అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) నవల- 15
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. అందువల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. . మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. తండ్రి కోరిక మేరకు ఆమె డయానె ద్వారా డైట్ కంపెనీలోకి దూరి బుషీట్రాట్ అన్న వ్యక్తి అక్కడ పని చేస్తున్నట్లు కనుక్కొంటుంది. ఆ విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా, పక్కబట్టల కోసం అటక మీద పాత బీరువాలో వెతుకుతున్న ఎఫీని బ్లాక్ విడో సాలీడు కరిచిందని గమనించి డాక్టరు వద్దకెళ్ళి చికిత్స చేయిస్తుంది. జబ్బుపడ్డ ఎఫీ కోలుకొనేవరకు నాన్సీ మార్చ్ భవంతిలోనే ఉండిపోతుంది. ఆ రోజే గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా కోరుతూ ఉత్తరం వ్రాస్తుంది. భోజనాల సమయంలోమార్చ్ తన కుటుంబవిషయాలను నాన్సీకి చెబుతాడు. ఆ రాత్రి అటకమీద వెతుకుతుంటే అనుకోకుండా ఆమె టార్చీలైట్ ఆరిపోవటం, అదే సమయంలో ఎక్కడినుంచో కొన్ని విపరీత శబ్దాలు వినిపించటం జరుగుతుంది. ఎఫీ కోలుకొన్నాక యింటికొచ్చిన యువ గూఢచారి, తన తండ్రితో కలిసి బుకర్ ఫాక్టరీకి వెళ్ళి పట్టుకండువాలు చేసే విధానాన్ని గమనిస్తుంది. తరువాత తండ్రికోరికపై ఒక ప్రణాళిక ప్రకారం డయానె యింటికి వెళ్ళి, తనకు తెలిసిన ఒక పాపకు డయానె చెల్లెలుకి బిగువైన బట్టలను యిమ్మని అడుగుతుంది. ఆమె లోనికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని వారి హాబీలేమిటో గమనిస్తుంది. డయానె యిచ్చిన పాత బట్టలతో ప్లెజెంట్ హెడ్జెస్ కి చేరిన నాన్సీ, మార్చ్ అనుమతితో అటక మీద ఉన్న కొన్ని పాత సీసాలతో డైట్ ఫాక్టరీలోకి అడుగు పెడుతుంది. అక్కడ సీసాలను డైట్ కి చూపెడుతున్న ఆమెకు బుషీట్రాట్ కనిపిస్తాడు.వెంటనే బుషీట్రాట్ ను అనుసరిస్తూ ప్రయోగశాల్లోకి ప్రవేశించిన నాన్సీ అక్కడ గాజుకుప్పెల్లో ఉన్న రసాయనిక ద్రవాన్ని చిన్న సీసాలో నింపుతుంది. ట్రాట్ తాళాలేసి వెళ్ళిపోవటం వల్ల లోపల యిరుక్కుపోయిన ఆమె అక్కడ నుంచి అతి కష్టంపై తప్పించుకొని తన యింటికి చేరుకొంటుంది. తనకోసం కంగారుపడుతున్న తండ్రికి తానెక్కడికెళ్ళిందీ చెప్పి, ప్రయోగశాలనుంచి సేకరించిన ద్రావకాల సీసాలను తండ్రికిస్తుంది. తాను ఎఫీకి తిరిగి వస్తానన్న మాటిచ్చినందున, ప్లెజెంట్ హెడ్జెస్ దగ్గ్రర తనను దింపమని తండ్రిని కోరుతుంది. ఇక యిక్కడ నాంసీ రాలేదని కంగారుపడుతున్న ఎఫీకి పొదలమాటునుంచి ఆ యింటివైపు వస్తున్న అగంతకుణ్ణి గమనించి భయపడుతుంది. మార్చ్ ఆమెకు ధైర్యం చెప్పినా, అగంతకుడి అడుగుల చప్పుడు తాను కూడా విన్నందున పరీ్క్సించటానికి అటకమీదకు వెడతాడు. కానీ అతనికి ఎవరూ కనిపించరు. ఆ రాత్రి తండ్రితో వచ్చిన నాన్సీకి విషయం చెబుతాడతను. మరునాడు యింటికి వచ్చిన యువ గూఢచారిని ఆమె స్నేహితురాళ్ళు విందుకు ఆహ్వానిస్తారు. వారితో బయల్దేరుతున్న ఆమె తన చిరునామాకి వచ్చిన ఒక కవరు చూసి దాన్ని చింపుతుంది. . ఆ తరువాత కధ ఏమిటంటే. . . )
@@@@@@@@@@@@
కవరులోంచి ఉత్తరాన్ని బయటకు తీసి ఆమె బిగ్గరగా చదివింది.
