" ఏంట్రా రామూ , ప్రొద్దున్నే అలా దిగులుపడి కూర్చున్నావు ?" చిరునవ్వు తోనే అడగాడు శివ.
ఇద్దరూ కాలేజీ లో అధ్యాపకులు. ఒకరు ఆంగ్లేయం లో. ఒకరు తెలుగు లో. చిన్నప్పటి పరిచయం వుంది, కానీ ఒకే చోట ఉద్యోగం కావడం సాన్నిహిత్యాన్ని పెంచింది. అదీకాక సాహిత్య చర్చలు వారిని ఇంకా దగ్గర చేసినయి. మూడు రోజుల తరువాత పండగ శలవలు ముగిసి , కళాశాల ఆనాడే మళ్లీ మొదలు అయింది. మొదటి పీరియడ్ ఇద్దరికీ లేక పోవటం తో అధ్యాపకుల గదిలో కలిసారు.
అప్పుడే లోపలికి వచ్చిన శివ ప్రశ్న రాముని ఇంకొంచం ఇరకాటం లో పెట్టింది. ఇంటి విషయాలు ఎలా బయట పెట్టటమా అని. అలా అని ఏమీ లేదు అంటే వూరుకునే తత్వం కాదు శివది. చాలా ఇంక్విజిటివ్ లక్షణం అతనిది. పి. హెచ్డి చేసి నప్పుడు ఇంకా ఎక్కువ అయి వుంటుంది. కానీ మనిషి చాలా మంచివాడు. మనస్సులో కల్మషం లేని వాడు.
జవాబు గా అబద్ధం చెప్పడం ఇష్టం లేదు రాముకి. ఎట్లా మొదలు పెట్టాలా అని ఆలోచనలు ముగియక ముందే, శివ మళ్ళా అడిగాడు, " ఇంటి పైకప్పు ఎలా వేయాలా అని ఆలోచిస్తున్నావా రామయ్యా ," అని, ఓ టీ.వీ. ప్రకటనను అనుకరిస్తూ.
కొంచం నవ్వు వచ్చి , మనసు తేలిక పడింది రాముకి. " ఏం లేదు. పైకప్పు గురించి కాదు కానీ , ఇంటికి పైకప్పు లాగా వుండవలసిన మా బావగారి గురించి ఆలోచిస్తున్నాను. "
" ఏమయింది, మీ బావ గారికి ? ఏదన్నా ఆర్థిక బాధా ? లేక ఆరోగ్య బాధా ? "
" రెండూ కాదు. ప్రవర్తన బాధ. "
" అంటే..."
(2)
" ఇంటిని పట్టించుకోడు. ఇంట్లో భార్యను, పిల్లల్నీ పట్టించు కోడు. నేను నెల నెలా ఇంతే ఇస్తాను. తక్కువ అయితే నేనేమీ చేయలేను. మీ తిప్పలు మీరు పడండి అంటాడు. ఇంట్లో ఓ చిన్న గిన్నె ఇక్కడిది అక్కడ పెట్టడు , తను తాగిన కాఫీ కప్పు తో సహా. ఇష్టమైతే ఇంట్లో తింటాడు, లేకపోతే ఒక్కడూ బయటకు వెళ్లి తిని వస్తాడు. "
మొదలు ఎలా ఆన్న సందిగ్ధమే కానీ, మొదలెట్టాక ఓ వాక్ప్రవాహమే. భావాల, బాధల వరద గట్టు దాటి.
" భార్యే కాదు, పిల్లల్నీ పట్టించుకోడు. యేమి చదువుతున్నారు , యెట్లా చదువుతున్నారు , ఏం ఆడుతున్నారు , వారు యెట్లా వృద్ధి లోకి వస్తారు , యే విషయమూ పట్టదు.
ఆఖరికి వారి పుట్టిన రోజున కూడా ఆ పిల్లల్ని సంతోష పెట్టే ప్రయత్నం చేయడు. అతను ఎంత సంపాదిస్తున్నాడు అన్నది అతనికే తెలుసు. వెనుక కొంచం ఆస్తి కూడా వుంది. అయినా డబ్బు ఆదా చేయాలి , దాచుకోవాలి ఆన్న అలవాటు. ఆఖరికి తన బట్టలు కూడా సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది కూడా అనవసరం.
