చిత్తగించవలెను
పెయ్యేటి రంగారావు
ప్రొఫెసర్ పరాంకుశం గారు రిటైరయి ఐదు సంవత్సరాలయింది. ఆయన భార్య పేరు బిట్రవల్లి కామేశ్వరి. వారు ఆమెను మనసులో కసిగా బికారి అని పిలుచుకునే వారు. వారికి సంతానం లేదు. ఆవిడ పరాంకుశం గారి జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి, ఆయన గొప్ప తాత్త్వికుడిగా మారిపోయారు. ఆయన భార్య క్రితం సంవత్సరమే కాలం చేసింది. అప్పటి నుంచి ఆయనకు కాస్త మనశ్శాంతి చిక్కింది. ఐతే ఆయనకు వంట రాదు. హోటలు భోజనం పడదు. ఆయన పరిస్థితికి జాలి పడి, అప్పటి నుంచి ఆయన దగ్గర చదువుకున్న గ్లోరీబాయమ్మ గారే పనికుర్రాడి చేత రోజూ క్యారియర్ పంపిస్తున్నారు. ఇంక ఆయనకు కాలక్షేపమల్లా ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ తిరిగి, తిరిగి చదువుకుంటూ వుండడం. ఎందుకంటే ఆయనకు టి.వి. అంటే ఎలర్జీ. ఆయన భార్య బ్రతికుండగా ఎడతెరిపి లేకుండా తెలుగు సీరియల్సన్నీ చూసేస్తూ, ఆయనకు టి.వి. అంటే విరక్తి కలిగించింది. ఇప్పుడు పొరపాటున టి.వి. రిమోట్ ఆన్ చేసి ఏదన్నా తెలుగు ఛానెల్ చూద్దామనుకున్నాడా, వెంటనే ఎలర్జీ వచ్చేసి, వంటినిండా తేళ్ళు, జెర్రులు పాకుతున్న ఫీలింగ్ వచ్చేస్తూ వుంటుంది.
ఒకరోజు పుస్తకాల బీరువా దగ్గరకు వెళ్ళి, ఏదన్నా పుస్తకం చదువుదామని తీయబోతుంటే ఆయన ఎప్పటినుంచో భద్రంగా దాచుకున్న చిరునామాల పుస్తకం బయట పడింది. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందామని ఉబలాటం కలిగి, ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చుని పేజీలు తిరగెయ్యసాగారు. మొదటి పేజీ తియ్యగానే 'ఎ' తో మొదలయ్యే వారి చిరునామాలన్నీ కనపడ్డాయి. ఆసక్తిగా ఒక్కొక్క పేరే చూస్తూ ఆలోచించసాగాడు.
'అనంతయ్య, .......బెంగళూరు.' ఓ! వీడు తను కలిసి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా చదువుకున్నారు కదూ? వెధవ, దారుణంగా అల్లరి చేసేవాడు. ఏ క్లాసులో ఐనా సరే, ఎప్పుడూ బెంచీ ఎక్కే వుండేవాడు.'
'అరోరా......కేలిఫోర్నియా.' అవును. వీడు తను ఒక ప్రొఫెసర్ దగ్గరే రీసెర్చ్ చేసారు. వెధవ, మహా కాకారాయుడు. ఆ ప్రొఫెసర్ గాడికి రోజూ ఏదో ఒక కానుక చదివించుకునే వాడు. గురుకులంలో లాగ, ఆయనకి కాళ్ళు పట్టడం దగ్గరనించి అన్ని సేవలూ చేసేవాడు. అందుకే వాడికి తనకన్న ముందర డాక్టరేట్ వచ్చేసింది.
'అయ్యప్ప........కొండాపూర్' వీడు తన దగ్గర నౌకరుగా చేసేవాడు. వాడినెప్పుడూ తన భార్య ఏడిపించేసేది. ఏ పని చేసినా వంకలు పెట్టడం, వెధవా, కుంకా అంటూ తిట్టడం, అంతేకాదు, వాడిది కొండాపూర్ కావడం మూలాన, వాడిని అస్తమానూ 'ఒరేయ్, కొండాపూర్ కే పుండాకోర్!' అని పిలుస్తూ వుండేది. దానితో పాపం, తన భార్య పెట్టే సాధింపులు భరించలేక వాడు విసుగెత్తి మానేసాడు.
ఇలా ఒక్కొక్క పేరూ చదువుకుంటూ వాళ్ళతో తనకున్న అనుబంధం నెమరువేసుకోసాగాడు ప్రొఫెసర్ పరాంకుశం. కాని ఒక పేరు దగ్గరకొచ్చేసరికి ఆయన మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. ఆ పేరు, రుద్రారం భిక్షపతి................. అరకులోయ. ఎవరీ రుద్రారం భిక్షపతి? ఎంత ఆలోచించినా ఆయనకు అస్సలు గుర్తు రావటం లేదు? తన భార్యది అరకులోయే. కాని తను ఎప్పుడూ ఈ భిక్షపతిని కలిసిన గుర్తు రావటం లేదే? అసలు తను అరకులోయకు ఆఫీసు పని మీద వెళ్ళినప్పుడు, తనకు ప్రభుత్వం వారు కేటాయించిన గెస్ట్ హౌస్ లో ఒకే ఒక్కరోజు ఉన్నాడు. అప్పుడు కూడా సెమినార్ లో తోటి ఉద్యోగస్తులను కలవడం, తన ఉపన్యాసం వినిపించడం మాత్రమే చేసాడు. ఇంక ఎవరితోను పరిచయాలేమీ కలగలేదు. మరి ఎవరీ భిక్షపతి! ఆలోచిస్తున్న కొద్దీ అతడి బుర్ర వేడెక్కి పోవడమే గాని సమాధానం దొరకలేదు. ఇంక లాభం లేదనుకుని లెటర్ ప్యాడ్ చేతిలోకి తీసుకుని ఉత్తరం వ్రాయసాగాడు.
