జర పయిలం బిడ్డా!
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు.
జర పయిలం బిడ్డా!
ఇన్నాళ్లూ పల్లె గుండెలో
వెచ్చగ నిదరోయినవ్
మనోళ్ల మధ్యన
భరోసాగా బతికినవ్
గిప్పుడు ఇంకింత మంచిగ బతకనీకి
పట్నం పోతనంటున్నవ్
జర పయిలం బిడ్డా!
గాడ పైసలే అంతానంట
మంచి సెడ్డా ఉండదంట
టీ వీల రోజుకోటి సూత్తా ఉంటే
గుండె సెరువైతాంది.
గది మనుషుల రూపాలల్ల
పులులుండే సోటంట
ఊర్ల సెప్పుకుంటుంటే ఇన్న
జర పయిలం బిడ్డా
నీ మనసుకు సుక్క గాయమైన
ఉ(ఊ)రికొచ్చెయ్.
లేదూ నువ్వు మంచిగ బతకబడ్తే
మనోళ్లకింత సాయం సెయ్యి
నువ్వు దీపం లెక్క
మనూరికి వెలుగు కావాల
చంద్రునిగ వెళ్లి
మాకు అమాస మాత్రం మిగల్చమాకురాయ్య!
***
No comments:
Post a Comment