ఇది ఏమిటీ, అని భార్య అడగకూడదు. అడిగితే ఇంట్లో రభస, రచ్చ. అతనికి నచ్చినట్లు అతను చేస్తాడు. అంతే. ఇల్లు యెట్లా గడుస్తోంది, ఎంత ఖర్చు అవుతోంది , భార్య ఆ లోటు యెట్లా పూడుస్తోంది , అన్నది అతనికి అవసరం లేదు. తక్కువ పడితే, నేను పూడుస్తున్నానా, లేక మా అమ్మ తీరుస్తోందా అని కూడా ఆలోచించడు. అంతే కాదు, బయట ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో ఎలా ఉంటాడో కానీ , ఇంటిదగ్గర ఏ చుట్టుపక్కల వారితో కూడా మాట్లాడడు.
ఎన్ని రోజులు ఇట్లా వేరే వారి మీద ఆధార పడటం , నేను చేసే చిన్న ఉద్యోగం తో ఎలా అని మా చెల్లిలి వ్యధ. అదేకాదు . పిల్లలు పెద్ద వారవుతున్నారు. తండ్రి పాలన అవసరం వుంటుంది.
వారికి తెలిసిన మిగతా పిల్లలు, వారితో వారి తండ్రులు ఎలా వుంటున్నారో చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు మానసిక ఆందోళనకు గురి అయ్యి , సమతుల్యం కోల్పోయే అవకాశం కూడా
వుంది కదా. అలా కాకపోయినా, ఆ పిల్లల ముందు అతను తన గౌరవం పోగొట్టుకుంటున్నాడు కదా ! . రేపు వార్ధక్యం వచ్చిన నాడు ఆ పిల్లలు అతనిని ఆదరించక పోతే ? లేక తండ్రి అడుగుజాడల్లో నడిచి, తల్లిని ఆదరించక పోతే ? ఇన్ని ఆలోచనలు మా చెల్లెల్ని ప్రశాంతత తో వుందనీయటం లేదు. ధైర్యం కోల్పోక బ్రతుకు సమరం లో పోరాడుతున్నా , ఏదో ఒకసారి , ఏదో మాటల్లో దైన్యం
" చూడు రామూ , మనం చడువుకున్నాం కదూ చిన్నప్పుడు. సామ దాన భేద దండోపాయాలు అని. ఆ వాక్యం లోనే ఆ ఉపాయాలని వాడవలసిన వరుస క్రమం కూడా చెప్ప బడింది కదా !"
" నాకు అర్ధం కాలేదు. నీవు ఏమి చెప్పదలుచుకున్నావో ."
" సామం అయిపోయింది, మీ అందరి ద్వారా ఇన్ని సంవత్సరాల ప్రయత్నాలలో , ప్రయాస లో. దానం చేస్తూనే వున్నారు. అతనికి తలవంపులు గా లేదు. ఒకరు చెప్పిన మాట వినడు కాబట్టి, మొదటి రెండూ లేవు," తన ధోరణి లో తను చెప్పుకు పోతున్నాడు శివ. " బేధం, దండన ; ఇహ ఈ రెండూ మిగిలి వున్నాయి. "
" ఇంతకీ మీ బావగారు యేమి చేస్తూ వుంటారు, పేరేమిటి , వివరాలు కొంచం చెప్పు. దానిబట్టి కూడా ఏదన్నా ఉపాయం తదుతుందేమో చూద్దాం," ఆన్నాడు శివ.
రామం చెప్పాడు. ఇంతలో గంట మ్రోగింది. తరగతులకు వెళ్లారు ఇద్దరూ. ఆ తరువాత ఒక నాలుగు రోజులు సమయం దొరక లేదు ఈ విషయం లో సంభాషణ కొనసాగించటానికి. రామం కూడా ఆ రోజు ఏదో బలవంతం చేస్తే చెప్పాను కానీ, అనవసరంగా శివ మనస్సు కూడా ఎందుకు నేను బాధపెట్టాలి , అని ఊరుకున్నాడు.
శనివారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది రామానికి, చెల్లెలు దగ్గర నుంచి. వాళ్ళ బావగారికి ఓ ప్రమాదం లో దెబ్బలు తగిలినాయి అని. కాలు ఒకటి ఫ్రాక్చర్ అయింది అట. చేయి ఒకటి బాగా గాయపడింది అట. ఆసుపత్రి లో వున్నాడు, అని.