'అయ్యా, భిక్షపతి గారూ!,
నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ పరాంకుశం. నేను రిటైరయినాక భీమవరంలో వుంటున్నాను. నా చిరునామాల పుస్తకం ఇవాళ యాధాలాపంగా తిరగేస్తూ వుంటే, అందులో మీ చిరునామా కనిపించింది. ఎంత ఆలోచించినా మీరు ఎవరో, మనం ఎప్పుడు, ఎలా కలుసుకున్నామో అస్సలు గుర్తు రావటంలేదు. మీరు అన్యధా భావించకండి. దయచేసి మనకు పరిచయం ఎలా కలిగిందో, నాకు గుర్తు చెయ్యండి. నాకు హోదా, పరపతి, పలుకుబడి బాగానే వున్నాయి. అందువల్ల మీకు ఏ విధమైన సాయం చెయ్యడానికైనా నేను సిధ్ధంగా వున్నాను. ఇందుతో నా స్వంత చిరనామా వున్న కవరు జత చేస్తున్నాను. వెంటనే సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
చిత్తగించవలెను,
భవదీయుడు,
ప్రొఫెసర్ పరాంకుశం.'
ఆ ఉత్తరాన్ని భద్రంగా కవరులో పెట్టి అంటించాడు. కాసేపటిలో గ్లోరీబాయమ్మ పంపించిన కేరేజి వచ్చింది. ఆ కేరేజి తెచ్చిన అబ్బాయికి ఆ ఉత్తరాన్ని ఇచ్చి పోస్ట్ బాక్స్ లో వేయమని చెప్పాడు. అప్పటికి ఆయన మనసు కుదుట పడింది. ఇంక అక్కడినుంచి ఎప్పుడు సమాధానం వస్తుందా అని ఎదురుచూడడం మొదలుపెట్టాడు. పదిరోజుల తర్వాత భిక్షపతి నుంచి సమాధానం వచ్చింది. ఆతృతగా కవరు చింపి, ఆయన వ్రాసిన సమాధానం చదవసాగాడు.
'మహారాజశ్రీ ప్రొఫెసర్ పరాంకుశం గారికి,
రుద్రారం భిక్షపతి సవినయ నమస్కారములు. తమరు వ్రాసిన ఉత్తరం అందినది. ఎన్నో సంవత్సరాల తరువాత మొదటిసారిగా మీ ఉత్తరం అందుకున్నాను. ఈ సెల్ ఫోన్ల యుగంలో మీరు ఉత్తరం వ్రాయడం ఆనందం కలిగించింది. మీ సందేహం తీర్చడం నా బాధ్యతగా భావించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. చాలా సంవత్సరాల క్రితం తమరు అరకులోయ వచ్చినప్పుడు ప్రభుత్వ అతిథిగృహంలో విడిది చేసారు. అప్పుడు నేనే మిమ్మల్ని స్వాగతించి, విడిది గృహానికి తీసుకు వెళ్ళాను. అప్పుడు నేను ఆ అతిథిగృహంలో గుమాస్తాగా వుండేవాడిని. తమకు బస చూపించి, 'మీరు సదుపాయంగా వుండవచ్చును. మీకు భోజనం, ఉపాహారాలు ఇక్కడే సరఫరా చెయ్యబడతాయి. మా వంటమనిషి సమయం ప్రకారం మీ గదికి తీసుకు వచ్చి అందిస్తుంది.' అని చెప్పి వెళ్ళబోతుండగా, తమరు తమ చిరునామా పుస్తకం తీసి, అందులో నా చిరునామా వ్రాయమని అడిగినారు. ఎందుకు అని నేను అడిగితే, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చేటప్పుడు, ముందుగా మీకు తెలియజేస్తాను, అని చెప్పినారు. అందువలన మీ పుస్తకంలో నా చిరునామా వ్రాసి ఇచ్చి వెళ్ళిపోయినాను. తరువాత తమరు వెళ్ళేటప్పుడు నేను మిమ్మల్ని కలవలేక పోయినాను.
ఇక, తమరు నాకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను అని దయతో వ్రాసినారు. నాకు తమరు చేయవలసిన మహోపకారం ఏనాడో చేసేసినారు. ఆ నాటి నుంచి నా జీవితం ఎంతో ప్రశాంతంగా, ఎటువంటి కలతలు లేకుండా గడిచిపోతున్నది. నేను జీవితంలో ఒక గొప్ప పొరపాటు చేసినాను. అది నేను వివాహం చేసుకోవడం. ఆ నాటి నుంచి నా జీవితంలో సునామీలు, భూకంపాలు, ప్రళయాలు సంభవించ సాగాయి. అనుదినం దిగులుతో కుమిలిపోతున్న తరుణంలో తమరు వచ్చి నాకు గొప్ప సహాయం చేసినారు. అది నా భార్య అయిన కామేశ్వరిని తమరు లేపుకు పోవడం. ఆవిడ అతిథిగృహంలో వంటలక్కగాను, నేను గుమాస్తాగాను వుండేవాళ్ళము. ఇంతకన్న వివరాలు మీకు చెప్పనవసరం లేదనుకుంటాను. నమస్కారం.
చిత్తగించవలెను,
ఇట్లు,
రుద్రారం భిక్షపతి.
ఆ ఉత్తరం చదివి పరాంకుశం గారు విరక్తిగా ఒక నవ్వు నవ్వుకున్నాడు.
No comments:
Post a Comment