"మిస్ డ్రూ,
మేము ప్రచురించిన పాటలకు చెందిన బెన్ బాంక్స్ కి సంబంధించి, మీరు అడిగిన ఎలాంటి సమాచారాన్ని మేమివ్వలేము. ఇలా తెలియపరచినందులకు మన్నించండి.
- ఇట్లు
మిల్టన్ జెన్నర్"
"బాగుంది. ఎంత నిబ్బరంగా చెప్పాడు" జార్జ్ వ్యాఖ్యానించింది. "ఆ సమాచారంలో అంత కొంపలంటుకు పోయేదేముందో నాకైతే అర్ధం కాలేదు."
"ఇలా జరుగుతుందని నాకు తెలుసు" నాన్సీ నెమ్మదిగా బదులిచ్చింది. "వదిలిపెట్టను. జెన్నర్ ని వ్యక్తిగతంగా కలవటానికి అనుమతి కోరుతూ ఫోను చేస్తాను."
ఆమె సంగీత సంస్థ ఫోను నంబరుని వెతికి పట్టుకొని డయల్ చేసింది. జెన్నర్ ఫోనుల ద్వారా అనుమతి యివ్వరని జవాబు వచ్చింది. అతన్ని కలవాలంటే అనుమతి కోరుతూ ఉత్తరం వ్రాయాల్సి ఉంటుంది.
నిరాశ చెందిన ఆమె తన స్నేహితురాళ్ళకు జరిగినదంతా చెప్పింది. "నేను ఉత్తరం వ్రాసేవరకూ ఆగుతారా?" వారిని అడిగింది.
"కుదరదు" బెస్ బదులిచ్చింది. "మేమెళ్ళి హన్నాతో మాట్లాడుతాం."
"మనకోసం బెస్ మంచి రుచికరమైన వంటకాలు చేస్తుంది" జార్జ్ తన బంధువుని ఆటపట్టిస్తూ అంది.
జెన్నర్ తో అతి ముఖ్యమైన విషయంపై చర్చించదలచుకొన్నట్లు నాన్సీ ఆ ఉత్తరంలో తెలిపింది. అతనితో 'వీలైనంత త్వరగా మాట్లాడే వీలు కలిపించగలరంటూ' ఆ సంస్థను ప్రశంసలతో ముంచెత్తింది. నాన్సీ ఉత్తరం ముగించాక తన స్నేహితురాళ్ళను పిలిచింది.
"ఈ ఉత్తరం పోస్టు చేశాక భోజనానికి వెళ్దాం" అంటూ నాన్సీ సూచించింది. "ఈ రోజు రాత్రి నాతో ఉండటానికి ప్లెజెంట్ హెడ్జెస్ కి వస్తారా? ఎఫీకి కొంత విశ్రాంతి అవసరం అనిపిస్తోంది."
"ఆ ప్రాంతం ఎలాంటిదైనా చూట్టానికి ఆహ్లాదంగా ఉంటుంది" బెస్ వ్యాఖ్యానించింది. " అక్కడ లతలంటే నాకిష్టం."
"ఓ! ఒకటి, రెండు దయ్యాలున్నా నిన్నేం చేయలేవు" జార్జ్ ఎకసక్కెంగా అంది. "ఇక వెళ్దాం."
