బాధ...(అలక్ష్యం) !
పి.వి.ఎల్.సుజాత
మనసు బాధని
తెంచుకుని గగనానికి పారిపోయింది.
ఏకాంతంలో నేను
భారాన్ని దింపుడు కళ్ళెం చేసి
మౌనాన్ని దూదిపింజలా ఎగరేయాలని వుంది.
సంతోషమైనా.. దుఖఃమైనా..
నా వెనుక నువ్వు వున్నావనే "నీడని అదిమిపెట్టి.."
అవతలికి చేరాలని వుంది.
తడి ఆరని హృదయంపై
కత్తి గాట్లు చేసిన కాలాన్ని బంధించి
సజీవంగా సమాధి చెయ్యాలని వుంది.
పడతిగా ఇన్నాళ్ళు
పరిగణలోకి రాకున్నా
పరుగాపక నిత్యం పోరాడుతూనేవున్నా..
అలసిన మనసుని వదిలి
నిత్య నిశీధిలో మమేకమవ్వాలనుంది.
సమస్తం నాకని విర్రవీగిన
నా మదికి తగిన శిక్షే పడిందిని
తెలుసుకునే లోపు... ఙ్ఞాపకాలన్నీ
తెంచుకుంటూ... ఒంటరిగా గడపాలని వుంది.
***
No comments:
Post a Comment