వెంటనే బయలుదేరి వరంగల్ వెళ్ళాడు రామం. శస్త్ర చికిత్స చేసి కాలులో రాడ్ వేసి ప్లాస్టర్ వేశారు. చేతికి బ్యాండేజీలు. కనీసం ఆరు వారాలు కదలకుండా మంచం మీద వుండాలి. దానిలో మొదటి మూడు వారాలు అసలు కదలటానికి లేదు, మంచం మీద కూడా. అన్నీ మంచం లోనె. మూడో రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తాము అని చెప్పారట.
చెల్లెల్ని ఓదార్చి, మేనళ్లులకు ధైర్యం చెప్పి , తల్లిని ఒక వారం రోజులు వారికి ఆసరాగా ఉండమన్నాడు రామం. కావల్సిన డబ్బు సర్ది, యే చిన్న
అవసరమైనా తనకు ఫోన్ చేయమని చెప్పాడు . తిరిగి వెళ్లక తప్పదు గదా. తన సంసారం, దాని ఈతి బాధలు కూడా చూడాలిగా. పైగా సోమవారం నుంచి మళ్ళా కళాశాల కు వెళ్ళాలిగా.
ఇంత జరిగినా, ఏదో ముక్తసరిగా రెండు పొడి మాటలు మాట్లాడాడు వాళ్ళ బావగారు . నాకోసం వీళ్ళు శ్రమ పడుతున్నారు అన్న కనీస కృతజ్ఞత కూడా కనిపించ లేదు ఆ
కదలటానికి లేదు.మెదలటానికి లేదు. ప్రతి అవసరానికి భార్య మీద ఆధారపడాల్సిందే. పైగా నొప్పులు ఒకటే సతాయింపు. మొదటి రెండు రోజులు విపరీతమైన చిరాకు పడ్డాడు. భార్య మీద, పిల్లల మీద అరుపులూ , కసురుకోవటాలు, విసుగుకోవటాలు.
ఆ రెండో రోజు ఇంకా పూర్తిగా కూడా గడవలేదు, పిల్లలు అతనున్న గదిలోకి రావటం కూడా మానేశారు. కనీసం మంచినీళ్ళ గ్లాసు అందించటానికి , పది సార్లు పిలిస్తేగానీ రావట్లేదు. ఎందుకు ఆలస్యం అని అడిగితే, వినిపించ లేదు, బయటకు వెళ్ళాము అని సమాధానం. అది అబద్ధం అని తెలిసినా, తను ఏమీ చేయలేడు.
చూసి, చూసి, భార్యను అడగక తప్పలేదు, ఏమిటి, ఎందుకు , వాళ్లకు ఈ నిర్లక్ష్యం అని.
" ఏమే , వారు నా దగ్గరకే కాదు, ఈ గదిలోకే రావటం మానేశారు, పిలిచినా పట్టించుకోవట్లేదు, " అని.
" వాళ్ళు చిన్న పిల్లలు. మీరు బాధలో వున్నారని చూస్తున్నా , మీ కోపం, మీ కసురుకోవటాలు
మాటి మాటికీ విసుక్కోవడం చూసి వాళ్లు మీకు దూరం జరుగుతున్నారు. అదీకాక, మీరు ఇప్పటవరకూ వారిని ఏనాడూ దగ్గరకు తీసుకోలేదు. ఆప్యాయంగా మాట్లాడలేదు. దానితో మీమీద వారికి ఉంటే గింటే భయముంది కానీ ప్రేమ లేదు. వాళ్ళవి లేత మనసులు. ఇట్టే ఓ అభిప్రాయానికి వచ్చేస్తాయి. ఏదో తండ్రి కదా, తమకి వీలైన సేవ చేద్దామనుకున్నారు. మీ ప్రవర్తనతో వారు అదికూడా మానుకున్నారు. మీరే దూరం చేసుకున్నారు.
మెడలో తాళి బొట్టు వున్నన్ని నాళ్లు మీరు ఎలా ప్రవర్తించినా , నాకు తప్పదు గదా! ," అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ ఇల్లాలు.
మొదటిసారి మనస్సు కలుక్కుమంది. బాధ కలిగింది. భయమూ వేసింది , ఆ తండ్రికి, ఆ మగాడికి. చిన్నపిల్లలు , పదేళ్ల వయస్సు కూడా లేని వారు , తనకు ఈ నాడే దూరం గా జరుగుతున్నారు , వెలివేస్తున్నారు అంటే...రేపు ? పెరుగుతున్నకొద్దీ దూరాలు పెరిగేవే కదా.
