ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -26
రెడ్లం రాజగోపాలరావు
విశ్వరూప సందర్శన యోగం
11వ అధ్యాయము
శ్రీ భగవానువాచ:
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసియన్మమ
దేవా అప్యస్యరూపస్య నిత్యం దర్శన కాంక్షిణః
52 వ శ్లోకం
నా యొక్క ఏ రూపమును నీవిపుడు చూచితిచో అది మహాదుర్లభమైనది. దేవతలు కూడా నిత్యము దానిని దర్శనము చేయగోరుచుందురు.
భగవంతుని స్వరూపమును సామాన్యులెవరూ దర్శింపజాలరు. పూర్ణమైన హృదయనిర్మలత, అనన్య భక్తిగలవారు మాత్రమే దానిని దర్శింపగలరు. అరుణోరణేయాన్ మహితో మహియాన్ చిన్న అణువు మొదలు బ్రహ్మాండమంతానిండి నిబిడీకృతమైన భగవంతుని విరాడ్రూపము చూచుటకు ప్రతిమానవుడు స్త్రీ, పురుష బేధం లేకుండా అర్హత కలిగియున్నారు. బాహ్యమైన ఆకర్షణ వ్యామోహము వలన మనసు అపరిశుద్ధమై ప్రత్యగాత్మ దర్శనము కాకున్నది. యమ, నియమాది అష్టాంగ యోగాలు తీవ్ర వైరాగ్యం, ప్రేమ పూరితమైన అంతఃకరణ మొదలగు మంచి గుణములవలన బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి జరిగి విరాట్పురుషుని దర్శించవచ్చును. నిరంతర సాధన వలన జ్ఞాననేత్రం తెరుచుకొని సూదిమొన మోపినంత సూక్ష్మంలో దర్శనమిచ్చిన భగవంతుడు విశ్వమంతానిండి, వ్యాపించి విశ్వరూప సందర్శన యోగాన్ని కలుగజేస్తున్నాడు. ఈ విషయంలో భగవంతునికి ఏ విధమైన బేధంలేదు. ఆయన నిజమైన సమతావాది.
భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున
జ్ఞాతుంద్రష్టుంచతత్త్వేన ప్రవేష్టుంచ పరన్తప
- 54వ శ్లోకం
అనన్య భక్తి వలననే మనుజుడు పరమాత్మను సందర్శింపగల్గునని యిచట వచింపబడినది భక్తియను పదమునకు అనన్య అను విశేషము చేర్చుటవలన ఇతరములగు ప్రాపంచిక పదార్థములపై ఆశక్తినుంచక కేవలము పరమాత్మయందే అనన్యమగు ప్రేమ, అనురాగము, ఆశక్తి కలిగియుండ వలెను పరమాత్మ తప్పా అన్య వస్తువును అభిలషింపని భక్తి అనన్య భక్తి. అట్టి అనన్య భక్తియే భగవంతుని సాక్షాత్కరింపజేయుటకు ఏకైక ఉపాయము.
అట్టి అనన్య భక్తిచే భగవంతుని తెలుసుకొనుటకు,చూచుటకు, ప్రవేశించుటకు శక్యమగునని పేర్కొనబడినది. ప్రారంభమున మనుజునకు భగవంతుడుట్టివాడను పరిజ్ఞానముకలుగును. తదుపరు అభ్యాసవశమున భక్తుడు భగవంతునకు సమీపముగా వచ్చి ప్రత్యక్షముగా దర్శింపగల్గును. భగవద్విషయమై ఆతనికేమాత్రము సందేహముండజాలదు.
