ్యక్తి వివరాలను అడుగుతూ ఆ సంస్థకు తాను ఉత్తరం వ్రాసినట్లు ఆమె తన స్నేహితురాళ్ళకు చెప్పింది. బదులు ఏమి వచ్చిందో అంటూ ఆమె ఆ కవరును చేతిలోకి తీసుకొని చింపింది.

కవరులోంచి ఉత్తరాన్ని బయటకు తీసి ఆమె బిగ్గరగా చదివింది.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages