నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -'కోనసీమ కుర్రోడు'
శారదాప్రసాద్
కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట, అంబాజీపేట. 'కోనసీమ' తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి వ్యవసాయం. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించింది. మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం ఉంది. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడికి వెళ్ళాలి.
ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సంప్రదాయాలు చూడవచ్చు. అతిథి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని "అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోనసీమ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ కనబడుతుంది. వివాహ సంబంధ విషయాల్లో కోనసీమకు చెందిన అమ్మాయిలంటే చాలా డిమాండ్.కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.నేను పనిచేసిన ముమ్మిడివరం కూడా కోనసీమలోని భాగమే!ఇక్కడి వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి.కోనసీమ అంటే గుర్తుకొచ్చేది --పూతరేకులు,కాజాలు,పాలకోవా ..ఇంకా అనేకం .ఒక్క ఆవకాయ పచ్చడినే ఎన్నో రకాలుగా పెడుతుంటారు. ఇవన్నీ మీకు కూడా తెలుసు.నాకు మాత్రమే తెలిసినవి కొన్నిటిని ఇక్కడ మీకు చెబుతున్నాను.నేను అక్కడ పనిచేస్తున్న మూడవ నెలలో(అంటే నాకు మూడో నెల కాదు!),హైదరాబాద్ నుండి ఒక బ్యాంకు ఇన్స్పెక్టర్ వచ్చాడు!మాటల సందర్భంలో ,ఆయన నన్ను"శాస్త్రి గారూ!కోనసీమ దేనికి ప్రసిద్ధి?" అని అడిగారు. నేను తడుముకోకుండా కొబ్బరి బోండాలని చెప్పాను!ఆ సమాధానం విన్న ఆయన--మీకు ఇంకా కోనసీమ అంటే పూర్తిగా అర్ధం కాలేదు!ఆయన రాజుగారు(పేరును చెప్పటంబాగుండదు లెండి!).నన్ను వెంటబెట్టుకొని ఒక ఇంటికి తీసుకొని వెళ్లారు.అదొక పెద్ద భవంతి.వెళ్ళగానే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లిచ్చి ,తువ్వాలు కూడా అందించారు.ఆయన వారి ఇంటికి వస్తున్నట్లు వారికి ముందే తెసిసి ఉండొచ్చు .ఇంట్లో నుంచి మంచి సాంబ్రాణి వాసన వస్తుంది.ఇంతలోనే మాకు జీడిపప్పు ఉప్మా వచ్చింది.నేను మొహమాటం పడుతూనే తిన్నా!అక్కడే ఉన్న 'రత్నాంబ 'తినండి --ఫరవాలేదు ,నేను కూడా బ్రాహ్మణ సంతునే అని చెప్పింది.నా పై అధికారి మోహమాటం లేకుండా తింటుంటే ,నేను మొహమాటం పడటం బాగుండదేమోనని తిన్నాను.ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు--దర్భతో నాలుక కాలుస్తారనే భయంతో !కాసేపు ఆగి రాజుగారు ఆమెతో ఏకాంతంగా ఏదో మాట్లాడి వచ్చారు!వారు ఏం మాట్లాడుకున్నారో కూడా అర్ధం చేసుకోలేనంత అమాయకుడిని కాదు .తర్వాత ఎక్కడ కలుసుకుందామని మాట్లాడాను అని ఆయనే చెప్పాడు.ఇప్పుడు బహిష్టులో ఉందట !అందుకేనేమో ఆమె ఉప్మా వేరొకరితో పంపి ఉంటుంది.వీరిని కళావంతులు అంటారు(భోగం వాళ్ళు అని ఒకప్పుడు అనేవారు,అది ఇప్పుడు నేరం).వీరిలో చాలా పధ్ధతి గలవారే ఎక్కువ!స్నేహితులను, అన్నదమ్ములను,తండ్రీ కొడుకులను,బావా బావమరదులను ..రానిచ్చేవారు కాదు .కొందరైతే బ్రాహ్మణులను ,క్షత్ర్రీయులను మాత్రమే రానిచ్చేవారు!నేను ఉబుసుపోక బ్యాంకు లో పనిచేస్తున్న appraiser చంద్రాన్ని --వారికి ఎంత ఇస్తారు?అని అడిగాను.వాళ్ళ స్థాయిని బట్టి మనమే ఇవ్వాలి!మొన్న వచ్చిన రాజుగారే ఆమెకు ఆ భవంతిని బహుమతిగా ఇచ్చారని చెప్పాడు.ఇటువంటి విషయాల్లో ఇరుక్కుంటే 'చింతామణి' లో భవానీశంకరం లాగా అవుతామని అనిపించి ,బుద్ధిమంతుడనయ్యాను.ఏదో సందర్భంలో ముళ్ళపూడి వారు --ఈ దేశంలో అవకాశం లేక చాలామంది నిజాయితీగా ఉన్నారు 'అన్న మాట చెవిలో మ్రోగింది.ఇక బ్యాంకులో పని నేర్చుకుంటున్నాను. కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాను.ఒక 65-70 ఏళ్ళ స్త్రీ వచ్చింది!ఒక నృత్యభంగిమలో నమస్కారం చేసింది!అప్పట్లో అకౌంట్ ఓపెన్ చేయటం తేలిక.ఒక అప్లికేషన్.introduction ఉంటే చాలు!సరే ఆమె రాగానే ,పేరు అడిగాను--అన్నాబత్తుల బులి వెంకటరత్నం అని చెప్పింది.తండ్రి పేరు అడగగానే --పేరయ్య శాస్త్రి గారని చెప్పింది. అన్నాబత్తుల వారు బ్రాహ్మణుల్లో ఉండరని అనుమానం వచ్చి, మేనేజర్ గారిని అడిగాను.మేనేజర్ గారు-ఆమెను తన వద్దకు పంపమని చెప్పారు.మేనేజర్ గారి రూంలోకి వెళ్ళింది.మేనేజర్ గారు ఆమెను కాఫీతో సత్కరించి ,కుశల ప్రశ్నలు వేసారు .అకౌంట్ ఓపెనింగ్ పూర్తి చేసి ఆమెను బయటకు వెళ్లి మర్యాదగా పంపారు .ఆమె ఆ రోజుల్లో బ్యాంకులో జమ చేసింది లక్షా 10 వేల రూపాయలు.ఇది 1973 లో జరిగిన సంఘటన!ఆమె వెళ్లిన తర్వాత ,మేనేజర్ గారు నన్ను పిలిచి ,కళావంతులకు చాలా మందికి తల్లి పేరే ఉంటుంది.కొద్దిగా పాండిత్యం,నృత్యకళ ఉన్నవాళ్లు - తండ్రి పేరును బ్రాహ్మణుల పేర్లను పెట్టుకుంటారని చెప్పారు!ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో మహాకవి క్షేత్రయ్య సినిమా తీస్తున్నారు.దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు,సినిమా స్టార్ట్ కావటం తోనే చనిపోయారు.తర్వాత మధుసూదనరావు గారు పూర్తి చేశారు!ఈ సినిమాకు నిర్మాతలు--అంజలీదేవి,ఆదినారాయణరావు గార్లు.వాళ్ళు కూడా కళావంతులే కావటం వలన,అన్నాబత్తుల బులి వెంకటరత్నమ్మ గురించి వారికి బాగా తెలుసు,క్షేత్రయ్య పదాలకు నృత్యరీతులను గురించి తెలుసుకోవటానికి మద్రాస్ నుంచి అంజలీదేవి,మధుసూదనరావు,
ఆదినారాయణరావు గార్లు వచ్చారు!వాళ్ళను చూడాలనే నా ఉబలాటాన్ని మేనేజర్ గారికి తెలిపాను. వెంటనే ఆయన తగిన ఏర్పాట్లు చేసారు.70 ఏళ్ళ వయసులో కూడా బులి వెంకటరత్నమ్మ గారు అద్భుతంగా నృత్యరీతులను అభినయించి చూపించారు.దాన్ని కెమెరాలో బంధించుకొని ,సినిమా వాళ్లు మద్రాస్ వెళ్లిపోయారు.నా మనసులో ఆమె చేసిన నృత్యం అలానే మిగిలిపోయింది!మరికొన్ని ముచ్చట్లతో మరో సారి!అంతవరకూ ,శుభం భూయాత్!
***
కోనసీమ గురించి తెలియని చాలా విషయాలు కళ్ళకు కట్టినట్లు వ్రాసారు శారదా ప్రసాద్ గారు.
ReplyDeleteధన్యవాదాలతో,
కోనసీమలోని మీ అనుభవాలను చక్కగా వ్రాసారు!
ReplyDeleteమీ రచనలోని నిజాయితీకి వందనం!
ReplyDeletevery nice
ReplyDeleteముమ్మిడివరంలో నువ్వు ఉద్యోగించినపుడు ఒకసందర్భంలో మనంకలుసుకోవడం జరిగింది. అప్పటి నీ అనుభవాలు నాకు చాలాచెప్పావు. చాల ఇంటరెస్టింగుగా విన్నాను. కొన్ని నవ్వు వచ్చే విషయాలు కూడా చెప్పావు. మళ్ళీ ఇప్పుడు మరిన్ని విషయాలు కోనసీమను గురించి నీరచనద్వార చదవడం ఆనంద దాయకం.
ReplyDeleteముమ్మిడివరంలో నీవు ఉద్యోగిస్తున్నపుడు మనంఒకతూరి కలుసుకోవదంజరిగింది. ఆప్రాంతవిశేషాలు, అక్కడి నీ అనుభవాలు ఎన్నో చెప్పావు. ఇప్పుడు మళ్ళీ "నాకునచ్చిన నాకకధ" ల ద్వారా మనబాల్యంనుండి జరిగిన సంఘటనలు ఒకరకంగాబయోపిఖ్ అనవచ్చు వ్రాస్తూ అందరకు ఆ ఙ్ఞా పకాలను గుర్తుకు తెస్తూ చేస్తున్న నీ రచనులుచాలాబాగున్నాయి. నీఅనుభవాలేకాక, కొంత విఙ్ఞాన దాయక విషయాల ను కూడ జోడిస్తున్నావు.బాగుంది. కొనసాగించగలవు.
ReplyDelete.......VSKHBABURAO.
Excellent narration
ReplyDeleteనమస్తే శారదా ప్రసాద్ గారు.
ReplyDeleteఈ రచనద్వారా ముమ్మడివరంలో మీ అనుభవాలను కళ్ళకి కట్టనట్టు వ్రాసారు.
కేవలం ఈ రచన లక్ష్యం ఇదేనా మిత్రమా.
కోనసీమ .. తెలుగునాట మరో కేరళసీమ. పచ్చని పొలాలు, కొబ్బరితోటలు, పచ్చిగాలులు, మర్యాద మన్ననలు, అభిమానాలు - వీటితో బాటు మీరు చెప్పినటువంటి శృంగారగృహాలు మరియు జూదశాలలు.. వెరసి ఒక అందమైన లోకం అది. పాడిపంటల కొబ్బరిసీమ - కోనసీమని మీరు వర్ణించిన తీరు బావుంది.
ReplyDelete