అవునూ , తన భార్య ఏమందీ, ఆలోచించి అన్నదో , అనాలోచితంగా అన్నదో కానీ ,
' మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ ,' అంది. అంటే...? అదిలేక పోతే ఆమెకి తనని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేగా.
ఆ తాళి బొట్టు తీసి అవతల పారేయటానికి మూడు నిమిషాల మూడు వస్తే చాలు, అదీ ఈ రోజుల్లో ! ఆ పరిస్థితే వస్తే ? ఆ పరిస్థితి రావటానికి తనే కారణాలు కలిపిస్తుంటే ?
అమ్మో , తన గతి ?
అందులోనూ ఇదంతా ఏదో మొక్కుబడిగా పట్టించు కోవడమే కానీ, తన మీద ప్రేమ తో కాదు అని స్పష్టం గా తెలుస్తోంది.
వీటన్నిటి కన్నా ఒక్క మాట బాగా అర్ధం అయింది తనకి. తనంటే ప్రేమా , అభిమానమూ వున్న వ్యక్తి ఈ ప్రపంచం లో ఒక్కరూ లేరు. బయట స్నేహితులు ఆడ కానీ , మగ కానీ , పైపైన వరకే. ముఖం ముందు కబుర్లు చెప్పేవారు మాత్రమే. దానికీ తానే కారణం అయినా కావచ్చు.
ప్రమాదం జరిగినాక ఒకసారి మాత్రం వచ్చి పాపం అన్నవారే కానీ , రెండో సారి రాలేదు, కనీసం ఫోన్ చెయ్యలేదు, యెట్లా వున్నావు అని. చేస్తే ఏదన్నా భారం మొయ్యవలసి వస్తుందని ఏమో.
అర్థం అయింది అతనికి, వెరసి ఈ ప్రపంచం లో తాను ఎంతటి ఒంటరివాడో. అప్పుడు ఆలోచించాడు. బేరీజు వేసుకున్నాడు . తను గతం లో యేమి చేశాడో, ఎలా ప్రవర్తించాడో.
రేపటి కోసమని డబ్బు దాచుకున్నాడు కానీ , ఆ రేపే రాక పోతే , లేక పోతే ? అప్పుడు ఆ డబ్బు తనకు ఏమి ఉపయోగం , యేమి సుఖం ఇస్తుంది.
వీటన్నిటి కన్నా , తన దురుసు తనం, తన పెడసరి మాటలూ , ప్రవర్తన , ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం , తనకు మనుష్యులను , తన.. వా రి ని ..కూడా దూరం చేసింది. నేడు తాను సరిగ్గా లేడు కాబట్టి రేపటి తన పరిస్థితి తెలిసింది.
అదే ఈ ప్రమాదం జరగ కుండా వుంటే , ఎంత చీకటి లో తను బతుకుతున్నాడు అన్నది తెలిసేది కాదు. అతనికి ఆ క్షణం గుర్తుకు వచ్చింది, అప్పటి దాకా భార్య తనకు చేసిన చాకిరీ , పిల్లలు దగ్గరగా వస్తె తాను కసురుకోవటం.
అమ్మ బాబోయ్ అనుకున్నాడు. తప్పు తెలిసింది. క్రమ క్రమంగా మాట ధోరణి మారింది. సౌమ్యత వచ్చి విసుగు తగ్గింది.
ఒక నాడు, పిల్లలు వారంత వారు వచ్చి, " నాన్నా , నొప్పి తగ్గిందా , ఏమన్నా కావాలా ," అని అడిగిన నాడు , అప్రయత్నం గా కళ్ళలోంచి రెండు కన్నీళ్ళ బొట్లు రాలినయి.
రెండు నెలల తరువాత అకస్మాత్తుగా శివ అడిగాడు, రామాన్ని ,
" ఏరా రామం, మీ బావగారు ఎలా వున్నారు ఇప్పుడు ? శస్త్ర చికిత్స, అదే దేహానికి చిన్న ప్రమాద , మనసుకి పెద్ద ప్రమోద , శస్త్ర చికిత్స ఫలితం యెట్లా వుంది ? " అని..
" అంటే...ఆ ప్రమాదం....????? ," నోట మాట రాక ,
ఆపుకోలేక , రెండు చేతులూ ఎత్తి దండం పెట్టాడు రామం శివకు.
***
No comments:
Post a Comment