మంచి విందు తరువాత నాన్సీ అమ్మాయిలను వాళ్ళ యింటి దగ్గర దింపింది. "నేను నాలుగింటికొచ్చి తీసుకెడతాను" అని చెప్పింది.
ఇంటికెళ్ళే దారిలో ఆమె చాలా పనులు పూర్తిచేసుకొంది. వాటిలో మార్చ్ యింటికి కావలసిన కిరాణా కొనుగోళ్ళు కూడా ఉన్నాయి. మనసిచ్చిన ప్రేరణతో పేరున్న మ్యూజిక్ స్టోరు దగ్గర ఆగి బెన్ బాంక్స్ బాణీ కట్టిన అన్ని పాటల కాపీల గురించి ఆమె అడిగింది.
" మూడు మాత్రమే ఉన్నాయండీ!" స్టోరు అసిస్టెంట్ చెప్పాడు. " గాలిపాటకు సంబంధించిన రికార్డులు, షీట్ మ్యూజిక్ రెండూ ఉన్నాయి. అదిగాక మరొక రెండు కొత్త పాటలు ఉన్నాయి. ఈ మధ్యనే ఆ పాటలు మార్కెట్లోకి వచ్చాయి."
" ఇవి ఎప్పుడు ముద్రించబడ్డాయి?"
" ఇటీవలే! అవి ఒకదాని తరువాత ఒకటి బయటకొచ్చాయి. బెన్ బాంక్స్ ఇంత తక్కువకాలంలో యిలాంటి గొప్ప పాటలకు బాణీలు కూర్చాడంటే చాలా నిబ్బరం కలవాడై ఉండాలి."
నాన్సీ కూడా అదే అనుకొంది. కానీ యింత తక్కువ సమయంలో ఆ పని సాధించాడంటే మరొకప్రక్క అనుమానాస్పదంగాను ఉంది. షాపులోనే ఆ పాటలను ప్లేయర్ లో పెట్టి విన్నది. కానీ మార్చ్ యింట్లో ప్లేయర్ లేదని రికార్డులను కొనలేదు. ఆ పాటల షీట్ మ్యూజిక్ ను మాత్రం కొని, అక్కడే పియానో ముందు కూర్చుని, అంతకు ముందు తాను వినని ఆ రెండు పాటల బాణీలను వాయించింది.
" మీరు బాగా వాయిస్తున్నారండీ!" షాపు కుర్రాడు మెచ్చుకొన్నాడు.
నాన్సీ చిరునవ్వుతో తను కొన్న షీట్ మ్యూజిక్ ధరను చెల్లించి షాపునుంచి బయటకొచ్చింది.
ఆమె బుర్ర చురుగ్గా పనిచేస్తోంది. తాను షాపులో వాయించిన బాణీలు గతంలో మార్చ్ ఈల వేస్తూ మెచ్చుకొన్న శ్రావ్యమైన గీతాల్లోని భాగాలే! అకస్మాత్తుగా ఆమెకు ఒక ఆలోచన తట్టింది.
" తనకు బెన్ బాంక్స్ కి చెందిన సమాచారాన్ని యివ్వటానికి జెన్నర్ నిరాకరించటానికి కారణం, ఈ బాణీలను బెన్ బాంక్స్ అన్నవాడు ఫిప్ మార్చ్ నుంచి కొట్టేశాడని ఈ పబ్లిషర్ కి తెలిసి ఉండటమేనా?"
నాలుగు గంటలకు బెస్, జార్జ్ లను తీసుకొని మార్చ్ యింటికి వచ్చింది నాన్సీ. ఎఫీ వాళ్ళని గుమ్మం దగ్గరే పలకరించింది.
" ఎఫీ! ఇక్కడకు వచ్చాక నువ్వు యింటికి వెళ్ళలేదు కదూ! ఈ రాత్రికి దారిలో సినిమాలు చూసుకొని యింటికి వెళ్ళు. మేము ముగ్గురం రాత్రికి యిక్కడే ఉండి అంతా చూసుకొంటాం."
