సుబ్బుమామయ్య కబుర్లు
వస్తువుల భద్రత
పిల్లలూ..ఎలా ఉన్నారర్రా..
మీ అమ్మా, నాన్నలు కాని మీకు తెలిసిన ఇతరులు కాని ఏదైనా వస్తువులను వెతుక్కోడం గమనించారా? దానిక్కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం.
నిజమే ఒక వస్తువు విలువ దాని అవసరం పడినప్పుడే తెలుస్తుంది. ఉదాహరణకు మీరేమైనా ముఖ్యమైనది రాయాలనుకోండి అప్పుడు పెన్సిల్ కాని పెన్ను కాని కనబడకపోతే మీకెలా ఉంటుంది? అర్థమైందా!
కొంతమంది సరిగ్గా బయటకెళ్లే ముందు తాళంచెవుల కోసం, బ్యాంకుకు వెళ్లాక పెన్ కోసం, స్కూలుకు వెళ్లాక టీచర్ వచ్చేముందు ఇంట్లో హో వర్క్ చేసిన బుక్ కోసం ఇలా ఏదో దానికోసం వెతుకుతూనే ఉంటారు. మనం నిత్యం ఉపయోగించే, మనకు కావలసిన వస్తువులను శ్రద్ధగా ఒక దగ్గర పెట్టుకోవాలి. అవి ఎంత చక్కగా పెట్టుకోవాలంటే, చీకట్లో అయినా మనకు ఆ వస్తువు కావలసి వస్తే సరాసరి వెళ్లి తెచ్చుకోగలగాలి.
కొంతమంది పుస్తకాల సంచిలో పుస్తకాలు, కంపాస్ బ్యాగ్ ఎంత చక్కగా అమర్చి పెట్టుకుంటారంటే, అలా చూస్తూ ఉండ బుద్ధవుతుంది.
మీకో విషయం చెబుతానే-
నా చిన్నప్పుడు మనోహర్ అని నా స్నేహితుడు ఉండేవాడు.
వాడు పుస్తకాలకి చక్కగా అట్టలేసుకుని బ్యాగు సర్దుకోవడం దగ్గర్నుంచి, మడత నలగని యునిఫాం వేసుకుని స్కూలుకొచ్చేదాకా చూడ్దానికి ఎంతబాగా ఉండేదో! ఇన్నాళ్లకి మళ్లీ వాడు కనిపించాడర్రా. నన్ను వాళ్లింటికి పిలిచాడు. వెళ్లి చూద్దునుకదా, వాళ్లింట్లో ఎక్కడి వస్తువులు అక్కడ అందంగా అమర్చి ఉన్నాయి. వాడు వాడే స్కూటర్, ఇంట్లోని టీ వీ, ఫ్రిజ్ అన్నీ నిన్ననో మొన్నో కొన్నట్టున్నాయి. వాటిని కొత్తవాటిలా ఎలా ఉంచగలుగుతున్నావని అడిగాను. దానికి వాడు- సెలవు దొరికినప్పుడల్లా వాటిని శుభ్రపరచుకుంటూ ఉంటానని, జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడు. అలా భద్రంగా చూసుకుంటే ఉపయోగమేంటో తెలుసా పిల్లలూ..ఒకటి మన అవసరానికి ఉపయోగపడతాయి. రెండు పాడవవు. వస్తువులు పాడయితే ఆ సమయానికి మనకు ఉపయోగపడవు పైనుంచి సరిచేయించడానికి డబ్బు కర్చవుతుంది. బోలెడంత డబ్బెట్టి కొంటాం కదా! ఆమాత్రం జాగ్రత్త ఉండాలర్రా!
మనోహర్ కి ఆ అలవాటు ఒక్కసారిగా రాలేదు. చిన్నప్పట్నుంచి అలవరచుకున్నదే!
మీరు కూడా మీ వస్తువుల పట్ల శ్రద్ధా, జాగ్రత్తా కలిగి ఉంటారు కదూ!
ఉంటానర్రా!
మీ సుబ్బుమామయ్య.
No comments:
Post a Comment