అటుపిమ్మట అభ్యాసమినుమడించి క్రమముగానాతనియందు ఐక్యమైపోవును. ఉప్పసముద్రమున లయించినట్లు వర్షబిందువువాగులో కలియునట్లు భక్తుడు భగవంతునిలో విలీనమైపోవును. సాయుజ్యస్థితిలో భక్తునికి, భగవంతునికి తేడాలేదు.ఇది పూర్ణ అద్వైత స్థితి. కేవలము వేద పఠనాదులచే ముక్తికలుగునని వచించినచో చదువురాని వారు ఆ కార్యముచేయజాలరు.కేవలము తపస్సులచే, యజ్ఞములచేగాని ముక్తి కల్గుననివచించినచో అవియును అందరికీ అందుబాటులో లేవు. కేవలము దానములచే మోక్షము సిద్దించునని చెప్పినచో బీదవారికి అందుబాటుకాదు. భక్తిచేతనే భగవద్దర్శనము కలుగునని చెప్పుటవలన ఇది సర్వులకు అందుబాటులో ఉండి ఆచరణీయమైయొప్పుచున్నది. సర్వులయెడలా సమానత్వము భగవంతునియొక్క గొప్ప గుణము.
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సంగ వర్జితః
నిర్వైరస్సర్వ భూతేషుయస్సమామేతి పాణ్డవ
- 55వ శ్లోకం
అర్జునా... ఎవడు నాకొరకే కర్మలను చేయునో, నన్నుపూర్తగా నమ్మియుండునో, సమస్తదృశ్య పదార్థములందు సంగమును విడిచివేయునో, సమస్త ప్రాణులందు ద్వేషములేకయుండునో అట్టివాడు నన్నుపొందుచున్నాడు.
భగవంతుని ఎవరు పొందుతున్నారో ఇక్కడ చక్కగా వివరించబడింది. సద్గుణములను వచించి, వానినెవడుగల్గియుండునో అతడు తప్పక భగవత్సాయుజ్యమును బడయగలడని పరమాత్మ చెప్పుచున్నాడు. ఇచట జాతి,మత,కుల విచక్షణ ఏమియునులేదు యోగ్యతయే ప్రధానము ఔషదమును ఎవరు తాగినా రోగమునయమగును గీతయొక్క ఉన్నతికి యిట్టి సార్వజనిక భావములే కారణములు.
దైవ సంబంధములగు పూజ, జప, ధ్యానాదులు గావించువాడు, ఏ కార్యముచేసిననూ భగవదర్వితము జేయువాడు క్రమముగా చిత్తసుద్ధినిపొంది, ఆత్మజ్ఞానముపొంది, మోక్షమునుపొందును. మనుజుడు దైనందిన కార్యములన్నీ భగవదర్పిత బుద్ధితో చేయ అవి దైవపూజగా పరిణమించిపోవును.
మత్పరమః - భగవంతునే పరమ ప్రప్యముగా, పరమ లక్ష్యముగా తలచి దైవతత్పరుడైయుండువాడు. దృశ్య పదార్థములన్నియు నశ్వరములు అవి బంధ విముక్తి కలిగింపజాలవు. పరమాత్మ యొక్కడే సద్వస్తువు.
మద్భక్తః పరమానందప్రదుడగు భగవంతునియందే అతిశయభక్తి కలిగియుండవలెనుగాని, ఇతర పదార్థమందుగాదు. భగవద్భక్తిచే అచిరకాలములో జీవుడు పరమాత్మ పదమునొందగలడను సత్యమిచట వచించబడినది.
సంగవర్జితః - సంగమనగా ఆసక్తి (Attachment) దేహాది దృశ్యపదార్థములందు మమత్వము వీడవలెను.అసంగమను పదునైన ఖడ్గముతో సంసార వృక్షమును సమూలముగా భేదించవలెనని భగవానుడానతిచ్చెను. సంగరాహిత్యమువలన ముక్తినిపొందగలడని ఇచట వచించెను
నిర్వైరిస్సర్వభూతేషు- సమస్త ప్రాణికోట్ల ఎడల ప్రేమ, దయ, ద్వేషరాహిత్యము, ఏ కొన్ని ప్రాణులయందోకాదని, సమస్త భూతకోటి ఎడల ప్రేమ, కరుణ, దయ, గలిగియుండవలెనని తెలియుచున్నది.
గీతయందీశ్లోకము చాలా ముఖ్యమైనది. శ్రీ శంకరాచార్యులవారు గీతయందలి ఈ శ్లోకము సర్వోత్కృష్టమైనదని, సారభూతమైనదని తెలిపియున్నారు.
ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
9482013801
No comments:
Post a Comment