యువ గూఢచారి మాటలకు ఆనందంతో ఎఫీ ముఖం వెలిగిపోయింది. నిమిషాల్లో హడావిడిగా దుస్తులను మార్చుకొంది. వారందరి దగ్గర సెలవు తీసుకొని హుషారుగా బయల్దేరింది.
బెస్, జార్జ్ ఆ రాత్రి వంట చేసే బాధ్యతను తీసుకొన్నారు. నాన్సీ పెద్దాయన్ని కలవటానికి వెళ్ళింది. అతను మొదటి అంతస్తు హాలు పైకప్పుకి ఉన్న పగులుకి సిమెంట్ పూస్తున్నాడు.
" మీకొకటి చూపించాలనుకొంటున్నా" అంటున్న ఆమె చేతిలో బాణీలను ముద్రించిన కాగితాలను చూశాడు. వెంటనే చేస్తున్న పని ముగించి కిందకు దిగి ఆమె వద్దకొచ్చాడు.
" వీటిని షీట్ మ్యూజిక్ అంటారు. ఒకసారి చూడండి. సంగీత దర్శకుడు కూర్చిన స్వరాలను సంగీత కోడ్ భాషలో వ్రాసి ముద్రిస్తారు. అవే యివి. ఇవి మీ అబ్బాయి కూర్చినట్లే ఉన్నాయా?"
" నీకు ఆశీస్సులమ్మా!" అంటూ ఆమెను దీవించి, ఆమె చేతిలోని బాణీ కాగితాలను తీసుకొని చూశాడు. " నాకు తెలీదమ్మా! సంగీతాన్ని నేను చదవలేను."
" సరె! నేను ఈ బాణీలను పాడి వినిపిస్తాను."
ఆమె పాడి వినిపించాక పెద్దాయన ఉద్రేకంతో అరిచాడు.
" అవి ఫిప్ కట్టిన బాణీలే! నేను ఆ కిలాడీ బెన్ బాంక్స్ ని కోర్టుకి లాగుతాను."
నాన్సీ తనకొచ్చిన ఉత్తరం గురించి, దానికి తాను వ్రాసిన సమాధానం గురించి అతనికి చెప్పింది.
" మంచిదమ్మా! ఈ పాటలు మా మార్చ్ వంశానికి చెందినవన్న విషయం బయటకు రావాలి. ఆ సంగతి ప్రపంచానికి తెలియాలని ఆశపడుతున్నాను."
" జెన్నర్ ని కలవటానికి ముందు నేను సరియైన ఋజువుని సంపాదిస్తాను. రేపు మరొకసారి అటకమీద వెతుకుతాను."
రాత్రి నాన్సీ స్నేహితురాళ్ళిద్దరూ చేసిన భోజనాన్ని పెద్దాయన మెచ్చుకొన్నాడు.
"ఈ వంటకాలు నా పాత రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. సాధారణంగా కుటుంబాల్లో బంధువులందరూ కలిసి చేసుకొనే విందుల్లో యిలాంటి వంటకాలనే తయారుచేస్తారు" అంటూ ముసిముసిగా నవ్వుకొన్నాడతను.
భోజనాలయ్యాక నాన్సీ సుశాన్ని గదిలో మంచంపై పడుకోబెట్టింది. కానీ పాప నిద్రపోవటం లేదు. తనకు వరుసగా కధలను చెప్పమని మారాం చేస్తోంది.
" రాజుగారి కథ చెప్పు" అని పాప అడిగింది.
" సరె! అనగనగా. . ." చెప్పబోయిన యువ గూఢచారి గొంతు అకస్మాత్తుగా మూగబోయింది. ఆమె దృష్టి కిటికీలోంచి కనిపించే తోట వైపు ఉందని పాప గమనించింది.
" ఎందుకు ఆపేశావు?" పాప అసహనంగా అడిగింది. " ఏమైనా చూశావా?"
నాన్సీ ఆమెకు బదులీయలేదు. మంచం మీదనుంచి దూకి పరుగున కిటికీ దగ్గరకు వెళ్ళింది.
( తరువాయిభాగం వచ్చే సంచికలో)
No comments:
Post a Comment