సంక్రాంతి సంబరాలు - అచ్చంగా తెలుగు

సంక్రాంతి సంబరాలు

Share This
       సంక్రాంతి సంబరాలు
వై.ఎస్.ఆర్.లక్ష్మి
            
రంగులీను రంగవల్లులు రమణులు తీర్చగా
            గుమ్మడిపూలతో గొబ్బియలందు కొలువుదీరగా
            పచ్చటి తోరణాల వాకిళ్ళు,పసుపుతో అలరిన గడపలు
           డూ డూ బసవన్నలు సన్నాయితో ఆడిపాడగా
           హరినామస్మరణతో హరిదాసుల హంగామా
          చీకటిని పారద్రోలే భోగి మంటల చిటపటలు
            కన్నెపిల్లల ఆటలు,కడుయింపైన గొబ్బి పాటలు
  ఇతిహాసాల ఇతివృత్తాలతో ఇంతులు 
            బొమ్మలకొలువుల పేరోలగములు పేర్చగా
           బోసినవ్వుల బుజ్జాయికి భోగిపండ్లతో దీవెనలు
          కొత్తకుండలో పొంగళ్ళు,కొత్త అల్లుళ్ళ కొంటె చేష్టలు
          కొత్త బియ్యపు పాయసం,కొత్త బెల్లపు అరిసెలు
         నిరుపమాన నిత్య నూతన రుచులు నోరూరించగా
          పొలాలు దున్నే హలాలకు,గోమాతలకు పూజలే చేయగా
          సాగివచ్చు సస్యరమ సాగురైతుకు సంతోషాన్నివ్వగా
         కోడిపందేల సమరాలు,యెడ్ల బండ్ల పోటీలు
         గాలిలో తేలే రాయంచలా గాలిపటాల విన్యాసాలు
         బంధు మిత్రుల ఆగమనం ,ఇల్లంతా సందడులు
         సంక్రాంతి పండుగ సంబరాలు,వెల్లి విరిసే సంతోషసుమాలు.
        *******

No comments:

Post a Comment

Pages