జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 14
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
“మేడం.. మీరేమీ అనుకోనంటే ఒక విషయం అడుగొచ్చా?” అన్నాను నెమ్మదిగా.
“మీరడుగాలనుకున్నది నా పెండ్లి విషయమేగా..” అంది. అవునన్నట్లు మెల్లిగా తలూపాను.
“సమయం వచ్చినప్పుడు చెబుతాను”
నేనింక ఆవిషయం కదిలించ లేదు. అవి పర్సనల్ విషయాలు.. ఒత్తిడి చేయడం భావ్యం కాదనుకున్నాను.
ఇంద్రాణి చెప్పే పాఠాలు పిల్లలను తృప్తిపరచడం లేదని మాత్రం తెలుసు.
రోజులు గడుస్తున్నాయి. నేను కాలేజీ పూర్వవైభవం కోసం ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమయ్యాను.
ఒక రోజు విద్యార్థులు స్కాలర్‍షిప్ పెంచాలంటూ తరగతులు బహిష్కరించారు.
స్టాఫ్ కొందరు వెళ్ళిపోయారు. తరగతుల బహిష్కరణ రోజు ఇంటికి వెళ్ళిపోవడం నాకు నచ్చదు.
ఆపూట ఇంద్రాణి, నేను స్టాఫ్ రూంలో మిగిలి పోయాం. నేను టీచింగ్ డైరీ రాస్తున్నాను.
“సార్.. బ్యుజీయా..” అంటూ ఇంద్రాణి పలుకరింపుతో డైరీ రాయడం ఆపి ఆమె వంక చూసాను. ఆమె ఎదో చెప్పాలనే కుతూహలం చూపిస్తున్నదని అర్థమయ్యింది. నా బుక్స్, డస్టర్ అన్నీ కప్ బోర్డులో సర్ది రిలాక్స్ గా కుర్చీలో కూర్చున్నాను.
“సూర్యప్రకాష్ సార్.. టీచింగ్ డైరీ ఇక్కడ ఎవరూ రాయరు.. మీరు చాలా సిన్సియర్.. మీ నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీ క్రమశిక్షణ సూపర్...” అంది ఇంద్రాణి.
“ఒకరు రాయరని.. నేను రాయకుండా ఉండలేను. మరొకరు కాలేజీకి ఆలస్యంగా వస్తున్నారని నేను రాను.
నేను ఒక ఉపాద్యాయుణ్ణి. ఇంటా.. బయటా.. కాలేజీలో ఒకరికి చెప్పాల్సిన వాణ్ణి. కాని ఒకరితో చెప్పించుకోవడం నాకిష్టముండదు
అయినా కాలేజీ డైరీ.. టీచింగ్ నోట్స్ రాయడం మన విధి. అదొక రకంగా మన మంచికే.. పిల్లలకు పాఠాలు చెప్పడంలో.. సకాలంలో సిలబస్ పూర్తి చేయడంలో సహకరిస్తుంది.
జీవితమైనా.. కాలేజీలో పాఠాలు చెప్పడమైనా ఒక ప్రణాళిక లేకుండా ఎలా ముందుకు సాగగలం..?
అవునూ.. జీవితమంటే గుర్తుకు వచ్చింది మేడం.. మీ గురించి చెప్తామన్నారు.. చెప్పనే లేదు..
ఒక సోదరుడిగా సలహా ఇద్దామని అంతకంటే మరే ఉద్దేశ్యం లేదు.. మీకు అభ్యంతరం లేకుంటేనే..” అన్నాను . ఎలాగూ ఇంద్రాణికి సహాయపడాలనే ఆలోచనతో..
ఇంద్రాణి కాసేపు ఆలోచనలో పడింది..
“సార్.. మా నాన్న గారు అర్థంతరంగా ఆక్సిడెంటులో పోయారు. ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాడు. కంపెనీ నుండి ఆర్ధిక సాయం అంతంత మాత్రంగానే అందింది.
అప్పుడు నేను ఇంటర్మీడియట్‍లో ఉన్నాను. మా అక్కయ్య బి.యి.డి. చేస్తోంది.. అన్నయ్య డిగ్రీ చేసి గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.
ఇక ఇంటి భారమంతా అమ్మ మీద పడింది. కుట్టుమిషన్ మాజీవనాధారమైంది. అమ్మ దాదాపు ఐదారు సంవత్సరాలు కష్ట పడింది.
అన్నయ్యకుద్యోగమొచ్చింది. మేమెంతగానోసంతోషించాం. కాని మా సంతోషం ఆట్టే కాలం నిలువలేదు.
మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి అతన్ని ఎగరేసుకు పోయింది. అమ్మ, చెల్లి అనుబంధాలు తెంచుకొని మాకు దూరమయ్యాడు అన్నయ్య.
అమ్మ ఏడ్వని రోజంటూ లేదు. తిరిగి కుట్టు మిషన్ చేతికొచ్చింది.
కొన్నాళ్ళకు అక్కయ్యకు టీచర్ ఉద్యోగమొచ్చింది. మా కష్టాలు తీరాయి. అక్కయ్య నన్ను చదివించింది. నేను సర్వీసు కమీషను ద్వారా లెక్చరర్‍గా ఎన్నికయ్యాను. ఇప్పుడు మాకు డబ్బు సమస్య లేదు. కాని మా అమ్మ మా పెళ్ళిళ్ళ మాట ఎత్తదు. మీరు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే నాగతేం కాను? అంటూ ఏడుస్తూంది. నన్ను కాదని మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే చస్తానని బెదిరిస్తూంది.
మా అన్నయ్య చేసిన ద్రోహం మాకు మానని గాయంగా మారింది.
మగజాతి మీద నమ్మకం పోయింది. మాఅక్కయ్య పెళ్లి విషయమే మర్చిపోయింది. అక్కయ్యకు పెళ్లిగాకుండా నేనెలా చేసుకోను?..
ఫణీంద్రలాంటి మృగం బారిన పడే ప్రమాదాన్ని తప్పించు కోవాలని.. ఒకవేళ తెగించి చేసుకున్నా నాజీవిత భాగస్వామి సైతం నన్ను మోసం చేయడనే గ్యారంటీ లేదు.. అటు అమ్మా దక్కదు. అనే భయం నన్ను మరో వంక వేధిస్తోంది” అంటూ కంట తడి పెట్టింది.
తల్లి పిల్లల సౌఖ్యం కోరుకోవాలి గాని తన సౌఖ్యం కోసం పిల్లల జీవితాలను నాశనం చేస్తుందా.. ఆమె తల్లి కాదు పిల్లల పాలిటి పిశాచి.. అని మనసు కుత, కుతలాడింది. మరో పక్క ఇంద్రాణిని చూస్తుంటే జాలేసింది. ఆమె అనుభవాలే ఆమెకు శాపాలయ్యాయి. జీవితమంటే భయమేర్పడింది. ఈ జీవితానికింతే చాలని సరిపెట్టుకుంటోంది. కాని అది సరియైనది కాదని నా అభిప్రాయం.
ప్రకృతినెదిరించి ఎదురీదటం.. సామాన్యులకు సాధ్యం కాదు. ఉప్పూ కారం తినే మానవ మాత్రులకు అంత సులువు కాదు. అని ఆలోచిస్తూ..
“మీనిర్ణయం సరియైనది కాదు మేడం.. జీవితమంటే సర్దుకు పోవడం.. సరిజేసుకోవడం. మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి దొరకినప్పుడు నిరాకరించకండి” అంటూ నాకు తోచింది చెప్పాను.
(సశేషం)
No comments:
Post a Comment